*10.భాగం*
*ఉపాసనాఖండము*
*మొదటి భాగము*
*వ్యాసప్రశ్న వర్ణనం*
భృగుమహర్షి యిలా చెప్పనారంభించాడు "ఓరాజా! పరాశర మహర్షి తనయుడూ, సాక్షాత్ నారాయణుని అంశతో జన్మించినవాడూ అయిన కృష్ణద్వైపాయనుడని పిలువబడే వ్యాసమహర్షికి ఒకసారి తాను విభాగించిన వేదములయొక్క అర్థం స్ఫురించటం మానేసింది. స్థబ్దతతనను ఆవరించింది. త్రికాలవేదీ, పంచమవేదమైన మహాభారతాన్ని
రచించినవాడూ, అష్టాదశ పురాణకర్తా ఐన వ్యాసభగవానుడు ఇందుకు
చకితుడైనాడు. తాను రచించిన పురాణాలకు మంగళాచరణం ఎలా
చేయాలో భావము ఏమాత్రం స్ఫురించలేదు. నిత్యనైమిత్తిక కర్మాచరణం ఎంత ఆచరించినా, మణిమంత్ర ఔషధాలచేత నిర్వీర్యమైన సర్పంలా అతని ప్రతిభ స్థాణువైంది. ఎంత ప్రయత్నించినా అలా ఎందుకు జరిగిందన్న విషయం ఆయనకేమీ అంతుబట్టలేదు!
ఈ విషయమై వివరం, కారణం తెలుసుకొనగోరి ఆయన సత్య
లోకానికి వెళ్ళాడు. అక్కడ దేవగురువైన బృహస్పతికీ, బ్రహ్మర్షులకూ,దేవగణాలకూ నమస్కరించి, బ్రహ్మకుకూడా ప్రణమిల్లాడు. బ్రహ్మ ఆయ
నను సాదరంగా తోడ్కొనివెళ్ళి ఉచితాసనంపైన కూర్చుండచేసి, అతని
రాకకు కారణం అడిగాడు. ఆ చతురాస్యుని పాదపద్మాలకు భక్తితో నమస్కరించి వినమ్రుడై బ్రహ్మనిలా ప్రశ్నించాడు.
"ఓ కమలాసనా! వేదాలకు అర్ధం గ్రహించలేని కలియుగ జీవులు జ్ఞానశూన్యులై, ఆచారవిహీనులైవున్న దుస్థితిచూసి ఎంతో దిగులు చెంది నేను వేదాలకు వ్యాఖ్యానంగా పురాణాలు విరచించి, ప్రతీ ఆశ్రమం
లోనూ పాటించవలసిన విధినిషేధాలను సులభ బోధకంగా ఉండేలా చేయాలని పూనుకున్నాను. కాని ఆశ్చర్యకరమైన విషయమేమంటే నాకు
భావస్ఫూర్తి, వ్యక్తీకరణల విషయంలో స్థబ్దత ఏర్పడింది! దీనికి కారణ మేమిటో నాకేమాత్రం అంతుపట్టడంలేదు! సర్వజ్ఞుడవైన ఓ పరమే!
నీవు దయతో నాకు కలిగిన ఈ స్థబ్దతపోయి తిరిగి కార్యసాఫల్యం కలిగే మార్గం ఉపదేశించవలసింది.”
అంటూ ప్రార్ధించాడు. ఆతరువాత జరిగిన సంభాషణను సూత
మహర్షి ఇలా చెప్పసాగాడు! "ఓ ఋషులారా! ఇలా బ్రహ్మను వ్యాస మునీంద్రుడు ప్రార్ధించగా ఆ చతుర్ముఖడు వినమ్రుడైఉన్న వ్యాసునివంక
చూస్తూ, చిరునవ్వుతో ఆశీఃపూర్వకంగా యిలా అన్నాడు."ఓ కృష్ణద్వైపాయన మహర్షీ! ఏదైనా కర్మని నిర్వహించటానికి పూనుకునే ముందుగానే దానిలోని సాధకబాధకాలనూ, మంచిచెడులనూ విచారించే మొదలుపెట్టాలి! అలా యోచించక, చేసే పనులు విపరీత ఫలితాన్నిస్తాయి. ఏ కర్మనైనా ఆచరించేటప్పుడు ఋజుబుద్ధితోనూ, యుక్తి
తోనూ, కార్యసాధనకు కృషిచేయాలి! నేను చేస్తున్నానన్న గర్వంకాని,
యితరులతో పోటీపడాలన్న మత్సరబుద్ధితోకాని చేయడానికే గనుక
ప్రయత్నిస్తే అందుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి! ఇందుకు పక్షీంద్రుడైన గరుత్మంతుడే ఒక ఉదాహరణ! బలగర్వంవల్లనే చెడి,
చివరకు భగవానుని దయచేత విష్ణువాహనత్వం పొందాడు.
ఇక పినతండ్రి పిల్లలైన పాండవుల పైగల మత్సరంతో దుర్యోధనుడు కురువంశ నాశనానికే కారణమైనాడు! మత్సరమువల్లనే జమదగ్ని
సుతుడైన పరశురాముడు రాజులపై దండెత్తి క్షాత్రవ తేజమునంతటినీ
నశింపచేశాడు. కనుక ఇప్పుడైనా నీవు గర్వాన్ని, మత్సరాన్నీ, ఈరెంటినీ
కార్యవినాశ హేతువులు అని గుర్తించు!
*బ్రహ్మ వ్యాసునికి విఘ్నకారణం చెప్పుట*
"ఓ వ్యాసమునీంద్రా! నీవు నీ వేదవిభాగ కార్యారంభంలో,
సకలసృష్టికీ ఆద్యుడు, సర్వకార్యములకూ కర్తయైనవాడు, సృష్టిస్థితి
లయాలకు భాద్యుడూ, త్రిమూర్తులమైన నాచే, శివునిచే, విష్ణువు చేతనూ
ప్రణవస్వరూపంగా ధ్యానించబడేవాడూ, ఇంద్రాది దేవతలచేత అష్టదిక్పా
లకులూ ఎవని ఆజ్ఞకు వశులై వర్తిస్తున్నారో, అట్టివానిని, భక్తులకు కార్యసాఫల్యతను ఒనగూర్చేవాడూ, అభక్తులకు విఘ్నాలనే చీకట్లతో
కన్నుకనబడనీయని విఘ్నకరుడూ ఐన ఆ గజాననుని నీవు స్వవిద్యామద
గర్వంచేత పూజించుట, స్మరించుట చేయలేదు. అందువల్లనే నీకీ పరి
స్థితి సంభవించింది. ఓ మునీంద్రా! పరమాత్మ స్వరూపుడైన ఆ విఘ్నపతిని సర్వకార్యారంభములయందూ, శ్రోత, స్మార్తాది కర్మలయందూ, లౌకిక వైదికకర్మల
యందూ స్మరించుటచేతా, భక్తితో పూజించుటచేతనూ సకల విఘ్నములూ దూరమౌతాయి. ఈ విఘ్నపతినే వేదశాస్త్రార్ధతత్వజ్ఞులు పరమాత్ముడైన ఆనందస్వరూపునిగా, పరబ్రహ్మ స్వరూపునిగానూ పేర్కొంటున్నారు!
కనుక అట్టి దేవదేవుడైన గజాననుని శరణుపొందు! ఆ మహానుభావుడు
గనుక ప్రసన్నుడైతే నీ వాంఛాపరిపూర్తి జేస్తాడు. అలా కానిదే నూరు
జన్మలెత్తినా కార్యసాఫల్యత అన్నది సిద్ధించదు!" అంటూ ఉపదేశించాడు.
అప్పుడు వ్యాసమునీంద్రుడు బ్రహ్మతో "ఓ చతురాననా! విఘ్నపతి,విఘ్నహరుడు అని పిలువబడే ఆతడెవరు? ఆయన ఎలావుంటాడు?
ఆయనను తెలుసుకోవడం ఎలాగ? ఇంతకు పూర్వమెవరెవరిని అనుగ్ర
హించాడు? ఈయన ఏయే అవతారాలెత్తాడు? అప్పుడు ఆయనచేసిన
మహత్తర కర్మలెలాంటివి? పూర్వం అతడెవరెవరిచేత పూజించబడ్డాడు?ఏకార్యములలో స్మరించబడ్డాడు? ఈ వృత్తాంతాన్నంతటినీ అశాంతితోవ్యాకుల చిత్తుడనైన నాకు దయతో విస్తరించి చెప్పుము" అంటూ ప్రార్ధించాడు.
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని
'వ్యాసప్రశ్న వర్ణనం' అనే అధ్యాయం.సంపూర్ణం.
*సశేషం.......*