*4వ భాగం*
👉 ఇలా క్రమముగా ఆమెకు తొమ్మిది నెలలూ నిండాయి.
అయితే లోపలనున్న నందీశ్వరుడు మాదాంబ గర్భ కుహరంలో సమాధిస్థితిలో సిద్ధ పద్మాసనంలో విశుద్ధాత్ముడై ఉండిపోయాడు. *‘ఇదేమిటీ ఎంతకూ గర్భశిశువు భూమీదికి రావడంలేదు? ఆలాంటిది పూర్వం ఎన్నడన్నా కన్నామా? విన్నామా?* అని మిత్రులూ శత్రువులూ అంతా భయపడి పారిపోసాగారు. అయితే శిశువు మాత్రం కుండలీయోగస్థుడై నిరంతర శివధ్యాన తత్పరుడై మూడు సంవత్సరాలు మాతృగర్భంలోనే ఉన్నాడు.
అప్పుడు మాదాంబ గర్భశిశువును మోయలేక దిగులుతో మళ్లీ నందికేశుని గుడికిపోయి *‘‘లోకంలో ఎవరైనా తొమ్మిది నెలలకే నీళ్ళాడుతారు. కానీ స్వామి మూడేళ్ళయింది దుర్భరమైన ఈ గర్భం నాకు కర్కటి గర్భంగా వుంది. చాలు చాలు నీ వరాలు నాకిక గర్భమూవద్దు ఏమీ వద్దు’’* అని విన్నవించుకుంది.
మాదాంబ తిరిగి గృహానికి వచ్చి పడుకొనగా ఆమెకొక కలవచ్చింది. అందులో నందీశ్వరుడు జంగమ లింగవేషము ధరించి కన్పడి *‘‘మాదాంబా! నీ గర్భస్థశిశువు సామాన్యుడనుకున్నావా? పరమశివుని ఆజ్ఞ పై భూలోకానికి వస్తున్న 🐂నందికేశుడు. అది వృషభము, శిలాదుని పుత్రుడు, భక్తహితార్థమై నీకు పుత్రుడుగా ప్రభవిస్తున్నాడు. ఇక దిగులు చెందకు. పుట్టిన వెంటనే శివువుకు 🙏🐂‘బసవ’డనే🙏 పేరు పెట్టు’’* అని చెప్పి అంతర్థానమైనాడు.
మాదాంబ మేలుకొని వచ్చిన కలను తలచుకొని *‘‘ఆహా సాక్షాత్తు నందికేశుడు స్వప్నంలో ప్రత్యక్షమైనాడు. నా జన్మ ధన్యమైంది’’* అని పరమానందపడింది. బంధు మిత్రులంతా ఇది విని ఆశ్చర్యపోయారు. అప్పుడు పరమేశ్వరుడు గర్భశిశువు నుద్దేశించి *"ఏమి నందికేశా వచ్చినపని మరచి లోపలే వున్నావు?’* అనగానే పద్మాసనస్థుడైన శిశువు పరమేశ్వరునికి నమస్కరించి మాదాంబ గర్భాన ఉదయించాడు.
శిశువు పుడుతున్న సమయంలోనే పరమేశ్వరుడు అదృశ్యరూపంలోనే ఉండి శిశువుకు లింగధారణ చేశాడు. ఇలా నందికేశుడు బిడ్డడై పుట్టగానే బంధు మిత్రాదులంతా శిశువును చూస్తున్నారు. అప్పుడు భస్మరుద్రాక్షలు ధరించి రాగికుండలాలతో త్రిపుండరేఖలతో ఒక చేత యోగదండమూ మరొక చేత గొడుగు ధరించి పరమశివుడు తాపసి వేషంలో ఆ గదిలోకి ప్రవేశించి మాదాంబను ఆశీర్వదించాడు.
*‘‘ఎవరు స్వామీ తమరు?’’* అని అక్కడివారు ప్రశ్నింపగా *‘‘మా ఇల్లు కప్పడి సంగమేశ్వరంలో వుంది. నా పేరు కూలి సంగమేశ్వరుడు, వెనకటి జన్మలో ఈ శిశువు నాకు కొడుకు. లోకహితార్థమై నీకు జన్మించాడు. అందుకని చూడవచ్చాను. ఇక నుండి ఈ శిశువుకు నేనే గురువును. మాదాంబా ఈ బిడ్డకు లింగార్పితం కాని ప్రసాదం ఎన్నడూ తినిపించకు. ఇదే నా ఆజ్ఞ!* అని చెప్పి తాపసి అదృశ్యుడైనాడు.
అప్పుడు పురిటిగది వేయి సూర్యులు వెలిగినట్లు వెలిగింది. పొత్తిళ్ళలోని శిశువు దివ్య తేజస్సుతో ధగధగ వెలుగసాగాడు. అజ్ఞానమనే అంధకారం విజ్ఞానవంతుడైన ఈ శిశువువనే సూర్యునివల్ల పారద్రోలబడుతున్నదా అన్నట్లుగా ఆ కాంతి ప్రభలు గోచరించాయి. మాదాంబ, మాదిరాజు అది చూసి పరమానంద భరితులై భక్తులకు హస్త పాదోదకములతో పూజించి విభూతి విడెములిచ్చి అర్పించారు. అప్పుడు పంచమహావాద్యములు మ్రోగుతుండగా పుణ్యాత్ముడైన ఆ శిశువుకు *🐂‘బసవ’డని* పేరు పెట్టారు.
బసవన్న క్రమంగా పెరుగుతున్నాడు. వెనుక చీకటి వుంటే తనకేమి? అన్నట్లు తేజోమూర్తి బసవన్న పాపగా వున్నపుడు దీపాన్ని చూచి నవ్వేవాడు. లింగ ప్రసాదమే స్వీకరిస్తున్నాడా అన్నట్లు తల్లి స్తన్యాన్ని స్వీకరించేవాడు. శివ సుఖామృతమును రెండు చేతులతో జుర్రుకుంటున్నట్లు పసిపాపడై చేతులు నాకుతూ వుండేవాడు. శివ పద ధ్యాన నిశేచష్టితావస్థలో ఉన్నట్లు దిగ్భ్రాంతుడై ఉండేవాడు. గాసట బీసట ప్రపంచాన్ని పారద్రోలి విజృంభించినట్లు చేతులాడించసాగాడు. మాయా ప్రపంచాన్ని దగ్గరకు రానీయనట్లు కాలు ఆడించేవాడు. తాను చేయవచ్చిన పనులకు ఆలస్యమయినట్లు ఉలిక్కిపడేవాడు. శివానందమగ్నుడై ఆనంద బాష్పాలు జాలువారుస్తున్నట్లు కళ్ళ వెంట నీరు కార్చేవాడు.
జన్మదుఃఖంతో రోదించే జీవుల మొరలు వింటున్నాడా అన్నట్లు ఏదో వినేవాడు. శివభక్తులకు పాదాభివందనం చేస్తున్నాడాన్నట్లు భూమిపై బోర్లాపడేవాడు. భూమిపై తగ్గిన నిర్మల శివభక్తి మళ్లీ తలెత్తుతున్నదా అన్నట్లు తల పైకెత్తేవాడు. పద్మాసన విధానం అభ్యిసిస్తున్నాడా అన్నట్లు కూర్చోవడం మొదలుపెట్టాడు. తానే ద్వితీయ శంభుండనని అనిపించేటట్లు నందివలె ఊగడం మొదలుపెట్టాడు. వీర మహేశ్వరాచారమంతా ఒక చోట మూర్త్భీవించినట్లు లేచి నిలబడ్డాడు.
సనాతన మార్గాన్ని ఒక్కడుగు కూడా మీరకుండా నడుస్తున్నట్లు అడుగులు వేయడం శివనామం చెప్పినంతనే గద్గద స్వరంతో మాట్లాడేటట్లు త్రొక్కు పలుకులు పలుకసాగాడు, శివచిత్తులే శ్రేష్టులు అని చాటి చెప్పుతున్నట్లు పరుగెత్తుతూ ఆడడం నేర్చుకున్నాడు.
*- ఇంకా ఉంది*
*హర హర మహాదేవ*