పదియారు వన్నెల బంగారు కాంతులతోడ
పొదలిన కలశాపుర హనుమంతుడు॥
ఎడమ చేతబట్టె ఇదివో పండ్లగొల
కుడిచేత రాకాసిగుంపుల గొట్టె
తొడిబడ నూరుపులతో తూరుపు మొగమైనాడు
పొడవైన కలశాపుర హనుమంతుడు॥
తొక్కె అక్షకుమారుని తుంచి యడగాళ్ళ సంది
నిక్కించెను తోక ఎత్తి నింగి మోవను
చుక్కలు మోవ పెరిగి సుతువద్ద వేదాలు
పుక్కిటబెట్టె కలశాపుర హనుమంతుడు॥
గట్టి దివ్యాంబరముతో కవచకుండలాలతో
పట్టపు శ్రీవేంకటేశు బంటు తానాయె
అట్టె వాయువునకు అంజనీదేవికిని
పుట్టినాడు కలశాపుర హనుమంతుడు॥
గానం. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్