స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు
- ⧫ శరీరము మజ్జ, ఆస్థి, క్రొవ్వు, రక్తము, శుక్లము, మాంసము, చర్మము అను సప్త ధాతువులచే ఏర్పడినది.
- ⧫ పాదములు, తొడలు, వక్షస్థలము, భుజములు, వెన్ను, మస్తకము అనే అవయవాలు ఉపాంగములుగా కల్గి, మలమూత్ర భరితమై నేను, నాదను అహంకార మమకారములకు ఆశ్రయమైనది స్థూల దేహము.
ఈ ప్రపంచంలో అన్నపానాదులు, స్త్రీ పురుష సంగాది ఇంద్రియ విషయాలే తప్ప ఏ పురుషార్ధమూ లేదు. ముల్లోకాలనబడే పాతాళ, భూ, స్వర్గ లోకాల్లో పంచ భూతాలే తప్ప ఆరవ వస్తువేదీ లేదు. శరీరం నేడో రేపో నశించి పోయేదని తెలిసినా, అజ్ఞానం వల్ల ఆ శరీర హితము కోసమే ప్రయత్నిస్తున్నాం. ఎలాంటి వ్యక్తైనా దృశ్య పదార్ధాల మీద ఆశ చేతనే బంధించబడుతున్నాడు. భోగ విషయాలపై వాంఛ బంధము. వాంఛలు త్యజించడం మోక్షమని యోగ వాశిష్టం చెబుతోంది.
పంచీకృత మహా భూతములతో స్థూలదేహము ఏర్పడింది. శరీరం ఆత్మకు భోగస్థానం. దీంతో తాదాత్మ్యం చెందటం వల్ల శరీరమే తాననుకొని, వివిధ విషయాలను బాహ్యేంద్రియాల ద్వారా సేవిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు.
స్థూలశరీరం వల్లే జీవుడికి బాహ్యజగత్తు కలుగుతోంది. ఈ స్థూల శరీరానికే జననము, వార్ధక్యము, మరణమనే ధర్మాలుంటాయి. బాల్య యౌవన కౌమారాది అవస్థలు, అనేక వర్ణాశ్రమ నియమాలు, మానావమానాలు, పూజ బహుమానము వంటివి కలుగుతున్నాయి. ఈ స్థూల శరీరమే జాగ్రదావస్థలో కనిపించేది. దీని యందు అభిమానమున్న చైతన్యము విశ్వుడు లేక వైశ్వానరుడు. బుధ్ధి జాగ్రదావస్థ యందు వివిధ వాసనలతో కలసి కర్తృత్వ భావంతో భాసిస్తుంటుంది. సాక్షికి బుధ్ధి ఉపాధిగా ఉన్నా, బుద్ధిచే చెయ్యబడే కర్మలు సాక్షికి అంటవు. ఎందుకంటే సాక్షి అసంగమైనది.
సూక్ష్మశరీరం పంచ ప్రాణాలు, పంచ కర్మే౦ద్రియములూ, జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధితో కలసి 17 తత్వములతో కలసి లింగశరీరము / సూక్ష్మ శరీరము ఏర్పడుతుంది. (వేదాంత పంచదశి). స్థూల శరీరం పంచీకృత మహాభూతాలచే ఏర్పడగా , సూక్ష్మ శరీరం అపంచీకృత భూతములతో ఏర్పడుతోంది. అంటే సూక్ష్మ భూత తన్మాత్రలతో ఏర్పడుతోంది. (కొన్ని చోట్ల దశేంద్రియాలు, పంచప్రాణాలు, పంచభూతాలు, అంతఃకరణంతో కలసి 21 తత్వాలతో సూక్ష్మశరీరం ఏర్పడుతున్నట్లుగా చెబుతారు.
వివేక చూడామణిలో ఆదిశంకరులు:
- 1) జ్ఞానేంద్రియాలు,
- 2) కర్మేంద్రియాలు,
- 3) ప్రాణ పంచకము,
- 4) పంచభూతాలు,
- 5) అంతఃకరణ చతుష్టయము,
- 6) అవిద్య
- 7) కామము,
- 8) కర్మ కలసి - ఈ 8 తత్వాలూ సూక్ష్మ శరీరాన్ని ఏర్పాటు చేస్తాయంటారు.
ఈ స్వప్నావస్థలో తైజసుడు 17 తత్వాలతోను అనేక క్రియలను జరుపుతూంటాడు. జాగ్రత్తులో చూసినదీ, చూడనిదీ, విన్నవీ, విననివీ, అనుభవించినవీ, అనుభవించనివీ, నిజమైనవీ, నిజంకానివీ, గత జన్మల అనుభవాలనూ స్వప్నంలో చూస్తుంటాడు.
కంఠస్థానము ఆశ్రయం.
- ⭄ ఇది వాసనలతో కూడి ఉండటం వల్ల, కర్మ ఫలాలను అనుభవింప జేస్తుంది. ఆత్మ, సంగ రహితమైనది.
- ⭄ ఈ సూక్ష్మ శరీరం/లింగ శరీరం చిదాత్మ రూపుడైన పురుషుని వ్యాపార సాధనకు కరణమై ఉంటుంది (అంటే సాధనము).
- ⭄ మరణానంతరం వివిధ లోకాల్లోకి, శరీరాల్లోకి ఇదే ప్రయాణం చేసేది. స్థూల శరీరం పడిపోగానే జీవుడు ఈ సూక్ష్మ శరీరంతో యాతాయాతాలు చేస్తుంటాడు. వాస్తవంగా ఇవి జీవుడికి లేవు. ఇవి సూక్ష్మ శరీరానికే.
- ⭄ సూక్ష్మ శరీరం ఎక్కడికి వెడితే అక్కడ ఆత్మ ఉంటుంది. అక్కడ ఆ శరీరంతో సంబంధ పడుతుంది. దేశ , కాల , మాన , పరిస్థితులను అధిగమించి ఈ సూక్ష్మ శరీరం పయనించ గల్గుతుంది.
- ⭄ ఇది మరణానికి ముందు చేసిన తప్పొప్పులను బేరీజు వేసుకొని, చేసిన పనులకు పశ్చాత్తాపం పడి, తనంత తానే ఒక నిర్ణయానికి వస్తుందని అంటారు. స్వచ్చందంగా;తానేలాంటి తల్లితండ్రులకు పుడితే ఉద్ధరించ బడుతుందో, ఎలాంటి జీవితాన్ని గడపాలో, ఎలాంటి శరీరాన్ని పొందాలో ఇవన్నీనిర్ణయించు కొంటుంది.
కారణ శరీరము:
- ⭄ జాగ్రదావస్థ యందు ఇంద్రియములతో చేసే కర్మల ఫలితాలను, వాసనారూపంలో కారణ శరీరంలో పొందు పరచబడి ఉంటాయి.
- ⭄ ఇవి మరు జన్మకు కారణమవుతాయి. అలా మరుజన్మకు కారణమయ్యే వాసనలు దీన్లో ఉండటం వల్ల దీన్ని, కారణ శరీరమంటారు. కాని ఇది ఆత్మ కాదు.
- ⭄ కారణశరీరం అవ్యక్తము. దీన్లో సత్వరజస్తమములనే మూడు గుణాలూ ఉంటాయి. ఆత్మకు కారణ శరీరమిది.
- ⭄ శరీర పతనానంతరం కారణ శరీరం, ఆత్మతో శరీరాన్ని వదలి పోతుంది. నిష్క్రియుడైన ఆత్మ ఈ కారణశరీరంలో ఉంటుంది.
- ⭄ సుషుప్త్యావస్థలో ఇంద్రియాలు మనస్సులో లీనమై ఉంటాయి. అంచేత అవి పనిచెయ్యక బాహ్య అనుభవాలు మనకు రావు.
- ⭄ ప్రాణ శక్తులు మాత్రమే పనిచేస్తుంటాయి. ఈ ప్రాణమే గాఢనిద్రలో శరీరం యొక్క సమస్త వ్యాపారాలనూ నడిపిస్తుంది.
- ⭄ ఇంద్రియవృత్తులు, మనస్సూ తనలో (ఆత్మలో) లీనమై ఉంటాయి. అలాంటి సుషుప్తిలో ఈ కారణ శరీరం మాత్రమే భాసిస్తుంది/ ఉంటుంది. సుషుప్తిలో ఏమీ తెలియదు. సుషుప్తి నుంచి లేచాక, నేను బాగా నిద్రపోయాను అని తెలుసుకొనేది మనస్సు. దీనికి అభిమాని ప్రాజ్ఞుడు.
- ⭄ ప్రాజ్నుడిది హృదయ స్థానం. ఏమీ తెలియని స్థితి అయిన సుషుప్తిలో కేవలం అవిద్యయే ఉంటుంది. అంటే అవిద్యచేత కారణ శరీరం ఏర్పడుతుంది. ఇది వాస్తవమైనది కాదు గనుక, బ్రహ్మజ్ఞానం వల్ల అజ్ఞానం (అవిద్య) నశించగా ఇదీ నశిస్తుంది.
ఇది గాఢనిద్రలో అనుభవంలోకి వచ్చే స్థితి. ఇదే తురీయావస్థ. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తీ అనునవి స్థూలశరీర ధర్మాలు. స్థూలశరీరం - క్రియాశక్తికీ, సూక్ష్మశరీరం- ఇచ్ఛాశక్తికీ, కారణశరీరం- జ్ఞానశక్తికీ....ఆశ్రయాలుగా చెప్పబడ్డాయి.
ఓం నమః శివాయ..!!
సర్వే జనా సుఖినోభవంతు..!!