⚜️ సత్యమగు అష్టాదశ సోపానములే శరణం ⚜️
తారక బ్రహ్మ స్వరూపియైన అయ్యప్ప స్వామివారి సన్నిధానమున శరణము కోరుటకు ఎక్కి వెడలవలసిన దారిలో అష్టాదశ దేవతలు మెట్లుగా అమరియున్నారు. దీనిని 'అష్టాదశ సోపానము' లనియూ 'సత్యం కాక్కుం పొన్ను పదునెట్టాంబడి'
అనియూ మిక్కిలి విశేషముగా వర్ణించెదరు. శబరిగిరి యాత్రా వైభవములో మిక్కిలి ప్రాధాన్యత ఈ పదునిమిది మెట్లకు కలదు. సంసార సాగరము నందు మునిగి అరిషడ్వర్గములకు గురియై ఈర్ష్యాపరులైన సాధారణ మానవులకు అష్టాదశ సోపాన దేవతలపై కాలుమోపే అర్హత లేదు. కనుకనే మెడలో మాలవేసుకొని , మండల కాలము
వ్రతముండి , ఇరుముడి శిరముపై ఎత్తుకొనే ఆ పావన అష్టాదశ సోపానములపై అడుగు మోపవలెను. పై చెప్పిన వానిలో ఏలోపమున్ననూ అనగా మెడలో మాల ధరించక పోయినా , వ్రతకాలము మండల కాలముకాక తగ్గినా, ఇరుముడి కట్టక పోయినా , ఆ దేవతలపై అడుగుపెట్టిన ఎడల వారి ఆగ్రహజ్వాలలకు ఆహుతి కాక తప్పదు. తస్మాత్ జాగ్రత్త.. జాగ్రత్త.... ఇక ఈ అష్టాదశ సోపానము పై భాగమున సమతలముగా నుండి పదిహేడు గజముల ఎత్తుగల నల్లరాతితో చతురాకృతి యందు ఎత్తుగా కట్టబడిన ప్రదేశము నందు తిడప్పళ్ళి , నాలంబలం బలికలెపురమండపము , కర్పూర గుండము , గణపతి సన్నిధి , హోమగుండము మొదలగునవి నిర్మింపబడియున్నవి. సమతల ప్రదేశము నుండి ఇంతటి ఎత్తున క్షేత్రము నిర్మించబడి ఉన్నందున వన్య మృగములకు అచ్చట ప్రవేశించుటకు ఏ ఒక్క మార్గమూ లేదు. పదునెనిమిది మెట్లు యొక్క పైభాగన (క్షేత్ర స్థానము) పరిశుభ్రమై సత్య ధర్మాదులకు మూలస్థానము అయినందున వ్రతానుష్ఠానము లేనివారికి ఈ మెట్లను
తొక్కుటకు , ఈ మార్గము గుండా వెళ్ళుటకు అర్హత లేదు. పంబలో స్నానమాడి , దాన ధర్మాదులు చేసి , సకల విధములైన సాంప్రదాయమునూ పాటించి , శుద్ధ మనస్కులై ఈ పదునెనిమిది మెట్లపై అడుగిడి స్వామిని దర్శించవలెను. అట్లు కాక మరల మరల స్వామిని దర్శించవలె నని ఇచ్ఛకలవారైనచో పడమట భాగమున నున్న మార్గము ద్వారా స్వామిని చూచుకొన వచ్చుట అలవాటు చేసుకొన వలయునే కాని , ఆలయములోకి అడుగు పెట్టుటకు పదే పదే ఈ పదునెనిమిది ఉపయోగించరాదు. అవసరాను సారము సన్నిధానమునకు వెడలుటకును , మరలుటకును ఉత్తరమున ఏర్పర్చిన మార్గము గుండా గాని లేక పడమర మార్గము గుండాగానీ వెడలి వచ్చుటలో టెంకాయ కొట్టనవసరము లేదు. ఈ విషయమును ప్రతివారునూ అందులోనూ క్రొత్త వారు ప్రత్యేకముగా జ్ఞప్తియందుంచు కొని సన్నిధానమునకు వెళ్ళి వచ్చుట చేయవలయును పాతవారికి ఎట్లో ఈ విషయము తెలియకుండా ఉండదు. పదునెనిమిది మెట్లు ఎక్కువేళ మొదటి మెట్టు ఎక్కునపుడు కుడిపాదమును మోపి ఎక్కుటయునూ , దిగునప్పుడు వెనుకకు తిరుగక అనగా స్వామి వారికి మన వీపు భాగము చూపక స్వామివారి వైపే ముఖమునుంచి వారిని దర్శించుచున్నట్లు దిగిరావలెను ! ఎక్కునపుడునూ , దిగునపుడునూ ఒక్కొక్క మెట్టునూ తాకి వందనము చేయవలెను. పదునెనిమిది సంవత్సరములు వదలక వ్రతానుష్టానములతో స్వామి దర్శనము చేసియున్న భక్తులు పదునెనిమిదవ సంవత్సరము ఒక కొబ్బరి చెట్టును మోసుకొని వెడలి నాటుదురు. ఈ విధముగా కొందరు అయ్యప్పలు నాటియున్న కొబ్బరి చెట్లను కొన్నింటిని ఇప్పుడు గూడా ఆ పదునెనిమిది మెట్ల చుట్టూ గల ప్రాంగణములో మనము కాంచ వచ్చును.
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప