యజ్ఞయాగాదులను గురించి ఎంతోమందికి సరైన అవగాహన లేదు. వీటిని గురించి యుక్తియుక్తంగా, సరియైన దృక్కోణం నుంచి వివరణ.
ఈ లోకంలో మనం సుఖంగా జీవించాలంటే మనలో పరస్పర సౌహార్థం, సహకారము ఉండాలి ఉపకారానికి తిరిగి ఉపకారం చేయటం మాత్రమే కాక మన సంఘం మొత్తాన్ని ఉన్నతమైనదానిగా రూపొందించడం కోసం మనం సంఘసేవ చేయాలి అనే ఒక విశిష్టమైన మనోభావం మనలో కలగాలి.
హిందూధర్మం ప్రకారం లోకమంటే కేవలం మనుష్యులు మాత్రమే కాదు. మనుష్యుల లాగానే పశుపక్ష్యాది ఇతర జీవకోట్లు అన్నీ అందులో ఉన్నాయి ప్రకృతియొక్క వివిధ శక్తులు కూడా ఉన్నాయి. ఈ శక్తులను నియమించి, నియంత్రించే అధిపతులుగా మనుష్యులకంటే ఉత్కృష్టమైన చైతన్యం కలిగిన జీవులు వేరే ఉన్నారు. వీరే దేవతలు. ఈ దేవతలు యజ్ఞయాగాది ధార్మికకర్మలతో తృప్తి చెంది, మనకు పాడిపంటలను ఆయురారోగ్యాలను, సకాల వర్షాలను అనుగ్రహించి మనను కాపాడుతారు.
ఇలా మానవులు దేవతలను దేవతలు మానవులను పరస్పరం సంతృప్తి పరచటం వలన లోకమంతా సంతుష్టిని పొందుతుంది. యజ్ఞయాగాదుల వెనుక ఉన్న నిజమైన తత్త్వం ఇదే. శాస్త్రోక్తంగా అగ్నిని వెలిగించి, దేవతలను ఆహ్వానించి, ఆ అగ్నిలో సరియైన మంత్రాల ద్వారా ఇష్టార్ధసిద్ధది కోసం ఆహుతులనివ్వటమే యజ్ఞం యొక్క విధానక్రమం.
శ్రీకృష్ణభగవానుడు గీతలో యజ్ఞాన్ని గురించి వివరించాడు. యజ్ఞం అనే పదానికి విపులంగా వివరించాడు. యజ్ఞం అనే పదానికి గీతాచార్యుడు చాలా విస్తృతమైన అర్థాన్ని ఇచ్చాడు. నిస్వార్ధమైన బుద్ధితో చేసే ఏ ఆరాధన నయినా, సేవ నయినా, దానాన్ని అయినా యజ్ఞంగా భావించవచ్చు. విద్యావంతులు విద్యను, తపోధనులు తపాన్ని దానమివ్వటం కూడా యజ్ఞమే.
మన జీవితంలో ఇలాంటి యజ్ఞాన్ని అవలంబించటానికి అందరికీ అపరిమితమైన అవకాశం ఉంది. కనుక ఇటువంటి యజ్ఞాలను అందరూ తమ తమ అర్హత మేరకు చేయవచ్చును చేయాలి కూడా.
రచన: దయాత్మనంద స్వామి