ఆయుర్వేదంలో చర్మవ్యాధులు వాటి మూలాలు మరియు చికిత్స - Ayurveda Treatment for Skin Diseases

P Madhav Kumar

 ఆయుర్వేదంలో చర్మవ్యాధులు వాటి మూలాలు మరియు చికిత్స - Ayurveda Treatment for Skin Diseases

పంచభూతాత్మకమైన ఈ శరీరానికి మూలం వాత, పిత్త, కఫాలనే త్రిదోషాలు! ఈ మూడింటిలో ఏది సమతౌల్యం తప్పినా వ్యాధి తథ్యం! అందుకే ఆయుర్వేదం వ్యాధులను త్రి దోష ప్రధానంగా నిర్వచిస్తుంది... దోష ప్రధానంగానే చికిత్స అందిస్తుంది. అందుకే వ్యాధులను స్వరూప స్వభావాల రీత్యా మూలాల్లోకి వెళ్లి అర్థం చేసుకోవటం.. దోషాలను సరిదిద్ది, సంపూర్ణ స్వస్థత చేకూర్చటం ఆయుర్వేద చికిత్సల విశిష్టతగా చెప్పుకోవచ్చు. శరీరంపైన బాహ్యంగా కనిపించే చర్మ వ్యాధుల విషయంలోనూ ఆయుర్వేదం ఈ అంతస్సూత్రాన్నే అనుసరిస్తుంది.అందుకే చాలా మొండి చర్మ వ్యాధుల విషయంలో కూడా చక్కటి ఫలితాలు సాధ్యమవుతాయి.  చర్మం మన శరీరానికి అతిపెద్ద రక్షణ కవచమే కాదు.. శరీరంలో అతిపెద్ద భాగమూ అదే. చర్మాన్ని ఆయుర్వేదంలో ‘త్వక్‌’ అంటారు. సాధారణంగా పైచర్మం, కింది చర్మం.. రెండే ఉంటాయని చెబుతుంటారుగానీ ఆయుర్వేద సిద్ధాంతకర్తల్లో ఒకరైన సుశ్రుతుడు చర్మాన్ని 7 పొరల (అవభాసిని, లోహిత, శ్వేత, తామ్ర, వేదిని, రోహిణి, మాంసధరా) సమాహారమని వివరించారు. చర్మ వ్యాధులు ఈ ఏడు పొరల్లో దేని నుంచైనా పుట్టుకురావచ్చు. వ్యాధి లోపలి పొరలకు వెళుతున్న కొద్దీ తీవ్రత పెరుగుతుంటుంది. పైపొరకు మాత్రమే పరిమితమైతే త్వరగా తగ్గే అవకాశాలుంటాయి.

ఆయుర్వేదంలో చర్మవ్యాధులను ‘కుష్ఠం’ అంటారు. తేలికపాటి చర్మ సమస్యల నుంచి కష్టతరమైన కుష్టు వ్యాధి వరకూ అన్నీ దీని కిందికే వస్తాయి. ఇవి చికిత్సకు ఎంత త్వరగా లొంగుతాయన్న సాధ్యాసాధ్యాలను బట్టి ప్రధానంగా వీటిని ‘క్షుద్ర కుష్ఠం’, ‘మహా కుష్ఠం’ అని రెండు రకాలుగా విభజించారు. క్షుద్ర కుష్ఠం రకాలు- సత్వరమే, అదీ మరీ అంత శక్తిమంతమైన మందుల అవసరం లేకుండానే నయమవుతాయి. ఇక చికిత్స చాలా కష్టసాధ్యంగా తయారై, అత్యంత ప్రభావవంతమైన మందులకు మాత్రమే లొంగే జబ్బులను మహా కుష్ఠ రకాలుగా పరిగణిస్తారు. క్షుద్ర కుష్ఠాల్లో 11, మహా కుష్ఠాల్లో 7.. ఇలా దాదాపు 18 రకాల చర్మవ్యాధులను ప్రధానంగా చెప్పారు. ఇవే కాకుండా శ్విత్రం (తెల్లమచ్చలు-బొల్లి), కళ్ల కింద మచ్చలను తెచ్చి పెట్టే వ్యంగం.. దురద, మంట, మచ్చలతో కూడిన ఉదర్దం, కోఠం కూడా చర్మ వ్యాధులే!

మూలాలెక్కడ?
విరుద్ధాహారం: కలిపి తినకూడని ఆహార పదార్థాలను భుజించటం విరుద్ధాహారం అంటారు. చేపలు లేదా పుల్లగా ఉండే వస్తువులతో పాలు కలిపి తీసుకోవటం, అతి వేడి మీద వేయించిన పదార్ధాలు (ఫాస్ట్‌ ఫుడ్స్‌ వంటివి) తీసుకోవటం, వండిన వాటిని తిరిగి మళ్లీమళ్లీ వేడి చేసి తినటం, కాచిన నూనెలనే మళ్లీమళ్లీ వేడి చేసి వాడుతుండటం.. ఇవన్నీ విరుద్ధాహారాల కిందకే వస్తాయి. తిన్నది జీర్ణం కాకముందే మళ్లీ తినటం, పెరుగు, పులుపు, ఉప్పులను అతిగా తీసుకోవటం.. వంటివన్నీ విరుద్ధాహారంగా భావించొచ్చు.
  • విహారం: ఎండలో ఎక్కువగా తిరగటం, ఆహారం భుజించిన వెంటనే సంభోగంలో పాల్గొనటం, రోజూ పగటి నిద్ర వంటివన్నీ చర్మ వ్యాధులకు కారణాలు కావొచ్చు.
  • మానసిక కారణాలు: తీవ్రమైన ఒత్తిడి, అమితమైన మానసిక శ్రమ, అధికంగా ఆలోచించటం.. ఈర్షా్యసూయల వంటి రాగద్వేషాలు.. ఇవన్నీ చర్మవ్యాధులకు దోహదం చేయొచ్చు.
  • సాధారణ కారణాలు: మలం, మూత్రం, ఆకలి, దప్పికల వంటి వేగాలను ఆపుకోవటం.
  • పాపకర్మలు: చెడు స్వభావం, నేర ప్రవృత్తి, అపరిశుభ్రత, విరుద్ధాచారాలను పాటించటం, గురువులను నిందించటం వంటివన్నీ పాపకర్మల కిందికి వస్తాయి. ఇవి కూడా చర్మ వ్యాధులకు కారణమవుతాయన్నది ఆయుర్వేద భావన.
  • సంసర్గ: శారీరక స్పర్శల (గాత్ర సంస్పర్శ) వల్ల కొన్ని చర్మవ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశముంది. వ్యాధి రసికారుతున్న దశలో వారితో సన్నిహితంగా మెలిగేవారికి వచ్చే అవకాశం ఎక్కువ. అయితే అవతలి వారి రోగనిరోధకశక్తి మీదా ఆధారపడి ఉంటుంది.
  • కులజం: కొన్ని చర్మవ్యాధులు వంశపారంపర్యంగా, కొన్ని కుటుంబాల్లో ఎక్కువగా రావొచ్చు.
  • క్రిమిజం: క్రిముల వల్ల రావొచ్చు.
  • కాలజం: చలికాలం, ఎండకాలం.. ఇలా కాలాలు, వయసును బట్టి కూడా చర్మవ్యాధులు వస్తాయి, విజృంభిస్తాయి.
  • చికిత్సా విభ్రంశం: వ్యాధులకు సరైన మందులు వాడకపోవటం, సరిగా శుద్ధిచెయ్యని మందులు ఇవ్వటం వల్ల కూడా ఇవి రావొచ్చు.
దీర్ఘరోగాల్లో ప్రధానం
Ayurveda Treatment for Skin Diseases
కొన్ని రకాల చర్మవ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి (ఔపసర్గికం). చికిత్సకు త్వరగాకష్టతరో రోగం- చికిత్సకు కష్టంగా ఉంటుంది. జన్మప్రవృత్తి అనుబంధం- ఆయుర్వేదం ప్రకారం ఈ కుష్ఠ వ్యాధులు ఒక జన్మలో పోయినా పాపకర్మల ఫలంగా మరో జన్మలో రావొచ్చు. చర్మవ్యాధులను ‘స్పర్శ వాతం’ అని కూడా పిలుస్తారు. సాధారణంగా వాత, పిత్త, కఫ దోషాల్లో వేటి మూలంగా వ్యాధి వచ్చిందో గుర్తించి చికిత్స అందించాల్సి ఉంటుంది. కొన్ని చర్మవ్యాధుల్లో త్రిదోషాలూ ఉంటాయి, అందుకే వీటిని మహావ్యాధులుగా గుర్తించారు. చికిత్స కష్ట సాధ్యంగా ఉండటానికి ఇదే కారణం. వాత దోషం వల్ల వచ్చే చర్మవ్యాధిలో మచ్చ పొడిగా ఉంటుంది. పిత్త దోషంతో కూడుకున్నది మంట పెడుతుంది. కఫంతో కూడుకుంటే దురద కనిపిస్తుంది. కొందరిలో ఒక దోషంతోనే వస్తే మరికొందరిలో రెండు, మూడు దోషాలూ ఉండొచ్చు. ఈ దోషాల కలయిక, వాటి నిష్పత్తులను బట్టి.. ఎంతకాలంగా వ్యాధి ఉన్నదాన్ని బట్టి చికిత్స మారుతుంది. ఒక దోషంతో కూడుకున్నదైతే చికిత్స తేలికవుతుంది. రెండు, మూడు దోషాలు కలిసినదైతే ఆలస్యమవుతుంది. ఈ లక్షణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చికిత్స చేయాల్సి ఉంటుంది. చికిత్సా ఫలితమన్నది- ఔషధ నిర్ణయం, వ్యాధి తీవ్రత, వైద్యుడి నైపుణ్యం- వీటన్నింటి మీదా ఆధారపడి ఉంటుంది.
లొంగవు (మహావ్యాధులు). వీటిలో చర్మం, రక్తం రెండూ ప్రభావితమై ఉంటాయి. వ్యాధి నెమ్మదిగా పెరుగుతుంది, చికిత్సకు ఎక్కువ సమయం తీసుకుంటాయి (చిరక్రియైః). కొన్నిసార్లు స్పర్శ తెలియదు. కొన్ని క్రిములతో వస్తాయి. ‘కుష్ఠం దీర్ఘరోగానం ప్రధానం’ అంటారు. అంటే ఎక్కువ కాలం వేధించే జబ్బుల్లో చర్మవ్యాధి ప్రధానమైందని అర్థం.

