బిందు సరోవరం
గుజరాత్‌లోని సిద్ధపూర్‌లో ఉన్న బిందు సరోవరం కపిలముని తపస్సు చేసి తరించిన ప్రాంతమని చెబుతారు.
"బిందు సరోవరం పరమశివుని కృప వలన ఏర్పడిన సరోవరమనీ, కపిలముని తపస్సు చేసిన ప్రాంతమంటూ బిందుసరోవరానికి అనేక ప్రత్యేకతలున్నాయి."
ఓ పురాణ కథనం ప్రకారం,స్వాయంభువు మనువు - శతరూప దంపతులకు ఆకూతి, ప్రకూతి, దేవహూతి అంటూ ముగ్గురు కుమార్తెలు. యుక్తవయస్కురాలైన దేవహుతికి తగిన వరుని కోసం వెదికే ప్రయత్నంలో పడిన స్వాయంభువు దేశదేశాలకు తిరిగాడు. చివరకు ఇక్కడకు రాగానే కర్దముడు అతని కంటబడ్డాడు. అతడే తన కూతురికి తగిన వరుడని సంతోషిస్తున్న సమయంలో అతని కళ్ళ నుండి ఆనందభాష్పాలు వెలువడ్డాయట. ఆ భాష్పాల వెల్లువతో ఓ సరోవరం ఏర్పడిందనీ, అదే బిందు సరోవరమని కథనం.
కర్దమ - దేవహూతిల వివాహం అయిన తరువాత సంతానప్రాప్తి కోసం కర్దమ ముని ఓ విమానాన్ని సృష్టించి, తద్వారా లోకమంతా తీర్థయాత్రలు చేస్తూ పుణ్యస్నానాలు చేయసాగారు. అలా వారు సరస్వతీ నదిలో పుణ్యస్నానం చేయగా వారికి కళ, అనసూయ, శ్రద్ధ, హరిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అంటూ తొమ్మిదిమంది కుమార్తెలు కలిగారు. కూతుళ్లకు పెళ్లుళ్ళు చేసిన కర్దముని మనసులో తనకు ఓ కొడుకు కూడ ఉంటే బాగుంటుందనిపించింది. భార్యను పిలిచి శ్రీమన్నారాయణుని పూజచేయమన్నాడు. అలా దేవహుతి ప్రార్థనలతో ప్రసన్నుడైన విష్ణుదేవుడు ఆమెకు పుత్రభాగ్యాన్ని కలిగించాడు.
ఆ పుత్రుడే కపిలుడు.
ఈ బిందు సరోవరం ప్రక్కన కపిలముని, కర్దమ - దేవహూతిల సన్నిధులున్నాయి. ఈ బిందు సరోవరం ప్రక్కనున్న రావిచెట్టు క్రింద తర్పణాలు చేస్తుంటారు. ఇక్కడ మాతృదేవతలకు మాత్రమే తర్పణాలను చేయడం విశేషం. ఇలా మాతృదేవతలకు మాత్రం తర్పణాలు ఇవ్వడాన్ని దేశంలో మరెక్కడా చూడలేము.
బిందు సరోవరం గుజరాత్‌లోని పఠాన్‌జిల్లా, సిద్ధపూర్‌లో అహ్మదాబాద్ - డిల్లీ జాతీయ రహదారిలో ఉంది. సిద్ధపూర్ అహ్మదాబాద్ నుంచి సుమారు 115 కి.మీ దూరములో ఉంది. గుజరాత్‌లోని అన్నిముఖ్యపట్టనాల నుంచి సిద్ధపూర్‌కు బస్సు సౌకర్యాలున్నాయి. సిద్ధపూర్ చిన్న ఊరే అయినప్పటికీ ఇక్కడ యాత్రీకుల సౌకర్యార్థం అనేక ధర్మశాలలు ఉన్నాయి.
అహ్మదాబాద్ నుంచి సుమారు రెండు గంటల ప్రయాణమే కాబట్టి, అహ్మదాబాద్‌కు యాత్రార్థం వెళ్లిన యాత్రీకులు తప్పక బిందుసరోవరాన్ని దర్శించుకుని వస్తుంటారు.
ముఖ్యంగా పితృదేవతలకు తర్పణాలను అర్పించాలనుకున్నవారు ఈ పంచసరోవర యాత్రలను చేస్తుంటారు. మరికొంతమంది ఆయా ఆలయాలకు వెళ్ళినపుడు అక్కడున్న సరోవరాలను దర్శించుకుంటుంటారు. మొత్తం మీద పంచసరోవరాల దర్శనం ఉభయతారకం. ఎందుకంటే ఒకప్రక్క తీర్థయాత్రను చేసిన అనుభూతితో పాటు, మరో ప్రక్క పితృదేవతలకూ తర్పణాలను విడిచి, వారికి ఉత్తమలోక గతులను ఏర్పరచి, పితృదేవతల్ను తృప్తి పరిచినట్లు అవుతుంది. ఇలా తీర్థయాత్రలు చేయడం వల్ల మనలో మానసికతీర్థాలు కూడ నెలకొంటాయి. అవి: సత్యం, ఓర్పు, ఇంద్రియ నిగ్రహం, దయ, ఋజుత్వం, దానం, తృప్తి, బ్రహ్మచర్యం, మధురసంభాషణం, జ్ఞానం, తపశ్చర్యలు తదితరాలు మానసిక తీర్థాలు.