బసవడు ఇంకనూ తన తండ్రితో ఇలా చెబుతున్నాడు *"మామిడి గింజను భూమిమీద నాటితే వేపమొక్క ఎలా మొలుస్తుంది? భక్తి, సహజలింగైక్య నిష్ఠ కలది. బ్రాహ్మణ పథము బహు దేవతా సేవతో కూడినది. భక్తికులసతి. బ్రాహ్మణ్యము వెలయాలివంటిది. గౌతమ దధీచి వ్యాసాదుల శాపములతో వహ్నిపాలైన భూసురులకు భక్తి ఎలా అబ్బుతుంది? కర్మమార్గానికి భక్తిమార్గానికీ పొత్తు కుదరదు. అలాంటి కర్మ మార్గంలో నన్ను పడేయాలని మీరు బలవంత పెడుతున్నారు. కాకులు పెంచినంత మాత్రాన కోకిల పిల్ల కాకి కాబోదు. అలాగే భక్తి మార్గనిష్ఠితుడైన నాకు ధర్మేతరులైన మీరెక్కడి తల్లిదండ్రులు? చెన్నయ్య మా తాత. చేరమ తండ్రి. పిన్నయ్యకక్కయ్యలకు బిడ్డను నేను. మీరు మీ ఇష్టం వచ్చినట్లు ఉండండి. నాకు తోచినట్లు నేనుంటాను’’.*
అని ఈ విధంగా బసవన్న తండ్రితో చెప్పి సోదరి నాగమాంబతో సహా ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. *‘ఇదెక్కడి వింతమ్మా!’* అని జనులు ఆశ్చర్యపడగా బసవడు శివుని సన్నిధిలో గుడిలో ఉండసాగాడు.
ఇలా కొంతకలాం గడిచింది. లోగడ బసవన్నకు ఉపనయమని ప్రకటించినప్పుడు చాలామంది బంధువులు మాదిరాజు ఇంటికి వచ్చారు కదా! అందులో బలదేవుడు కూడా ఉన్నాడు. బలదేవుడు మాదాంబకు సోదరుడు, ప్రభువైన బిజ్జలునికి దండనాయకుడు. ఆయన బసవేశ్వరుని భక్తిని చూచి పరమానందపడ్డాడు. ఇటువంటి శివభక్తునికి నా కుమార్తెను ఇచ్చి పెళ్లిచేస్తాను కాని భవికి (శైవేతరునికి) ఇవ్వను’ అని నిశ్చయించుకున్నాడు.
ఇలా అనుకొని బలదేవుడు బసవకుమారుడు నివసించే చోటుకుపోయి *‘ఓ మాహేశ్వర తిలకా! నా కుమార్తెను నీవు భార్యగా స్వీకరించి కరుణించవలసినది’* అని ప్రార్థించాడు. బసవకుమారుడు బలదేవుని కోరికను మన్నించాడు.
బసవన్న సంగమేశ్వరము చేరాడు. ముందుగా ఆ పుణ్యస్థలికి వందన మాచరించి గురుస్తవంతో నగర ప్రవేశము చేశాడు. సంగమేశ్వరము తీర రాజమని చెప్పవచ్చు. దాని మహిమ పొగడడానికి ఆదిశేషునికైనా తరం కాదు. అక్కడి ఏరులన్నీ పుణ్యతీర్థాలే! ప్రతి గుహ కూడా శివ నివాసమే. అక్కడి గుట్టలన్నీ కైలాస తుల్యములే. చెట్లన్నీ రుద్రాక్ష చెట్లే. గనులన్నీ విభూతి గనులే. ఆవులన్నీ కామధేనువులే. వృషభములన్నీ నందీశ్వరులే. ఆ సంగమేశ్వరంలోని స్ర్తిలంతా పతివ్రతలే. పురుషులంతా భక్తమహాశయులే! నిరంతరం తత్వ భాషలు గీత వాద్యోత్సవములు చెలరేగే ఆ నగరంలో దుర్జనుడు వెతికినా కూడా కన్పడడు. అట్టి సంగమేశ్వర నగరంలోని కూడలి సంగమేశ్వరుని గుడి వద్దకేగి బసవన్న గురులింగమూర్తికి సాష్టాంగ ప్రణామము చేసి వేద పురాణార్థ సూక్తులతో స్వామిని ప్రశంసించాడు.
అప్పుడు గుడిలోనుండి సంగమేశ్వరుడు జంగమ వేషము ధరించి బయటకు వచ్చాడు. ఆయనను చూడగానే బసవన్న నిర్భరమైన ఆనందంతో తన కన్నీళ్లే అభిషేము కాగా గురుదేవుని పాదములు అభిషేకించాడు.
అప్పుడు సంగమేశ్వరుడు తన ముద్దుల కొడుకును లేవనెత్తి కౌగలించుకొని ప్రసాదమిచ్చి ఇలా అన్నాడు.
*‘‘ఇక్కడికివచ్చిపోతూ వుండేభక్తులవల్ల నీ సచ్చరిత్రము వింటూనే వున్నాము. బసవా! ఈ మాటలు విను! గత కాల వర్తనకంటే సద్భక్తి మితి తప్పి నడువవద్దు. శివభక్తులలో లోపాలు ఎంచవద్దు. లింగాయతుడు శత్రువైనా మిత్రునిగానే పరిగణించు. తాపట్టిన వ్రతము ప్రాణాంతకమైనా విడువవద్దు. శివభక్తి హీనులను సహించవద్దు. వేదశాస్త్రార్థ సంపాదిత భక్తిని లోకంలో ప్రచారం చేయాలి. భక్తులు తిట్టినా, కొట్టినా, కాలతన్నినా, ‘శరణు శరణు’ అని మాత్రమే అను! పరస్ర్తిలను సోదరీమణులుగా భావించు! భక్త ప్రసాదం కాని అమేధ్యంతో సమానంగా భావించు! భక్తి వంచన లేనిదని గుర్తించు! జంగముడు వేరు నేను వేరు కాదు. శివభక్తస్తుతి చేయి. ఎట్టి కష్టం వచ్చినా మమ్ము స్మరించుకో! సత్యమార్గాన్ని వదలవద్దు నాయనా!’’* అని మృధు మధుర భాషణములతో కొడుకును ప్రబోధించి కౌగిలించుకొని బసవనిచే మొక్కించుకొని తిరిగి తాపసి రూపంలో వున్న ఆ గురులింగ మూర్తి గుడిలో అదృశ్యమైపోయాడు. అది చూచిన భక్తులు ఆశ్చర్యపోయి మనమెన్నడూ ఈ గుడిలో ఇలాంటి తపసిని చూచింది లేదు. సాక్షాత్తు శివుడే ఈ రూపంలో వచ్చాడనేందుకు సందేహం లేదు. బసవన్న ఎంతటి భక్తుడో కదా! కాకుంటే సాక్షాత్తు సంగమేశ్వరుడే వచ్చి ప్రబోధించి ఎందుకు వెళ్తాడు! బసవన్నా! నా జన్మ ధన్యము- భక్తుడంటే ఇలాగే ఉండాలి. లోగడ ఒక భక్తుడు కొడుకును నొప్పించాడు. మరొకడు వస్తమ్రు సమర్పించాడు. ఇంకొకడు తన భార్యను శివునికి అర్పించాడు. ఇంకొకడు భక్తికోసం తండ్రినే చంపివేశాడు. ఇట్లా పురాతన భక్తులు తమ భక్తి ప్రదర్శించి శివానుగ్రహాన్ని చూరగొన్నారు. ఇప్పుడు బసవన్న కూడా అలా శివకృపకు పాత్రుడైనాడు అని అందరూ వేనోళ్ల పొగిడారు.
అప్పుడు బసవన్న భక్త సమూహంతో కలిసి కూడల సంగమేశ్వరుని మంటపంలోనే శివరాధనలో ఉండి మూడు సంధ్యలలోనూ గురు లింగమూర్తిని సేవిస్తూ కొంతకాలం గడిపాడు.
(ఇక్కడ ముఖ్యమైన చారిత్రకాంశములు గమనించాలి. పాల్కురికి సోమనాథుని జన్మస్థలం నేటి వరంగల్‌కు సమీపంలోని పాలకుర్తి గ్రామం. ఆయన సమాధి మాత్రం కర్ణాటకలోని కల్వ అనే ప్రాంతంలో ఉంది.)
ఇంకా ఉంది🙏