నవగ్రహ పురాణం - 29 వ అధ్యాయం - కుజగ్రహ జననం - 2

P Madhav Kumar


🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷

*కుజగ్రహ జననం - 2*

*"నారాయణ ! నారాయణ ! అదృష్టమంటే నాదే ! కోరకుండానే ఈ నారదుడి కోరిక తీరింది !


*"మా సహోదరులు అందర్నీ , అన్నింటినీ మూడవ కంటితో చూసి గ్రహిస్తారు. నారదా !"* అంది భూదేవి. లక్ష్మి భూదేవి చేతుల్లోంచి బాలుణ్ని అందుకుని , నుదురు మీద ముద్దెట్టుకుంది.


భూదేవి శ్రీహరిని వాలుగా చూస్తూ , నమస్కరించింది. కళ్ళతో పలకరిస్తూ దీవించాడాయన.


*"అబ్బ ! తామర మొగ్గలా ఉన్నాడు”* అంది సరస్వతి కుజుణ్ణి అందుకుంటూ.


*"అమ్మా , భూదేవీ ! బాలకుణ్ణి చక్కగా తీర్చిదిద్ది , విద్యావంతుడిని చేయి. ఈ శిశువు సామాన్యుడు కాదు. నవగ్రహ దేవతలలో ఒకడు !"* అన్నాడు బ్రహ్మ.. 


*“ఔను ధరణీ ! అంగారక బాలుని తల్లిగా నీకు అందివచ్చిన అదృష్టం నీ కీర్తిని లోకాలలో శాశ్వతం చేస్తుంది !"* అన్నాడు విష్ణువు. 


*"వసుధా ! నా స్వేద సంభూతుడైన ఈ శిశువు నీ శిశువైనాడు. భవిష్యత్తులో ఆధ్యాత్మిక , అధి భౌతిక , అధి దైవిక తాపాలనబడే తాపత్రయం లేని విశిష్టుడుగా విరాజిల్లుతాడు. నీ పుత్రుడైన ఈ కుజుని ప్రభావంతో లోకాలకు భూసంపద లభిస్తుంది".* అన్నాడు శివుడు.


సరస్వతి బాల భౌముణ్ని భూదేవికి అందించింది. *"గర్భధారణ క్లేశం లేకుండానే తల్లివైన అదృష్టం నీది !"* అంది చిరునవ్వుతో. .


*"పరమేశ్వరుల దీక్షకు భంగం కలిగిందేమో !"* నారదుడు నవ్వుతూ అన్నాడు  అర్ధం చేసుకున్నట్టు బ్రహ్మా , విష్ణువు ధర్మపత్నీ సమేతులుగా అదృశ్యమయ్యారు..


భూదేవి బాలుణ్ని శరీరానికి హత్తుకుని , శివుడి వైపు చూసింది. *"అప్పుడప్పుడు మీ స్వేదజుడిని మీ దర్శనానికి తీసుకువస్తుంటాను ! సెలవు !"* 


*"శుభం భూయాత్"* అన్నాడు శివుడు దీవిస్తూ , భూదేవి బాలుడితో పాటు అంతర్ధానమైంది. 


శివుడు ఇంకా అక్కడే ఉన్న నారదుడివైపు చిరునవ్వుతో చూశాడు. *"నారదా ! మా దీక్షకు భంగం కలిగింది కదూ !"*


*“నారాయణ ! తమ అనుమతితో నిష్క్రమిస్తున్నాను. కుజ జనన వార్త లోకాలలో చాటాలి కదా !"*


పరమేశ్వరుడు విశాలమైన రెప్పల్ని , విశాలమైన నేత్రాల మీదికి వాల్చాడు.


నిర్వికల్పానంద కథనం ఆపి , శిష్యులవైపు చూశాడు. *"కుజుని ఆవిర్భావం గురించి. విన్నారు కదా ! తరువాత ఎవరి వృత్తాంతం చెప్పుకోవాలో చెప్పగలరా ?”*


*"ఇంకెవరు బుధుడు !"* చిదానందుడు నవ్వుతూ అన్నాడు.


నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు. *"బుధగ్రహం కాదు నాయనా , గురుశుక్రుల గురించి ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటే 'ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే...'* అనే క్రమం నవగ్రహాల స్థానాలను త్రిమూర్తులు నిర్ణయించిన వరుస క్రమం. నవగ్రహ దేవతలు జన్మించిన క్రమం కాదు ! గురువూ , శుక్రుడూ అనంతరం - గురువుకు , అంటే బృహస్పతికి వివాహం జరిగిన అనంతర కాలంలో జన్మించాడు బుధుడు ! అంచేత గురుశుక్రుల జన్మ వృత్తాంతాలు తెలుసుకోకుండా బుధుని వృత్తాంతం తెలుసుకోవడం పద్ధతి కాదు.


*మరో నిజం చెప్పాలంటే గురు గ్రహంగా పేర్కొనబడే బృహస్పతీ , శుక్రుడూ ఇద్దరూ చంద్రుడి కన్నా ముందే జన్మించారు ! అయితే నేను ముందుగా చంద్ర జన్మగాథనే వినిపించాను. ఎందుకంటే - ఆయన ఆవిర్భావానికి గురుశుక్రులకూ ఏ విధమైన సంబంధమూ లేదు !"*


*"అర్థమైంది గురువుగారూ !"* విమలానందుడు అన్నాడు..


*"చంద్రుడి ఆవిర్భావం గురించి ముందుగా చెప్పడానికి మరో ముఖ్య కారణం ఉంది. నవగ్రహాలలో మొదటి ముగ్గురూ త్రిమూర్తుల అంశలతో జన్మించారు ! అందుకని ఆ ప్రాధాన్యతలిచ్చాను.”* నిర్వికల్పానంద వివరించాడు.


*"ఏ అంశాన్నీ విస్మరించకుండా తెలియజెప్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది గురువుగారూ !"* సదానందుడు సంతోషంగా అన్నాడు.


*"నిర్లక్ష్యంగా చెబితే , పురాణం 'పుక్కిటి రాణం' అయిపోతుంది నాయనా !"* నిర్వికల్పానంద నవ్వుతూ అన్నాడు.


*"సరే - ఇక బృహస్పతి చరిత్ర శ్రవణం చేద్దాం. బ్రహ్మ మానస పుత్రుడు 'అంగిరసుడు' గుర్తున్నాడు కదా ! ఆయనకి చాలా మంది భార్యలూ , చాలా మంది పుత్రులూ , పుత్రికలూ ఉన్నట్లు పురాణాలు చెప్తున్నాయి. అయితే మన కథకు వాళ్ళందరితోటీ అవసరం లేదు. బృహస్పతి చరిత్రకు అవసరమైన వాళ్ళ గురించి మాత్రమే తెలుసుకుందాం. అంగీరస మహర్షి భార్యలలో 'శ్రద్ధ' అనే ఆమెది ప్రముఖ స్థానం. 'వసుధ' అనే మరొక పేరు కూడా ఆమెకు ఉండేది. అంగిరసుడికీ , శ్రద్దకూ కలిగిన ప్రథమ సంతానం 'ఉతథ్యుడు'...”*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat