శ్రీదేవీభాగవతము - 8

P Madhav Kumar


*ప్రథమ స్కంధము - 4*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః*

*లలితా సహస్రనామ శ్లోకం - 8*

*కదంబమంజరీ క్లప్త కర్ణపూర మనోహరా!*
*తాటంక యుగళీభూత తపనోడుపమండలా!!*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

👉 *నిన్నటి భాగములో....*

హయగ్రీవ వృత్తాంతం విన్న తరువాత, శౌనకుడు..... ఓ మహామతీ ! సూతమహర్షీ ! పాపాలను పోగొట్టి, పుణ్యాలను సమకూర్చి శ్రోతలను బుద్ధిమంతులుగా చేసేది పురాణ శ్రవణమే. వ్యాస మహర్షినుంచి నువ్వు తెలుసుకున్న ఈ మధుకైటభ వృత్తాంతాన్ని మాకూ వినిపించు. దుష్టశిక్షణకోసం జరిగిన యుద్ధం కనుక దీన్ని వినడం ఉత్తమమే.

శౌనకుడు ఇలా అడిగేసరికి సూతుడికి తనువంతా పులకించింది. ఆనందంతో కన్నులు చెమర్చాయి.

శౌనకమహామునీ ! ఇంకా వినాలి, అనుకుంటున్నారు కనుక మీరంతా ధన్యులు. ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి అనుకుంటున్నాను కనుక నేనూ ధన్యుణ్ణే. సరే,

మధుకైటభుల కథ చెబుతున్నాను.
ఏకాగ్రచిత్తంతో ఆలకించండి.

🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡️

🌈 *మధుకైటభ వృత్తాంతం* 🌈

పూర్వకాలంలో మహాప్రళయం సంభవించి ముల్లోకాలూ సముద్రంలో మునిగిపోయాయి. దేవదేవుడు జనార్దనుడు ఒక్కడూ మిగిలి శేషపర్యంకం మీద నిద్రిస్తున్నాడు. అతడి చెవులలో నుంచి గులుగు జారిపడింది. ఆ గుమిలి ఉండల నుంచి మధుడూ కైటభుడూ జన్మించారు. సముద్రజలాల్లో దినదిన ప్రవర్ధమానులయ్యారు. మహాబలిష్టులయ్యారు. ఇద్దరూ కలిసి అన్నదమ్ముల్లాగా ఇటూ అటూ ఈదుతూ ఆడుకుంటున్నారు. ఒకరోజున వాళ్ళకి ఒక సందేహం వచ్చింది.

కారణం లేకుండా కార్యం ఉండదంటారు. ఆధారం లేకుండా ఆధేయం ఉండదంటారు. ఈ నీరంతా ఎలా నిలబడి ఉంది ? దీని ఆధారం ఏమిటి ? ఎవరు సృష్టించారు ? ఎలా సృష్టించారు ? ఈ నీళ్ళల్లో ఆడుకుంటున్న మనమిద్దరం ఎలా జన్మించాం ? జన్మకారకులు ఎవరు ? మన తల్లిదండ్రులెవరో మనకు తెలియకపోయె, ఎంత ఆశ్చర్యం !

ఇద్దరూ ఇలా చాలాసేపు చర్చించుకున్నారే గానీ ఎంతకూ ఒక నిశ్చయానికి రాలేకపోయారు. అపుడు కైటభుడన్నాడు గదా - మధూ ! మనం ఇలా నీళ్ళల్లో ఉండటానికి కారణం మహాశక్తి. ఆవిడే మనలను సృష్టించింది. ఈ నీళ్ళను సృష్టించినదీ ఆ శక్తియే. వీటికి ఆధారం కూడా ఆమెయే. నా బుద్ధికి తోచిన సంగతి చెప్పాను - అన్నాడు.

సరిగ్గా అదే సమయానికి ఆకాశం నుంచి ఒక మనోహరమైన శబ్దం వినిపించింది. ఆ వాగ్బీజాన్ని ఇద్దరూ విన్నారు. పదేపదే మననం చేసుకున్నారు. అంతలోకీ శుభసూచకంగా ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. మనకు వినిపించిన వాగ్బీజం నిస్సంశయంగా ఒక మంత్రం అని ఆ ఇద్దరూ గ్రహించారు. అదే జపించారు. నిరాహారులై జితేంద్రియులై ఏకాగ్రచిత్తంతో వెయ్యి సంవత్సరాలపాటు ఆ మంత్రాన్ని జపిస్తూ మహాతపస్సు చేశారు. మహాశక్తి ప్రసన్నురాలయ్యింది. దర్శనమిచ్చింది. వరం కోరుకొమ్మంది. స్వేచ్చా మరణం అనుగ్రహించమని ఇద్దరూ ముక్తకంఠంతో అభ్యర్థించారు.

అమ్మవారు తథాస్తు అంది.

దేవదానవులకు అజేయులం. మన చావు మన అధీనం. మధుకైటభులకు మదం ఎక్కింది. ఇష్టం వచ్చినట్టు ఆ మహాసముద్రంలో క్రీడిస్తున్నారు. స్వేచ్చగా సంచరిస్తున్నారు. ఉన్నట్టుండి ఒకరోజున బ్రహ్మదేవుడు వాళ్ళ కంటబడ్డాడు. పద్మాసనంమీద కూర్చుని నిర్మలంగా జపం చేసుకుంటున్నాడు. అతణ్ణి సమీపించి ఇద్దరూ. మాతో యుద్ధం చెయ్యమని అడిగారు. లేదంటే పద్మాసనం వదిలేసి వంటనే వెళ్ళిపామ్మన్నారు. దుర్చలుడికి ఇంతటి శుభాసనం మీద కూర్చునే యోగ్యత లేదన్నారు, ఇది వీరభోగ్యం. నువ్వు పిరికివాడివి దిగు. ఫో - అన్నారు.

పాపం. ప్రజాపతి చింతాకులుడయ్యాడు. ఏమి చెయ్యడానికీ తోచలేదు. కాలు చెయ్యి ఆడలేదు. ఇద్దరూ బలవంతులు. కొయ్యబారి అలా ఉండిపోయాడు.

*(అధ్యాయం -6, శ్లోకాలు - 44)*

బాగా ఆలోచించాడు. సామదానభేద దండోపాయాలను బేరీజు వేశాడు. వీళ్ళ బలం ఎంతటిదో తెలీదు. అంచేత యుద్ధానికి దిగడం (దండోపాయం) మంచిది కాదు. మదమత్తులైన ఈ దుష్టుల్ని పోనీ పొగిడి మంచి చేసుకుందామా అంటే, నా నిర్బలత్వం వీళ్ళకు తెలిసిపోతుంది. స్వయంగా ప్రకటించుకున్నవాణ్ణి అవుతాను. అప్పుడు ఇద్దరిలో ఎవడో ఒకడు నన్ను సంహరించవచ్చు. కాబట్టి సామోపాయం పనికిరాదు. ఇలా మీదకి వచ్చాక దానమూ ఫలించదు. ఇక మిగిలింది భేదం. అది ఎలా సాధ్యమో ఆలోచించాలి.

ఆదిశేషుడిమీద పడుకుని హాయిగా నిద్రపోతున్న విష్ణుమూర్తిని లేపుతాను. అతడు చతుర్భుజుడు, మహాబలశాలి. ఈ కష్టం నుంచి కడతేరుస్తాడు - ఇలా నిశ్చయించుకుని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని స్తుతించాడు.

*హే దీననాథ ! హరే ! విష్ణో! వామన ! మాధవా |! నిద్రలే, నిద్రలే. భక్తార్తిహారకా ! హృషీకేశా ! సర్వావాసా ! జగత్పతీ ! ఉత్తిష్థ ! ఉత్తిష్ట ! అంతర్యామిన్‌ ! అమేయాత్మన్‌ ! హే వాసుదేవ ! హే జగత్పతే! దుష్టశత్రు వినాశక |! చక్రగదాధరా ! సర్వజ్ఞ ! సర్వలోకేశ ! సర్వశక్తి సమన్వితా ! పాహి మామ్‌, పాహి మామ్‌. విశ్వంభరా ! విశాలాక్షా ! పుణ్య శ్రవణ కీర్తనా ! జగద్యోనే ! నిరాకార ! సర్గస్థిత్యంతకారకా !* ఇదిగో, ఇద్దరు రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. కష్టాల్లో ఉన్నాను. గమనించలేదా ? శరణు శరణు. ఉపేక్షించకు. నీ జగత్పాలకత్వం నిరాధారం అయిపోతుంది. రక్షించు, రక్షించు.

బ్రహ్మదేవుడు ఎంతసేపు స్తుతించినా శ్రీహరి నిద్రలేవలేదు. అది యోగనిద్ర. ఆ శక్తికి వివశుడై నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఏమి చెయ్యాలో విరించికి పాలుపోలేదు. ఈ మదమత్తులిద్దరూ చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమి చెయ్యను, ఎక్కడికిపోను, ఎవరిని శరణు వేడను ! - ఇలా దిగులు పడుతూండగా మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. ఆ యోగనిద్రనే స్తుతిద్దాం అనుకున్నాడు. ఆ శక్తి నన్ను రక్షిస్తుందనుకున్నాడు.

విష్ణుమూర్తినే నిశ్చేతనుణ్ణి చేసిందంటే ఆ శక్తి సామాన్యమైనది కాదు. ఎంత స్తుతించినా ఇతడికి ఏమి వినపడటం లేదు. కదలిక లేదు. అంటే నిద్ర ఇతడికి వశంలో లేదు. ఇతడే నిద్రకు వశీకృతుడు అయ్యాడు. వశుడయ్యాడంటే కింకరుడితో సమానమే కదా ! అంటే ఇప్పుడు విష్ణుమూర్తికి స్వామిని (అధికారిణి) ఈ యోగనిద్ర అన్నమాట. లక్ష్మీదేవి సన్నిధిలోనే ఇతడు ఈ నిద్రకు ఇలా లొంగిపోయాడంటే ఇక జగత్తు అంతా ఆ శక్తికి అధీనంలో ఉన్నట్టే కదా! జగత్తేమిటి, నేనూ సరస్వతి, శివుడూ పార్వతి అందరం శక్తి అధీనంలో ఉన్నట్టే. సందేహం లేదు. ఒక సామాన్య మానవుడి కన్నా అన్యాయంగా విష్ణుమూర్తి వివశుడైపోయాడు. తక్కిన మహాత్ముల్ని గురించి చెప్పాలా ! అందుచేత ఆ యోగనిద్రనే స్తుతిస్తాను. ప్రసన్నురాలిని చేసుకుంటాను. విష్ణుమూర్తిని వదిలిపెట్టమని ప్రార్థిస్తాను. అప్పుడితడు నిద్రలేచి యుద్ధం చేసి ఈ రాక్షసుల్ని సంహరిస్తాడు.

🙏 *బ్రహ్మకృత యోగనిద్రాస్తుతి* 🙏

ఇలా నిర్ణయించుకుని చతుర్ముఖుడు యోగనిద్రను అనేక విధాల స్తుతించాడు. దేవీ ! సకల జగత్తుకీ నువ్వే కారణమని నా ముఖతః వేదాలు చెబుతూంటే, ఆ సంగతి నాకు ఇప్పటికి తెలిసింది. గ్రహించగలిగాను. అఖిలలోకానికీ వివేకాన్ని ప్రసాదించే పురుషోత్తముణ్ణి నిద్రావశుణ్ణి చేశావు. నీ మోహ విలాస లీలలు తెలియతరమా తల్లీ | నేనెంత మూఢుణ్ణి, ఇంతవరకూ తెలుసుకోలేకపోయాను. నేనేకాదు, విబుధకోటిలో నిన్ను తెలుసుకున్నవాడు ఎవడూ లేడు. జగత్కర్తృత్వం నీదే. నువ్వే ప్రకృతీ-పురుషుడూ. సర్వ చైతన్యశక్తివి నువ్వే. నిర్గుణ స్వరూపిణివి. నువ్వే వివిధ రూపాలు ధరించి నటిస్తూ ఉంటావు. నీ పనులూ నీ విధానాలూ ఎవరికీ అంతుపట్టవు. నీకు నామరూపాలు కల్పించి మునీశ్వరులు త్రికాలాల్లోనూ నిన్ను సంధ్యగా ధ్యానిస్తూంటారు. మేల్కొల్పే బుద్ధివి నువ్వు. సంపదవు నువ్వు. కీర్తి మతి, ధృతి, శ్రద్ధ అన్నీ నువ్వే. విష్ణుమూర్తి నీకు వివశుడై నా కళ్ళ ఎదుట కనపడుతూంటే ఇంక వేరే ప్రమాణం కావాలా!

వేదవేత్తలే కాదు వేదాలు కూడా నిన్ను పూర్తిగా అర్ధం చేసుకోలేకపోయాయి. అంతటి దుర్విజ్ఞేయవు. ఇక మేమనగా ఎంత ! యజ్ఞ యాగాలలో బుత్విజులు స్వాహా శబ్దంతో నీ నామధేయాన్ని ఉచ్చరించకపోతే ఆయా దేవతలకు పురోడాశభాగాలు అందవు. దేవతలకు భుక్తిదాయినివి నువ్వు.

*యజ్జేషు దేవి యది నామ న తే వదంతి*
*స్వాహేతి వేదవిదుషో హవనే కృతో౭పి !*
*న ప్రాప్నువంతి సతతం మఖభాగధేయం*
*దేవాస్త్వమేవ విబుధేష్వపి వృత్తిదా౭సి ॥*

*అమ్మా, వరప్రదాయినీ!* భయభీతుణ్గి, నిన్ను శరణు వేడుతున్నాను. ఇదిగో మధుకైటభులు, ఘోరరూప రాక్షసులు. నన్ను సంహరించడానికి కత్తులు నూరుతున్నారు. విష్ణుమూర్తికి ఈ సంగతి తెలుసునని నాకు అనిపించడం లేదు. నీకు వివశుడై నిద్రలో ఉన్నాడు. అతణ్ణి విడిచిపెట్టు, లేదా ఈ రాక్షసులు ఇద్దరినీ నువ్వే మట్టుపెట్టు. నీ ఇష్టం తల్లీ ! నీకు ఏది నచ్చితే అదే చెయ్యి.

*హే మహామాయే !* హరిహరుల కోసం తపస్సు చేసేవాళ్ళు ఎంత అమాయకులో కదా | పాపం నీ ప్రభావం వాళ్ళకు తెలీదు. నాకయినా ఇప్పటికి గదా తెలిసింది. ఈ విష్ణుమూర్తిని నిద్రలేపాలంటే లక్ష్మీదేవికి కూడా అయ్యేటట్టు లేదు. ఆవిడకూడా నీకు వివశురాలై నిద్రపోతోంది. నువ్వు జగజ్జననివనీ కామధేనువువనీ నిజంగా తెలుసుకుని నీ పాదపద్మాలను అర్చించేవాళ్ళూ అనన్యభక్తితో సేవించేవాళ్ళూ ధన్యాతిధన్యులు. బుద్ధి, తేజస్సు, కీర్తి శుభప్రవృత్తి మొదలైనవి శౌరిగుణాలు. అవన్నీ ఎటుపోయాయో. నీ అమేయశక్తి కారణంగా నిద్రకు బందీ అయ్యాడు. సకల జగత్తుకీ నువ్వే ఆదిశక్తివి. ఇదంతా భావమాత్రంగా నువ్వు చేసిన నిర్మాణమే. నువ్వు నిర్మించిన ఈ మోహజాలంలో నువ్వే క్రీడిస్తున్నావు - నటుడు తన నాట్యంలో తానూ విహరిస్తున్నట్టు. యుగాదితో మొదటిసారిగా విష్ణుమూర్తిని నువ్వే ప్రకటించావు. వెలుగులోకి తెచ్చావు. పరిపాలనాశక్తిని ఇచ్చావు. ఇప్పుడేమో ఇలా నిద్రపుచ్చావు. అంబా | నువ్వు సర్వతంత్ర స్వతంత్రురాలివి. ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలనిపిస్తే అలా చేస్తావు. నన్ను సృష్టించింది ఇలా నశింపజెయడానికే అయినట్లయితే, నీ ఇష్టం. దయ చూపించకు. ఇలాగే మౌనంగా ఉండిపో.

*భగవతీ!* నన్ను పరిహసించడానికే కాకపోతే ఈ కాలరూప రాక్షనుల్ని నువ్వసలు ఎందుకు సృష్టించావుట ! తెలిసింది తల్లీ! తెలిసింది. ఇదంతా నీ అద్భుత విచేష్టితం. స్వతంత్రంగా సృష్టిస్తావు, వినోదిస్తావు, ఉపసంహరిస్తావు. ఇప్పుడు నన్ను ఉపసంహరించాలి అనుకున్నావు. అవును. ఇందులో విచిత్రం ఏముంది ! మాతా! నీ ఇష్టం. అలాగే కానీ. నన్ను సంహరించు. నాకు దుఃఖం లేదు. నేనేమీ బాధపడటం లేదు కానీ,  హే జగదంబికే! నువ్వు సృష్టించిన నన్ను ఈ రాక్షసుడు చంపడం నీకు పెద్ద అపకీర్తి అవుతుంది. 'అందుకని, దేవీ! లే.

అద్భుతరూపం ధరించు. నన్నో,  ఈ రాక్షసులనో సంహరించు. లేదంటే, హరిని నిద్రలేపు. ఈ రాక్షసుల్ని సంహరిస్తాడు. ఏదయినా అంతా నీ చేతిలో ఉంది.

ఇలా కమలసంభవుడు భక్త్యావేశంతో నిలదీశాడు. ఎట్టకేలకు ఆ తామసీశక్తి శౌరి శరీరాన్ని వదలి పెట్టింది. జనార్దనుడిలో కదలిక వచ్చింది. విరించి ముఖాలలో ఆనందం వెల్లివిరిసింది.

*(అధ్యాయం - 7 శ్లోకాలు - 50)*

సూతుడు ఇలా కథ చెబుతుండగా శౌనకాదిమహామునులలో ఒకరికి మరొక సందేహం వచ్చింది.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులనీ, సనాతనులనీ, బ్రహ్మాండంలో వీరికంటే అధికులు (పరతరం) లేరనీ, సృష్టిస్టితిలయాలను వీరే నిర్వహిస్తుంటారనీ పెద్దలు చెప్పగా విన్నాం. అందులో విష్ణుమూర్తి మహాతేజస్వి అనీ సర్వసమర్ధుడనీ చెబుతారు గదా ! అంతటి స్వామి యోగమాయకు వశుడై నిద్రపోయాడా ? అతడి వివేకం ఏమైపోయింది ? బ్రతికుండీ నిశ్చేష్టుడు ఎలా అయ్యాడు ? ఇదినా సందేహం. విష్ణుమూర్తినే లొంగదీసుకున్న ఆ శక్తి ఎవరు ? దాని పేరు ఏమిటి ? ఎక్కడ ఎలా పుట్టింది? అంతటి సమర్ధురాలు ఎలా కాగలిగింది ? పరాత్పరుడు నిద్రాపరతంత్రుడయ్యాడంటే ఆశ్చర్యంగా ఉంది.

ఓ మహామతీ | వ్యాస శిష్యా! నీ జ్ఞానఖడ్గంతో నా సందేహల తలను ఖండించి సత్యప్రకటనం చెయ్యి - అని ఆ మహాముని అభ్యర్థించాడు. సూతుడు రవ్వంత ఇరుకునపడ్డాడు. అయినా సమాధానం చెప్పాడు.

మహామునులారా ! ముల్లోకాలలోనూ ఈ సందేహాన్ని తీర్చగలవాడు లేడని నా అభిప్రాయం. బ్రహ్మపుత్రులూ సనాతనులూ అయిన నారద కపిలాది మహామునులు సయితం దీనికి సమాధానం చెప్పలేరేమో. అంతటి దుర్ఘటమైన ప్రశ్న ఇది. ఇక నేననగా ఏమిటి ! ఏమి చెప్పను ? కానీ ఒక్క విషయం గమనించండి.

🙏 *సూతకృత శక్తి స్తవం* 🙏

వేదాలు విష్ణుమూర్తిని సర్వపాలకుడుగా కీర్తిస్తున్నాయి. అతడు విరాట్‌ స్వరూపుడు. చరాచరప్రాణికోటి అంతా ఆ స్వరూపం నుంచే ఆవిర్భవిస్తోంది. నారాయణుడూ, హృషీకేశుడూ, వాసుదేవుడూ, జనార్దనుడూ అనే పేర్లతో అందరూ అతడిని స్తుతించి ఉపాసిస్తున్నారు. మరికొందరు శివుణ్ణీ అలా ఉపాసిస్తున్నారు. శంకరుడు, చంద్రశేఖరుడు, త్రినేత్రుడు, పంచవక్రుడు, శూలపాణి, వృషధ్వజుడు - మొదలైన నామధేయాలతో వేదం త్రయంబకుణ్ణి గానం చేస్తోంది. అర్ధనారీశ్వరుడుగా కైలాసనివాసిగా సర్వశక్తి సమన్వితుడుగా భూతనాథుడుగా దక్షయజ్ఞ వినాశకుడుగా - భక్తులు కీర్తిస్తున్నారు. మరికొందరు. వేదవిదులు ముప్పాద్దులా సూర్యుణ్ణి ఉపాసిస్తున్నారు. సూర్యోపాసనమే ఉత్తమోత్తమమనీ అతడు పరమాత్మ అనీ వేదాలు కూడా చెబుతున్నాయి. అలాగే అగ్నినీ, ఇంద్రుణ్ణీ, వరుణుణ్ణీ పరమాత్మలుగా చెప్పే వేదభాగాలూ ఉన్నాయి. వీరిని పరమాత్మలుగా ఉపాసించే వేదపండితులూ ఉన్నారు. ప్రవాహాలు ఎన్నయినా గంగ ఒక్కటే అన్నట్టు వీరందరిలోనూ విష్ణువే ఉన్నాడు అన్న మహర్షులూ ఉన్నారు.

ఏ విషయంలోనైనా ఒక నిశ్చయానికి రావాలంటే ప్రధానంగా మూడు ప్రమాణాలను చెబుతారు పండితులు. ప్రత్యక్షం, అనుమానం, శాబ్దం అని. మరికొందరు ఉపమానాన్ని చేర్చి మొత్తం నాలుగన్నారు.
అర్థాపత్తితో కలిపి అయిదు అనేవారూ ఉన్నారు. పౌరాణికుల మార్గంలో అనుభవ దృష్టాంతాలతో కలిసి ప్రమాణాలు ఆరున్నొకటి. ఇంతకీ పరబ్రహ్మ స్వరూపం ఈ ప్రమాణాలకు వేటికీ అందనిదే. అందుకే అది పరమమైన బ్రహ్మ. కాబట్టి బాగా ఆలోచించి ఒక నిశ్చయానికి రావాలి.

త్రిమూర్తులలో సృజన, పాలన, సంహరణ శక్తులు ఉన్నాయి. సూర్యుడిలో ప్రకాశకశక్తి ఉంది. శేష-కూర్మాలకు భూభరణశక్తి ఉంది. అగ్నిలో దహనశక్తి ఉంది. వాయువులో ప్రేరణశక్షి ఉంది. ఈ శక్తులు లేకపోతే వీరంతా ఏమవుతారు ? అసమర్ధులవుతారు. వేరే చెప్పాలా ?

*శివో౬పి శవతాం యాతి కుండలిన్యా వివర్జితః।*
*శక్తిహీనస్తు యః కశ్చిత్‌ అసమర్థః స్మృతో బుధైః ॥*

*ఓ మహాతపస్వులారా !* బ్రహ్మ మొదలుకొని స్తంభపర్యంతం ఉన్న ఈ బ్రహ్మాండంలో శక్తిహినం పరమనింద్యం. శివుడు శవమయినట్టే. కాబట్టి శత్రు విజయంలో గమనంలో భోజనంలో సర్వత్ర నిండి ఉన్న ఆ శక్తినే పరబ్రహ్మం అని బుద్ధిమంతులు నిర్ధారించారు. ఉపాసించారు. అదే విష్ణుమూర్తిలో సాత్త్వికశక్తి. అది లేనివేళ అతడు నిశ్చేష్టుడు. చతుర్ముఖునిలో అదే రాజసశక్తి. అది లేనినాడు అతడు ఏ సృష్టీ చెయ్యలేడు. అదే శివుడిలో తామసశక్తి. అది ఉంటేనే అతడు సంహారకారకుడు. అందుచేత ఈ బ్రహ్మాండ సృష్టికీ స్థితికి వినాశానికీ శక్తియే కారణం. అదే లేకపోతే త్రిమూర్తులే కాదు ఇంద్రుడూ, సూర్యుడూ, అగ్ని, వరుణుడు - ఎవ్వరూ తామిప్పుడు చేస్తున్న పనుల్ని చెయ్యలేరు.

*ఆ శక్తి - సగుణ అనీ నిర్గుణ అనీ రెండు రకాలు.* నిర్గుణ శక్తిని విరాగులు ఉపాసిస్తారు. సగుణ రూపాన్ని కోరికలున్నవారు (రాగి) ఉపాసిస్తారు. అది నిష్కామోపాసన. ఇది సకామోపాసన.

*సగుణా నిర్గుణా సా తు ద్విధా ప్రోక్తా మనీషిభిః |*
*సగుణా రాగిభిస్సేవ్యా నిర్గుణా తు విరాగిభి: ॥*

ధర్మార్థకామమోక్షాలకు స్వామిని ఆ శక్తియే. విధి విధానంగా పూజిస్తే అన్ని కోరికలూ తీరుస్తుంది. ఇది తెలుసుకోలేని మూఢులు కొందరైతే, తాము తెలుసుకొని ఇతరులను మోసం చేసేవారు మరికొందరు. పొట్టపోసుకోవడం కోసం కొందరు పండితులు కలి ప్రేరితులై రకరకాల పాషండధర్మాలను ప్రచారం చేస్తున్నారు. మరే యుగంలోనూ వేదబాహ్యమైన ధర్మాలు ఇంతగా విజృంభించడం కనపడదు.

*మహానుభావులారా !* త్రిమూర్తులూ నిత్యమూ ధ్యానించేది ఈ శక్తినే. వేల సంవత్సరాలు తపస్సు చేసేదీ ఈమె అనుగ్రహం కోసమే. యజ్ఞాలు చేసేదీ ఇందుకోసమే. బ్రహ్మాఖ్యయైన ఆ పరాశక్తి సనాతని. అందరికీ ఉపాస్యదేవత, ఇది సర్వశాస్తాలూ అంగీకరించి చేసిన నిర్ణయం అని మా గురువుగారు (వ్యాసుడు) చెప్పారు. ఆయనకు నారదుడు చెప్పాడట. నారదుడికి వాళ్ళ నాన్నగారు బ్రహ్మదేవుడు చెప్పాడట. బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి చెప్పాడట. కాబట్టి ఇంక ఇతరుల మాటలు ఏవీ మీరు వినక్కరలేదు. పట్టించుకోనక్కర లేదు. శక్తి మాత్రమే ఆరాధనీయ.

అశక్తుడు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా గ్రహించారు గదా ! సర్వ ప్రకృతిలోనూ శక్తినే దర్శించండి. ఉపాసించండి.

*(అధ్యాయం -8, శ్లోకాలు - 51)*

*మహామునులారా !*
మీ సందేహం తీరింది గదా ! ఇంక కథలోకి వద్దాం - అంటూ సూతుడు కొనసాగించాడు.

జగద్గురువైన విష్ణుమూర్తి శరీరంనుంచి నిద్రాదేవి బయటకు వచ్చింది. నేత్ర - ఆస్య – నాసికా - బాహు - హృదయ - వక్షః స్థలాలనుంచి వెలువడింది. ఆకాశంలో నిలబడింది. జగన్నాథుడు ఆవులింతలతో లేచాడు. భయంభయంగా నిలబడ్డ ప్రజాపతిని చూశాడు. మేఘ గంభీర కంఠస్వరంతో పలకరించాడు.

*పద్మజా !* తపస్సు వదిలేసి ఇలా వచ్చా వెందుకని ? విచారంగా కనపడుతున్నావు, కారణం ఏమిటి ?

తండ్రీ ! వాసుదేవా ! నీ చెవి గులుగు నుంచి పుట్టిన మధుకైటభరాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. భయపడి నీ సన్నిధికి వచ్చాను. శరుణు, శరణు. త్రాహి మామ్‌, త్రాహి మామ్‌.

అలాగా, చతుర్ముఖా ! భయపడకు. వాళ్ళను నేను సంహరిస్తాను. ఆయువు మూడింది వాళ్ళకి. వస్తారు. నా మీదకే వస్తారు. చస్తారు.

విష్ణుమూర్తి ఇలా అంటూండగానే వాళ్ళు వచ్చారు. మదగర్వితులై వచ్చారు. ఆ నీళ్ళల్లో నిరాధారులై నిలబడి - ఓయీ నలువా ! పారిపోయి ఇక్కడికి వచ్చావా ? రా. యుద్ధం చెయ్యి. ఈయన కళ్ళముందే ఇక్కడే నిన్ను సంహరిస్తాం. తరువాత ఈయన పనిపడతాం. మహాసర్పం మీద కులుకుతున్నాడు గదా ! ముందు నువ్వు రా యుద్ధం చెయ్యి. లేదా దాసుణ్ణి అని ఒప్పుకో - అని గద్దించారు. విష్ణుమూర్తి కల్పించుకుని,,

దానవులారా ! రండి, నాతో యుద్ధం చెయ్యండి. మీ మదం వదిలిస్తాను.

ఈ ఆహ్వానానికి మధుకైటభులు ఆగ్రహోదగ్రులయ్యారు. ముందుగా మధుడు కలబడ్డాడు. కైటభుడు నిలబడ్డాడు. మల్ల యుద్ధం జరుగుతోంది. మధుడు అలిసిపోతుంటే కైటభుడు అందుకున్నాడు. అతడు అలిసిపోతే మళ్ళీ మధుడు. ఇలా ఇద్దరూ మారిమారి శౌరితో పోరుతున్నారు. సన్నిధిలో బ్రహ్మదేవుడూ, ఆకాశంలో (నిద్రా) దేవి ప్రేక్షక క్షకపాత్ర వహిస్తున్నారు.

విష్ణుమూర్తి అలిసిపోతున్నాడే తప్ప వాళ్ళిద్దరిలోనూ ఎక్కడా అలసటే లేదు. అయిదువేల సంవత్సరాలు గడిచాయి. కారణం ఏమిటి చెప్మా అని హరి ఆలోచించాడు. నేను ఎందుకు అలిసిపోతున్నాను? నా శక్తి ఏమయ్యింది ? వీళ్ళు అస్సలు అలిసిపోవడం లేదేమిటి ? వీళ్ళకి ఈ శక్తి ఎక్కడినుంచి వచ్చింది? ఈ ఆలోచనలతో ఒక్క నిమిషం ఆగాడు.

మధుకైటభులు విజయగర్వంతో సంబరపడ్డారు. గంభీరంగా
అరిచి పలికారు.

*హే విష్ణో!* అలిసిపోయావా ? యుద్ధం చేసే ఓపిక లేదా ? అయితే మాకు తలవంచి నమస్కరించు. దాసుణ్జి అని ప్రకటించు. కాదంటావా, సమర్ధుడవై యుద్ధం చెయ్యి. నిన్ను చంపి, ఈ నాలుగు ముఖాలవాణ్ణీ కూడా చంపుతాం. - ఆ ప్రళయ మహాసముద్ర ఘోషను అధఃకరిస్తూ వాళ్ళిద్దరూ ముక్తకంఠంతో పలికిన ఈ మాటలు చెవులారా విన్నాడు శౌరి. ప్రశాంతంగా సామోపాయంగా ప్రసంగించాడు.

మధుకైటభులారా ! మీరేమో ఇద్దరు, నేనో ఒక్కణ్ణే.  మీరు ఒకరి తరువాత ఒకరుగా నాతో తలపడుతున్నారు. ఒకరు యుద్ధం చేస్తోంటే మరొకరు విశ్రాంతి తీసుకుంటున్నారు. నాకు ఆ అవకాశం లేదు. అయిదువేల సంవత్సరాలపాటు పోరాడాను. అలిసిపోయాను. సహజం గదా ! ధర్మయుద్ధంలో మహావీరులు పాటించే నియమాలు మీకు తెలియనివి కావు. అలిసిపోయిన వాడితో భయపడిన వాడితో ఆయుధం వదిలేసిన వాడితో పడిపోయిన వాడితో బాలకుడితో మీవంటి మహావీరులు యుద్ధం చెయ్యరు. ఇది సనాతన ధర్మం.

అందుచేత కొంచెంసేపు నేనూ విశ్రాంతి తీసుకుని మళ్ళీ యుద్ధం చేస్తాను. సంశయించకండి. న్యాయం తప్పను.

ఈ ప్రతిపాదనకు వాళ్ళు సమ్మతించారు. అల్లంత దూరం తొలగి నిలబడ్డారు. వాసుదేవుడు ఆలోచించాడు. అసలు కారణం తెలిసింది. వాళ్ళది స్వేచ్ఛా మరణమనీ, దేవి ఆ వరం ఇచ్చిందనీ గ్రహించాడు. అయ్యో ! వృధాగా యుద్ధం చేశానే. ఇంత శ్రమా వ్యర్థం అయ్యిందే. విషయం తెలిసి ఇంక యుద్ధం చేసి ఏమి లాభం ! పోనీ మానేద్దామంటే వీళ్ళు మరణించేదెలాగ! వరదర్పితులై విరించి పైకీ నా పైకీ దండెత్తారు. చంపక తప్పదు. వరం ఇచ్చిన తల్లి తానై ఆ పని చెయ్యదు. ఎంత దుఃఖితుడైనా రోగగ్రస్తుడైనా దీనుడైనా తనంత తాను మరణం కోరుకోడు. మరణించాలి అనుకోడు. అందుచేత, సర్వకామద అయిన ఆ పరాశక్తినే శరణువేడతాను.

ఆవిడ అనుగ్రహం లేనిదే ఎవ్వరికీ ఏవీ సిద్ధించవు.

ఇలా నిశ్చయించుకున్న లక్ష్మీపతి తలఎత్తి ఆకాశంవైపు చూశాడు. నిలబడి ఉన్న యోగనిద్రామహాశక్తి కనిపించింది. వెంటనే నమస్కరించాడు. యోగవిద్య తెలుసు కనక ఆ మార్గంలో స్తోత్రపాఠం చేశాడు.

*నమో దేవి మహామాయే సృష్టిసంహారకారిణి ।*
*అనాదినిధనే చండి భుక్తిముక్తిప్రదే శివే ॥*

*దేవీ |! మహామాయా !* నీ రూపం సగుణమో నిర్గుణమో ఎరగను. అసంఖ్యాకమైన నీ దివ్య చరిత్రలు ఎరగను. కానీ, నీ అతిదుర్ఘటమైన ప్రభావం మాత్రం అనుభవంలోకి వచ్చింది. చేష్టలు ఉడిగి నిద్రలో మునిగిపోయాను గదా ! ఈ బ్రహ్మదేవుడు ఎంతసేపు లేపినా మెలకువే రాలేదు. ఇంద్రియజ్ఞానం కోల్పోయి అచేతనుణ్ణి అయిపోయాను. అంబికా! నీ ప్రభావం ఏమిటో తెలిసింది. నువ్వు వదిలావు, మేల్కొన్నాను. వెంటనే వీళ్ళతో యుద్దానికి దిగాను. వీళ్ళు బ్రహ్మ దేవుణ్ణి చంపడానికి వచ్చారు. నాతో ద్వంద్వ యుద్దానికి తలపడ్డారు. నీ వరం వీళ్ళను మదమత్తుల్ని చేసింది. దుర్జయుల్ని చేసింది. అయిదువేల సంవత్సరాలు పోరాడి అలిసిపోయాను. చూశావు గదా ! విషయం తెలిసి నిన్నే శరణు వేడుతున్నాను. దయచేసి, తల్లీ! సహాయం చెయ్యి. నేను ఖిన్నుణ్ణి. వాళ్ళు గర్వితులు. నువ్వు దేవార్తిహారిణివి. వీళ్ళు నన్నూ చంపుతామంటాన్నారు. ఏం చెయ్యాలి ? ఎక్కడికి పోవాలి ? చెప్పు - మాతా! దీనుడై అభ్యర్థిస్తూ శిరసువంచి నమస్కరిస్తున్న వాసుదేవుణ్ణి చూసి పరాశక్తి ప్రసన్నురాలు అయ్యింది. చిన్నగా నవ్వుతూ ఇలా అంది -

*హరీ !* మళ్ళీ యుద్ధం చెయ్యి. ఈ రాక్షసుల్ని మోసగించి సంహరించాలి. మరో దారి లేదు. నేను వంకర చూపులతో వీళ్ళను సమ్మోహపరుస్తాను. ఆ మాయలో ఉండగా నువ్వు సంహరించు, విష్ణుమూర్తికి ధైర్యం వచ్చింది. రణరంగానికి వెళ్ళాడు. మధుకైటభులు హర్షించారు. చతుర్భుజా! భయపడకు. ధైర్యంగా యుద్ధం చెయ్యి. జయాపజయాలు దైవాధీనాలు, బలవంతుడే జయించాలనిలేదు. దైవయోగం ఉంటే దుర్చలుడే జయించవచ్చు. అందుచేత ఆనందించవలసిందీ లేదు, దుఃఖించవలసిందీ లేదు. ఇంతకుముందు నువ్వు ఎందరో రాక్షసుల్ని జయించావు. దానవవైరి అనిపించుకున్నావు. ఇప్పుడు మా చేతిలో ఓడిపోతున్నావు. అంతే.

ఈ గర్వోక్తులకు మండిపడ్డాడు శౌరి. బలంగా ఇద్దరికీ చెరొక ముష్టిఘాతమూ ఇచ్చాడు. వాళ్ళు చెక్కుచెదరకపోగా రెండు పిడిగ్రుద్దులు దక్కాయి శ్రీహరికి. యుద్ధం రాజుకొంది, ఘోరంగా పరిణమించింది. శ్రీనాథుడు దీనంగా అమ్మవారివైపు చూశాడు.

విష్ణుమూర్తి అవస్థను గ్రహించింది పరమేశ్వరి. కరుణామయి అయ్యింది. ఎరుపెక్కిన కన్నులతో మధుకైటభులను చూస్తూ పెద్దగా నవ్వింది. మన్మథబాణాల వంటి చూపులు, కామప్రేమ భావాలను మందస్మితంతో రంగరించిన చూపులు ఇద్దరినీ హింసించాయి. ఆ పాపాత్ములు ఆ వక్రవిలోకనాలకు మురిసిపోయారు. కామభావ పీడితులయ్యారు. ఇది విశేషమనుకున్నారు. కన్నులప్పగించి దేవిని చూస్తూ అలాగే నిలబడిపోయారు. శ్రీహరి గమనించాడు, మోహితులు అయ్యారని గుర్తించాడు. చిరునవ్వులు చిందించాడు. గంభీరంగా పలికాడు.

*మధుకైటభులారా!* మీ యుద్దానికి సంతోషించాను. ఎందరో రాక్షసుల్ని చూశాను, యుద్ధాలు చేశాను. కానీ మీతో సాటివచ్చేవాళ్ళను కనలేదు, వినలేదు. మీ బాహుబలానికి సంతుష్టి చెందాను. వరం ఇస్తున్నాను. మీ ఇష్టం. కావలసింది కోరుకోండి.

దానవ సోదరులకు అభిమానం పొడుచుకు వచ్చింది. మన్మథార్తులై జగదానందకారిణి అయిన ఆ మహా మాయను తదేక దీక్షతో చూస్తూ కన్ను తిప్పకుండా హరికి సమాధానం చెప్పారు.

*హరీ!* మేము యాచకులం కాము. అయినా నువ్వు మాకు ఏమి ఇస్తావు ? మేమే ఇస్తాం. కోరుకో. మేము దాతలమే కానీ చెయ్యి చాపేవాళ్ళం కాదు. ఏం కావాలో అభ్యర్థించు. నీ యుద్దానికి మేమూ సంతోషించాం. నీ ఇష్టం, కోరుకో.

అయితే, దానవులారా ! మీరిద్దరూ ఇప్పుడు నాచేతిలో మరణించాలి. వధ్యులు కావాలి.

రమాపతి ఇలా కోరేసరికి మధుకైటభులు ఆశ్చర్యపోయారు. వంచితులమయ్యామని గ్రహించారు. గొల్లుమన్నారు. వెంటనే తేరుకుని ఆలోచించారు. జగత్తు అంతా జలమయంగా ఉండటం గమనించి ఒక ఎత్తుగడ వేశారు.

*జనార్దనా!* ఇంతకుముందు నువ్వు మాకొక వరం ఇస్తానన్నావు గుర్తిందిగా. మాటమార్చకు. నీకు మేము వధ్యులం అవుతాం. కాకపోతే, నిర్జలమైన విశాల ప్రదేశంలో సంహరించాలి. అదీ నీ నుంచి మేము కోరుకునే వరం. సత్యవాదివి కదా ! నెరవేర్చు.

ఈ నియమానికి విష్ణుమూర్తి నవ్వుకున్నాడు. సుదర్శన చక్రాన్ని స్మరించాడు. నిర్జలమైన విపులప్రదేశంలో కదా మిమ్మల్ని సంహరించాలి అంటూ తన తొడలను విశాలంగా విస్తరించాడు. నీళ్ళమీద నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది. దానవులారా! ఈ తొడలమీద నీళ్ళు లేవు. మీ శిరస్సులు ఖండించి మాట నిలబెట్టుకుంటాను. రండి - అని పిలిచాడు.

రాక్షసులకు మతిపోయింది. ఏమి చెయ్యాలో తోచలేదు. హఠాత్తుగా తమ శరీరాలను వెయ్యి యోజనాలకు పెంచారు. విష్ణుమూర్తి తన జఘనభాగాన్ని రెండువేల యోజనాలకు విస్తరించాడు. చక్రంతో ఇద్దరి శిరస్సులూ ఖండించాడు. తలలూ మొండేలూ తొడలమీద రాలిపడ్డాయి. మధుకైటభులు నిహతులయ్యారు. వారి కళేబరాల నుంచి క్రొవ్వు (మేదస్సు) ప్రవహించి సాగరమంతటా వ్యాపించింది. అదే తరువాత కాలంలో మేదిని (భూమి) అయ్యింది. అందుకనే మృత్తిక (మట్టి) తినరానిదయ్యింది.

*శౌనకాదిమహామునులారా !* మీరడిగిన మధుకైటభ వృత్తాంతం చెప్పాను. మహావిద్య, మహామాయ సర్వదా మనకు సేవనీయ. సురాసురులకు ఆరాధ్య. ముల్గోకాలలోనూ పరాశక్తికి మించిన దైవం లేదు. ముమ్మాటికీ ఇది సత్యం. వేదశాస్త్రాల నిర్ణయం. నిర్గుణగానో సగుణగానో నిత్యం పరాశక్తినే పూజించాలి.

*(అధ్యాయం - 9, శ్లోకాలు - 87)*

సూతుడి ప్రబోధానికి మునులంతా సంతోషించారు. ఆమోదం తెలియజేశారు. అటుపైని యథావిధిగా ప్రశ్నించారు.

*సూతమహర్షీ!* ఇంతకుముందు అన్నావు, వ్యాసుడు ఈ పురాణమంతా రచించి శుకుడితో చదివించాడని. గొప్ప తపస్సు చేసి శుకుణ్ణి పుత్రుడుగా పొందాడు అని. అందులోంచి ఇంకో కథలోకి వెళ్ళిపోయాం! ఇపుడు ఆ సంగతులు తెలియజెయ్యి.

*మునీశ్వరులారా!* తప్పకుండా! వ్యాసుడికి శుకుడు జన్మించిన వృత్తాంతం సవిస్తరంగా చెబుతాను.
శుకుడు సాక్షాత్తూ యోగీశ్వరుడు.

*(రేపటి భాగంలో.... శుకమహర్షి  జన్మ వృత్తాంతం)*

               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*

♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾

*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*

*భావము:* 💐

ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏

🙏 శ్రీ మాత్రే నమః 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat