🔰 *దేవాంగ పురాణము* 🔰 9వ భాగం

P Madhav Kumar


 *9.భాగం* 

తరువాత దేవలుడు మేరుపర్వతమును సమీపించి మయుని యింటికి

బోయి యతనిచే సత్కరింపబడియానందమును బొందుచునుండగా మహాబలుడగు

నామయుడు దేవులుని జూచి యిట్లనియె. రాజేంద్రా ! మహామతీ ! ఇచ్చటికి వచ్చిన

కార్య మేమి ? నీ వొక్కరుడవును వచ్చుట చూడగా నాకు మిక్కిలి యాశ్చర్యమగు చున్నది. అనుమయునిమాటలు విని దేవలుడిట్లనియె ఓయీ ! మయుడా ! నా రాకకు గారణము వినుము. నేను వస్త్రములు చేయుటకు సామగ్రికై వచ్చితిని. నీవు

నేర్పరివి. ప్రాజ్ఞుడవు. సమర్థుడవు. కావున నోప్రభూ ! నీవు నాకు నేత్ర సామగ్రిని సిద్ధముచేసి యిచ్చిపంపుము. నేను శీఘ్రముగా దేవాదులకు వస్త్రములు నేసి

యీయవలసి యున్నది. అని దేవలుడు చెప్పగానే మయుడు మంచిదే యని

క్షణకాలములో నేత సామగ్రినంతయు సిద్ధము చేసెను. అతడు వజ్రమయమయి

సుందరముగా నుండు వస్త్రమును జుట్టుసాధనమును, మధ్యమధ్యను రత్నములతో

పొదుగబడిన వైడూర్యమణి వికారమైన దట్టింపుపలకను, వజ్రమయము

దంతమయమునగు సూదిని, మరకతమణివికారమయి పుష్పరాగపుబువ్వులచే

నలంకృతమయి గోమేధకములు కంఠభాగమునందుగల నేతకట్టను, గరుడపచ్చ

తోడి నాడిక్రోవిని వజ్రమయమయిన కీలనుజేసెను. చుట్టునట్టి యావజ్రమయమయిన కీలయందొక్కొక్క పలక యెక్కొక్క రత్నముచే బ్రకాశించునదిగా జేసెను.

ఈరీతిగా వస్త్రములను జుట్టుసాధనమును నిర్మించెను. వజ్రపుబిడియు వజ్రకీలయు

రత్నపుష్పవిరాజితము, అయోమయియు, హేమపట్టయునగు చూఱకత్తిని జేసెను.ఇట్లు మయుడేడు విధములయిన నేతసామగ్రిని సిద్ధముచేసి దేవలునకిచ్చి

యిట్లనియె. రాజేంద్రా ! హర్షమును గలిగించునట్టి వీని ప్రభావమును వినుము.

అనేకవస్త్రము లీవేష్టనికి జుట్టినను నిది పరిపూర్తిని బొందదు. దీని ప్రమాణమట్టిది.

మఱియు నిసూదియు నేత కఱ్ఱయు నీయనుబంధ ప్రమాణముచే రమ్యముగానుండు

గలవు. ఇందు సందియములేదు. ఈ నాడిక్రోవిచీలలు నీతలంచినట్ల కాగలవు.లోకులమానమును గాపాడెడు. మహానుభావా ! పంచవిధములయిన రంగులుగలనూలు కండెలయందు జుట్టియున్నను వానిలో నుండి ప్రకృతమున కుపయోగించు రంగులుగలనూలే బయటికి వచ్చుచుండును. మఱియు నైదురంగుల నూలు

చుట్టియున్న యాసాధనమునందలి యైదుదారములును బ్రకృతమున కుపయోగిం

చునట్లగుచుండును. అన్నియు వేఱువేఱుగానే ప్రకృతము ననుసరించి వచ్చుచుండును. బదువిధములగు కండెలును నొకేమాదిరిగా దిరుగుచుండును. అని

వానివాని సంగతులన్నియు జెప్పి హేమపట్టయు, వజ్రమయియు, అష్టఘంటావిరాజి

తమునగు నొకమహాశక్తి నాదేవల రాజనకిచ్చెను. తరువాతను దేవలుడామయుని

భూషించి యతనిచే భూషితుడై తనపట్టణము ప్రవేశించెను. అనుబంధము యొక్క మనోహరమయిన ప్రమాణము తనయిచ్ఛాధీన మగుటంజేసి తానే కట్టెను.

మునులు - మాతా ! దేవలుడే యనుబంధము గట్టెననించెప్పితివి.

మయుడెందులకు గట్టి యీయకపోయెను ? నేత సామగ్రియంతటిలో ననుబంధము గట్టుటయే కఠినముగదా ! అట్టియనుబంధము గట్ట నేర్పరియయిన దేవలునికి

మయుడిచ్చిన సామగ్రిమాత్రము నిర్మించుటకు శక్తి లేకపోయినదా ? తానే

స్వయముగా నెటిగినవాడు. మయుని యాచించుట కేలపోయియుండెను ? యథార్థమెటిగినవాడవు గనుక మాసందియముల దీర్పవలయు నన సూతు

డిట్లనియె.సూతు మునులారా ! అనుబంధముగట్టుట దేవలునికి శంకరా

నుగ్రహమువలన సిద్ధించియున్నది. మఱియు నేతసామగ్రియంతయు నిర్మింప దేవలుడు శక్తిగలవాడే అయిననుదనచే సింహమునకును రాక్షసునకును శాప

విమోచనము చేయవలసియుండుటంజేసి సామగ్రిని సంపాదించునిపచే

మయునిదగ్గఱకు బోవలసివచ్చినది. బ్రహ్మతో సమానమయిన సామర్థ్యముగల

యాదేవలునకు మూడు లోకములయందును సాధ్యముగానిది యొకటియుండునా?

ఇట్లు యావత్సామగ్రియు సిద్ధముచేసికొని యాదేవలుడు భక్తితో జాడేశ్వరియను

పేరుగల చండికాదేవిని మనస్సులో దలంచెను. ఇట్లు దేవలుడు స్మరించినంతనే

యాదేవి దేవలునికి బ్రత్యక్షమయి ప్రీతిపూర్వకముగా నిట్లనియె. వత్సా ! దేవలా !నన్నెందులకు స్మరించితివి? అని యడుగగా నతడిట్లనియె. దేవేశీ !

నీదరిసెనమువలన ధన్యుడ నయితిని. నీదయవలన నామనోరధము సఫలమయి

నది. నేను శివునియాజ్ఞవలన వస్త్రములు చేయుటకు గోరుచున్నాను. భక్తవత్సలు

రాలవగు నోదేవీ ! నీ కటాక్షము వలననే నేసినవస్త్రములక్షయములగుగాక, నేను

మూడులోకములవారికిని వస్త్రము లీయవలసియున్నది. వారివారి కోరిక ప్రకారము

వస్త్రములు సిద్ధముచేసి యీయవలెను. అట్లు చేసి కృతార్థుడను గావలయును కనుకనట్లు నాకు వరమీయవలయును. అని యిట్లతడు కోరుగానే యామె

ప్రేమపూర్వకముగా నిట్లనియె. రాజేంద్రా ! నీవు కోరినట్లే యగును. ఇదిగో

నేనిచ్చుకంకణమును జేతికి ధరించి నేర్చుకొలదిని నానావర్ణములు గల

వస్త్రములును నేయుము. ఒక్కొక్కరంగుగల నూలుతో నొక్కొక్క వస్త్రమునేయుము.

అవియన్నియు నక్షయములగును. నీవెట్టివస్త్రములునేసినను నవి యక్షయములే యగును. మచ్చునకుగా నొక్కొక్కటి మాత్రము నేయుము. అని చెప్పి కంకణమిచ్చి

రాజును సంతోషపఱచి యచ్చటినేయంతర్ధానమైనది. 


   *సశేషం......*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat