⚜️ సన్నిధానము ⚜️
గుంపులు గుంపులుగా గాలి కూడా ప్రవేశించుటకు ఆస్కారము లేనట్లు అయ్యప్పస్వామి దర్శనార్ధము భక్తులు శరణఘోష చేయుచూ వరుసలలో నిలబడి యుందురు. అహోరాత్రులు నిరంతరాయముగా ప్రేలుచుండు చిన్న , పెద్ద టపాకాయల మ్రోతనూ , క్షేత్రములలో నుండి మ్రోగుచున్న ఘంటానాదమును వినుచూ , ఆనంద నాట్యము చేయుచూ , ఆలయము ముంగిట చేరిన భక్తులు ఇరుముడి కట్టును శిరముపై ఉంచుకొని భక్తి పారవశ్యముతో , తమ జీవిత సాఫల్యము పొందువేళ ఇదే అన్న
తలంపుతో తమ కుడి పాదమును ముందుమోపి , పావన పదునెనిమిది మెట్లను కన్నులు మూసి తెరచులోపల దాటుదురు.
కన్నిస్వాములు మొదటి మెట్టులోనూ , రెండు మూడు సంవత్సరములనుంచి వెళ్ళువారు వారి వారి యాత్ర యొక్క క్రమము ననుసరించి కొబ్బరికాయను ఆయా మెట్లపై కొట్టుదురు. ( మెట్లకు ఇత్తడి రేకుతో తొడుగు చేయబడినందు వలన ఈ పద్ధతి ఇప్పుడు నిషేధింప బడినది. దానికి బదులుగా మెట్లకు కుడివైపు గోడకు కొబ్బరికాయలు కొట్టి మెట్లు ఎక్కుదురు) సత్య స్వరూపుడైన ధర్మశాస్తాను దర్శనము చేయుటకొరకు వెళ్ళుచున్న భక్తులకు ఆ సన్నిధి ముంగిట పదునెనిమిది మెట్లుగా వెలసి కాపాడు చుండెడి సత్యమైన ఆ అష్టాదశ సోపాన దేవతపై పాదము మోపువేళ వారి యొక్క హృదయము మిక్కిలి పరిశుద్ధమై తీరును.
కార్తీక మాసము 1 వ తేదీ మొదలు మాలధరించి వ్రతానుష్టానములను నియమముగా పాటించి , మండలకాలము తర్వాత బయలుదేరి ఇల్లూ వాకిలిని ఉపేక్షించి , స్వామిని సదా చింతించుచూ , మోక్షార్థ మానసులై మిట్టలు , పల్లములు దాటి
పంబా స్నానము చేసి బలికర్మాదులు ముగించి శుభ్ర వస్త్రాలంకార భూషితులై వైభవ సమృద్ధమైన సద్య భోజనము చేసి కాస్త విశ్రమించిన పిదప పుణ్య నదీమ తల్లి దగ్గర వన దేవతల దగ్గర వీడ్కోలు పుచ్చుకొని యాత్ర గావించి అయ్యప్ప భక్తులు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ అయ్యప్పస్వామివారి సన్నిధానమునకు అదే ఆ స్వర్గతుల్యమైన శబరిగిరికి సూర్యాస్తమయమునకు ముందుగా చేరి శ్రమ అంతయూ మరిచి ఆనందోన్మత్తులై తమకు అనుకూలముగా తావళమేర్పరచుకొని నివసించుటకు సిద్ధమగుదురు. ఆకలి , దాహము ఇవి ఏవియూ అచ్చట ఎవ్వరినీ బాధించవు. ఎలా బాధించును ? స్వర్గము వంటి స్థలమున చేరి ఆ స్వర్గాధీశుని అనుగ్రహ ఆశీస్సులకు పాత్రులై ఆనందముచే మనస్సంతయూ నిండియున్నవేళ ఆకలి , దాహములు
బాధించునా ? భక్తాభీష్ట వరప్రదుడైన భగవంతుని తేజోముఖమును దర్శించినంత మాత్రముననే తమయొక్క సకల దుఃఖములు మరచి ముగ్ధులై పోవుదురు. స్వామియే శరణం అయ్యప్ప ! ఆహా ! ఆ దివ్య మంత్రోచ్ఛారణ మహత్యము అవర్ణనీయమైనది.
“ఒకే జాతి ఒకే మతము. ఒకే దైవము మానవునికి" అనుమాటను ఎవరైనను విస్మరించి యుండినచో , ఈ శబరిగిరి యాత్రయూ , ఇచ్చట కూడియున్నవారి సౌహార్ధ మనఃస్థితియూ తప్పక వారి స్మృతి పథమునకు వచ్చును. అంతయే కాదు అనుభవములోనికి వచ్చును.
ప్రియ సోదరులారా ! భక్తాగ్రేసరులారా ! పూజ్యులైన గురుస్వాములారా ! మీ యొక్క దాసుడైన నేను మీతో విన్నవించు కొనునదేమనగా మీరు ఇచ్చట నుండి అనగా మన శబరిగిరీశుని సన్నిధానము నుండి వెడలరాదు. అనేక కాయక్లేశములను , బాధలను సహించి మనము ఇచ్చటకు చేరుకొనియున్నాము. ఇచ్చట మనము ఇంతవరకూ అనుభవించిన సౌఖ్యము చాలదు. కనీసము మూడు దినములైననూ ఈ ఆనందాను
భూతిని అనుభవించుట కొరకు మనమిచ్చట క్షేత్రోపవాసము చేయవలెను. అంతేకాదు
మనము ఎరిగినంతవరకూ ఈ యాత్రను గురించిన అనేక విషయములను , రహస్యములను ఇచ్చట చేరి భగవంతునిపై ఇంకనూ నమ్మకము పెట్టుకొనని వారికై చెప్పవలసి యున్నది. మనము ఈ వన యాత్ర ముగించి మనయొక్క స్వస్థానము చేరిననూ స్వామియే శరణం - శరణమయ్యప్ప అనియే ఎల్లప్పుడూ మనసా వాచా కర్మణా జపించునట్లు చేయవలసిన బాధ్యత కూడా మనపై యున్నది. మనకు ఆత్మజ్ఞానము కలుగుటకునూ , ప్రధానముగా జపించవలసిన మంత్రము "స్వామి శరణమయ్యప్ప" అను అష్టాక్షరి. అందరూ సర్వకాల సర్వావస్థల యందునూ జపించి
తరింతురు గాక.
🙏🪷ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్పా 🌻🙏