పూర్వం ఒకప్పుడు ఒక రాజ్యంలో ప్రసిద్ధికెక్కిన ఒక జూదరి ఉండేవాడు. జూదాన్నే వృత్తిగా చేసుకున్న అతడు దేవతలను బ్రాహ్మణులను సదా నిందిస్తూ ఉండేవాడు. లోకంలోని చెడు వ్యసనాలన్నిటికీ అతడు ఆలవాలమైనాడు.
ఇలా ఉండగా ఒకరోజు జూదంలో చాలా ధనం గెలుచుకున్నాడు. దాంతో అతడి మనస్సు సంతోషంతో పొంగిపోగా, అతడే తన చేతులతో కిళ్ళీ కట్టి, చందనమూ, పువ్వుల మాలలు వంటివి తీసుకొని ఒక వెలయాలి ఇంటివైపు వేగంగా అడుగులు వేస్తూ పోతున్నాడు.
దారిలో కాళ్ళు తడబడటంతో కిందపడి స్పృహ కోల్పోయాడు. కాసేపటికి స్పృహ వచ్చాక అతడు తన హృదయంలో ఏదో మార్పు కలగటం గ్రహించాడు.
తను అంతదాకా గడిపిన చెడు జీవితం గురించిన దిగులు అతణ్ణి పట్టుకొంది. తత్ఫలితంగా అతడిలో వైరాగ్య బీజాలు అంకురించాయి.
పిదప మనస్సులో స్పష్టత జనించగా నిర్మలమైన మనస్సుతో తన చేతిలో ఉన్న వస్తువులను సమీపంలో వెలసి ఉన్న ఒక శివలింగానికి అర్పించి ఇంటి ముఖం పట్టాడు.
కాలం తన వేగగతిలో వెళ్ళిపోతోంది. జూదరి జీవిత పయనం అంతమయింది. యమదూతలు అతణ్ణి యమలోకానికి తీసుకుపోయారు.
యమధర్మరాజు అతణ్ణి చూసి, "మూర్ఖుడా! నువ్వు ఒనరించిన దుష్టకర్మల కారణంగా నరకంలో ఘోరమైన శిక్షలు అనుభవిస్తూ రోదించవలసి ఉంది" అని చెప్పాడు.
ఆ మాటలు విన్న మన జూదరి వణకిపోతూ యమధర్మరాజుతో.. "స్వామీ! నేను ఏదైనా పుణ్యం కూడా చేసి ఉండవచ్చు గదా? దయచేసి ఆ పుణ్యకర్మ ఫలాన్ని కూడా పరిగణించి తీర్పు ఇవ్వండి" అని ప్రార్థించాడు. యమధర్మరాజు, చిత్రగుప్తుని వైపు చూశాడు.
*చిత్రగుప్తుడు:*
నువ్వు మరణించడానికి మునుపు కొద్దిగా చందనాన్ని- ఈ శివలింగానికి అర్పించావు. దాని ఫలితంగా నువ్వు మూడు గడియలకాలం స్వర్గ సింహాసనం మీద దేవరాజుగా ఉండడానికి అర్హత పొందావు.”
*జూదరి:*
”అలా అయితే మొదట స్వర్గంలో నేను అనుభవించవలసిన వాటిని అనుభవించడానికి నాకు అనుమతి ఇవ్వండి. ఆ తరువాత నరకంలో పడవలసిన బాధలన్నీ పడతాను.”
వెంటనే యమధర్మరాజు ఆదేశ ప్రకారం జూదరిని స్వర్గలోకానికి పంపించారు. దేవగురువైన బృహస్పతి, ఇంద్రుణ్ణి పిలిచి మూడు గడియల కాలం స్వర్గ సింహాసనాన్ని ఖాళీచేసి ఆ జూదరికి ఇవ్వమని నచ్చజెప్పి, ఒప్పించాడు.
మూడు నాళికల కాలం గడిచాక మళ్ళీ ఇంద్రుడే దేవసింహాసనాన్ని అధిష్ఠిస్తాడని కూడా బృహస్పతి చెప్పాడు.
ఇంద్రుడు సింహాసనం నుండి దిగగానే జూదరి దేవలోకానికి అధిపతి అయ్యాడు. ఇంకా మూడు గడియల కాలం మాత్రమే ఉంది!
జూదరి ఆలోచనలో పడ్డాడు. మహాశివుడు తప్ప నాకు మరో శరణ్యం లేదు' అని మనస్సులో సంకల్పించుకున్నాడు.
వస్తువుల పట్ల గల అనురక్తి అతడి నుండి తొలగిపోసాగింది. వెంటనే తన ఆధిపత్యం కింద ఉన్న వస్తువులను అన్నిటినీ దానం చేయడం మొదలుపెట్టాడు.
శివభక్తుడైన అతడు సుప్రసిద్ధమైన దేవేంద్రుని ఐరావతమనే గజరాజును అగస్త్యమునికి దానంగా ఇచ్చేశాడు. ఉచ్ఛైశ్రవమనే అశ్వాన్ని విశ్వామిత్ర మునికి సమర్పించాడు.
కామధేనువును వశిష్ఠ మహర్షికి అర్పించాడు. చింతామణి అనే అమూల్య రత్నాన్ని గాలవ మహర్షికి దానంగా ఇచ్చాడు. కల్పవృక్షాన్ని పెకలించి కౌండిన్య మహర్షికి ఇచ్చేశాడు. ఈ విధంగా అతడు మూడు నాళికల కాలం అయ్యేదాకా దానం ఇస్తూనే ఉన్నాడు.
స్వర్గంలోని అమూల్యమైన వస్తువులను అన్నింటినీ దానంగా ఇచ్చేశాడు. మూడు గడియల కాలం గడిచిందో లేదో, మాట్లాడకుండా సింహాసనం నుండి దిగిపోయాడు.
దేవేంద్రుడు తిరిగి వచ్చి చూసేసరికి అమరావతీ నగరమే సర్వసంపదలూ కోల్పోయి వెలవెలబోతూ కనిపించింది.
వెంటనే దేవేంద్రుడు దేవగురువైన బృహస్పతిని తోడ్కొని యమధర్మరాజు వద్దకు వెళ్ళాడు.
కోపోద్రేకంతో యమధర్మరాజును చూస్తూ, "ధర్మదేవా! మీరు నా పదవిని ఒక జూదరికి అర్పించి తగని పని చేశారు. అతడు అక్కడకు వచ్చి చెయ్యరాని పనులన్నీ చేశాడు.
నా అమూల్యమైన రత్నాలను అన్నింటినీ అతడు మునులకు దానం చేశాడు. వచ్చి అమరావతీ నగరాన్ని తిలకించండి! కొల్లగొట్టబడినట్లు ఎంత శూన్యంగా కనిపిస్తోందో కళ్ళారా మీరే చూసి తెలుసుకోండి" అని చెప్పాడు.
అంతా విని యమధర్మరాజు, "దేవేంద్రా! మీకు వయస్సు అధికరించడంతో వృద్ధులయ్యారు. అయినప్పటికీ, మీకు రాజ్యాధికార అనురక్తి ఇంకా పోలేదే!
జూదరి చేసిన పనుల వల్ల అతడికి ఇప్పుడు లభించిన పుణ్యం మీరు చేసిన వందల సంఖ్యలోని యజ్ఞాల వలన కలిగిన పుణ్యం కంటే ఎంతో అధికరించింది.
తన వశంలో అత్యంత గొప్ప అధికారం అప్పగించబడినప్పటికీ ఎవరు కించిత్తు కూడా గర్వించక సత్కర్మలు చెయ్యడంలో తలమునకలై ఉంటాడో అతడే సర్వోత్కృష్టుడు.
”వెళ్ళండి, మునులకు అవసరమైన వస్తువులను ఇచ్చో లేదా మరి కాళ్ళ మీద పడో మీ రత్నాలను తిరిగి తెచ్చుకోండి” అని జవాబిచ్చాడు.
ఇది విని ఇంద్రుడు… “సరే, మంచిది" అంటూ తిరిగి వెళ్ళిపోయాడు.
జూదరి తను ఇదివరలో చేసిన దుష్కర్మల ఫలితంగా కలిగిన నరకవాస జీవితాన్ని గడపటం నుంచి విడివడ్డాడు.
తరువాత అతడు మరుజన్మలో విరోచనునికి మహాతపస్వి, దానశీలి అయిన బలి పేరిట పుత్రుడుగా జన్మించాడు. …..స్కాందపురాణం.