⚜ మంజమాత (మాళికాపురత్తమ్మ) ⚜
అనంతరము అయ్యప్ప భక్తులు మాళికాపురత్తమ్మ వారి యొక్క సన్నిధానము చేరి అచ్చట అమ్మవారికి (శక్తి స్వరూపిణికి) పూజారాధనలు చేయుదురు. మాళికాపురత్తమ్మ యున్న స్థలమునకు పదునెనిమిది మెట్లకును మధ్య సుమారు అర ఫర్లాంగు దూరము ఉండును. పదునెనిమిది మెట్లకు ఉత్తర దిక్కుగా మాళికాపురత్తమ్మ వెలసి మనలను
అనుగ్రహించుచున్నది. మాళికాపురత్తమ్మను మంజమాత అనియూ , మంజాంబికా అనియూ అనెదరు. ఇచ్చట అన్ని దేవాలయములందువలె వాకిలి తెరచి యుండదు. అనగా సన్నిధి తెరిచి యుండగా దర్శనము లభించదు. సన్నిధి తెరువ వలయునంటే దేవి యొక్క ప్రత్యేక అనుగ్రహము కలుగవలయు నందురు. దానికి నిదర్శనమా అన్నట్లు నేడునూ అచ్చటి సన్నిధానము తెరువబడక యున్నది. అచ్చట సన్నిధి ముంగిట స్థాపించబడియున్న శూలము , దీపములను భక్తాదులు చూచి నమస్కరించెదరు. అచ్చట నారికేళమును పగులగొట్టక దొర్లించ వలయునన్నదే నియమము. అమ్మవారి కొరకు చేయబడు ఆరాధనలలో మిక్కిలి ప్రాధాన్యమైనది ఈ నారికేళమును దొర్లించుటయను
ఆచారము. త్రినేత్రధారియైన ఈశ్వరుడు నారికేళము నందు కన్నులుగా కనిపించుట వలన అమ్మవారి ముంగిట మాత్రము పరమేశ్వరుని పగుల గొట్టగూడదని తలంచి ఈ పద్ధతి ఏర్పర్చబడి యున్నదని కొందరందురు.
ఇదిగాక తమలపాకు వక్కలతో గూడా పట్టుగుడ్డ , కుంకుమ , పసుపుపొడి , గాజులు మొదలగునవి కానుక ఇచ్చి పసుపు పొడిని సన్నిధి అంతయూ చల్లి , టపాకాయలను కాల్పించియూ , మాళికాపురత్తమ్మగారి సన్నిధినుండి స్వామివారి సన్నిధి వరకునూ (పదునెనిమిది మెట్లవరకునూ) పొర్లుడు దండాలు పెట్టుదురు. వీటినే అడుగడుగు దండాలు అనెదరు. ఇవన్నియూ గూడా అమ్మవారి యొక్క అనుగ్రహము పొందుటకు చేయు సేవలు. అమ్మవారి సన్నిధానము నుండి లభించిన పసుపుపొడియునూ , అమ్మవారిపై యుంచిన వస్త్రములకు మిక్కిలి మహత్యము ఉండునని పెద్దల అనుభవములు తెలియజేయుచున్నవి. భక్తితోనూ , విశ్వాసముతోనూ ఆ పసుపుపొడిని సేవించుటయూ , శరీరాంగములలో రుద్దుకొనుటయూ చేసినచో పలు విధ రోగముల నుండియూ భూతాపస్మార పీడల నుండియూ ముక్తులు అగుదురు అన్నది ధృడతరములగుటకునూ ఎంతో మంచిదని అభిప్రాయములు గలవు.
🙏🌻ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్పా 💐🙏