తులసి పూజ
తులసీ దయాపూర్ణకలశీ - తులసి పూజ, దళచయనం
తులసి పూజ - తులసి ప్రాశస్త్యమ్
శ్లో|| యన్మూలే సర్వతీర్ధాని యన్మధ్యే సర్వదేవతా
య దగ్రే సర్వవేదశ్చ తులసీం త్వా నమామ్యహమ్ ||
శ్రీ మహాలక్ష్మీ నారాయణ స్వరూపిణియైన "తులసి" యొక్క మూలంలో సర్వతీర్ధాలు, మధ్యభాగమందు సమస్త దేవతలు, తులసిమొక్క పైభాగమున సర్వవేదాలతో కొలువైవున్న తులసి మాతకు ముందుగా నమస్కరించుకుని, అంతటి పూజ్యనీయమైన ఆ తులసి ఆవిర్భావ చరిత్ర - తులసి ప్రాశస్త్యమును గూర్చి, మన పురాణములలో ఎన్నో కధలు కానవస్తున్నాయి. వాటిలో ఒకగాధను సమీక్షించుకుందాం!
"బ్రహ్మవైవర్తపురాణ"మందు గల తులసి వృత్తాంతము ఇలా ఉన్నది. ధర్మధ్వజుడు, మాధవి అను దంపతులకు అతిలోక సౌందర్యవతియైన కుమార్తై కలిగినది. వారు ఆ బిడ్డకు "బృంద" అను నామకరణము చేసుకుని అల్లారు ముద్దుగా పెంచుకోసాగిరి. ఆమెకు వివాహవయస్సురాగనే శ్రీహరిని వివాహమాడతలచి బదరికాశ్రమము జేరి బ్రహ్మనుగూర్చి ఘోరముగ తపమాచరించినది. బ్రహ్మదర్శన మిచ్చి నీ కోరిక ఏమిటో చెప్పుమనగా "నేను రాధాశాపముతో నున్న రుక్మిణిని, నాకు శ్రీకృష్ణుడే భర్తగా పొందుటకు"- వరమీయమని ప్రార్ధించినది.
అందులకు బ్రహ్మ ! నీ కోరిక తప్పక నెరవేరగలదు. కాని! ముందుగా గోలోకనివాసి సుదాముడే ముందుగా నీకుభర్త కాగలడు, అనంతరమే నీవు కోరిన వాడే నీకు పతియగును అని వరమిచ్చి అంతర్ధానమయ్యెను.
ఇలా ఉండగా బ్రహ్మదేవుడు చెప్పిన సుదాముడు పుష్కరకాలము శాపకారణముగా భూలోకమున శంఖచూడుడై జన్మించి తపమాచరించసాగెను. అతని తపస్సునకు మెచ్చి బ్రహ్మ ఏమివరము కావాలో కోరుకోమన్నాడు. అంత శంఖ చూడుచు "లక్ష్మీభూలోకమున పుట్టినదట! నాకామెతో వివాహాము చేయించమని వేడుకొనెను" బ్రహ్మ 'తధాస్తు' అని పలికి ఆమె బదరికాశ్రమమున నున్నది. ఆమె నీకు తప్పక లభ్యముకాగలదు అని యంతర్ధానమందెను. అనంతరము శంఖ చూడుడు బృందవాద ప్రతి వాదములను గమనించి అప్పుడు వార్కి మరల బ్రహ్మ ప్రత్యక్షమై వారి వారి అభీష్టములు నెరవేరుటకు వార్కి వైభవముగా వివాహము గావించెను.
ఇక శంఖచూడునకు లక్ష్మీయంశతో నున్న భార్య లభ్యమగుసరికి! అష్ట్తెశ్వర్యము లతో తులతూగుచూ అతిసమయము పెంచుకుని స్వర్గాధిపత్యము పొందగోరి దేవరాజ్యమును కొల్లగొట్టి; దేవతలను పలు ఇక్కట్లు పాలు చేయుటయే కాకుండా; పరమేశ్వరుని చెంతకేగి, శివా! నీ భార్య సుందరాంగి. అమెను నాకు వశ్యురాలును చేయుము లేనిచో యుద్ధమునకు తలపడమని ఘోరముగా శివునితో యుద్ధము చేయసాగెను. వెంటనే శ్రీహరి వారిని సమీపించి "శివా! వీడు అజేయుడు అగుటకు కారణం! ఈతని భార్య మహాపతివ్రత. ఆమె పాతివ్రత్య భంగము నేనాచరించదను. నీవు వీనిని వధించుము." యని యుక్తి చెప్పెను.
అనంతరము మాయా శంఖచూడుని వేషము ధరించి యున్న శ్రీహరిని చూచి బృంద తన భర్తే వచ్చినాడని భ్రమించి! ఆతనికి సర్వోపచారములుచేసి శ్రీహరి చెంతకు చేరగానే! ఆమె పాతివ్రత్యము భగ్నమగుట గ్రహించి శివుడు శంఖచూడుని సంహరించగా! నాతడు దేహమును విడచి "సుదాముడై" గోలోకమునకు పోయెను. బృంద తన ఎదుట ఉన్నది మాయా శంఖచూడుడని గ్రహించి శ్రీహరిని "శిలారూప మందుదువుగాక" యని శపించగా! తిరిగి ఆమెను నీవు "వృక్షమగుదువుగాక" యని శపించెను. ఆవిధంగా శ్రీహరి గండకీనదిలో సాలగ్రామ శిలగాపుట్టి; బృంద తులసీ వృక్షమై పోయి ఇద్దరూ ప్రపంచముచే పూజనీయస్వరూపములు పొందినట్లుగా బ్రహ్మవైవర్త పురాణగాధ ద్వార విదతమగుచున్నది.
ఒకసారి పరమేశ్వరుడు కుమారుడైన కుమారస్వామిని చెంతకుం చేర్చుకుని; పుత్రా!
"పుత్రా! సకల వృక్షములలోన తులసియొక్కటయే
పూజ్యమైక క్ష్మారుహంబు దాని పత్రములను దాని
పుష్పములను బ్రాణ సమములగును అచ్యుతనకు."
మరియు వృక్షాలన్నిటియందు తులసి శ్రేష్ఠమైనది, శ్రీహరికి ఇది అత్యంత ప్రీతిపాత్రమైనది.
"తులసిపూజ" తులసీ స్త్రోత్రం చదవడం, తులసి మొక్కలో పోసిన నీటిని శిరస్సున జల్లుకోవడం, తులసీవనమును పెంచి వాటి మాలలు శ్రీహరికి సమర్పించుట ఎంతో! పుణ్యప్రదమైనవి. గోదాదేవి తులసీవనంలోనే అయోనిజగా విష్ణుచిత్తునింట వెలసి శ్రీరంగనాధుని ఇల్లాలయింది.
శ్లో|| వశిష్ఠాది ముస్తోమై: పూజితో తులసీవనే
తదా ప్రభృతి యద్విష్ణు : బ్రతిజ్ఞాం కృతవాన్ ప్రభు:
తస్మిన్ తులస్యాంతు య: పూజాంకురు తేనర:
సర్వపాప వినిర్ముక్త : మమసాయుజ్య మాప్నుయాత్.
వశిష్ఠాది మునిగణముచే ఎన్నో విధములుగా స్తోత్రపూర్వకముగా శ్రీహరి తులసీ వనమందు పూజలందుకొని నన్ను "కార్తీక శుద్ధద్వాదశి" నాడు విశేషించి ఎవరు బూజచేయుదురో! అట్టివారి సమస్తయొక్క పాపములు అగ్నిలోపడిన మిడుతలు వలె భస్మమయి వారు తప్పక నా సాన్నిధ్యమును పొందుదురని ప్రతిజ్ఞ చేసెనట!
శ్లో|| తులసీవ్రత మహాత్మ్యం శ్రోతవ్యం పుణ్యవాంచ్చిన:
యదిచ్చేద్విష్ణు సాయుజ్యం శ్రోతవ్యం బ్రాహ్మ్ణ్తణ్తెస్సహ
విష్ణో : ప్రీతిశ్చ కర్తవ్యా శ్రోత వ్యాతులసీకధా
ద్వాదశ్యాం శ్రవణాత్తస్యా: పునర్జన్మ న విద్యతే.
విష్ణు సాన్నిధ్యముగోరి విష్ణుదేవునకు యేమాత్రమైన ప్రీతి జేయవలయునునని తలచేవారు తులసీ వ్రతమహాత్మ్యము తప్పక వినవలయును. అందునా! ఆ వ్రత కధను "క్షీరాబ్ధిద్వాదశి" రోజున తులసీ కధ వినువార్కి, చదువువార్కి, పూర్వజన్మ కృతమైన దు:ఖములన్నియు తొలగిపోయి విష్ణులోకమును పోందుదురు, అని శంకరునిచే "తులసి" కొనియాడబడినట్లు చెప్పబడినది. అట్టి తులసీ బృందావన మందు ఉసిరిమొక్కతో కలిపి "తులసీధాత్రీ సమేత శ్రీమన్నారాయణుని" ఈ కార్తీక ద్వాదశినాడు పూజించుట ఎంతో విశిష్టమైనదిగా పేర్కొనబడినది. మరియు అట్టి తులసీ దళములకు "నిర్మాల్యదోషం" పూజలో ఉండదని కూడా చెప్పబడినది.
కావున! మన హిందూమతంలో "తులసి" ఆధ్యాత్మిక దృష్టిలో విశిష్టమైన స్ధానాన్ని పొందింది. తులసిమొక్క హిందువులకు పూజనీయమైనది. కావున హిందువులు ప్రతిఇంటా తులసి మొక్కను కోటలో పెంచి పూజించుట మనం చూస్తూ ఉంటాము. ఇక పట్టణావాసులైతే అంతలో కొంత జాగా ఏర్పరచుకుని, చిన్నచిన్న కుండీల్లోనో, డబ్బాల్లోనో పెంచి పూజిస్తూ ఉంటారు. కావున 'తులసి' ఉన్న ఇల్లు నిత్యకళ్యాణము పచ్చతోరణంతో శోభిల్లుతూ ఉంటుంది.
ఇక ఈ తులసిని వైద్యపరంగా కూడా చూస్తే! ఆయుర్వేద శాస్త్రంలో 'సప్తతులసి-భరతవాసి' అంటూ..
తులసిని ఏడువిధాలుగా వివరించబడినది. అవి:
- 1. కృష్ణ తులసి
- 2. లక్ష్మీతులసి
- 3. రామతులసి
- 4. నేల తులసి
- 5. అడవి తులసి
- 6. మరువ తులసి
- 7. రుద్రతులసిగా వివరుస్తారు.
- వైద్యపరంగా వాటి అన్నిటికి ఎన్నో అమోఘమైన ఔషధగుణాలతో కూడి ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం కొనియాడుతోంది.
- ప్రతిరోజు ఉదయం రెండు తులసి ఆకులు (కోటలోవికాదు) విడిగా పెంచుకున్న మొక్కలనుండి నమలి మింగితే వార్కి బుద్ధిశక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
- మరియు అనేక మానసిక రుగ్మతలు నయమవుతాయని; ఇలా ఎన్నో విశేష గుణాలను చెప్తారు.
- ఇక దాని కాండముతో తయారుచేయబడ (తులసిమాల)కు ఇటు ఆధ్యాతికపరంగా అటు ఆరోగ్యపరంగా ఎన్నోలాభాలు ఉన్నాయిట !
తులసీ పూజ |
తులసీ పూజతో సర్వదేవతారాధన
ప్రతి మనిషికీ తల్లి తొలిగురువు అని పెద్దలంటారు. ఆ తల్లిని గురువుగా భావించి, గురుదక్షిణ ఇవ్వడం కొద్ది మందికే సాధ్యం. అటువంటి అసాధారణ వ్యక్తులలో సంగీత త్రయంలోని త్యాగరాజును చెప్పుకోవాలి. సంగీత కుటుంబం నుండి వచ్చిన తల్లి సీతమ్మ సంగీతంలోని ఓనమాలు నేర్పి త్యాగరాజు తొలిగురువయింది.ప్రతి నిత్యం తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తూ, మధురమైన కంఠంతో పురందరదాసు, రామదాసు, అన్నమయ్యల కీర్తనలు తల్లి పాడుతుంటే వింటూ, గొంతు కలిపి పాడుతూ త్యాగరాజు పెరిగాడు. వంశానుగతంగా వచ్చిన శ్రీరామభక్తి, తల్లి సంకీర్తనల ద్వారా మరింత పరిపుష్టమై, త్యాగరాజును అచిరకాలంలోనే గొప్ప సంగీతజ్ఞుడిగా, వాగ్గేయకారుడిగా తీర్చిదిద్దింది.
తన బంగారు భవితవ్యానికి మార్గదర్శకురాలైన తల్లికి గురుదక్షిణ సమర్పించడమే తన ప్రథమ కర్తవ్యమని త్యాగరాజు భావించాడు. తల్లికి అత్యంత ప్రియమైన తులసీమాతపై కీర్తనలు రచించి తద్వారా ఆమెకు సంతృప్తి కలిగించాడు. ఎన్నో ఔషధగుణాలు కలిగి, సౌభాగ్యప్రదాయినిగా ప్రతియింటా వెలసిన తులసీమాతపై త్యాగరాజు రచించిన కీర్తనలు ఎంతో ప్రసిద్ధి పొందాయి.
సావేరి రాగం - రూపకతాళం
ప॥తులసీ జగజ్జననీ దురితాపహారిణీ॥
చ॥చరణ యుగంబులు నదులకు పరమ వైకుంఠమట
సరసిజాక్షి నీమధ్యము సకల సురావాసమట
శిరమున నైగమకోట్లు చెలగుచున్నారట
సరస త్యాగరాజాది వర భక్తులు పాడేరట॥
తులసి మొక్క అడుగుభాగాన శ్రీ మహావిష్ణువు సాలగ్రామ రూపంలో ఉంటాడు. విష్ణుపాదాల నుండే గంగ పుట్టడం వల్ల, నదులకు పుట్టిల్లు వైకుంఠమనీ, విష్ణు నివాసమైన తులసియే వైకుంఠమని, మధ్య భాగంలో సకల దేవతలు కొలువుంటారనీ, శిరోభాగం వేద స్వరూపంగా భాసించడం వల్ల, ఒక్క తులసి మాతను పూజిస్తే సకల దేవతలనూ పూజించినట్లే అని త్యాగరాజు తులసీ మహాత్మ్యాన్ని తెలియపరిచాడు.
అనన్యదర్శనాః ప్రాతః మే పశ్యంతి తపోధన
జగత్త్రితయ తీర్థాని తైర్దృష్టాని న సంశయః
ఉదయము నిద్రనుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది. తులసిచెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరిక, మానసిక ఆరోగ్యమునిస్తుంది.
తులసి పూజ చేయు విధానము:
తులసికోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణము చేయాలి, నమస్కరించాలి. దీనివలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వ పాపప్రక్షాళన జరుగుతుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము, సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు.
పూజ:
ఒక చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకొని తులసి చెట్టు వద్ద నిలుచొని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి.
నమస్తులసి కళ్యాణీ! నమో విష్ణుప్రియే! శుభే!
నమో మోక్షప్రదే దేవి! నమస్తే మంగళప్రదే!
బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ!
పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణజీవనీ!
ఏతన్నామాష్టకం చైవ స్తోత్రం నామార్థసంయుతం
యః పఠేత్తం చ సంపూజ్య సోశ్వమేధ ఫలం లభేత్
అని తులసిని ప్రార్థించి, అచ్యుతానంతగోవింద అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి. తరువాత క్రింది శ్లోకాన్ని ప్రార్థనా పూర్వకంగా పఠించాలి.
యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం ||
అని చెంబులోని నీళ్లను తులసిచెట్టు మొదట్లో పోసి నమస్కరించాలి.
తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే
నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే ||
అని తులసికోట లేదా చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీనివలన కర్మదోషాలన్నీ తొలగుతాయి.
పూజ కోసం తులసీ పత్రాలను ఎలా కోయాలి అన్నదానికి సనాతన ధర్మం ఒక పద్ధతిని తెలియజేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం:
- 🙙 తులసీం యే విచిన్వంతి ధన్యాస్తే కరపల్లవాః - పూజ చేయటం కోసం తులసి దళాలను త్రెంపిన చేతులు ఎంతో ధన్యములు అని స్కాందపురణం చెప్పింది.
- 🙙 తులసి చెట్టునుండి దళాలను మంగళ, శుక్ర, ఆది వారములలో, ద్వాదశి, అమావాస్య, పూర్ణిమ తిథులలో, సంక్రాంతి, జనన మరణ శౌచములలో, వైధృతి వ్యతీపాత యోగములలో త్రెంప కూడదు. ఇది నిర్ణయసింధులో, విష్ణుధర్మోత్తర పురాణంలో తెలియజేయబడినది. తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణం అయినట్లు కాదు.
- 🙙 ఇది వరాహ పురాణంలో చెప్పబడింది. కాబట్టి నిషిద్ధమైన రోజులలో, తిథులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలి పడిన ఆకులతో, దళములతో పూజ చేయాలి. ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసి దళములను త్రెంపి దాచుకొని మరుసటి రోజు ఉపయోగించాలి.
- 🙙 సాలగ్రామ పూజకు మాత్రం ఈ నిషేధము వర్తించదు. సాలగ్రామమున్నవారు అన్ని తిథివారములయందు తులసి దళములను త్రెంపవచ్చు. ఎందుకంటే సాలగ్రామం స్వయంగా విష్ణు స్వరూపం.
- 🙙 శ్రీమహావిష్ణువు మందిరంలో వచ్చి ఉన్నప్పుడు ఏ దోషాలూ వర్తించవు. ఇది ఆహ్నిక సూత్రావళిలో చెప్పబడింది. స్నానము చేయకుండా మరియు పాద రక్షలు ధరించి తులసి చెట్టను తాకరాదు, దళములను త్రెంపకూడదు. ఇది పద్మపురాణంలో చెప్పబడింది.
తులసి ఆకులను ఒక్కొక్కటిగా త్రెంపకూడదు. రెండేసి ఆకులు కలిగిన దళముతో కూడిన కొసలను త్రెంపాలి. అన్ని పుష్పాల కన్నా తులసీ మంజరులు (అంతే తులసికి వచ్చే పుష్పాలు) అత్యంత శ్రేష్ఠమని, ఈ మంజరులను కోసేటప్పుడు వాటితోపాటు ఆకులు తప్పనిసరిగా ఉండాలని బ్రహ్మపురాణం చెప్పింది.
తులసిమొక్కకు ఎదురుగా నిలబడి, రెండు చేతులు జోడించి, కింది మత్రాన్ని చదువుతూ పూజా భావంతో మొక్కను కదిలించకుండా తులసి దళాలను త్రెంపాలి. దీనివలన పూజాఫలం లక్షరెట్లు అధికంగా లభిస్తుంది అని పద్మపురాణం చెప్పింది.
మాతస్తులసి గోవింద హృదయానందకారిణి
నారాయణస్య పూజార్థం చినోమి త్వాం నమోస్తుతే
తులస్యమృతజన్మాసి సదా త్వం కేశవప్రియా
చినోమి కేశ్వస్యార్థే వరదా భవ శోభనే
త్వదంగసంభవైః పత్రై పూజయమి యథా హరిం
తథా కురు కురు పవిత్రాంగి! కలౌ మలవినాశిని!
(ఆహ్నిక సూత్రావళి)
శ్రెహరికి ఆనందాన్ని కలిగించే తులసీ మాతా! నారాయణుని పూజ కొరకు నీ దళములను కోస్తున్నాను. నీకు నా నమస్కారములు. అమృతమునుండి జన్మించిన, ఎల్లప్పుడు శ్రీహరికి ప్రియమైన తులసీమాతా! ఆ కేశవుని పూజ కొరకు నీ దళాలను త్రెంపుతున్నాను. నాకు అభయమునివ్వు శుభకరీ! నీ శరీరమునుండి జన్మించిన పత్రములతో ఆ శ్రీహరిని పూజిస్తాను. కలియుగంలో సమస్త దోషములు తొలగించే పవిత్రమైన శరీరము కల తల్లీ! నేను తలపెట్టిన హరిపూజను సాఫల్యము చేయుము.పూజ చేసిన తరువాత ఒక తులసీదళాన్ని "అచ్యుతానంతగోవింద" అని స్మరిస్తూ నోట్లో వేసుకొని తినాలి. ప్రతిరోజు భక్తిభావంతో ఒక తులసిదళాన్నిసేవించటం వలన సకల రోగాలు నశిస్తాయి, రాబోయే రోగాలు నిరోధించబడుతాయి.
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తులసీ దయాపూర్ణకలశీ అన్నారు ఒక గీతంలో. తులసి అంతటి వైభవము, దయ కల మాత. నిత్యం పూజిద్దాం, దళాన్ని సేవిద్దాం. సకల శుభాలను,ఆరోగ్యాన్ని పొందుదాం.
రచన: శేషగిరి రావు