కృష్ణా జిల్లా "మొగల్రాజపురం" 👉 శ్రీ దుర్గాదేవి దేవాలయం

P Madhav Kumar


👉 శ్రీ దుర్గాదేవి దేవాలయం

💠 ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతోన్న విజయవాడలో చారిత్రాత్మ‌క ఆలయాల్లో మొగల్రాజపురం ధనకొండ ఒక‌టి.

ఇక్కడ దుర్గాభవాని ఆలయం... దుర్గమ్మ కొలువైన కొండ అని ఇప్పటికీ ఇక్క‌డి ప్రజలు నమ్ముతారు.


💠 విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన కనకదుర్గాదేవి ఆలయం జగత్ప్రసిద్ధమైంది. 

ఈ దేవాలయం కాకుండా, ఇక్కడ మరో కనకదుర్గాదేవి గుడి ఉంది. 

ఈ అమ్మవారి ఆలయమే మొగల్రాజపురం కొండమీద ఉంది. 


💠 ఈ విషయం ఇప్పటి తరంలో చాలా మందికి పెద్దగా తెలీదు. విజయవాడలో ఉన్న వెనకటి తరాల వారికి మాత్రం అసలు కనకదుర్గమ్మ ముందుగా మొగల్రాజపురం ధనకొండపై వెలసిందని నమ్ముతారు. 

ఇప్పటికీ అమ్మవారు పగలంతా ఇంద్రకీలాద్రి మీద ఉండి, రాత్రి ఒక చిన్న పాప రూపంలో ధనకొండకు వస్తుందంటున్నారు స్థానికులు. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఎంతటి మహిమాన్వితురాలో మొగల్రాజపురంలో ఈ కొండపై వెలిసిన దుర్గమ్మ కూడా అంతే మహిమగలదని భక్తుల నమ్మకం.


💠 ఈ గుడి మండపం వద్ద ఒక సొరంగం ఉంది. అందులో కనకదుర్గాదేవి దర్శనమిస్తుంది. ఇక్కడ ఎలాంటి హడావిడి, ఆర్భాటమూ కనిపించదు. సిసలైన భక్తులు కోరుకునే ప్రశాంత చిత్తత అనుభూతికొస్తుంది.


💠 విజయవాడలో దుర్గమ్మ వెలసింది మొదట మొగల్రాజపురం కొండమీదేనని, అయితే ఇక్కడికంటే ఇంద్రకీలాద్రి కొండమీద అయితే మరింత శోభాయమానంగా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ పెద్ద గుడి కట్టించారని అంటారు.


💠 ఇంద్రకీలాద్రి పైనున్న దుర్గాదేవి దేవాలయం ప్రసిద్ధం అయిననూ అక్కడ ఉండే రద్దీ ఇక్కడ లేనప్పటికీ ఈ మొగల్రాజపురం దుర్గాదేవి ఆలయం మహిమాన్వితమైంది. 

ఈ గుడికి వస్తామని మొక్కుకుంటే అనుకున్న పనులు నెరవేరుతాయని స్థానికులు చెప్తుంటారు. 

ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.


💠 మొగల్రాజపురం కొండపై ఒక చిన్న గుహలో అమ్మవారు శ్రీ చ్రకపీఠంపై పాదముద్రలు, నేత్రంతో వెలసిందంటారు. 

ఇది నిజమేన‌ని అంటానికి సాక్ష్యంగా ఇప్పటికీ అంతరాలయంలో అమ్మ‌వారి పాద ముద్రలు, నేత్రంతో ఉన్న శ్రీ చక్రపీఠం ఉంది. 


💠 ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహ రూపం కనపడదు.. అంటే గర్భాలయంలో ఎర్రటి జ్వాలలాగా ఒక రూపం కనిపిస్తుంది. 

ఈ రూపం కింద భాగంలో శ్రీచక్ర రూపం ఉంటుంది. 

              


💠 దశాబ్దాల క్రితం చిట్టడివిగా ఉన్న ఈ ప్రాంతంలో ఒక గొల్లవానికి గుహలో అమ్మవారు దర్శనం ఇచ్చి, నీకేం కావాలో కోరుకోమనగా పేదరికంతో ఉన్న తనను ఆదుకోమని అభ్యర్థించాడట. 

అమ్మ కరుణించి కొంత ధనాన్నిని ఇచ్చి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్లు... ఎటువంటి శబ్దం వచ్చినా చూడొద్దని.. చూస్తే శిలగా మారిపోతావని ఆదేశించింద‌ట. 

గుహ వద్ద నుంచి కిందకు బయల్దేరిన గొల్లవాడు కొంత దూరం వచ్చేసరికి వెనుక నుంచి శబ్దాలు, ఇతర చప్పుళ్లు వినబడటంతో వెనక్కి తిరిగాడట. 

వెంటనే అతను ఒక బండగా మారిపోయాడట. ఇప్పటికీ ఆ గుహకు దిగువుగా అక్కడ గొల్లబండ అని ఒకటి ఉంది. 



💠 ప్రస్తుతానికి కొండ కింద నుండి పైకి వెళ్లడానికి చక్కటి మెట్లు ఆపై నుంచి గుడి వరకు సిమెంట్‌ రోడ్డు ఉంది. 


💠 అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌డానికి వ‌చ్చే భక్తులు పైన పొంగళ్లు చేసుకొవడానికి షెడ్డు, కాలి మార్గంలో నవదుర్గలు, క్షేత్రం ప్రధాన ద్వారం వద్ద వినాయక, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉన్నాయి. 

అమ్మవారి గర్బగుడిపైన గోపురం ఉన్న ప్రాంతంలో కొండలో అంతార్భగంగా శివలింగాన్ని దర్శించుకోవచ్చు. 

              


💠 ప్ర‌తి ఏటా ఇక్క‌డ న‌వ‌రాత్రుల పాటు అమ్మ‌వారికి ఉత్స‌వాలు చేయ‌డం...  దసరా పండగ రోజున మేళ‌తాళాలు, మంగ‌ళ‌వాయిద్యాల‌తో అమ్మ‌వారిని న‌గ‌ర పుర‌వీధుల్ల‌తో ఊరేగింపు జ‌ర‌ప‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది. 


💠 అమ్మ‌వారి మ‌హ‌త్యం తెలిసిన భ‌క్తులు ఏటా దేశం న‌లుమూల‌ల నుంచి ద‌స‌రా ఉత్స‌వాల స‌మ‌యంలో ఇక్క‌డికి విచ్చేస్తూ ధ‌న‌కొండ‌పై వెల‌సిన క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకుని వెళుతుంటారు. 

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat