విధి వ్రాతను ఎవ్వరు తప్పించుకోలేరు - విధిని ఎవ్వరూ మార్చలేరు.

P Madhav Kumar

 విధి రాత     

అది ఇంద్రలోకం... అందులో ఇంద్రుడి విలాస వంతమైన రాజమందిరం. ఆ భవనంలో సుందరమైన రాణివాసం. అక్కడ ఒక పంచవన్నెల రామచిలుక. అందమంతా తనదే అన్నట్లు వయ్యారాలు పోతూ తానే రాణిలా కలతిరుగుతోంది. అది ఇంద్రుడి భార్య ఇంద్రాణి పెంచుకుంటున్నఅందమైన చిలుక. 


   ఆమెకు ఆ చిలుకంటే ఎంతో ఇష్టం. దానిని తన ప్రాణ సమానంగా చూసుకునేది. ఉన్నట్లుండి ఒక రోజున ఆ చిలుకకు జబ్బు చేసింది. ఇంద్రాణి బాగా దిగులుపడి పోయింది. చిలుకను ఆస్థాన వైద్యుడికి చూపించింది.


        ఆ వైద్యుడు చిలుకను అన్ని విధాల పరీక్షించాడు. ఇక చిలుక బ్రతకడం కష్టమని తోచిందతడికి. అదే విషయం ఇంద్రాణితో చెప్పాడు.


        ఆ మాట విన్న ఇంద్రాణి హతాసురాలైంది. పరుగు పరుగున ఇంద్రుడి వద్దకు వెళ్లింది. చిలుక సంగతి భర్తతో చెప్పి....


        "మీరేంచేస్తారో నాకు తెలియదు నా చిలుకను బ్రతికించండి. లేదంటే నేనూ చనిపోతాను" అంటూ కన్నీరుపెట్టుకుంది.


        ఒక చిలుకతో ఆమెకు వున్న అనుబంధానికి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఆమెను దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ...


        "దీనికే ఇంత ఏడవడం ఎందుకు.!? అందరి తలరాతలు వ్రాసేది బ్రహ్మే కదా ! నేను వెళ్ళి ఆయన్ని ప్రార్ధిస్తాను. నువ్వేం దిగులు పడకు" అని బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు.


        ఇంద్రుడి ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు


        "నేను తలరాతలు మాత్రమే వ్రాస్తాను. దాన్ని అమలు పరిచేది మాత్రం శ్రీమహావిష్ణువు... కాబట్టి మనం శ్రీమహావిష్ణువు దగ్గరికి వెళదాం పద" అంటూ ఇరువురూ వైకుంఠానికి బయలుదేరారు.


        వీరి రాకను గమనించిన శ్రీహరి వారిని ఆహ్వానించి వచ్చిన కారణం తెలుసుకున్నాడు.


        "మీరు అనుకున్నది నిజమే ప్రాణాలు కాపాడేవాణ్ణి నేనే.. కానీ.. చిలుక ప్రాణం చివరి దశలో ఉంది. మళ్ళీ ఊపిరి పోయాలంటే ఆ పరమశివుడికే సాధ్యం. మనం ముగ్గురం శివుడిని ప్రార్థిద్దాం పదండి" అన్నాడు.


        ముగ్గురూ కైలాసానికి వెళ్లి శివుడితో విషయం చెప్పారు. అంతా విని శివుడు ఇలా అన్నాడు.


        "ఆయుష్షు పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను. అతని పనికి నేను అంతరాయం కలిగించకూడదు. కాబట్టి మనం వెళ్ళి యమధర్మరాజు ను అడుగుదాం పదండి" అన్నాడు. 


        అందరూ కలిసి యముడి కోసం యమపురికి బయలుదేరారు.


        ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు అందరూ కలిసి యమలోకానికి రావడం చూసిన యముడు మనసులో ‘వీరంతా తన వద్దకు వచ్చారంటే ఏదో విశేషమే వుండి వుంటుంది’ అనుకుంటూ వారిని సాదారంగా ఆహ్వానించి విషయం తెలుసుకుని....


        "అయ్యో..! అదేమంత పెద్ద పనికాదు. మాములుగా చావుకు దగ్గరైన వారి పేర్లను, వారు ఏ విధంగా చనిపోవాలి అన్నది ఒక ఆకుమీద వ్రాసి ఒక గదిలో వ్రేలాడ తీస్తాము. వారికి సమయం ఆసన్నమయినపుడు ఏ ఆకు రాలి క్రింద పడుతుందో వారు ఆ విధంగా చనిపోతారు. పదండి వెళ్లి ఆ ఆకుని తొలగించి చిలుకను కాపాడుదాం" అని అన్నాడు .


        యముడితో కలిసి అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి పడింది. ఆ ఆకు ఎవరిదో అందులో ఏం రాసి వుందో చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ఆ ఆకుపై చిలుక మరణానికి కారణం ఇలా వ్రాసి ఉంది.


        "ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు, యమధర్మరాజు కలిసి వస్తారో అప్పుడు చిలుకకు మరణం !" అని వ్రాసి ఉంది.


        విధి అంటే ఇదే కదా..! విధిని ఎవ్వరూ మార్చలేరు.

ఓం నమో నారాయణాయ🙏


🌷🕉🌷.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat