నారాయణ వన సరోవరం
నారాయణ్ వన సరోవరం గుజరాత్ రాష్ట్రంలో కచ్ ప్రాంతంలో ఉంది. గుజరాత్‌లోని భుజ్ పట్టణం నుంచి సుమారు 150 కి.మీ దూరంలో ఈ నారాయణ వన సరోవరం ఉంది.
ఈ నారాయణ వన పరిసరప్రాంతాలన్నీ శివకేశవుల పాద స్పర్శతో పునీతమయ్యాయని స్థలపురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. ఈ సరస్సుకు కాస్త దూరంలో శివుడు కోటేశ్వరునిగా కొలవబడుతున్నాడు. ఆయన ఇక్కడ కొలువై ఉండటం వెనుక ఓ కథ చెప్పబడుతోంది. ఒకసారి పరమశివుని వేడుకుంటూ ఘోరమైన తపస్సు చేసిన రావణునికి శివుడు ప్రత్యక్షమై ఓ విగ్రహాన్ని బహుకరిస్తాడు. స్వామి నుంచి లింగాన్ని అందుకున్న రావణుడు, ఆశ్రద్ధతో ఆ లింగాన్ని నేలపై పడవేస్తాడు. దాంతో కోపగించుకున్న శివపరమాత్మ అనేక లక్షల కోట్ల లింగాలుగా మారిపోతాడు. రావణునికి అన్ని కోట్ల లింగాలలో ఏది అసలైన లింగం అనే విషయం తెలియదు. చివరకు అసలు లింగాన్ని అక్కడే వదిలేసి, చేతికి అందిన లింగంతో రావణుడు వెళ్లిపోయాడని కథనం. ఇలా శివుడు నారాయణ వన సరోవర ప్రాంతాలలో కొలువై ఉండగా, విష్ణురూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ మధుర నుంచి ద్వారకకు వెళ్తున్నప్పుడు, ఇక్కడున్న సరోవరంలో పాదాలను కడుకున్నాడనీ, అందుకే ఇది నారాయణవన సరోవరమని పిలువబడుతోందని మరో కథనాన్ని భక్తులు చెబుతున్నారు.
భుజ్ పట్టణం నుంచి ఈ నారాయణవన సరోవరం రెండుగంటల ప్రయాణమే కాబట్టి, ప్రయాణానికి పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు. నారాయణవన సరోవర ప్రాంతంలో భక్తులకు బస సౌకర్యాలు బాగానే ఉన్నాయి.