*25.భాగం*
*ఉపాసనా ఖండము*
*మొదటి భాగము*
*దక్ష స్వప్నవృత్తాంతం*
ఈ కధాగమనాన్నంతటినీ విశ్వామిత్రమహర్షి చెబుతూండగా శ్రద్ధతో వింటూన్న భీముడు యిలా ప్రశ్నించాడు.
“ఓ మునీశ్వరా! ముద్గలునిచేత గణేశమంత్రాన్ని ఉపదేశంగా పొందిన దక్షుడు ఆ మంత్రాన్ని ఎక్కడ అనుష్టించాడు? ఆ వృత్తాంతాన్ని వివరించండి! పవిత్రగాధ ఎంతవిన్నా అమృతంతో సమానంగా ఉండి ఈ తనివితీరటంలేదు!"
ఆ మాటలకు విశ్వామిత్రుడు యిలా బదులిచ్చాడు.
'ఓ రాజకుమారా! అలా ముద్గలునివద్దమంత్రోపదేశాన్ని పొందిన ఆ దక్షుడు అక్కడికి సమీపంలోనే ఉన్న 'కౌండిన్యవన'మనే దట్టమైన
అరణ్యంలో తన అనుష్టానాన్ని కొనసాగించాడు. ఆ అరణ్యం నానా రకములైన పుష్పలతా శోభితమై, వివిధములైన పక్షుల కిలకిలారావములతో విలసిల్లుతూ ఎంతో ఆహ్లాదభరితంగా, ప్రశాంతంగా ఉన్నది. అక్కడ ఏకాంత స్థలంలో కూర్చుని మంత్రానుష్టానమును తదేకదీక్షతో పన్నెండు సంవత్సరాలకాలం తన కొనసాగించాడు! షోడశోపచారాలతోనూ, మానసిక పూజనూ అరవై రోజులపాటు నిర్విరామంగా చేశాక, ఒకనాటి తెల్లవారు ఝామున అతనికి ఒక దివ్యస్వప్నం కలిగింది.
అందులో సింధూరవర్ణంతో శోభిల్లుతూ, పెద్ద పర్వతంలా వున్న ఒక ఏనుగు కలలో కనిపించింది. అది తన తొండముతో ఒక రత్న హారాన్ని ఈతని మెడలో వేయటమేకాక, అతడిని తనమూపు పైకి తొండంతో లేవనెత్తి కూర్చోపెట్టుకుని సర్వాలంకార శోభితమైన రాజనగరి లోకి ఠీవిగా నడిచివెళ్ళింది! అప్పుడు ఆ రాజకుమారుడు కలలోంచి మేల్కొని, తాను చూసిన దృశ్యాన్ని వివరంగా తన తల్లికి చెప్పి 'అమ్మా! ఈస్వప్నం యొక్క ఫలితం శుభమేనా? ఏనుగును స్వప్నంలో దర్శించవచ్చా?' అంటూ అడిగాడు! దానికామె 'నాయనా! నీకు కలిగిన స్వప్నం సకల శుభాలకూ సూచకమే! గజారోహణ ఫలంగా రాజ్యప్రాప్తి కలుగుతుంది!' కీర్తివంతుడవవుతావు!" అంటూ అభినందించింది.
అప్పుడు ఆ దక్షుడు ఎంతో సంతోషంతో తన తల్లితో, 'తనకు రాజ్యమే ప్రాప్తించినట్లయితే ఆమెకు సమస్త రాజభోగాలనూ కల్పించగల ననీ, తృప్తిదీర ఆమెచే సద్రాహ్మణులకు సువర్ణాన్ని గోసహితంగా దానం కూడా మిప్పించగలననీ, అప్పుడు ఆమె కోరిన వ్రతాలన్నీ యధేచ్చగా
ఆచరించుకోవచ్చనీ' తెలిపాడు.
ఆ మాటలకు ఆమె ఎంతోప్రీతితో సంతుష్టురాలై, 'సర్వదా నీవు ధర్మబుద్ధి కలిగిఉందువు! దీర్ఘాయువుపై దేవబ్రాహ్మణ పూజలందు
అనురక్తి కలిగి చిరయశస్సును పొందెదవు గాక!" అంటూ ఆశీర్వదించింది.
ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని 'దక్ష స్వప్నవృత్తాంతం' అనే అధ్యాయం.సంపూర్ణం.
*సశేషం......*