శ్రీ దేవీ భాగవతము - 7

P Madhav Kumar


*ప్రథమ స్కంధము - 3*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

*లలితా సహస్రనామ శ్లోకం - 7*

*నవచంపకపుష్పాభ నాసాదండ విరాజితా!*
*తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా!!*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

👉 *నిన్నటి భాగములో....*

సూతుడు చెప్పిన ఈ వ్యాస - నారద సంభాషణను శ్రద్ధగా విన్న మునులకు మరో సందేహం వచ్చింది. సర్వకారణకారణుడూ జగన్నాథుడూ అయిన విష్ణుమూర్తికి శిరస్సు తెగిపడటం ఏమిటి, గుర్రపు తలను తెచ్చి అతకడం ఏమిటి, హయగ్రీవుడు కావడం ఏమిటి - ఇదంతా చాలా విడ్డూరంగా ఉంది, వివరంగా చెప్పమని ప్రార్థించారు.
సూతుడు అందుకున్నాడు.
🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡️

🙏 *హయగ్రీవ వృత్తాంతము* 🙏

*మహామునులారా !*

సావధానంగా వినండి. పరమతేజస్వి, దేవదేవుడు ఆయిన విష్ణుమూర్తి జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన చెబుతున్నాను.

ఒకానొకప్పుడు జనార్దనుడు పదివేల  సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా మహాయుద్దం చేసిచేసి బాగా అలిసిపోయాడు. ఎక్కుపెట్టి ఉన్న ధనుస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేలకు ఆన్చి, పైకొనకు గడ్డం ఆన్చి, శరీరభారమంతా ధనుస్సుపై మోపి, అలా నిలబడే విశ్రమించాడు. అలసటో దైవయోగమో చటుక్కున నిద్ర పట్టేసింది. గాఢనిద్ర. చాలాకాలం గడిచింది.

అంతలో - ఏదో యజ్ఞం చేయాలని తలపెట్టిన దేవతలు బ్రహ్మను, శివుణ్ణి తీసుకొని విష్ణులోకానికి వెళ్ళారు. యజ్ఞప్రభువు కదా విష్ణుమూర్తి, ఇది దేవకార్యార్థం చేస్తున్న యజ్ణమాయె. అందుచేత జగన్నాథుడి అనుమతి తీసుకుని ప్రారంభిద్దాం అని వారి ఆకాంక్ష. తీరా వెడితే, విష్ణులోకంలో  విష్ణుమూర్తి కనపడలేదు. దివ్యదృష్టితో చూశారు. యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనుస్సు మీద నిలబడి నిద్రపోతున్న కేశవుడు కనిపించాడు. అంతే, అందరూ. ఒక్క ఉదుటున అక్కడికి చేరుకున్నారు. అలికిడి అయినా స్వామి లేవలేదు. నిద్రలేపడం ఎలాగ, ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవేంద్రుడు. నిద్రాభంగం చెయ్యకూడదు. మహాపాపం. అలాగని ఈ యజ్ణాన్నీ ఆపనూలేము - అంటూ సంశయంలో పడ్డాడు శంకరుడు.

బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది. ఒక వమ్రిని (చెద పురుగు) సృష్టించాడు. వింటినారిని భక్షించమన్నాడు. అప్పుడు ధనుస్సు జారిపడుతుంది, దేవదేవుడు నిద్ర లేస్తాడు, దేవకార్యం నెరవేరుతుంది. అని పథకం చెప్పాడు. అందరూ అంగీకరించారు. కానీ ఆ వమ్రి ఒక (ధర్మ) సందేహం వెలిబుచ్చింది.

*కమలసంభవా !* జగద్గురువైన రమాపతికి నిద్రాభంగం చెయ్యమంటావా ? ఎలా చెయ్యను! నిద్రాభంగం, కథాభంగం, దాంపత్యభేదనం, శిశుమాతృవిభేదనం (తల్లీబిడ్డలను విడదీయడం) ఇవి బ్రహ్మహత్యతో సమానమైన మహాపాపాలు గదా ! పోనీ, ఇంత పాపానికీ ఒడిగడితే నాకు ఒరిగేది ఏమిటి? వింటినారిని తింటే నాకు దక్కే ఫలం ఏమిటి ? సర్వపాపాలకూ స్వార్ధమే కదా మూలం, భక్షణం నా స్వార్ధమే. ఫలం మాట ఏమిటి ?

వమ్రి ప్రశ్నకు బ్రహ్మదేవుడే సమాధానం చెప్పాడు. వమ్రీ | నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాము. హోమకుండాలలో హవిస్సులు వేల్చేటప్పుడు అటూఇటూ చెదిరిపడే భాగాలు ఇకనుంచీ నీవే. పద త్వరగా విష్ణుమూర్తిని నిద్రలేపు. దేవకార్యం నెరవేర్చు - అని ఒప్పించాడు.

వమ్రి వెళ్ళింది. నేలపై ఆని ఉన్న ధనురగ్రం దగ్గర నారిని చటుక్కున కొరికింది. ఒక్క పెట్టున ధనుస్సు ఎగిసిపడింది. భీకరశబ్దం భూనభోంతరాళాలలో ప్రతిధ్వనించింది. దేవతలంతా భయపడ్డారు. బ్రహ్మాడం సంక్షోభించింది. భూమి కంపించింది. సముద్రాలు ఘూర్ణిల్లాయి. తిమింగిలాలకు వణుకు పుట్టింది. ఝంఝామారుతాలు వీచాయి. పర్వతాలు క్రక్కదిలాయి. అమంగళసూచకంగా ఉల్కాపాతాలూ మహోత్పాతాలూ జరిగాయి. హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు. చీకట్లు దట్టంగా వ్యాపించాయి. ఏమి
జరుగుతోందో, ఏమి జరుగుతుందో తెలియక దేవతలంతా కలవరపడుతున్నారు.

తాపసులారా! ధనుస్సు పైకొనకు ఆన్చి ఉన్న శిరస్సు, దేవదేవుడి శిరస్సు, కుండలమండితమైన శిరస్సు - త్రుటిలో తెగి, ఎటో ఎగిరి, ఎక్కడో పడింది.

కొంతసేపటికి చీకట్లు విడిపోయాయి. బీభత్సం శాంతించింది. శిరస్సు లేని మొండెం కనిపించింది. దేవతలు బావురుమన్నారు. భయపడ్డారు. నిశ్చేష్టులయ్యారు.

*జగన్నాయకా !* నువ్వు దేవాదిదేవుడవు. సనాతనుడవు. ఏమిటి ఈ దారుణం ? ఏమిటి ఈ మాయ ? నీ శిరస్సుని ఎవరు ఖండించారు ? ఏమైపోయింది. నువ్వు అచ్చేద్యుడవే, అభేద్యుడవే, అదాహ్యుడవే (అగ్నికి కాలనివాడవు), నువ్వే ఇలా అయిపోతే మరింక దేవతలలో మిగిలేది ఎవడు ! అంతా మరణిస్తారు. నీపట్ల మాకున్న ప్రేమ, గౌరవం. ఆదరం ఏమయిపోయాయో, స్వార్థం ఆవరించి నిన్ను పోగొట్టుకున్నాము. ఏడుస్తున్నాం. మేము తలపెట్టిన యజ్ఞానికి ఇది యక్షులో రాక్షసులో కల్పించిన విఘ్నం కానేకాదు. మాకు మేమే చేసుకున్నాం. స్వయంకృతం. ఎవరిని నిందిస్తాం ! అందరం పరాధీనులమే. ఏమి చేస్తాం ? ఎక్కడికి పోతాం ? ఎంత మూఢులం ! మాకు ఇంక రక్షకుడెవరు ?

ఇది సాత్త్వికమాయ అందామా ? రాజసమో తామసమో అందామా ? అన్ని మాయలకూ అధిపతివి. జగద్గురువువి. నీ శిరస్సే ఎగిరిపోయింది అంటే ఏమనాలి !

ఇలా దిక్కుతోచక డీలాపడి విలపిస్తున్నారు బ్రహ్మ, శివుడు మొదలైన దేవతలంతా. పరిస్థితి గమనించాడు బృహస్పతి. దేపగురువు కదా ! పైగా వేదాంతం వంటబట్టినవాడు. నెమ్మదిగా దేవతలను ఓదారుస్తూ ప్రసంగించాడు.

మహానుభావులారా ! ధైర్యం తెచ్చుకోండి. ఎంత దుఃఖించి ఏమి లాభం ? రవ్వంత తేరుకోండి. దేవతలే ఇంత బేంబేలుపడిపోతే ఎలాగ ! ఉపాయం ఆలోచించండి. బుద్దికి పని చెప్పండి. దైవ బలమూ పురుషకారమూ రెండూ సమానమే. ఇప్పటి కర్తవ్యం ఉపాయమే. ఒక్కొక్కప్పుడు కాదు, అన్ని వేళలా అన్ని విధాలా దైవం కంటే అదే (పురుషకారమే, ఉపాయమే) ఫలిస్తుంది.

*దైనం పురుషకారశ్చ దేవేశ సదృశావుభౌ !*
*ఉపాయశ్చ విధాతవ్యో దైవాత్ఫలతి సర్వధా ॥*

బృహస్పతి ఇలా అనేసరికి ఇంద్రుడికి ఉక్రోషం వచ్చింది. దేవగురు ! ఎందుకు వచ్చిన పౌరుషమయ్యా ? అది వట్టి అనర్థకం. దైవమే గొప్పది. దాని శక్తికి తిరుగులేదు. లేకపోతే ఏమటీ ఈ దారుణం. దేవతలూ దేవతానాయకులూ అందరం కళ్ళు అప్పగించి చూస్తునే ఉన్నాం, విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోయింది.

అప్పటికి బ్రహ్మదేవుడు తేరుకున్నాడు. వేదాంత ధోరణిలో ప్రసంగించాడు. దేవెంద్రా! అభం కానీ అశుభంకానీ కాలం తెచ్చిపెట్టిన దాన్ని అనుభవించవలసిందే. దైవఘటనను తప్పించుకోవడం ఎవరివల్లా కాదు. దేహం ధరించాక సుఖదుఃఖాలు తప్పవు. నా సంగతే చూడు, ఒకప్పుడు ఈ శివుడు నా శిరస్సును ఖండించాడు గదా ! ఈ శివుడికి శాపవశం వల్ల లింగపాతం జరిగింది కదా ! అలాగే ఇప్పుడు హరిశిరస్సు ఏ సముద్రంలోనో పడిపోయింది. అంతా కాలమహిమ. నీ విషయమూ అంతేగా, సాక్షాత్తూ దేవేంద్రుడివి. శచీపతివి. మరి నీకు శరీరమంతటా పొడలు రాలేదూ ! స్వర్ణ సింహాసనంనుంచి ఎన్నిసార్లు భ్రష్టుడివి కాలేదు ! అక్కడా ఇక్కడా తలదాచుకున్నావు కాదూ ! ఎంతటివాడికైనా కష్టాలు రాకా తప్పదు అనుభవించకా తప్పదు, ఎవ్వడూ తప్పించుకోలేడు. అందుచేత అతిగా దుఃఖించక ఉపాయం ఆలోచించండి. సనాతని అయిన ఆ మహామాయను, మహావిద్యను, మహాదేవిని ధ్యానించండి, ఆ పరాశక్తి, ఆ నిర్గుణ, ఆ ప్రకృతి మనకు దారి చూపుతుంది. ఆవిడ బ్రహ్మవిద్య. జగద్ధాత్రి (పోషకురాలు, దాది). సర్వలోకజనని, ఈ ముల్లోకాలలో చరాచరజగత్తు అంతటా ఆమె వ్యాపించి ఉంది,

