త్రేతాయుగంలో అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరాముడు సీతాదేవి, హనుమంతులతో వన విహారమునకై వచ్చి, ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ఆనందభరితుడై ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి నిశ్చయించారు. ఈ విషయమై అరణ్య ప్రాంతములోని మహర్షులను సంప్రదించగా వారు సంతోషించి శివలింగ ప్రతిష్ఠాపన కోసం సుముహూర్తాన్ని నిర్ణయించారు.
అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుని కాశీ క్షేత్రమునకు వెళ్ళి గొప్ప శివలింగమును తీసుకొని రావలసినదని ఆజ్ఞాపిస్తారు. ఆంజనేయుడు ఆకాశమార్గాన కాశీక్షేత్రానికి వెళ్ళగా, ఈశ్వరుడు నూటొక్క శివలింగముల రూపములో దర్శనమిచ్చాడు. అతడు పరమేశ్వరుని ప్రార్థించి నూటొక్క శివలింగములను తీసుకొని బయలుదేరాడు.
ఇక్కడ మహర్షులు నిర్ణయించిన సుముహూర్తము సమీపిస్తుండగా శ్రీరాముడి పరమేశ్వరుని ప్రార్థింపగా ముహూర్త సమయమునకు ఈశ్వరుడు ప్రత్యక్షమై శివలింగ రూపమును ధరించాడు. శ్రీసీతారామచంద్రులు ఆ శివలింగమును ప్రతిష్ఠించి అభిషేకించారు. అందువలన ఈ స్వామికి "శ్రీరామలింగేశ్వరస్వామి" అని పేరు వచ్చింది.
కీసరగుట్టపై వున్న ఆంజనేయ స్వామి విగ్రహము
తరువాత హనుమంతుడు 101 శివలింగములను తీసుకువచ్చి, అప్పటికే ప్రతిష్ఠ జరగడంతో ఆవేశముతో తాను తెచ్చిన శివలింగములను తోకతో విసిరివేసెను. ఆ శివలింగాలన్నీ పరిసర ప్రాంతములలో అక్కడక్కడా పడినవి. హనుమంతుని శాంతింపజేయుటకు ఈ క్షేత్రము ఆచంద్రతారార్కం అతని పేరుమీద 'కేసరిగిరి' గా ప్రసిద్ధిచెందుతుందని ఆశీర్వదించెను. హనుమంతుడు శాంతించి తాను తెచ్చిన శివలింగములలో ఒకదానిని స్వామివారి వామభాగములో ప్రతిష్ఠించాడు. అదే మారుతీ కాశీ విశ్వేశ్వరాలయము. కాలక్రమేణా కేసరిగిరి క్షేత్రము కీసరగుట్ట'గా రూపాంతరం చెందింది. ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖముగా ఉండుట విశేషము.
చారిత్రిక ప్రాముఖ్యత
చారిత్రక పరిశోధకుల అభిప్రాయము ప్రకారం క్రీ.శ. 4వ శతాబ్దం ఉత్తరార్ధం నుండి 7వ శతాబ్దం పూర్వార్థం వరకు ఆంధ్రదేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలించిన విష్ణుకుండిన రాజవంశమునకు కీసరగుట్టతో సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. వీరి రాజముద్రిక లంఘించు సింహం (కేసరి)
కీసరలో పురావస్తు శాఖవారి ఫలకము
విష్ణుకుండినులు మొదట ఇంద్రపురిని (నేటి నల్గొండ జిల్లా రామన్నపేట మండలంలోని తుమ్మలగూడెం) రాజధానిగా చేసుకొని ప్రజారంజకంగా పరిపాలన చేశారు. కీసరగుట్ట ప్రాంతం వారి సైనిక స్థావరం. ఈ ప్రాంతంలో పురావస్తు శాఖవారి త్రవ్వకపు పరిశోధనలలో 3 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఒక శిథిలమైన కోట, భవనాలు, ఆభరణాలు, అలంకార వస్తువులు, నాణెములు, మట్టి పాత్రలు, యజ్ఞ కుండాలు వెలుగుచూశాయి. ఈ వంశంలోని మొదటి గోవింద వర్మ బలపరాక్రమ సంపన్నుడై అనేక రాజ్యాలను జయించి బౌద్ధారామ విహారాలను, చైత్యములను, దేవాలయములను నిర్మించి ప్రసిద్ధిచెందినట్లుగా ఇంద్రపురి (ఇంద్రపాల నగరం) లో లభించిన తామ్రశాసనం ద్వారా తెలుస్తోంది. విష్ణుకుండినులు తెలుగుభాషను అధికార భాషగా మొట్టమొదట గుర్తించినట్లు ఇక్కడ లభించిన శాసనాల ద్వారా తెలుస్తున్నది.
క్రీ.శ. 17వ శతాబ్దంలో గోల్కొండ కుతుబ్ షాహీ వంశంలోని అబ్దుల్ హసన్ తానీషా నవాబు వద్ద మహా మంత్రులుగా ఉన్న అక్కన్న, మాదన్నలు కేసరిగిరి శ్రీరామలింగేశ్వరస్వామిని దర్శించి, ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రముగా అభివృద్ధి చేయదలచి హిందూ మహమ్మదీయ సమ్మిళిత సంప్రదాయం ఉట్టిపడేలా ఒక దేవాలయాన్ని నిర్మించారు. దానిలో శ్రీ లక్ష్మీనృశింహస్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ దేవాలయం వెనుక ఒక ఏకశిలా విజయస్థూపం ఉంది. ఈ స్తంభంపై మత్స్య, కూర్మ, వరాహ, గణపతి, ఆంజనేయ విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ గుట్టపైన బండ రాతి పై అనేక శివ లింగాలు ఉన్నాయి. ఉత్సవ సమయంలో వీటి నన్నిటిని నూనెతో అభిషేకిస్తారు.
కీసరలో బయల్పడిన శతాబ్దాల నాటి కట్టడాల పునాదులు
చరిత్రకెక్కని మరొక విశేషము ఇక్కడున్నది. అదేమనగా ఈ గుట్ట పైన, ప్రక్కనున్న గుట్టపైన వృత్తాకారంలో అతి పెద్ద ఇటుకలతో కట్టిన బౌద్ధ స్తూపాల వంటి కట్టడాలు కనిపిస్తాయి. అవి చాల వరకు శిథిలమై పోతున్నాయి. అదే విధంగా కీసర గుట్ట ప్రక్కన వున్న మరొ గుట్టపై ఒక పెద్ద ద్వారము కట్టబడి ఉంది. అది ముస్లిం వాస్తును ప్రతిబింబిస్తున్నది. దీనిని నిజాం ప్రభువుల ఉద్యోగులైన అక్కన్న మాదన్నలు కట్టించినట్టుగా తెలియు చున్నది. ఈ ప్రాంగణంలో అక్కన్న మాదన్నలు కట్టిన మరో రామాలయము కూడా ఉంది.
క్షేత్ర విశిష్టత
కీసర గుట్టలో వేద సంస్కృత పాఠశాల : దీనిని తిరుమల తిరుపతి దేవస్థానములు 1981 సంవత్సరము నుండి నిర్వహించుచున్నది. ఇక్కడ గురుకుల పద్ధతిలో కృష్ణ యజుర్వేదము, సంస్కృత శాస్త్రములు బోధింపబదుచున్నవి. గురుకుల విద్యాలయము : ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల సంస్థ 1972 సంవత్సరంలో ఒక సంస్థను ప్రారంభించి, 1980 లో డా. మర్రి చెన్నారెడ్డి గారు పాఠశాలకు శంకుస్థాపన చేశారు.
పూజలు
కీసర, కీసరగుట్ట లేదా కేసరిగిరి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం. కీసర, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 25 కి.మీ దూరములో ఉంది. ఇక్కడ ఉన్న అతి పురాతన కీసరగుట్ట శివుని ఆలయమునకు ప్రసిద్ధి. "మహాశివరాత్రి" పండుగ రోజు ఆలయమును దర్శించుటకు రాష్ట్రము నలుమూలలనుండి భక్తులు విచ్చేయుదురు. ఈక్షేత్రము జంటనగరాలకు చాల దగ్గరగా వున్నందున భక్తులు విశేషంగా నిత్యము వస్తుంటారు.
వసతులు
తిరుమల... తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన 26 గదుల ధర్మశాల ఉంది. ఆలయ కార్యాలయంలో సంప్రదించి అద్దెకు తీసుకోవచ్చు. పర్యాటకాభివృద్ధి సంస్థ వారు నిర్మించిన హరిత హోటల్ ఉంది. ఇందులో భోజనం, వసతి సదుపాయం ఉంది. జిల్లా పరిషత్ వారు, ఆర్ అండ్ బి వారు నిర్మించిన గదులు కూడా ఉన్నాయి. ఆర్య వైశ్య నిత్యాన్నదాన సత్రం ఉంది. బ్రాంహణులకు నిత్యాన్నదాన పథకం కూడా ఉంది. 'రవాణ సౌకర్యాలు.: ఈక్షేత్రం జంట నగరాలకు అతి సమీపంలో వున్నందున జంట నగరాలలోని సికింద్రాబాద్, ఇ.సి.ఐ.ఎల్., అఫ్జల్ గంజి నుండి చాల బస్సులు ఉన్నాయి. ప్రవేటు వాహనాలు కూడా ఉన్నాయి.🙏