*సాధకుడు తన మానస మండలాన్ని తానే కల్పించుకొని ఆ శ్రీహరిని* 🌹
*దేవతల పూజా విధానం :*
విద్వాంసుడైన దేశికుడు ముందు భగవంతుని ధ్యానించాలి. తరువాత వాయువ్యం వైపు తిరిగి 'యం' అనే బీజమంత్రాన్ని చదువుతూ శిష్యుల క్షేమాన్ని ఆలోచించాలి. ఆగ్నేయం వైపు తిరిగి 'రం' అనే బీజమంత్రం ద్వారా తమ మనస్తాపాలను తొలగించే విధానాన్ని ఆలోచించాలి. వారుణీ దిశగా తిరిగి 'వం' అనే బీజ మంత్రం ద్వారా హృదయస్థితినీ, ధర్మాభిరుచిని విచారించుకోవాలి.
🌺తరువాత దేశికుడు అభేద చింతనాన్ని చేయాలి. అభేద జ్ఞానమనగా ఆత్మతేజాన్ని పరమాత్మ తేజంతో ఏకం చేసే సాధనను చేయగలిగే తెలివి. అపుడు ఓంకారాన్ని జపిస్తూ వాయు, అగ్ని, నీరు , పృధ్వీ,ఆకాశం తత్త్వాలను ధ్యానం చేయాలి. అలా చేయగా చేయగా సాధకునికి వాటిపై విజయం ప్రాప్తిస్తుంది. తరువాత శరీరమంతా జ్ఞానంతో నిండిపోయి క్షేత్రజ్ఞుడవుతాడు.
🌺మండలాదికములను నిర్మించుకోవడం సాధ్యం కానపుడు సాధకుడు తన మానస మండలాన్ని తానే కల్పించుకొని ఆ శ్రీహరిని పూజించుకోవచ్చును. శరీరంలోనే బ్రహ్మాది తీరాలుంటాయని శాస్త్రాల్లో చెప్పబడింది. మనిషి మానసమండలానికి కూడ నాలుగు ద్వారా లుంటాయి. చేతిని పద్మంగానూ వ్రేళ్ళనుపద్మపత్రాలుగానూ, హస్తమధ్యాన్ని కర్ణిక గానూ, గోళ్లను కేసరాలుగానూ భావించుకొనే సాధకుడు తన హస్తరూపియైన కమలంలోనే సూర్య, చంద్ర, ఇంద్ర, అగ్ని, యమాది పరివేష్టితుడైన శ్రీహరిని కల్పించుకొని పూజించుకోవచ్చును.
🌺ఇక పూజానంతరము గురువు లేదా దేశికుడు తన చేతిని శిష్యుని తలపై పెట్టాలి. ఈ చేతిలోనే విష్ణువుంటాడు కాబట్టి ఆ హస్త స్పర్శ మాత్రాననే శిష్యుని పాపాలూ, అజ్ఞానమూ కూడా పటాపంచలై పోతాయి. అపుడు గురువు శిష్యుని పూజించి నూతన నామకరణం చేసి తనతో బాటు శిష్యుని కూడా ఆధ్యాత్మిక సాధనల దారిలో నడవాలి.