*చింతయంతు మహామాయాం విద్యాం దేవీం సనాతనీమ్‌ |*
*సా విధాస్యతి నః కార్యం నిర్గుణ ప్రకృతిః పరా ॥*
*బ్రహ్మవిద్యాం జగద్దాత్రీం సర్వేషాం జననీం తథా!*
*యయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం సచరాచరమ్‌ ॥*

ఈ ఉపదేశానికి దేవతలంతా సమ్మతించారు. దేవీస్తవం ఆరంభించారు. బహ్మదేవుడి నాలుగు ముఖాలనుంచీ వేదాలు మాతృసూక్తం ఆలపించాయి.,

*నమో దేవి మహామాయే విశ్యోత్పత్తికరే శివే |*
*నిర్గుణే సర్వభూతేశి మాతః శంకరకామదే ॥*

*హే దేవీ! మహామాయా |! నమోనమః. నువ్వు విశ్వోత్పత్తి కారణానివి. శుభప్రదవు. నిర్గుణవు. సర్వభూతేశ్వరివి, జగన్మాతవు. శంకరుడంతటి వాడికి కోరికలు తీర్చినదానవు. ప్రాణికోటికంతటికీ ప్రాణం నువ్వే. జీవకోటికంతటికీ ఆధారభూమివి నువ్వే. తెలివి, కలిమి, వెలుగు, ఓరిమి, శాంతి, శ్రద్ధ, మేధ, ధైర్యమూ, స్మృతి - అన్నీ నువ్వే. ఉద్గీథంలో అర్ధమాత్రవు - నువ్వే. గాయత్రివి నువ్వే. జయ, విజయ, ధాత్రి, లజ్జ, కీర్తి స్పృహ, దయ - అన్నీ నువ్వే. ముల్లోకాలనూ సంవిధానపరచగల్గిన దయామయివి. సర్వజననివి. లోకహితకారిణివి. వరేణ్యవు. వాగ్బీజవు. భవబంధవినాశినివి. నమోస్తు దేవీ ! నమోనమః.*

త్రిమూర్తులూ అష్టదిక్పాలకులూ - అందరూ నీ సృష్టి.   స్థావర జంగమ జగత్తులో నువ్వే ముఖ్యాతిముఖ్యవు. సకల భువనాలనూ తయారు చెయ్యాలి అని నీకు అనిపించినపుడు త్రిమూర్తులనూ సృష్టిస్తూ ఉంటావు. వారితో సృష్టి స్థితి లయాలను జరిపిస్తూ ఉంటావు. నీకుమాత్రం ఈ సంసార స్పర్శ రవ్వంతయినా ఉండదు. నీ రూపవిభవాన్నిగానీ నీ నామ సంఖ్యనుగానీ తెలుసుకున్నవాడూ, తెలియజెప్పగలవాడూ ఈ ముల్లోకాలలో ఒక్కడూ లేడు. మామూలుగా చిన్న నీటి గుంటనే దాటలేనివాడు. మహాసముద్రాన్ని (పారావారాన్ని) ఈదుతాడా |!

*న తే రూపం వేత్తుం సకలభువనే కో౭పి నిపుణః*
*న నామ్నాం సంఖ్యా తే కథితుమిహ యోగో౬స్తి పురుషః |*
*యదల్పం కీలాలం కలయితు మశక్త సతు నరః*
*కథం పారావారాకలనచతురః స్యాదృతమతిః ॥*

*హే |! జగజ్జననీ !* మానవులలోనే కాదు దేవతల్లో కూడా నీ అనంతవిభవం తెలిసినవారు ఒక్కరూ లేరు. నువ్వు అద్వితీయవు. ఒంటిచేతితో ఈ సకల మిథ్యా విశ్వాన్నీ సృష్టిస్తున్నావు. దీనికి వేదవాక్కులే ప్రమాణం. ఇంత సృష్టీ చేసి, నువ్వు నిరీహంగా ఉంటావు. నీ చరిత్ర - చిత్రవిచిత్రం.

అమ్మా! విష్ణుమూర్తి శిరస్సు తెగిపడిందని నీకు తెలియదా ? తెలిసీ ఈ తాత్సారం ఏమిటి తల్లీ! అతడు నీ పాదసేవకుడు గదా. మహాపాపం ఏమైనా చేశాడా ? అది నీ పాదసేవకంటే బలీయం అయ్యిందా! లేకపోతే, కన్న తల్లివి ఇంత ఉపేక్షిస్తావా ! దేవతలకు ఎంత విషమ పరిస్థితి దాపురించింది. విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోవడం ఏమిటి | ఎంత ఆశ్చర్యం ! బహుశ సకలదేవతలూ చేసిన దోషాలు విష్ణుమూర్తిని కొట్టి ఉంటాయి. అందరి పాపాలనూ అతడి నెత్తిన పెట్టిఉంటావు.

లేదా మధుకైటభులతో వేల సంవత్సరాలు సాగిన యుద్ధంలో నా అంతట నేనే జయించానని విష్ణుమూర్తి ఏమైనా గర్వించాడేమో! అందుకు శిక్ష విధించావా జననీ! నీ భావం ఏమిటో అంతుపట్టడంలేదు. ఒకవేళ సమరంలో ఓడిపోయిన (మధుకైటభ) రాక్షసులు తీవ్రంగా తపస్సు చేసి నిన్ను మెప్పించి ఇటువంటి వరమేదైనా కోరారా! అదీకాకపోతే. క్షీర సముద్రరాజ తనయ లక్ష్మీదేవి మీద నీకు కోవం వచ్చిందా!? భర్తృహీనను చేసి వినోదిస్తున్నావా ? అమ్మా! నీ అంశతో జన్మించాడు విష్ణుమూర్తి. అతడు ఏవైనా అపరాధాలు చేస్ఇ ఉంటే క్షమించడమే సమంజసం. అతణ్జి త్వరగా జీవింపజెయ్యి. మమ్మల్ని ఆనందింపబెయ్యి.

ఈ దేవతలంతా నిరంతరం నీకు మ్రొక్కుతూనే ఉన్నారు. నీకు పరమభక్తులు. నీ ఆజ్ణలనూ పనులనూ నెరవేర్చడంలో అతిముఖ్యులు. సమర్ధులు. ఇప్పుడు ఇలా శోకార్ణవంలో మునిగిపోయారు, త్వరగా వీళ్ళని తరింపజెయ్యి. విష్ణుమూర్తిని బ్రతికించు. అతడి శిరస్సు ఎక్కడ పడిందొఇ తెలీదు. నీవు తప్ప మరొక దిక్కు లేదు, మరొక ఉపాయం లేదు. అమృతంలాగా జగత్తుకి నివే జీవనప్రదాత్రివి.

వేదాలు స్వయంగా చేసిన ఈ ప్రస్తుతికి మహేశ్వరి ప్రసన్నురాలు అయ్యింది. కనిపించకుండా ఆకాశవాణిని వినిపించింది. చెవులకు ఇంపైన శబ్దాలతో ఆనందకరంగా శుభప్రదంగా మాట్లాడింది.

దేవతలారా ! చింతించకండి. వేదస్తుతులతో నేను సంతుష్టి చెందాను. కుదుటపడండి. ఈ స్తుతిని ఇటుపైని ఎవరు చేసినా చదివినా విన్నా వారి కోరికలన్నీ తీరతాయి. వేదాలు చేసిన స్తోత్రములు అంటే వేదతుల్యమే కదా!

సరే. విష్ణుమూర్తి శిరస్సు అలా అయిపోడానికి కారణం ఉంది. ఈ ప్రపంచంలో అకారణంగా ఏ పనీ జరగదు.

ఈ విష్ణుమూర్తి ఒకరోజున తన ప్రియభార్య లక్ష్మీదేవి సుందరవదనాన్ని చూసి అదోలా నవ్వాడు. ఎందుకబ్బా అనుకొంది లక్ష్మీదేవి. నా ముఖం వికృతంగా కనిపించిందా ? లేకపోతే ఉత్తినే ఎందుకలా నవ్వుతాడు. కాదులే, ఎవతెనో నాకు సవతిని చేసి ఉంటాడు. అందుకే ఈ వంకరనవ్వు అని అవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది. మనసులో కోపం భగ్గుమంది. తామసీశక్తి ఆమెలో ప్రవేశించింది. ఇది భవిష్యత్తులొఇ దేవకార్యం కోసమే. పట్టరాని ఆ కోపంలో భర్తను శపించింది. నీ శిరస్సు తెగిపడిపోవుగాక అనేసింది. . ఆ క్షణాన కాలయోగం అటువంటిది. తన సుఖాన్నే మరిచిపోయింది. వైధవ్యం కన్నా సపత్నీదుఃఖం ఎక్కువ అనుకొంది. స్త్రీ స్వభావం అలాంటిది గదా ! ఆ శాపం ఇప్పుడు కార్యరూపం ధరించింది. శిరస్సు వెళ్ళి ఉప్పుసముద్రంలో పడిపోయింది. అయినా ఫరవాలేదు. ఇప్పుడే శౌరిని బ్రతికిస్తాను.

సురసత్తములారా ! మీరు తలపెట్టిన మహాకార్యం నెరవేరుతుంది, సందేహంలేదు. ఈ సంఘటనకు మరొక చిన్న కారణం కూడా ఉంది. అదీ చెబుతాను. వినండి.

ఒకప్పుడు హయగ్రీవుడనే రాక్షసమహావీరుడు సరస్వతీనదీ తీరంలో పరమదారుణంగా తపస్సు చేశాడు. మాయా బీజాత్మకమై ఏకాక్షరమైన (హ్రీం) నా మంత్రాన్ని ఘోరనిష్ఠతో జపించాడు. అప్పుడు తామసరూపంతో దర్శనం అనుగ్రహించాను. ఏ రూపాన్ని ధ్యానించాడో అదే రూపంలో సింహవాహనంపై కనిపించాను. వరం కోరుకోమన్నాను. నా రూపాన్ని చూసి అతడి కన్నులు ప్రేమతో విప్పారాయి. నమస్కరించి ప్రదక్షిణం చేశాడు. ఆనంద బాష్పాలలో దొప్పదోగుతూ అద్భుతంగా స్తుతించాడు.

*నమో దేవ్యై మహామాయే సృష్టిస్థిత్యంతకారిణి |*
*భక్తానుగ్రహచతురే కామదే మోక్షదే శివే ॥*

హే జగదీశ్వరీ |! పంచభూతాలూ నువ్వే. జ్ఞానేంద్రియాలూ కర్మేంద్రియాలూ అన్నీ నువ్వే - అంటూ స్తుతించాడు. నాకు మరీ సంతోషం కలిగింది. హయగ్రీవా! నీ తపస్సుకీ నీ స్తోత్రానికీ సంతసించాను. నీ కోరిక ఏమిటో చెప్పు - అన్నాను.

మాతా ! నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు. నేను యోగిగా సురాసురులకు అజేయుడుగా అమరుడుగా ఉండిపోవాలి అనుగ్రహించు.

హయవదనా ! ఇది అసంభవం. పుట్టినవాడు గిట్టక తప్పదు. గిట్టినవాడు తిరిగి పుట్టకా తప్పదు.
ఇది లోకంలో స్థిరపడిన మర్యాద. దీనికి భిన్నంగా నువ్వు అమరుడవు ఎలా అవుతావు. కుదరదు.

*జాతస్యహి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ।*
*మర్యాదా చేదృశీ లోకే భవేశ్చ కథమన్యథా ॥*

కాబట్టి, రాక్షసోత్తమా ! మరణం తప్పదు అనే మాటను నిశ్చయంగా మనసులో పెట్టుకుని, బాగా ఆలోచించి, నీ ఇష్టం, ఏ వరమైనా కోరుకో.