క్షుద్ర కుష్ఠాలు
క్షుద్ర కుష్ఠాలు కొన్నిసార్లు సుఖ సాధ్యాలు. మరికొందరిలో కష్ట సాధ్యం కూడా. ఇది వ్యాధి తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. 
ఇవి 11 రకాలు.
1. ఏక కుష్ఠం: మచ్చ ఏర్పడిన చోట చెమట పట్టదు. శరీరంలో ఎక్కువ భాగాలకు వ్యాపిస్తాయి. అక్కడి చర్మం చేప మాదిరిగా పొలుసులుగా, ఏనుగు చర్మంలా దళసరిగా ఉంటుంది. (ఒక రకంగా దీన్ని ‘సోరియాసిస్‌’ అనుకోవచ్చు.)
2. కిటిమ: ఇందులో నల్లటి మచ్చ కనబడుతుంది. దీనికి ఎత్తుపల్లాలు ఉండాల్సిన అవసరం లేదు. ఒక మచ్చలా చేతికి తగులుతుంటుంది.
3. వైపాదిక: ఇది చేతులకు, పాదాలకు వస్తుంది. ఇందులో కొంచెం బాధ, చర్మం పగిలి నీరు కారటం కనిపిస్తుంది.
4. అలసక: దురద ఎక్కువగా ఉంటుంది. దద్దు కనిపిస్తుంది.
5. దద్రుమండల: దురద ఎక్కువగా ఉండి బొబ్బలు వస్తాయి.
6. చర్మదళ: ఎర్రటి మచ్చలు, నొప్పి, దురద ఉంటాయి. ఈ భాగంలో చేయి పెడితే బాధ కలుగుతుంది.
7. పామా: మచ్చలకు దురద ఎక్కువ
8. కచ్చు: మచ్చ మందంగా ఉంటుంది.
9. విస్ఫోట: చర్మం బొబ్బలు బొబ్బలుగా లేచి మంట పుడుతుంది.
10. శతార: ఎరుపు రంగులో, పెద్ద సంఖ్యలో కురుపులు వస్తాయి.
11. విచర్చికా: మచ్చ నల్లగా ఉండి, చీము వస్తుంది.

