బ్రహ్మ, విష్ణువుల యుద్ధం
ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేస్తూ ఉండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగారు. ఇలా సమరం జరుగుతుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరుతారు. ప్రమథగణాలకు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసంలో మణులు పొదగబడిన సభా మద్య లొ ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శ్రద్ధతో వింజామరలు వీచుతుంటారు.
ఈ విధంగా నున్న ఈశ్వరునికి దేవతలు ఆనందబాష్పాలతో శ్హస్త్రంగమ్ ప్రణమిల్లుతారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. బ్రహ్మ, విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవితో బయలుదేరుతాడు.
యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు. మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం యొక ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరుతారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుసుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు (బ్రహ్మ, విష్ణువు ల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకొంటాడు. వాటితో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి, అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మ కి షోడశోపచారా లతో పూజ చేస్తాడు. కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆదిని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు.
మోసము చేసిన బ్రహ్మ ను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్షం అవుతాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువు కి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి