భ్రమరాంబ క్షేత్రం: మనదేశంలో పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి. ‘సౌరాష్ట్రే సోమనాథంచ..’ అని ఆరంభమయ్యే శ్లోకంలో ‘శ్రీశైలే మల్లికార్జునం’ అంటూ భ్రమరాంబికా సతీ హృదయేశ్వరుడి ప్రస్తుతి కనిపిస్తుంది. దేవీ నవరాత్రుల్లో ఆదిపరాశక్తికి నవమరూపంగా భ్రమరాంబను ఆరాధించడం శాక్తేయులకు పరమ పవిత్రం. అరుణుడనే రాక్షసుడు గాయత్రిని విస్మరించిన ఫలితంగా భ్రమర రథాంకృతులతో ఆదిశక్తి అతణ్ణి సంహరించిన గాథ ప్రాచుర్యంలో ఉంది. ఆదిశక్తి కొలువుదీరిన పద్దెనిమిది శక్తి పీఠాల్లో భ్రమరాంబ వెలసిన శ్రీశైలానికి ప్రత్యేక స్థానం ఉంది.
సకల వేదాలకూ మూలాధారం:
జ్యోతిర్లింగ, శక్తి పీఠాలు ఒకే గిరిశృంగం మీద వెలసిన పుణ్యక్షేత్రమైన శ్రీశైలం సకల లోకారాధ్యంగా భాసిల్లుతోంది. ఇది వేదాలకు ప్రాణాధారమని ధార్మికులు భావిస్తారు. చతుర్వేదాల్లోనూ యజుర్వేదానిది హృదయస్థానమనీ, అందులోని రుద్ర నమక మంత్రాలు ఆ వేదానికే హృదయం లాంటివనీ, అందులోని ‘నమశ్శివాయ’ పంచాక్షరి ఆ నమకానికే హృదయమనీ, దానికి ఆత్మలా శోభిల్లే శివనామం సకల వేదాలకూ మూలాధారమనీ వేదవిదులు ప్రవచించారు. అలాంటి శక్తిమంతమైన నామాన్ని అడుగడుగునా స్మరిస్తూ, భక్తులు చేసే శ్రీశైల యాత్ర, వేద దర్శనంతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి.
మల్లన్న సన్నిధికి చేరే మార్గం
లక్షా 47 వేల 456 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో - ఎనిమిది శృంగాలతో అలరారే శ్రీశైలంలో- నలభై నాలుగు నదులు, అరవై కోట్ల తీర్థరాజాలు, పరాశర, భరద్వాజాది మహర్షుల తపోవన సీమలు, చంద్ర కుండ, సూర్యుకుండాది పుష్కరిణులు, స్పర్శవేదులైన లతలు, వృక్షసంతతులు, అనేక లింగాలు, అద్భుత ఔషధాలు ఉన్నాయని ప్రతీతి. గిరుల బారులను దాటి శ్రీశైల మల్లన్న సన్నిధికి చేర్చే దారి అత్యంత ఆహ్లాదకరం. పౌరాణిక ప్రశస్తికి గుర్తుగా సీతారాములు ప్రతిష్ఠించిన సహస్ర లింగాలు, పాండవులు సభక్తికంగా సంస్థాపించిన సద్యోజాతి లింగం, పంచపాడవ లింగాలు పూజలందుకుంటున్నాయి.
మరే క్షేత్రానికీ లేని ప్రత్యేకత శ్రీశైల క్షేత్రానికి ఉంది. పూజారంభంలో సంకల్పంలో శ్రీశైల క్షేత్రానికి ఏ దిశలో కూర్చొని తాము భగవదారాధనచేస్తున్నదీ విధిగా పేర్కొనడం ఈ క్షేత్ర ప్రామాణికతకు నిదర్శనం. బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అనే మూడు పర్వతాలకు పాదాభివందనం చేస్తూ తన చరణ కింకిణుల సవ్వడితో వేదఘోషను స్ఫురింపజేసే కృష్ణవేణి పాతాళగంగ పేరుతో ఉత్తరవాహినిగా ప్రవహిస్తోందిక్కడ.
శ్రీశైలం ఎప్పుడు వెలసిందీ స్పష్టంగా తెలియజేసే ఆధారాల్లేవంటారు. అష్టాదశ పురాణాల్లోనూ భారత రామాయణాది ఇతిహాసాల్లోనూ శ్రీశైల వైభవం స్తుతుల్ని అందుకొంది. సంస్కృత, ఆంధ్ర, కన్నడ, మరాఠీ గ్రంథాల్లో ఈ క్షేత్ర వర్ణనలున్నాయి. ఆయా భాషల కవులు శ్రీగిరిని కీర్తిస్తూ వ్యోమకేశ, హైమవతుల సంధ్యా సుందర నృత్యాన్ని సమనోజ్ఞంగా అభివర్ణించారు. అరవై నాలుగు అధ్యాయాలున్న స్కాందపురాణంలోని శ్రీశైల ఖండం, ఈ క్షేత్ర మహత్తును వివరిస్తోంది.ఈ క్షేత్ర ప్రశాంతతకు ముగ్ధులైన ఆదిశంకరులు కొంతకాలం ఇక్కడ తపస్సు చేసి, ‘శివానంద లహరి’ని రచించి, మల్లికార్జునుడికి పూజాసుమాలు అర్పించారు. భ్రమరాంబ సన్నిధిలో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారు.
దత్తావతార పరంపరలో భక్తుల పూజలందుకొనే నృసింహ సరస్వతీ స్వామి శ్రీశైల మహత్యాన్ని వివరిస్తూ తన పాదుకల్ని పట్టుకొన్న తంతుడు అనే భక్తుడికి ఈ క్షేత్ర దర్శన భాగ్యాన్ని కలిగించినట్లు ‘గురు చరిత్ర’ చెబుతోంది. ఆ స్వామీజీ తన అవతారాన్ని సైతం ఇక్కడి పాతాళగంగలో పరిసమాప్తి గావించి, కదలీవనంలో గుప్తరూపంలో ఉన్నట్లు దత్తభక్తులు విశ్వసిస్తారు.
కృతయుగంలో హిరణ్యకశిపుడు శ్రీశైలాన్ని తన పూజా మందిరంగా చేసుకొన్నాడనీ, త్రేతా యుగంలో రామ చంద్రుడు రావణుణ్ణి వధించిన తరవాత బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవడానికి సతీసమేతంగా ఈ క్షేత్రాన్ని దర్శించి, సహస్రలింగాల్ని ప్రతిష్ఠించి, ఆర్చించాడనీ ప్రతీతి. ద్వాపరయుగంలో పాండవులు సైతం వనవాస కాలంలో ఈ గిరిని దర్శించి లింగప్రతిష్ఠ చేసినట్టు ప్రాచుర్యంలో ఉంది.
పురాణము:
స్కాందపురాణంలో శ్రీశైల ఆవిర్భావానికి సంబంధించిన గాథ ఉంది. శిలాథుడు అనే మహర్షికి నంది, పర్వతుడు అనే ఇద్దరు కుమారులుండేవారు. వారు శివభక్తి పరాయణులు. పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలనుకుని శివదీక్ష స్వీకరించి, కఠోర తపస్సు చేశారు. వారి భక్తి కైలాసపతి మనస్సును కరిగించింది. స్మరణ మాత్రం చేత ఆపన్నుల భారాల్ని స్వీకరించే మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. తెరచిన కన్నుల ఎదుట త్రినేత్రుణ్ణి దర్శించిన ఆనందంతో నంది పరవశుడయ్యాడు. పశుపతికి వాహనంగా నిలిచిపోవాలన్న మనోభీష్టాన్ని వ్యక్తం చేశాడు. తాండవప్రియుడు ‘తథాస్తు’ అనడంతో నందికి నిఖిలేశ్వరుడికి వాహనమయ్యే యోగం సంప్రాప్తించింది. రెండో భక్తుడైన పర్వతుడు సైతం పరమేశ్వర సాక్షాత్కారానికి పరవశుడయ్యాడు. క్షణమాత్ర దర్శనభాగ్యం వల్లనే కొండంత ఆనందం పొందిన పర్వతుడు, దాన్ని శాశ్వతం చేసుకోవాలని సంకల్పించాడు. ఆదిదంపతులైన ఉమామహేశ్వరులు తనపై అన్నివేళలా కొలువుదీరి ఉండాలని కోరుకొని కొండగా మారిపోయాడు. ఆ విధంగా శిలాథుడి రెండో కుమారుడైన పర్వతుడే ఈ శ్రీశైల శిఖరరూపుడని స్కాందపురాణం చెబుతోంది. మొదట్లో శ్రీపర్వతం అని పిలిచేవారనీ, కాలక్రమంలో అది శ్రీశైలంగా మారిందనీ అంటారు.
మల్లెల రాయుడు
శ్రీశైలాన వెలసిన లింగాయుతుడైన మహేశ్వరుడికి మల్లికార్జునుడనే వ్యవహారనామం రావడం వెనుక కూడా ఓ ఐతిహ్యం ఉంది. కృష్ణాతీరంలో బ్రహ్మగిరిని రాజధానిగా చేసుకుని చంద్రకేతుడనే రాజు పాలించేవాడు. సంతానార్ధి అయిన ఆ రాజుకు లేకలేక చంద్రమతి అనే ఓ అమ్మాయి జన్మించింది. ఆమెను అల్లారుముద్దుగా పెంచే దశలో రాజపురోహితులు జైత్రయాత్రకు ముహూర్తం పెట్టడంతో బలగాలను తీసుకొని ఆయన బయల్దేరాడు. రోజులు నెలలయ్యాయి. నెలలు సంవత్సరాలుగా మారాయి. అయినా బ్రహ్మగిరికి చంద్రకేతుడు తిరిగి రాలేదు. అలా కొన్నేళ్ల తరవాత రాజ్య విస్తరణ కాంక్షకు శాశ్వత విరామాన్ని ప్రకటించిన చంద్రకేతుడు జైత్రయాత్రలో అనంత విజయాల్ని సాధించి రాజధానికి తిరిగి వచ్చాడు. అంతఃపురంలో ప్రవేశిస్తూనే ముగ్ధమోహన కన్య అతని కంటపడింది. అతని మనస్సు చలించింది. బుద్ధి వక్రించింది. విచక్షణ కోల్పోయిన చంద్రకేతుడు ఆ సుందరిని చేపట్టబోయాడు, అది చూసి అతని భార్య వారించింది. ఆ సుందరి సాక్షాత్తూ వారి కుమార్తే అంటూ మొరపెట్టింది. కామాంధుడైన చంద్రకేతుడు భార్య మాటలు వినిపించుకోలేదు. ‘వద్దు తండ్రీ నేను నీ వంశాకురాన్ని’ అంటూ చేతులు జోడించిన పుత్రికా రత్నాన్నీ కనికరించలేదు. ఏళ్ల తరబడి యుద్ధాల్లో గడిపిన ఆ రాజులో కారుణ్యం హరించుకుపోయింది. కామ వాంఛతో చంద్రమతిని వెంబడించాడు. ఆమె రాజధాని వదిలి, కృష్ణానదిని దాటి కొండల్లోకి పరుగుతీసింది. ఓ గుహలో తలదాచుకొంది. చంద్రకేతుడు ఆమెను తరుముతూ గుహను చేరుకొన్నాడు. గుహ ద్వారం వద్ద మాటువేశాడు. గుహలోని రాజకన్య భూతనాథుడైన పరమేశ్వరుణ్ణి ప్రార్థించి, కామపిశాచగ్రస్తుడైన తన తండ్రి బారి నుంచి రక్షించమంటూ ప్రార్థించింది. వెంటనే శివమహిమ చేత చంద్రకేతుడు ఆకుపచ్చ శిలగా మారిపోయాడు. గుహద్వారం నుంచి అది దొర్లుకొంటూ వెళ్లి పాతాళగంగలో పడింది. ఆ కారణం వల్లనే పాతాళగంగ నీరు ఆకుపచ్చగా కనిపిస్తుందని స్థానికుల విశ్వాసం.
గుహ నుంచి బయటకు వచ్చిన చంద్రమతి సమీపంలో ఒక అద్భుత దృశ్యాన్ని దర్శించింది. ఒక గోవు పొదుగు నుంచి వెలువడుతున్న క్షీరధారలో అభిషిక్తమవుతున్న శివలింగాన్ని చూసింది. శివాజ్ఞ మేరకు ఆలయాన్ని నిర్మించి ఆ స్వామిని అనుదినం మల్లెలతో అర్చించేది. ఆమె నిర్మల భక్తికి మెచ్చిన నీలకంఠుడు చంద్రమతి సమర్పించిన మల్లెదండను తన సిగలోని నెలవంకకూ, సురగంగకూ నడుమ అందంగా ధరించాడట. ఆ విధంగా మల్లికార్జునుడన్న వ్యవహారనామంతో ఇక్కడ స్వామి వేంచేసి ఉన్నారని ధార్మికులు విశ్వసిస్తారు.
భ్రమరమోహనుడు:
మల్లికార్జునుడి హృదయపద్మంలో భ్రమరాంబ కొలువుదీరిన వైనం గురించి ఓ అపురూప గాథ ప్రాచుర్యంలో ఉంది. ఆమె మల్లికార్జునుణ్ణితొలిసారి చూసినప్పుడే శ్మశాన వాసిలా, విరాగిలా కనిపించే ఈశ్వరుడు భువనైక మోహనుడునీ, సత్యశివ సుందరుడనీ గ్రహించి, వరించింది. శివుడి ఆలోచనలు మరోలా ఉన్నాయి. శక్తిని పరీక్షించడం కోసం తన సంకల్పం చేత ఓ భ్రమరాన్ని సృష్టించాడాయన. ఆ భ్రమర పథాన్ని అనుసరిస్తూ అది ఆగిన చోట ఆమెను వివాహమాడగలనని చెప్పాడు. శక్తీఅంగీకరించి, మాయా భ్రమరాన్ని అనుసరించింది. కొంతకాలం తరవాత అది అగిన చోటుకు శక్తి చేరుకొంది. అక్కడ వృద్ధ రూపుడైన వృషభ వాహనుడు ఆమెకు కనిపించాడు. ఆమె భ్రమరాన్ని అనుసరించడంతో యుగాలు గడిచిపోయాయనీ, తనను వార్థక్యం ఆవరించిందనీ శివుడు తెలిపాడు. వృద్ధమూర్తి అయినా, అన్యుణ్ణి ఆరాధించే ప్రసక్తే లేదని ఆదిశక్తి ఖండితంగా చెప్పేసింది. అప్పుడు శంకరుడు ఆమెను తన హృదయపద్మంలో నిలిపి భ్రమరాంబికగా స్వీకరించాడని అంటారు.
చరిత్ర:
క్రీస్తుపూర్వం నుంచి అనేక రాజవంశాలు శ్రీశైలాన్ని సేవించినట్లు శిలాశాసనాలు, ఇతర చారిత్రక ఆధారాలు వర్ణిస్తున్నాయి. ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్లవులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర సామ్రాజ్యాధీశులు, భ్రమరాంబికా సమేతుడైన మల్లికార్జునుణ్ణి దర్శించి, ఆలయ ప్రాకారాలు నిర్మించి, అశేష వస్తుసంపదలు సమర్పించినట్లు ఆధారాలున్నాయి. బౌద్ధయుగంలో మహాయానానికి పూర్వం నుంచీ ఈ ఆలయం ప్రాచుర్యంలో ఉందని తెలుస్తోంది. చైనా యాత్రికుడు హ్యూయన్‌త్సాంగ్ గ్రంథంలో శ్రీశైలం ప్రసక్తి ఉంది. ఆలయ పూర్వ చరిత్రకు సంబంధించి 14 శతాబ్దానికి చెందిన కాకతీయ ప్రతాప రుద్రుడి శాసనమే ప్రాచీనమైనది. అది ప్రస్తుతం చెన్నైలోని మ్యూజియంలో ఉంది.
ఆరో శతాబ్దంలో కదంబ మయూర వర్మ ఈ ప్రాంతాన్ని పాలించారు. ఏడో శతాబ్దంలో చాళుక్యులూ, ఆ తరవాత పదో శతాబ్దం వరకూ రాష్ట్రకూటులూ శ్రీశైల ప్రాంతాన్ని పరిపాలించారు. తరచూ సంభవించిన యుద్ధాల తరవాత ఈ క్షేత్రం వెలనాటి ప్రభువుల అధీనంలోకి వచ్చింది.
11వ శతాబ్దంలో ఆరో విక్రమాదిత్యుని మరణానంతరం ఇక్కడ కాకతీయుల ఏలుబడి ఆరంభమైంది. తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఏకీకృతమై కాకతీయ సామ్రాజ్యం వెలసిన తరవాత, శ్రీశైల ప్రభ ప్రవర్ధమానమైంది. గణపతి దేవుడు, రుద్రమాంబ, ప్రతాపరుద్రుల కాలంలో ఈ క్షేత్రం అభివృద్ధి చెందింది. అనంతరం రెడ్డి రాజుల కాలంలో పోలయ వేమారెడ్డి ప్రాభవంలో శ్రీశైలం మరింత అభివృద్ధి చెందింది. తరవాత విజయనగర రాజుల కాలంలో రెండో హరిహరరాయలు ఆలయానికి దక్షిణ గోపుర ద్వారాన్నీ, ముఖమంటపాన్నీ నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు శ్రీశైలానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించి, తన దేవేరులైన తిరుమల దేవి, చిన్నమదేవిలతో ఈ క్షేత్రాన్ని దర్శించారు. దేవాలయ ప్రధాన ద్వారం వద్ద గాలిగోపురాన్ని నిర్మించారు. 1677లో మరాఠా వీరకిశోరమైన ఛత్రపతి శివాజీ ఉత్తరం వైపున గాలిగోపురాన్ని నిర్మించారు. ఇక్కడే ఆయనకు జగన్మాత దర్శనమిచ్చి వీరఖడ్గాన్ని ప్రసాదించిందని ప్రతీతి. 1996లో దేవస్థానం వారు పడమట గోపురాన్ని నిర్మించి, దీనికి బ్రహ్మానందరాయ గోపురమని పేరు పెట్టారు.
విదేశీ మతదురహంకార శక్తుల దండయాత్రలకు ఈ ఆలయం గురికాకపోవడం అలా ఉంచితే, ఎందరో ముస్లిం పాలకులు ఈ ఆలయాన్ని పవిత్రధామంగా భావించి, మల్లికార్జునుడికి మాన్యాలూ, ఆస్తులూ సమర్పించడం మరింత విశేషం. ఔరంగజేబు కాలంలో దావుద్ ఖాన్ అనే సేనాని కర్నూలు జిల్లాను జాగీరుగా పొందాడు. అతని సోదరులు ఇబ్రహీం ఖాన్ ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశాడు.
ఈస్టిండియా కంపెనీ వారి అధికార కాలంలో ఈ ఆలయ నిర్వహణను పుష్పగిరిమఠం స్వీకరించింది. 1929లో ప్రత్యేకమైన మేనేజ్‌మెంట్ బోర్డు రూపొందింది. స్వాతంత్య్రానంతరం రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో ఈ నీలకంఠ నిలయం నిత్యోత్సవధామంగా భక్తావళిని అనుగ్రహిస్తోంది.ఇక్కడ చూడాల్సినవి:
అనేక ప్రత్యేకతలున్న శ్రీశైల ఆలయానికి నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి. ప్రకాశంజిల్లాలో త్రిపురసుందరి వెలసిన త్రిపురాంతకాన్ని తూర్పు ద్వారంగానూ, మహబూబ్‌నగర్ జిల్లాలో జోగులాంబ విరాజిల్లే శక్తిపీఠమైన ఆలంపూర్ పశ్చిమ ద్వారంగానూ, కడప జిల్లాలో సిద్ధేశ్వరుడు కొలువుతీరిన సిద్ధవటం దక్షిణద్వారం గానూ, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఉమామహేశ్వరాన్ని ఉత్తర ద్వారంగానూ భావిస్తారు. ఇవి కాకుండా - ఆగ్నేయంలో పుష్పగిరి క్షేత్రం, నైరుతిలో సోమశిల క్షేత్రం, వాయువ్యంగా సంగమేశ్వర క్షేత్రం, ఈశాన్యంలో ఏకేశ్వర క్షేత్రం ఉన్నాయి.
శ్రీశైలాన్ని అనేక క్షేత్రాల సమాహారంగా భావిస్తారు. గిరిపంక్తుల్ని దాటి వెళ్తుంటే ఆలయానికి ఎనిమిది కిలో మీటర్ల దూరంలో శిఖరేశ్వరం దర్శనమిస్తుంది. శ్రీశైల శిఖరదర్శనం సర్వపాపహరణమని భక్తులు విశ్వసిస్తారు. అదేవిధంగా కుంభాకారుడు కేశప్పను స్వర్ణలింగ రూపంలో శివుడు అనుగ్రహించిన హటకేశ్వరం, ఆదిశంకరులు పావనం చేసిన పాలధార, పంచధారలు, తన జననీ జనకుల్ని దర్శించవచ్చిన వారి మోక్షార్హతను నిర్ధరించే సాక్షి గణపతి, కుంతీసుత మధ్యముడైన భీమసేనుడి గదాఘాతంతో ఏర్పడిందని భావించే ‘భీముని కొలను’ ఇలా శ్రీశైల యాత్రలో విధిగా సందర్శించాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.ఘంటా, విభూతి, సారంగభావ, నందుల, భీమశంకర మఠాలు; అలాగే మల్లమ్మ పన్నీరు, పశుపతినాథలింగం, గోగర్భం, విశ్వామిత్ర మఠాలు కూడా ప్రసిద్ధి చెందాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇక్కడి నందీశ్వరుడి ప్రస్తావన ఉంది. ‘శనగల బసవన్న’ అని పిలిచే ఈ పశుపతి వాహనం, కలియుగాంతంలో పెద్ద రంకె వేస్తాడని కాలజ్ఞాన కర్త పేర్కొన్నారు.
ధూళిదర్శనం:
శ్రీశైల ఆలయాన్ని వీరశైవులు అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన లింగధారులు ఇక్కడి విభూతి సుందరుణ్ణి విధిగా అర్చిస్తారు. అంతేకాదు, ఏ ఆలయంలోనూ లేని మరో ప్రత్యేకత శ్రీశైలంలో కనిపిస్తుంది. మల్లికార్జునుడికి పూజాదికాలు నిర్వహంచే పవిత్ర బాధ్యతను వీరశైవార్చకులు, భ్రమరాంబను అర్చించే పుణ్యవిధిని బ్రాహ్మణులు నిర్వర్తించడం ఈ ఆలయంలో మాత్రమే గోచరించే సంప్రదాయం. శివపార్వతుల కల్యాణాన్ని ఆరాధ్యులు జరిపించడం మరో విశేషం. పరివార దేవతలకూ, ఉత్సవమూర్తులకూ వస్త్రాలంకరణ చేసే విధిని చెంచులు నిర్వహిస్తారు. శ్రీశైలంలో మరో ప్రత్యేకత ‘ధూళి దర్శనం’ పాదప్రక్షాళనతో పనిలేకుండా ఆలయంలోకి నేరుగా ప్రవేశించి, ఆర్తితో శివుణ్ణి ఆలింగనం చేసుకొనే ఆత్మీయ దృశ్యం ఈ ఆలయంలో కనిపిస్తుంది.
యాత్రా ఫలం:
శ్రీశైల క్షేత్రదర్శనం అత్యంత శుభఫలితాలనిస్తుందని పేర్కొనే భక్తులు అనేకులున్నారు. కురుక్షేత్రంలో లక్షలకొద్దీ దానాలు చేస్తే, గంగలో రెండువేల సార్లు మునిగితే, నర్మదా తీరంలో అనేక సంవత్సరాలు తపస్సుచేస్తే, కాశీక్షేత్రంలో లక్షలాది సంవత్సరాలు నివసిస్తే లభించే పుణ్యం శ్రీశైల క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించడం ద్వారా పొందగలమని ధార్మికులు విశ్వసిస్తారు. తెలుగు, సంస్కృతం, కన్నడ భాషల్లో వెలువడిన అనేక కావ్యాల్లో శ్రీశైలం సుమనోహరంగా వర్ణితమైంది. పాల్కురికి సోమనాథుడు రచించిన ‘పండితారాధ్య చరిత్ర’నూ, ఆది శంకరుల ‘శివానందలహరి’నీ వాటిలో ప్రముఖంగా పేర్కొనవచ్చు. మల్లికార్జునుడికి మహారుద్రాభిషేకాన్నీ, ఆదిశంకర ప్రతిష్ఠిత శ్రీచక్రం పై కొలువైన భ్రమరాంబికకు కుంకుమపూజనీ జరిపించడం సర్వమంగళకరం, సకలైశ్వర్యప్రదాయకమని భక్తులు విశ్వసిస్తారు.
శ్రీశైల క్షేత్ర సమీపంలో కృష్ణవేణి మీద నిర్మితమైన శ్రీశైలం డ్యామ్ బహుళార్థ సాధక ప్రయోజనాలనందించే ఆధునిక దేవత అని మన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు పేర్కొన్నారు. మహాశివరాత్రి, శరన్నవరాత్రుల సందర్భంలో ఈ క్షేత్రంలో నేత్రపర్వంలా నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. మల్లికార్జున లింగాన్ని అర్చించి, పరమేశ్వరి భ్రమరాంబికను సేవించి శ్రీశైల యాత్రలో పునీతులవుతారు.
ఎలా చేరుకోవాలి?
- శ్రీశైలక్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం కర్నూలు జిల్లాలో ఉంది.
- హైదరాబాద్ నుంచి 214 కి.మీ. దూరంలోని క్షేత్రాన్ని బస్సు లేదా ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు.
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పలు బస్సు సర్వీసులు ఉన్నాయి.