ఇతర రకాలు
  • శ్విత్రం: ఇందులో తెల్ల మచ్చలు కనబడతాయి. వాడుక భాషలో దీన్ని బొల్లి అంటారు.
  • వ్యంగం: కళ్ల కింద తెలుపు మచ్చలు. ఆడవారిలో ఎక్కువ.
  • ఉదర్దం: కందిరీగలు కుట్టినట్టుగా శరీరంపై దద్దు వస్తుంది. సూదులతో గుచ్చినట్టుగా పోటు ఉంటుంది. ముఖ్యంగా నడుం దగ్గర చుట్టూ దద్దు ఏర్పడుతుంది. శిశిర రుతువులో ఎక్కువ.
  • కోఠం: శరీరంలో దురదతో కూడి ఎరుపు రంగులో చాలా దద్దుర్లు వస్తాయి. చికిత్స తీసుకోకపోయినా వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ బాధ పెడతాయి.
చర్మం - రసధాతువు
చర్మం - రసధాతువు
ఆయుర్వేదం ప్రకారం సప్తధాతువుల్లో ఒకటైన రస ధాతువుకు చర్మం ఉపధాతువు. అందువల్ల శరీరానికి బలాన్ని చేకూర్చే రసాయనాలన్నీ చర్మంపై బాగా పని చేస్తాయి. (‘ఆశ్రయ-ఆశ్రయీ’ భావ సంబంధం) రసధాతువును పెంచే వాటిల్లో ఆమలకి రసాయనం ముఖ్యమైంది. ఇది వ్యాధిని తగ్గించటమే కాదు, తిరిగి రాకుండానూ చేస్తుంది. సోరియాసిస్‌లో ఆమలకి రసాయనం పొడిని రోజూ రెండు పూట్లా అరచెంచా చొప్పున లోనికి తీసుకోవటం ప్రయోజనకరం. అలాగే ఆరోగ్యవర్ధని కూడా. పైకి నిర్గుండి తైలం, కరంజి తైలాన్ని రాసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది.

చికిత్సలు
చర్మవ్యాధులకు ఆయుర్వేదం ప్రధానంగా రెండు రకాల చికిత్సలను నిర్దేశిస్తోంది. 1. శోధనం 2. శమనం. త్రిదోషాల్లో ఏయే దోషాల ప్రమేయంతో వ్యాధి సంప్రాప్తించిందన్నది గుర్తించి.. తదనుగుణంగా వమనం, విరేచనం, వస్తి వంటి పంచకర్మల ద్వారా ఆ దోషాలను తొలగించటాన్ని ‘శోధనం’ అంటారు. అయితే వృద్ధుల్లో, బలహీనుల్లో దీన్ని చేయటం కుదరదు. ఇలాంటి వారికి కేవలం శమన చికిత్సలే చేస్తారు. శమనానికి ఔషధ ద్రవ్యాలు, ఆహార ద్రవ్యాలు ఉపయోగపడతాయి.

వ్యాధి దీర్ఘకాలంగా వేధిస్తుంటే ‘రసౌషధాలను’ వాడతారు. రోగి బలహీనంగా ఉన్నా, జబ్బు ఇటీవలి కాలంలోనే వచ్చినా, తీవ్రత తక్కువగా ఉన్నా మూలికా ద్రవ్యాలు ఇస్తారు. చర్మవ్యాధుల్లో లోనికి వేసుకునే మందు (అంతః పరిమార్జనం), పైపూత లేపనాలు (బహిః పరిమార్జనం).. రెండూ ముఖ్యమే. అప్పుడే జబ్బు పూర్తిగా నయమవుతుంది. రెంటిల్లో ఏది మానేసినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది.

ఔషధ ద్రవ్యాలు
  • * గంధక రసాయనం, దేవకుసుమ రసాయనం, ఖదిరారిష్ట, పంచతిక్త గుగ్గులు ఘృతం, సారస్వతారిష్ట, ఆరోగ్యవర్ధని.. ఇవన్నీ బాగా పనిచేస్తాయి. సోరియాసిస్‌ వంటి చర్మవ్యాధుల్లో ఇవి చక్కటి సత్ఫలితాలనిస్తాయి.
  • * రసౌషధాల్లో వ్యాధి హరణ రసాయనం బాగా పనిచేస్తుంది. దీన్ని నేరుగా ఇవ్వరాదు. గుడూచీ(తిప్పతీగ)లో గానీ, శారిబా(శుగంధిపాల) గానీ, ఆమలకి (ఉసిరిక)లోగానీ కలిపి ఇవ్వటం మంచిది.
  • * ఏకగుణ సింధూరం, షడ్గుణ సింధూరం రకరకాల చర్మవ్యాధుల చికిత్సలో ఉపయోగపడతాయి.
  • * గుంజాదివటి కూడా మచ్చలకు బాగా పనిచేస్తుంది. కొన్ని రకాల చర్మవ్యాధుల్లో మధుస్నుహి రసాయనం ఉపయోగపడుతుంది. జపాకుసుమ తైలం, పునర్నవాసం కూడా ఉపయోగపడతాయి. భల్లాతకవటి, అమృత భల్లాతక లేహ్యం మంచి ఫలితాలనిస్తాయి. అయితే వీటన్నింటినీ కూడా వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.
  • * నిర్గుండి తైలం పైన రాయొచ్చు, లోనికీ తీసుకోవచ్చు.
  • * కరంజ తైలం.. దీన్ని పైకి మాత్రమే వాడుకోవాలి.
  • * తాకితే చేతికి తగిలే మచ్చలకు సింధూరాది లేపం, లేదా బ్రాహ్మీ రసాయనాలు బాగా పనిచేస్తాయి.
అయితే... పైకి రాసుకునే తైలాలు, లేపనాలను ఒకట్రెండు సార్లు ఎక్కువగా వాడినా తప్పులేదు. ముఖానికి రాసుకునే లేపనాలను రాత్రి పూట వాడకపోవటం మంచిది. ఆసవ, అరిష్టాలను ఉదయం సాయంత్రం 30 ఎం.ఎల్‌. చొప్పున మాత్రమే వాడాలి.

ఆహార ద్రవ్యాలు
  • ఉసిరి, కాకమాచి (కామంచి) కూర, నెయ్యి, తియ్యటి పెరుగు, తియ్యటి మజ్జిగ.. ఆహార పరంగా బాగా ఉపయోగపడతాయి.
  • మూడొంతుల పెరుగు, ఒకవంతు నీరు కలిపి తయారుచేసిన మజ్జిగ (తక్రం) చర్మవ్యాధుల్లో ఔషధ రూప ఆహారంగా పనిచేస్తుంది.
  • పొన్నగంటి కూర చర్మవ్యాధులు పెరగకుండా, నివారణగా కూడా రక్షణనిస్తుంది.
పై పూతలు
  • గరిక రసాన్ని చర్మంపై రాస్తే చాలా చర్మవ్యాధులు తగ్గుతాయి. వ్యాధి తీవ్రతను బట్టి ఈ రసం కొంత లోనికీ తీసుకోవచ్చు.
  • మంచి గంధాన్ని అరగదీసి అరచెంచా లోపలికి తీసుకోవచ్చు. దీన్ని కొబ్బరినూనెలో కలిపి చర్మంపై రాస్తే మంచి ఫలితం కనబడుతుంది.
  • నల్ల జీలకర్ర ముద్దను కొబ్బరి నూనెలో కలిపి చర్మంపై రాయొచ్చు. ఈ ముద్దను నీటిలో కలిపి తాగొచ్చు.
  • మచ్చలపై మెంతుల పొడి, లేదా శతావరి పొడిని అద్దచ్చు. లోపలికీ తీసుకోవచ్చు.
  • కరక్కాయ గంధాన్ని కొబ్బరినూనెతో కలిపి రాయొచ్చు.
  • గుంట గలగరాకు రసంలో దూదిని ముంచి, దాన్ని మచ్చ మీద వేయాలి. ఇది తెల్లమచ్చలను తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుంది.
  • శెనగలు నానబెట్టి, అంతే పరిమాణంలో వెన్నతో కలిపి నూరి ముద్దగా చేయాలి. దీన్ని కళ్ల కింద నల్ల మచ్చకు (వ్యంగం) రాస్తే మంచి ఫలితముంటుంది.
  • శొంఠి, గైరికం కలిపి పైకి రాస్తే కోఠం తగ్గటానికి ఉపకరిస్తుంది. వీటిని పావు చెంచా చొప్పున లోనికి కూడా తీసుకోవచ్చు. దొండకాయ కోసినపుడు వెలువడే జిగురును రాసినా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దీంతో మంట బాగా తగ్గుతుంది.
మహా కుష్ఠాలు
మహా కుష్ఠాలు నయం కావటమనేది- వ్యాధి ఎన్ని రోజుల నుంచీ ఉంది? సమస్య చర్మంలో ఏ పొర వరకూ విస్తరించి ఉందన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. వీటికి ముఖ్యంగా రోగి బలం, రోగ బలం.. రెంటినీ అంచనా వేసి చికిత్స చేస్తారు.

వీటిల్లో ఏడు రకాలున్నాయి.
1. కపాల కుష్ఠం: చర్మం మీద విస్తృతంగా మచ్చలు వచ్చి.. అవి ఎర్రగా, కుండపెంకులా ఉంటాయి.
2. ఔదుంబర: ఇందులో మచ్చలు నొప్పీ, మంటా ఉంటాయి. అక్కడి చర్మం మేడిపండు రంగులో కనబడుతుంది.
3. మండల: మచ్చలు గుండ్రంగా ఉండి, ఎరుపు రంగులో ఉంటాయి.
4. రుష్యజిహ్వ: మచ్చలు దుప్పి నాలుక ఆకారంలో ఎర్రగా ఉంటాయి.
5. పుండరీక: తామరాకు మాదిరిగా గుండ్రంగా మచ్చలు ఏర్పడతాయి.
6. సిధ్మ కుష్ఠం: చర్మం తెల్లటి పిండిలా, పొట్టు పొట్టులా రాలుతుంది.
7. కాకణన్తికా: మచ్చలు గురివింద గింజలా కొంచెం ఎర్రగా, కొంచెం నల్లగా ఉంటాయి.

ఏక కుష్ఠం (సోరియాసిస్‌)
చర్మవ్యాధుల్లో ఏకకుష్ఠం, చర్మదళం, కోఠం, ఎక్కువగా కనబడతాయి. ఈ ఏక కుష్ఠం లక్షణాలు ఇప్పుడు మనం ప్రబలంగా చూస్తున్న సోరియాసిస్‌కు చాలా దగ్గరగా ఉంటాయి. దీని లక్షణాలు..
  • త్వచ వికృతి: చర్మం రంగు మారటం * త్వచ వైవిన్యం: చర్మం కుంచించుకపోవటం, దగ్గరకు రావటం, వ్యాకోచించక పోవటం, పొలుసులు రాలటం
  • మండలోత్పత్తి: గుండ్రంగా మచ్చలు ఏర్పడటం * పిడకోత్పత్తి: మచ్చలను చేత్తో తాకితే అంచులు తగులుతాయి.
  • కండు: దురద పెట్టటం.
పూర్వరూపాలు
చర్మవ్యాధులు రావటానికి ముందుగానే కొన్ని లక్షణాలు కనబడతాయి. వీటిని పూర్వరూపాలంటారు. ఇవే కొన్నాళ్ల తర్వాత వ్యాధి రూపంలోకి మారతాయి. ఇందుకు ఆహార, విహారాల వంటి వాటితో పాటు శరీరతత్వమూ దోహదం చేస్తుంది. ఈ దశలో చికిత్స తీసుకుంటే అది వ్యాధిగా మారకుండా చూసుకోవచ్చు. కొన్నిపరిస్థితుల్లో వీటినే వ్యాధి రూపాలుగానూ పరిగణించాల్సి ఉంటుంది.
  • చర్మవ్యాధి వచ్చే భాగంలో చేత్తో తాకితే నునుపుగా గానీ గరగరగా గానీ ఉంటుంది.
  • అధికంగా చెమట పట్టొచ్చు, లేదా చెమట పట్టకపోవచ్చు.
  • రంగు మారటం, మంట, దురద
  • స్పర్శ సరిగా ఉండకపోవచ్చు.
  • సూదులతో పొడిచినట్టుగా పోటు ఉండొచ్చు.
  • కందిరీగలు కుట్టినట్టుగా దద్దు, చికాకు ఉండొచ్చు.
రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat