శ్రీ దేవీ భాగవతము - 6

P Madhav Kumar


*
*ప్రథమ స్కంధము - 2*

*లలితా సహస్రనామ శ్లోకం - 6*

*వదనస్మరమాంగల్య గృహతోరణచిల్లికా!*
*వక్త్రలక్ష్మీపరీవాహ చలన్మీనాభలోచనా!!*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

👉 *నిన్నటి భాగములో....*

🙏 ఇవి పద్దెనిమిదీ మహాపురాణాలు. వీటి పేర్లే కాకుండా వీటిలో ఉండే శ్లోకాల సంఖ్య కూడా తెలియజేశాను. విన్నారు కదా ! మరో పద్దెనిమిది ఉపపురాణాలు ఉన్నాయి. అవీ చెబుతాను, వినండి.

*సనత్కుమార-నారసింహ- నారదీయ - శివ - దౌర్వాస - కాపిల - మానవ - బెశనస – వారుణ - కాళికా - సాంబ - నంది (కృత) - సౌర - పారాశర - ఆదిత్య - మాహేశ్వర - భాగవత - వాసిష్ట* పురాణాలను ఉపపురాణాలు అంటారు. ఇన్నీ వ్రాసి ఇంకా *మహాభారతం* రచించాడు వ్యాసుడు.

🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡️

*వ్యాసులు*

మన్వంతరాలన్నింటా ద్వాపరయుగం ఉంటుంది. ప్రతి ద్వాపరం లోనూ విష్ణువే వ్యాసుడుగా జన్మించి ధర్మచింతనతో యథావిధిగా పురాణాలు రచిస్తాడు. అఖండంగా ఉన్న వేదాన్ని బహుధా (నాలుగుగా) విభజిస్తాడు. ఇది లోకహితం కోరి చేసే పని.

కలియుగంలో విప్రులు అల్పాయుష్కులుగా స్వల్చ బుద్ధులుగా ఉంటారని తెలిసే కలియుగం వచ్చినప్పుడల్లా పుణ్యప్రదమైన పురాణ సంహితను అందిస్తుంటాడు వ్యాసుడు. వేదశ్రవణాధికారం కొందరికి లేదు. కాబట్టి వారి హితంకోరి ఇలా పురాణాలను రచించాడు.

మహామునులారా !

ఏడవ వైవస్వతమన్వంతరంలో ఇప్పుడు ఇది ఇరవై ఎనిమిదవ ద్వాపరం నడుస్తోంది. అందుకని సత్యవతీ సుతుడుగా వ్యాసుడు జన్మించాడు. ఈ ఇరవైయెనిమిదవ వ్యాసుడే నా గురువు. మహానుభావుడు. లోకైక హితుడు. ధర్మవేత్తలలో అగ్రగణ్యుడు. రేపు ఇరవై తొమ్మిదవ ద్వాపరం వస్తే *ద్రౌణి* - వ్యాసుడవుతాడు. ఇప్పటికి ఇరవైయేడుగురు వ్యాసులు గడిచిపోయారు. వారంతా పురాణ సంహితలు రచించినవారే.
ఈ మాటలకు మునీశ్వరులు కొందరు ఆశ్చర్యచకితులయ్యారు. గడిచిన ద్వాపరయుగాలలో పురాణకర్తలైన ఆ వ్యాసుల్ని గురించి క్లుష్తంగానైనా చెప్పమని అడిగారు.

మునిసత్తములారా !

మొదటి ద్వాపరంలో స్వయంభువుడే స్వయంగా వేదవిభజన చేశాడు. రెండవ ద్వాపరంలో ప్రజాపతి వ్యాసుడయ్యాడు. మూడవ ద్వాపరంలో ఉశనసుడు, నాల్గవ ద్వాపరంలో  బృహస్పతి, అయిదవ ద్వాపరంలో సవిత (సూర్యుడు), ఆరు లో మృత్యువు, ఏడులో మఘవుడు, ఎనిమిదిలో వసిష్టుడు, తొమ్మిదిలో సారస్వతుడు, పదిలో త్రిధాముడు, పదకొండులో త్రివృషుడు, పన్నెండులో భరద్వాజుడు, పదమూడులో అంతరిక్షుడు, పధ్నాలుగులో ధర్ముడు, పదిహేనులో త్రయ్యారుణి,  పదహారులో ధనంజయుడు, పదిహేడులో మేధాతిథి, పద్ధెనిమిదిలో వ్రతి,  పంతొమ్మిదిలో అత్రి, ఇరవైలో  గౌతముడు, ఇరవైయొకటిలో ఉత్తముడు - వ్యాసులయ్యారు. అటుపైని వరసగా వేనుడు, సోముడు, తృణబిందువు, బార్గవుడు, శక్తి జాతుకర్ణ్యుడు వ్యాసులుగా కర్తవ్యం నిర్వహించారు. ఇప్పటి ఇరవై ఎనిమిదవ ద్వాపరానికి కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు. ఈయన చెప్పిన పురాణాలనే నేను విన్నాను.

ఈ కృష్ణద్వెపాయనుడికి శుకుడు అనే కుమారుడు ఉన్నాడు. అరణి సంభవుడు. (ఆరణి - యాగాగ్నిని మధించే కొయ్య పాత్ర) గొప్ప వైరాగ్యభావ సంపన్నుడు. వ్యాసుడు దేవీభాగవతం రచించి కొడుకుతో చదివించాడు. అప్పుడే వ్యాసుడి ముఖతః నేను దీన్ని విని యథాతథంగా గ్రహించాను.

కరుణాసముద్రులు మా గురువుగారు. శుకుడి సందేహాలకు సమాధానాలుగ ఈ దేవీభాగవత రహస్యాలన్నీ విడమర్చి చెప్పారు. అయోనిజుడైన ఆ బుద్ధిమంతుడితో పాటు నేనూ వీని ఆయా విశేషాలు కొంత తెలుసుకోగలిగాను.

మునిపుంగవులారా!

ఈ దేవీభాగవతం ఒక కల్పవృక్షం. దీని ఫలాలను ఆస్వాదించాలన్న కోరికతో, సంసార మహాసముద్రాన్ని తరించాలనే వాంఛతో ఈ ఆఖ్యానరసాలయాన్ని ప్రేమగా, శ్రద్ధగా శుకుడు అంతటివాడు ఆలకించాడు. అద్భుతమైన ఈ పురాణాన్ని వింటే భూలోకంలో ఎవరికైనా ఇంక కలి భయమంటూ ఏదీ ఉండదు గాక ఉండదు.

భగవతీనామాంకితమైన ఈ మనోహరపురాణాన్ని నిజంగా వినాలనే కోరికతో కాకపోయినా ఏదో ఒక వంకతో విన్నప్పటికీ చాలు ఎంతటి పాపాత్ముడైనా, ఆచారదూరుడైనా పుణ్యాత్ముడవుతాడు. ఇహాలోకంలో సకల భోగాలూ పొంది, పరలోకంలో యోగీశ్వరులకు మాత్రమే దక్కే సుస్థిర స్థానాన్ని గెలుచుకుంటాడు. ఇక నిరంతరం శ్రద్దగా వినేవారి హృదయకుహరంలో ఆ నిర్గుణ స్వరూపిణి స్వయంగా తానే నిత్యనివాసం చేస్తుంది. భవసాగరాన్ని తరించడానికి నావగా వాగ్రూపంలో అందివచ్చిన ఈ పురాణాన్ని, మానవుడుగా పుట్టి వినకపోతే అంతకంటే మూఢుడు ఉంటాడా! చెవులున్నాయి కదా అని ఎప్పుడూ పరాపవాదాలనే ఇష్టంగా వింటూ, ఇలాంటి పురాణ నాదాలను పొరపాటునైనా వినకపోతే ఎవరికిట నష్టం ! అంతకంటే మందబుద్దులుంటారా!.
     *(అధ్యాయం -3, శ్లోకాలు -43)*

*యః ప్రాప్య కర్ణయుగలం పటు మానుషత్వే*
*రాగీ శృణోతి సతతం చ పరాపవాదాన్‌*
*సర్వార్ధదం రసనిధిం విమలం పురాణం*
*నష్ట కుతో న శృణుతే భువి మందబుద్దిః ॥*

*వ్యాసుడి పుత్రకాంక్ష*

శ్రద్ధగా ఆలకిస్తున్న శౌనకాదులకు ఒక చిన్న సందేహం కలిగింది. దాపరికం లేకుండా అడిగారు.

సూతమహర్షీ! వ్యాసుడికి శుకుడనే కుమారుడు ఉన్నాడన్నావు. అతడు ఎలా జన్మించాడు? తల్లి ఎవరు? ఎటువంటివాడు? ఈ సంహితను ఎలా పఠించాడు? శుకుడు అయోనిజుడు (గర్భవాసం లేకుండా జన్మించిన వాడు) *అరణి సంభవుడు* అనికదా అన్నావు. అది ఎలా జరిగింది ? శుకుడు మహాతపస్వి అనీ, పుట్టుకతోనే మహాయోగి అనీ విన్నాం. అతడు ఈ విపుల పురాణాన్ని ఎలా, ఏ విధానాన చదివాడు అనేది మా అందరి సందేహమూను. నువ్వు సౌమ్యుడవు కనక అడిగాము. దయచేసి వివరించవూ ! అని అభ్యర్థించారు. అప్పుడు సూతుడు -

మునులారా ! పూర్వకాలాన వ్యాసుడు సరస్వతీ నదీతీరాన ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నాడు. అప్పట్లో పిచ్చుకల జంట ఒకట వ్యాసుడికి రోజూ కనిపించేది. వాటి పరస్పరానురాగం ఆశ్చర్యపరిచేది. వాటి గూడు, ఆ గూటిలో అప్పుడే గ్రుడ్డువిచ్చి జన్మించిన పిచ్చుక పిల్ల, వ్యాసుడి మనస్సును ఆకట్టుకున్నాయి. ఇంకా తోకమొలవని పిచుక పిల్ల, దాని ఎర్రని నోరు, దానికి ఏదో తెచ్చి తినిపించాలని శ్రమపడుతున్న ఆ పిచుక దంపతులు, అది నోరు తెరిస్తే తినుబండారాన్ని నోటితో నోటికి అందిస్తున్న దృశ్యం, తమ రెక్కలతో దాన్ని సుతారంగా పాదువుతూ ముద్దులలో ముంచెత్తుతూ పులకించిపోతున్న ఆ మాతాపితల ప్రేమ చూసి వ్యాసుడు చాలా ముచ్చట పడ్డాడు.

సంతానమంటే పక్షులకే ఇంత ప్రేమ ఉంటే ఇంక మనుష్యుల సంగతి చెప్పాలా ! వివాహం చేసుకుని ఒకరినొకరు చూసుకుని సంతృప్తి చెందే దంపతులు వార్ధక్యంలో పరిచర్యకోసమైనా పుత్రుణ్గి కోరుకుంటారు. సంపాదించి సుఖపెడతాడని ఆశిస్తారు. ఏది చేసినా చెయ్యకపోయినా చితికి నిప్పు అంటించి ఉత్తర క్రియాలన్నా చేస్తాడు గదా ! పోనీ గయలో శ్రాద్ధం పెడతాడు గదా ! సంసారంలో ఎన్ని సుఖాలు ఉన్నా కన్న కొడుకుని తనివితీరా కౌగిలించుకోవడం, లాలించడం అనేవి ఉత్తమోత్తమ సుఖాలు,

*అపుత్రస్య గతిర్నాస్తి* అన్నారు. ఉత్తమలోకాలను సాధించిపెట్టేది పుత్రుడే. పుత్రవంతుడికే స్వర్గమని శాస్త్రాలు చెబుతున్నాయి. అది ప్రత్యక్ష విషయమే. కొడుకులు లేనివాడు మరణకాలంలో మరీ విచారిస్తాడు. ఇల్లూ వాకిలీ నగానట్రా ఇంత సంపాదించాను, ఇదంతా ఎవడు తన్నుకుపోతాడో గదా అని మరింత దిగులు పడతాడు. దుఃఖిస్తాడు. మనశ్శాంతిని కోల్పోతాడు. భగవన్నామం జపిస్తూ హాయిగా ప్రాణాలు వదలలేడు. అందుచేత అతడికి దుర్గతులే తప్ప ఉత్తమగతులు ఉండవు.

ఈ ఆలోచనలతో వ్యాసుడి మనస్సు వికలమయ్యింది. వేడిగా నిట్సుర్చాడు, కాసేటికి  తేరుకుని ఒక నిశ్చయానికి వచ్చాడు. పుత్రప్రాప్తికోసం తపస్సు చెయ్యాలని గట్టిగా సంకల్పించుకున్నాడు. ఆశ్రమం వదిలి మేరుపర్వతం చేరుకున్నాడు.

ఏ దేవుడు నాకోరిక తీరుస్తాడు? విష్ణువా ? రుద్రుడా ? ఇంద్రుడా ? బ్రహ్మదేవుడా ? సూర్యుడా? వినాయకుడా ? కార్తికేయుడా ? దిక్పాలకులా ? ఎవరు ? - వ్యాసుడు నిశ్చయించుకోలేక పోతున్నాడు. అంతలో - అనుకోకుండా నారదమహర్షి అటువైపు వచ్చాడు. వీణ మీటుకుంటూ వచ్చాడు. వ్యాసుడు భక్తితో అతిథి మర్యాదలు చేశాడు. కుశల ప్రశ్నలు అయ్యాయి. వ్యాసుడి ముఖంలో కనిపస్తున్న ఆందోళనను నారదుడు గమనించాడు. కారణమేమిటని అడిగాడు. వ్యాసుడు తన మనస్సులో ఉన్నది చెప్పాడు. ఏ దేవుణ్లి ప్రార్ధించాలో తేల్చుకోలేకుండా ఉన్నాను, సలహా చెప్పమన్నాడు.

వ్యాసమహర్షీ ! వెనకటికి ఒకనాడు ఇదే ప్రశ్నను మా తండ్రి (బ్రహ్మదేవుడు) విష్ణుమూర్తిని అడిగాడుట. విష్ణుమూర్తి ఎప్పుడూ ధ్యానంలోనే ఉండటాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి. ఇలా అడిగాడు -

దేవదేవా ! జగత్పతీ ! త్రికాలజ్ఞా ! నువ్వు దేనిని ధ్యానిస్తున్నావు ? ఈ తపస్సు ఎందుకోసం ? సర్వజగత్పతివికదా | నువ్వు తపస్సు చెయ్యడమేమిటి ! చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ నాభికమలం నుంచి పుట్టిన నేను సృష్టికర్తనయ్యానే. నీకంటే అధికుడెవడు ? నువ్వే కర్తవు, నువ్వే హర్తవు. నువ్వే కారణం, నువ్వే కార్యం. నీ ఇచ్చామాత్రంచేత ఈ జగత్తును నేను సృష్టిస్తున్నాను. కాలాంతరంలో నీ ఆజ్ఞ మేరకు శివుడు సంహరిస్తున్నాడు. సూర్యచంద్రులూ అష్టదిక్పాలకులూ నీమాట ప్రకారం విధులు నిర్వహిస్తున్నారు. అటువంటి నువ్వు ఏ దేవుణ్ణి ధ్యానిస్తున్నావు ? ఇది నాకు తెమలని సందేహంగా ఉంది. పుత్రుణ్ణి మాత్రమే కాదు నీకు భక్తుణ్ణి నేను. దయచేసి సమాధానం చెప్పు. మహాత్ములకు గోప్యం ఉండదంటారు గదా! *(మహతాం నైవ గోప్యం హి ప్రాయః కించిదితి స్మృతిః - 43).

సృష్టికర్త సందేహాన్ని తీర్చడం తన కర్తవ్యం అనుకున్నాడు విష్ణుమూర్తి, చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ కొడుకుకి సమాధానం చెప్పాడు.

నాయనా, విరించీ! శ్రద్ధగా విను. నా మనస్సులో ఉన్నది చెబుతున్నాను. నువ్వూ నేనూ శివుడూ సృష్టి - స్థితి - లయ కారకులమని ప్రపంచమంతా అనుకుంటోంది. కానీ ఈ విధులను మనతో నిర్వర్తింపజేస్తున్నది (ఆదిపరా) శక్తి అని వేదవేత్తలకు మాత్రమే తెలుసు. నీలో ఉన్నది రాజసశక్తి, అదే నీతో జగత్సృష్టి చేయిస్తోంది. నాలో ఉన్నది సాత్త్విక శక్తి. జగత్పాలన చేయిస్తోంది. రుద్రుడిలో ఉన్నది తామసశక్తి. సంహారం చేయిస్తోంది. అది లేనివేళ నువ్వు సృష్టించలేవు, నేను పాలించలేను, శివుడు సంహరించలేడు. మనం ముగ్గురమూ శక్తి అధీనంలోనే ఉన్నాం. నేను పరతంత్రుణ్ణి. ఈ శేషశయ్యపై నిద్రిస్తూంటాను.

సమయం వచ్చినప్పుడు లేస్తూంటాను, తపస్సు చేస్తూంటాను. అంతా శక్తి అభీష్టం. ఒకప్పుడు లక్ష్మీదేవితో సుఖంగా విహరిస్తూ ఉంటాను. మరొకప్పుడు రాక్షసులతో ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటాను. సర్వలోక భయంకరమైన ఆ యుద్దాలు కొన్ని దారుణాలు సుమా ! నీకు గుర్తుందా? ప్రళయ మహాసముద్రంలో అయిదువేల సంవత్సరాలపాటు మధుకైటభులతో బాహాబాహి పోరాడాను. ఆ యుద్ధం నీ కళ్ళ ఎదుట జరిగిందే కదా | మహాదేవి అనుగ్రహంవల్ల వాళ్లను సంహరించగలిగాను. ఇప్పుడు ఇలా నన్ను అడుగుతున్నావంటే, అప్పుడు తెలుసుకోలేకపోయావన్నమాట. పరాత్పరమైన కారణం ఆ శక్తి స్వరూపమే. నా అవతారాలకన్నింటికీ అదే కారణం. నా ప్రమేయం ఏమి లేదు. పశుజాతిలో జన్మించాలని ఎవడైనా కోరుకుంటాడా చెప్పు! మత్స్యవరాహాదిరూపాల్లో నేను జన్మించలేదూ ! లక్ష్మీదేవితో విహారాన్ని వదులుకోలేదూ! చల్లని మెత్తని శేషశయ్యను వదులుకొని పక్షిమూపున కూర్చుని యుద్దాలు చేశాను.

చతుర్ముఖా ! మరిచిపోయావా ! ఒకప్పుడు వింటినారికి తెగి నా శిరస్సు ఎటో ఎగిరిపడింది. అప్పుడు నువ్వే కదా గుర్రపు తల తెచ్చి శిల్పివరుడితో కలిసి అతికించావు. అందరూ *హయగ్రీవుడు* అన్నారు.

భేషజాలెందుకు, నన్ను నేను ఎరుగుదునుగదా! స్వతంత్రుణ్ణి కాదు. శక్తి పరాధీనుణ్ణి. ఆ శక్తినే నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను. ఇంతకన్నా నాకు తెలిసింది లేదు - అని విష్ణుమూర్తి సమాధానం ముగించాడుట. అని నారదుడు.....

వ్యాసమహర్షీ! మా తండ్రి బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని ఇలా నాకు తెలియజేశాడు. అందుచేత నువ్వు కూడా నీ హృదయపద్మంలో ఆ దేవీపాదపద్మాలను ధ్యానించు. నీ కోరిక నెరవేరుతుంది – అని నారదుడు సలహా చెప్పేసరికి వ్యాసుడు కుదుటపడ్డాడు. మేరుపర్వత శిఖరంమీద నిశ్చలంగా తపస్సుకి కూర్చున్నాడు.
       *(అధ్యాయం - 4, శ్లోకాలు - 69)*

సూతుడు చెప్పిన ఈ వ్యాస - నారద సంభాషణను శ్రద్ధగా విన్న మునులకు మరో సందేహం వచ్చింది. సర్వకారణకారణుడూ జగన్నాథుడూ అయిన విష్ణుమూర్తికి శిరస్సు తెగిపడటం ఏమిటి, గుర్రపు తలను తెచ్చి అతకడం ఏమిటి, హయగ్రీవుడు కావడం ఏమిటి - ఇదంతా చాలా విడ్డూరంగా ఉంది, వివరంగా చెప్పమని ప్రార్థించారు.
సూతుడు అందుకున్నాడు.

     *(రేపు హయగ్రీవ వృత్తాంతము)*

               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*

♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾

*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*

*భావము:* 💐

ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏

🙏 శ్రీ మాత్రే నమః 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat