బ్రహ్మదేవుడు ఆదిలో ఐదు శిరస్సులతోవుండేవాడు. ఒకానొకప్పుడు శివుని
శాపానికి లోనై తన ఐదవ
తలను , బ్రహ్మ పదవిని కోల్పోయాడు.
బ్రహ్మ తనకి వచ్చిన ఆపదనుండి విముక్తి మార్గాన్ని సూచించమని మహ ఋషుల
సహాయం కోరాడు. అప్పుడా ఋషులంతా జనకమహారాజు
శ్రీ మహావిష్ణువు ని పూజించిన స్ధలానికి వెళ్ళి ధ్యానిస్తే
శాపవిముక్తి కలుగుతుందని వారు బోధించారు. జనకుడు
శ్రీ మహావిష్ణువు ని పూజించిన స్ధలం తొండమండలం లో అరసర్ కోయిల్ అని
తెలుసుకుని, ఆస్ధలానికి
వెళ్ళి శ్రీ మహావిష్ణువు ని
పూజించి శాప విముక్తుడవడమే కాకుండా పోగొట్టుకున్న బ్రహ్మలోకాన్ని కూడా తిరిగి పొందాడు బ్రహ్మదేవుడు.
బ్రహ్మ పూజించిన ఆ స్ధలం పలు పురాణ గాధలతో ముడిపడివున్నది.
భూలోకానికి వచ్చిన శ్రీ మన్నారాయణుడు ,
పాలారు నదీతీరాన గల
ఒక పెద్ద అశ్వథ్థవృక్షం క్రింద నివాసం ఏర్పర్చుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న జనక మహారాజు సంతానం కోసం , నిత్యం క్రమం తప్పకుండా ఒకే సమయానికి వచ్చి పూజించేవాడు. ఒక రోజు ఆలస్యంగా రావడం జరిగింది. వచ్చి చూడగా అప్పటికే అక్కడ పూజలు జరిగిన చిహ్నాలు కనిపించాయి.
జనకుడు తన జాప్యానికి బాధ పడుతూండగా ,
' రాజా ! బాధపడకు ,సమయానికి
నీవు రాలేక పోయినందున నీకు బదులుగా నేను పూజలు పూర్తిచేశాను' అని అన్నాడు నారాయణుడు.
మహాలక్ష్మి అక్కడికి వచ్చింది. జనకుడు భక్తిశ్రధ్ధలతో పూజించకపోవడం , నారాయణుడు తనకు తానే పూజించు కోవడం
చూసి కోపించింది.
శ్రీ మన్నారాయణుడు
ఆమెను శాంత పరిచి ,
" నన్ను దర్శించ వచ్చే
భక్తులు లక్ష్మీసమేతంగా
లేననే కొఱత తోవున్నారు. అందువలన ఇక మీద నీవు కూడా ఇక్కడే వాసమేర్పర్చుకొని నన్ను
పూజించే భక్తులకు సకల
ఐశ్వర్యములతో కాపాడమని" మహాలక్ష్మి ని అక్కడే నివసింప జేశాడు.
బ్రహ్మశిరస్సును నరకిన పాపానికి శివునికి బ్రహ్మ హత్యా పాపం
చుట్టుకొంది. ఆ పాపం నుండి నివృత్తికోసం శివుడు అక్షయ
తృతీయనాడు యీ అరసర్ ఆలయాన్ని దర్శించాడు.
పరమ శివుని చూసిన పెరుందేవితాయారు 'అక్షయం' అని పలికి శివుని బ్రహ్మహత్యా పాపాన్ని తొలగించింది. దానికి ప్రత్యుపకారం గా పరమేశ్వరుడు తన కుమారుడైన వినాయకుని 'అక్షయపాత్ర' వినాయకునిగా యీ ఆలయంలో నివసింపచేసినట్లు
స్ధల పురాణకధ విశదీకరిస్తోంది.
ఆది కాంచిగా పిలవబడే యీ అరసర్ కోవెల గర్భగుడి లో
శ్రీవరద రాజ పెరుమాళ్
శ్రీ దేవీ ,భూదేవీల సహితంగా దర్శనం అనుగ్రహిస్తున్నాడు.
లక్ష్మీ దేవి యిచ్చిన తామర పుష్పాన్ని ఒక చేతిలో
ధరించి కమల వరదరాజ
పెరుమాళ్ గా భక్తులకు సాక్షాత్కరమిస్తున్నాడు.
కమల వరదరాజ పెరుమాళ్ కంచి వరదుని కంటే పూర్వమే వెలసిన స్వామి. కంచి వరద రాజ పెరుమాళ్ ఆలయ నిర్మాణానికి మునుపే
బ్రహ్మ దేవుడు ఇక్కడినుండి
ఇసుకను తీసుకుని వెళ్ళి
యాగశాల నిర్మించి అక్కడ పూజలు చేశాడు.అందుకే
అరసర్ పెరుమాళ్ ఆలయం
ఆది కంచిగా పిలవబడింది.
ఇక్కడ వున్న ప్రత్యేక ఆలయంలో ముగురమ్మల శక్తి పీఠం మీద పెరుందేవి తాయారు పద్మాసనాశీనురాలై భక్తులకు దర్శనం ప్రసాదిస్తోంది. సుందర
మహాలక్ష్మి గా భక్తుల కోరికలను నెరవేరుస్తున్నది.
ఈ ఆలయంలోని విగ్రహాలు అత్యంత శిల్ప కళా చాతుర్యం తో మలచబడినాయి.
ప్రత్యేక సన్నిధిలో వుండే లక్ష్మీ దేవి కుడికాలు పాదానికి ఆరు వ్రేళ్ళు వుండడం విశేషం.
ఆదివారం ,మంగళవారం
శుక్రవారం రోజులలో విశేష పూజలు జరుగుతాయి.
తమిళ ఉగాదినాడు, చైత్ర పౌర్ణమికి ,అక్షయ
తృతీయనాడు , ఉత్తర
ఫల్గుణీ దినాన ఉత్సవాలు
వైభవోపేతంగా జరుపుతారు.
శ్రీ మాత్రే నమః🙏🏻