👉 శ్రీ పెద్దింట్లమ్మ దేవాలయం
💠 కొల్లేటికోటలో 11వ శతాబ్దం నాటి అమ్మవారి దేవాలయంలో జలదుర్గ అమ్మవారి విగ్రహం ఉంది.
ఒడిషా పాలకుడు అంబదేవరాయ ఈ దుర్గాన్ని జయించి జలదుర్గకు బదులుగా పెద్దింట్లమ్మ లేదా మాతంగిదేవి విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు కథనం.
💠 కొల్లేరు లంక గ్రామాల ప్రజల ఆరాధ్య దైవమైన పెద్దింట్లమ్మను దర్శించుకునేందుకు ఆంధ్రరాష్ట్రంలోని వివిధ ప్రాంతలనుంచి వేల సంఖ్యలో భక్తులు, పర్యాటకులు తరలివస్తుంటారు.
💠 కైకలూరు మండలానికి చెందిన ఒక గ్రామమే "కొల్లేటికోట".
ఈ కొల్లేటి కోట గ్రామంలోనే శ్రీ పెద్దింట్లమ్మగా పిలవబడే శ్రీ జలదుర్గా అమ్మవారి ఆలయం కలదు.
💠 9 అడుగుల ఎత్తు కలిగి, విశాల నేత్రాలతో, వీరాసన భంగిమలో ఉంటుంది.కొల్లేరు లంక గ్రామాల ప్రజలు ఆరాధ్య దైవంగా కొలుస్తారు.
💠 ఏ శుభకార్యం తలపెట్టినా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ఇక్కడ నివాసం ఉంటున్న వడ్డెర కులస్తులు ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే మొదలుపెడతారు.
💠 ఇక్కడికి దగ్గర్లోని జలదుర్గాలయం చూడదగ్గది. కొల్లేటికోట గ్రామాన్ని 15వ శతాబ్దం చివరలో ఒరిస్సాను ఏలిన అంబదేవరాయ జయించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
💠 కొల్లేటికోట దుర్గాన్ని జయించిన అనంతరం అంబదేవరాయ జలదుర్గాలయంలో జలదుర్గకు బదులుగా పెద్దింట్లమ్మ లేదా మాతంగిదేవి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు స్థానికుల కథనం.
💠 మహమ్మదీయ సుల్తానులు గజపతులపై దాడిచేసి కొల్లేటి కోటను వశం చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది.
గజపతులపై జరిపిన ఈ దాడి సఫలం అయ్యేందుకు మహమ్మదీయ లేదా విజయనగర సైన్యాధ్యక్షుడు కొల్లేటి ఒడ్డున తన సొంత కూతురిని బలి ఇచ్చాడనీ.. అందుకే ఇప్పటికీ ఆ ఒడ్డుకు పేరంటాళ్ల కనుమ అనే పేరు నిలిచిపోయిందని స్థానికుల కథనం.
💠 ప్రతి యేడాది ఫిబ్రవరి నెలలో ఫాల్గుణ శుద్ధ ద్వాదశి రోజున అమ్మవారి జాతర (ఉత్సవాల)ను నెలరోజులపాటు నిర్వహిస్తారు.
లక్ష్మీ పురం గ్రామ కాపులు, నాయి బ్రాహ్మణ, యాదవలు,గోకర్ణపురం కాపులు, బట్రాజులుతో పాటు గుమళ్ళపాడు దళితులు గొకర్నేశ్వర స్వామి వారిని పల్లకి లో తీసుకొని వస్తే.... కోటలంక (పందిరి పల్లె గూడెం) వడ్డీలు నూట ఒక్క దేవతలు తో ప్రభ రథంతో ఊరేగింపుగా వస్తారు. ఆరోజు ముహూర్తానికి జలదుర్గమ్మ తల్లికి గొకర్నేశ్వరుడి స్వామికి వివాహం జరుగుతుంది.
దుర్గమ్మ విశ్వరూపమే పెద్దింటి అమ్మ అని చెబుతారు.
💠 ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వడ్డెర కులస్తులు, ఇతర కులాలు వాళ్లు ఏ శుభకార్యం తలపెట్టినా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ముందుగా అమ్మవారిని దర్శించుకుని, పూజలు జరిపిన అనంతరమే మొదలుపెడతారు. ప్రతి ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య వేలల్లో పై మాటే. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చే భక్తులే కాకుండా, అప్పుడప్పుడూ విదేశీయులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.
💠 అలాగే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సుకు విహారయాత్రకు వచ్చిన ప్రతివారూ కూడా తప్పకుండా అమ్మవారిని దర్శించుకుంటారు.
పెద్దింట్లమ్మను దర్శించుకునేందుకు కొల్లేటికోటకు వచ్చే భక్తులు "కొల్లేరు"లో పడవ ప్రయాణం, చేయాల్సి ఉంటుంది.
💠 దేశ విదేశాల నుంచి వచ్చే పక్షులతో చూడముచ్చటగా ఉండే కొల్లేటిలో ప్రయాణమే ఓ అద్భుతమైన అనుభవం అని చెప్పవచ్చు. కాగా.. దేశంలో ఏ దేవాలయంలో లేని విధంగా ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఉచితంగా ప్రసాదాలు, భోజనాలను ఏర్పాట్లు చేయడం అనేది "పెద్దింట్లమ్మ" ఆలయ విశేషంగా చెప్పవచ్చు.
💠 కొల్లేటికోటలో జరిగే పెద్దింట్లమ్మ జాతరకు వెళ్ళాలంటే... పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుంచి. అలాగే కైకలూరు, ఆలపాడు, ఏలూరు పట్టణాలనుంచి మాత్రం రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాలి.
మొత్తంమీదా కొల్లేటికోటలో కొలువైన అమ్మవారి దర్శన భాగ్యంతోపాటు.. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేటి సరస్సులో ప్రయాణం, దేశ విదేశాల నుంచీ అతిథులుగా వేంచేసిన పక్షుల సందడితో కనువిందు చేసే ఈ విహారం మరచిపోలేని అనుభూతి.