#శ్రీ #వేంకటేశ్వర #లీలలు భాగము 41 - శ్రీనివాసుడు ఎరుకలసానియైు సోది చెప్పుట

P Madhav Kumar


🌻 *శ్రీనివాసుడు ఎరుకలసానియైు సోది చెప్పుట* 🌻

🍃🌹అక్కడ శ్రీనివాసుడు కూడా నిద్రాహారాలు మాని కాల పరిణామము తెలియకుండా అదే పనిగా పద్మావతిని గూర్చి ఆలోచించసాగాడు.

🍃🌹శ్రీనివాసుని దిగులు వకుళాదేవికి విచార కారణమయినది. వకుళ పరిష్కారమును గూర్చి ఆలోచించసాగినది. శ్రీనివాసునితో ఆమె ’’నాయనా! నీ దిగులు చూస్తే నాకు మతిపోతోంది. బాధపడకు, ఆకాశరాజుగారి వద్దకు ఇంక నేనే స్వయముగా వెళతాను వెళ్ళి అన్నీ మాట్లాడుతాను మాట్లాడి, ఈ నీ వివాహము ఎలాగైనా జరిపించాలని అర్ధిస్తాను.

🍃🌹శాయశక్తులా కృషిచేసి రాయబారము సాగించి వస్తాను. నీవు బాధపడడము మాత్రము మానుకో! అని నారాయణపురానికి బయలుదేరినది. పాపం వకుళాదేవి శ్రమపడి వెళుతోంది కానీ, ఆకాశరాజా వాళ్ళూ అంగీకరిస్తారో లేదో? అందుచేత ఈ లోపున దానికి బలముగా ఒక పధకం వేయవలసి వుంది అని అనుకున్నాడు శ్రీనివాసుడు.

🍃🌹సోదిని నమ్మే ఆచారము వున్నది కదా! అందుచే శ్రీనివాసుడు కనకాంబరము చీర కట్టాడు. కాని రంగు రవికె తొడుగుకున్నాడు. ముద్దొచ్చే పచ్చబొట్టు ముఖానికి పెట్టుకున్నాడు. కండ్లకు నల్లనైన కాటుక పెట్టుకున్నాడు.

🍃🌹తలమీద సోదిబుట్ట పెట్టుకొన్నాడు. ఈ విధముగా ఎరుకలసాని వేషము ధరించినవాడై శ్రీనివాసుడు అచ్చు ఆడుదానివలె తయారయి ఆకాశరాజు నగరములో ప్రవేశించాడు, సరాసరి రాజభవనము చేరింది ఆ క్రొత్త సోది స్ర్తీ. ‘సోది చెబుతానమ్మా సోదీ!’ అని బిగ్గరగా కేక వేసింది.

🍃🌹ఆకాశరాజు భార్య ధరణీదేవి ఈ మాట విన్నది. పిలికించి ఆమెను ‘మా అమ్మాయికి సోది చెప్పుము’ అంది. ‘సరే’ యన్నది ఎరుకల సాని పద్మావతిని బుట్టకి ఎదురుగా కూర్చుండజేసి చేటలో విలువైన ముత్యాలు పోయించినది. గద్దెపలక వుంటుంది కదా దానికి పసుపూ, కుంకుమా పెట్టించింది. దేవతలను కొలిచినది. మూలదేవతలకు మ్రొక్కినది. ఇంక సోది చెప్పుట ప్రారంభించినది.....

‘‘ఇనుకోవె ఓ పిల్లా ఇవరంగా చెప్పుదు
జరిగేది యంతా నిజముగా చెప్పుడు
వనములో పురుషుని వలపుతో జూసి
అతని నీ మనసులో అట్లే దాచావు
గుండెలో నతుడు బాగుండినాడే పిల్ల
శృంగార వనములో శృంగార పురుషుడే ‘‘నన్ను
ప్రేమింతువా?’’ యని యన్నందుకే నీవు
రాళ్ళతో కొట్టించు రాలుగాయీ పిల్లా
వెన్నవంటీ మనసున్నవాడే వాడు
నిన్న బోలిన బాధ నున్నాడు వాడు
ఆ రోజు నడవి వాడనుకొంటివే వెఱ్ఱి!
ఆదిదేవుడు నారాయణుడతండే
శ్రీనివాసునిగాను చెలగుచున్నాడే
ఆకాశమె క్రిందుగా గమనించిననూ
భూమియే పైపైకి పోయినా ఏమైనా
దంపతులగుదరు పెండ్లియు జరిగి
దిగులు నీ పెండ్లితో దిగునులే పిల్లా‘‘

అని వున్నవీ, జరిగేవీ వివరముగా సోది చెప్పినది. వారిచ్చిన కట్నము తీసుకొని వెళ్ళిపోయింది ఎరుకులసాని.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat