ప్ర: ‘ప్రాతఃస్మరణీయులు' అంటే ఏమిటి? వారెవరు?
జ: ప్రాతఃకాలాన్నే నిద్ర లేస్తూ పవిత్రమైన, దివ్యమైన వస్తువుల్నీ, మహాపురుషుల్ని స్మరించుకోవడం భారతీయ సనాతన ధర్మం. ఉదయానికి పూర్వకాలం ఆ రోజు ఆరంభం. ఆ సమయంలో 'మంచి'ని తలచుకుంటే దినమంతా మంచే జరుగుతుందని భావన. ప్రాతఃకాలాన ముందుగా, శయ్యమీదే కూర్చొని అరచేతిలో ముగ్గురమ్మలనీ భావనచేసి నమస్కరించి, ఆ తరువాత ఇష్టదైవాన్నీ, దేవతలనీ స్మరించాలి. అటు పిమ్మట వసిష్ఠాది మహర్షులనీ పృథు మాంధాత రఘు మొదలైన మహాచక్రవర్తులనీ ప్రహ్లాదాది పరమ భాగవతులనీ, హిమవత్పర్వతాది పుణ్యగిరులనీ, గంగాది పావన నదులనీ తలంచుకొని నమస్కరించాలి. అటుతరువాత భూమాతకి నమస్కరించి శయ్య నుండి దిగాలి. ఇలా ప్రాతఃకాలంలో స్మరించదగినవారిని 'ప్రాతఃస్మరణీయులు' అంటారు. అలాంటి పుణ్యచరిత్ర గలవారిని కూడా ఆ పేరుతో గౌరవించడం సంప్రదాయం.