సరే అయితే, జగదంబికా ! హయగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవ్వరిచేతిలోనూ నాకు మృత్యువు ఉండకూడదు. ఈ వరం ప్రసాదించు.
రాక్షస మహావీరా ! తథాస్తు. ఇంక ఇంటికి వెళ్ళు. సుఖంగా రాజ్యం పరిపాలించుకో. హయగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవ్వరిచేతిలోనూ నీకు చావులేదు.  ఇలా వరం ఇచ్చిన నేను అంతర్థానం చెందాను. ఆ హయవదన రాక్షసుడు పట్టరాని ఆనందంతో ఇంటికి వెళ్ళి, ఇక అక్కడినుంచి వేదాలనూ వేదవిదులనూ మునులనూ దారుణంగా హింసించడం మొదలుపెట్టాడు, ఆ దుష్ణుణ్ణి సంహరించగలవాడు ఈ భువనత్రయంలో లేడు. అందుచేత, ఓ దేవతలారా ! ఒక అందమైన గుర్రపు తలను తీసుకురండి. దాన్ని విష్ణుమూర్తి మొండేనికి దేవశిల్పి ( త్వష్ట) నేర్పుగా అతుకుతాడు. అప్పుడు ఈ హయగ్రీవ భగవంతుడు ఆ రాక్షసుణ్గి సంహరిస్తాడు. ఇది దేవకార్యం.

అశరీరవాణిగా జగన్మాతచేసిన ఈ ఉపదేశాన్ని దేవతలంతా విన్నారు. తేరుకున్నారు. దేవశిల్పిని వేడుకున్నారు. అతడు దగ్గరలో ఉన్న గుర్రపు తలను వెంటనే ఖడ్గంతో ఖండించాడు. ఆలస్యం లేకుండా విష్ణుమూర్తి శరీరానికి కలిపాడు. హయగ్రీవ భగవంతుడు ఆవిర్భవించాడు. ఇది మహామాయా ప్రసాదం. అటుపైని కొంతకాలానికి ఆ రాక్షసుణ్ణి మట్టుపెట్టాడు.
          
*(అధ్యాయం - 5, శ్లోకాలు - 1 12)*

సూతుడు చెప్పిన ఈ హయగ్రీవ వృత్తాంతాన్ని శ్రద్ధగా విన్న శౌనకాది మహామునులకు కుతూహలం మరింత పెరిగింది. మహాసముద్రంలో మధుకైటభులతో శౌరి జరిపిన అయిదువేల సంవత్సరాల యుద్దాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నారు. సవినయంగా అడిగారు. అసలు ఆ దానవులిద్దరూ ప్రళయ సముద్రంలో ఎందుకు జన్మించారు ? దేవతలకు కూడా దుర్జయులు అన్నావు. వారిని విష్ణుమూర్తి ఎలా సంహరించాడు ? ఈ అద్భుతగాథను సవిస్తరంగా వినాలి అనుకుంటున్నాం. నువ్వు బహు శ్రుతుడివి. మంచి వక్తవు. కాబట్టి దయచేసి వివరంగా చెప్పు. దైవికంగా నువ్వు మాకు కలిశావు. మూర్ఖుడితో సంయోగం విషంకంటే భయంకరం. నీవంటి విజ్ఞుడితో కలయిక అమృతంతో సమానం.

*మూర్ఖేణ సహ సంయోగోః విషాదపి సుదుర్జరః |*
*విజ్జేన సహ సంయోగః సుధారససమః స్మృతః ॥*

నీవంటివారు చెప్పే విలువైన విషయాలను వినడమే ఒక గొప్ప వరం, అదే మానవుడి విశిష్టత, పశువులు చూడు - తింటున్నాయి, తిరుగుతున్నాయి, శారీరకంగా సుఖం అనుభవిస్తున్నాయి. వాటికి సదసద్‌ జ్ఞానం లేదు. వివేకం లేదు. మోక్షాసక్తి లేదు. పురాణశ్రవణం లేకపోతే, నీవంటివాళ్ళను వినకపోతే మనిషికూడా వీటితో సమానం అయిపోతాడు. జంతువుల్లో కూడా లేడి జింక మొదలైన వాటికి వినడం తెలుసు. సంగీతానికి పరవశించిపోతాయి. పాముల సంగతి తెలిసిందే కదా! మనకున్న జ్ఞానేంద్రియాలైదింటా చెవి-కన్ను శుభప్రదమైనవి. వినడంవల్ల వస్తు విజ్ఞానం కలుగుతుంది. చూడటం వల్ల మనస్సు రంజిల్లుతుంది.

ఈ వినికిడి కూడా సాత్త్విక - తామస-రాజస భేదాలతో మూడు విధాలని పెద్దలు చెబుతున్నారు.

వేద శాస్తాదులను వినడం సాత్త్విక శ్రవణం.

(స్త్రీ పురుష సంబంధాత్మకమైన) సాహిత్యాన్ని వినడం రాజస శ్రవణం.

యుద్ధ వార్తలూ ఇతరుల దోషాలూ వినడం తామస శ్రవణం.

*సాత్వికం వేదశాస్త్రాది సాహిత్యం చైవ రాజసమ్‌ ।*
*తామసం యుద్ధ వార్తా చ పరదోషప్రకాశనమ్‌ ॥*

అంతేకాదు, మిత్రమా ! ఈ సాత్త్విక శ్రవణంలో ఉత్తమ - మధ్యమ - అధమ భేదాలున్నాయి. మోక్షఫలాన్ని అందించే విషయాలను వినడం ఉత్తమం. స్వర్గాన్ని ఇచ్చే వాటిని వినడం మధ్యమం. భోగఫలాన్ని సమకూర్చే అంశాలు చెవిని పెట్టడం అధమం.

అలాగే సాహిత్యమూ (కలయిక) మూడు విధాలు. ధర్మపత్నీ వృత్తాంతరూపమైన సాహిత్యాన్ని (భార్యాభర్తల కథలు) వినడం ఉత్తమం. వేశ్యా వృత్తాంతాలను చెవి కెక్కించుకోవడం మధ్యమం. అక్రమ సంబంధాల కథలు ఆలకించడం అధమం.

తామస శ్రవణంలోనూ ఈ భేదాలు ఉన్నాయి. ధర్మ సంస్థాపనకోసం దుష్టులనూ పొపాత్ములనూ సంహరించే యుద్ధగాథలు వినడం ఉత్తమం.

కౌరవ పాండువుల్తాగా ఏదో ఒక విద్వేషంతో ఒకరిని ఒకరు చంపుకునే చరితలను చెవిని పెట్టడం మధ్యమం. అకారణ కలహాలకూ నిర్నిమిత్త వివాదాలకూ చెవులప్పగించడం అధమం.

కాబట్టి, ఓ మహామతీ ! సూతమహర్షీ ! పాపాలను పోగొట్టి, పుణ్యాలను సమకూర్చి శ్రోతలను బుద్ధిమంతులుగా చేసేది పురాణ శ్రవణమే. వ్యాస మహర్షినుంచి నువ్వు తెలుసుకున్న ఈ మధుకైటభ వృత్తాంతాన్ని మాకూ వినిపించు. దుష్టశిక్షణకోసం జరిగిన యుద్ధం కనుక దీన్ని వినడం ఉత్తమమే.

శౌనకుడు ఇలా అడిగేసరికి సూతుడికి తనువంతా పులకించింది. ఆనందంతో కన్నులు చెమర్చాయి.

శౌనకమహామునీ ! ఇంకా వినాలి, అనుకుంటున్నారు కనుక మీరంతా ధన్యులు. ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి అనుకుంటున్నాను కనుక నేనూ ధన్యుణ్ణే. సరే,

మధుకైటభుల కథ చెబుతున్నాను.
ఏకాగ్రచిత్తంతో ఆలకించండి.

*(రేపటి భాగంలో.... మధుకైటభుల కథ)*

               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*

♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾

*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐

ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏

🙏 శ్రీ మాత్రే నమః🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat