🔱 శబరిమల వనయాత్ర - 57 ⚜️ తిరువాభరణ పెట్టె ఆగమనము ⚜️

P Madhav Kumar

⚜️ తిరువాభరణ పెట్టె ఆగమనము ⚜️

స్వామివారికి అలంకరించబడు తిరువాభరణములు పందళ దేశ రాజు యొక్క వంశము వారి ఆధీనములో యుండును. మకర విళక్కు ఉత్సవమునకు (అనగా జనవరి 14వ తేదీన) ముందుగా పందళ దేశమునుండి తిరువాభరణములు మహా కోలాహలముతో వైభవముగా గొని వచ్చి అలంకరించి మరల పందళ దేశపు రాజధానికి గొనిపోయి భద్రపరచెదరు. ఈ తిరువాభరణములు అందమైన మూడు పెట్టెలలో ఉండును. తిరువాభరణ పెట్టెని పందళదేశపు సన్నిధికి మోసుకొని వచ్చువారు ఒక ఏడాది కఠినమైన వ్రతానుష్ఠానములు గైకొనిన పిదపనే మోసుకుని రాగలరనియూ , నియమము , వ్రత భంగము గలిగినవారు తిరువాభరణ పెట్టెని స్పర్శించుటకు సాధ్యము

కాదనియూ చెప్పెదరు. మకర సంక్రాంతి దినమున సంధ్యా సమయమునకు

తిరువాభరణ పెట్టి స్వామి సన్నిధానమునకు చేరును. తిరువాభరణము యొక్క ఆగమనమును చూచుటకునూ , స్వామివారి దీపారాధనను దర్శించుటకునూ అయ్యప్ప భక్తులు ఆలయము యొక్క పురోభాగము నందు సంఘటిత మయ్యెదరు. అందరూ అచ్చట సౌకర్యముగా నిలబడి చూచుటకునూ , నమస్కరించుట కునూ వసతి తక్కువగా నున్ననూ , స్వామివారి యొక్క తిరువాభరణము ఉండు పెట్టెను ఒక కంటితో చూచి ఆనందించు భాగ్యము సిద్ధించక యుండదు. నిశ్చల మనస్కులై అచ్చట కూడియున్న వారందరూ ప్రవర్తించడం మూలముగా దానికి ఎటువంటి ఆటంకమూ కలుగదు. స్వామియొక్క అవర్ణనీయమైన మహత్మ్యములలో మిక్కిలి ప్రాధాన్యము చెందిన కార్యక్రమము ఈ తిరువాభరణ పెట్టెయొక్క ఆగమనము. తిరువాభరణ పెట్టెయొక్క రాక ఏవిధముగా ఉండునో తెలుసుకొనని వారు నిర్భాగ్యవంతులనియే చెప్పవచ్చును.


ముప్పదియవ దినమున సంధ్యవేళ దీపారాధనకు ముందుగా తిరువాభరణ పెట్టెతో ఎగురుతూ (కఠిన వ్రత దీక్షకుడు) పదునెనిమిది మెట్లను దాటుదురు. మెట్లెక్కి వచ్చెడి ఆ వ్యక్తి ఎగురుతూ వచ్చుచున్నది చూసినచో అతనియొక్క శిరముపై ఉండే పెట్టె ఇదిగో ఇప్పుడో , అప్పుడో , క్రింద పడిపోవును అని మనకనిపించును. కాని అది శిరమునుండి నేలపై పడదు. ఎందువలన  ? ఆలోచించుడు. అవును , నిశ్చయముగా తారక బ్రహ్మ స్వరూపియైన ఆ హరిహరసుత అయ్యప్ప స్వామివారి యొక్క దివ్య శక్తియే , దివ్య లీలయే , గొప్ప సత్యమే సందేహము వలదు. తిరువాభరణ పెట్టెతో గూడా ఆ ఆభరణములకు రక్షకునివలె గరుత్మంతుడు ఆకాశములో ఆ పెట్టెపై ఎగురుతూ శబరిగిరి

సన్నిధి చేరేంతవరకూ వచ్చి సురక్షితముగా ఆ తిరువాభరణములు స్వామి సన్నిధి చేరిన పిదప , ఆ శబరి క్షేత్రమును మూడు పర్యాయములు ప్రదక్షిణము చేసి అదృశ్యమగుట

నేడు గూడా మనము కనులారా గాంచి తరించవచ్చును. ఇటువంటి దైవలీలలు ఈ శబరిగిరి యాత్రలో ఎన్నెన్నో జరుగును. తిరువాభరణపెట్టెయొక్క రాకను చూచి నమస్కరించుకొని పోలీసులు , కడుత్త స్వామి , కరుప్పస్వామి మొదలగువారి యొక్క

వెలిచ్చపాడులు (కాగడాలు పట్టుకొనువారు) గూడా వెంబడించుట కానవచ్చును. తిరువాభరణ పెట్టెని మోసుకొని వచ్చిన వ్యక్తి పెట్టెను నేల దించిన వెంటనే అచేతనుడై స్పృహ తప్పి పడిపోవును. భగవంతునికి తిరువాభరణములను అలంకరించి దీపారాధన ముగిసిన పిదపనే అతనికి స్పృహ వచ్చును. ఆహా ! ఏమి భగవంతుని లీలా వైభవము. భక్తాదులు స్వయముగా చూచి గ్రహించవలసిన అద్భుత సంఘటన ఇది.


🙏🌻ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌸🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat