అన్నపూర్ణదేవి శివునికి భిక్ష ఇస్తున్న మధుర ఘటన ఎప్పుడు జరిగింది..?

P Madhav Kumar

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌿ప్రతీ ఆస్తీకునికి ఈ చిత్తరువు సుపరిచితమే. “భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి” అని 


🌸ఆది శంకరాచార్యులు కీర్తించిన అన్నపూర్ణాష్టకం అందరూ నోరారా పాడుకుని అమ్మవారి కరుణగా అన్నం తింటున్నాము.


🌿 మనలాంటి అల్పులకు అన్నం పెట్టింది అమ్మవారు సరే మరి సంపూర్ణ పరబ్రహ్మ అయిన ఈశ్వరునికి అమ్మవారు భిక్ష ఇవ్వడం ఏమిటి? 


🌸అసలేది అవసరం లేని భవుడు దేహి అని అమ్మవారిని అడగడం ఏమిటి? ఆదిభిక్షువు గా అలా ఎందుకు అవతారం ఎత్తవలసి వచ్చింది?


🌿 అంటే అంతా ఆయన లీల. శివ, శక్తి  అవిభాజ్యం, కానీ లీలావినోదంగా ఇద్దరూ కలిసి ఆడిన నాటకం ఏమిటో ఒకసారి చూద్దాం. 


🌸ఒకానొక శుభోదయంనాడు అమ్మవారు అయ్యవారు కైలాశశిఖరం మీద సుఖాశీనులై ఉండగా ఎప్పటిలాగానె పార్వతీదేవి శివుని ప్రకృతి పురుషులలో ఎవరు అధికులు అని ప్రశ్న సంధించింది. 


🌿శుద్ధసత్త్వమైన పురుషుని వలననే ప్రకృతికి అస్తిత్వం ఉన్నదని శివుడు చెప్పగా ఇరువురి మధ్య చిన్న వాదోపవాదాలు జరిగి 


🌸ఆఖరకు అమ్మవారు ప్రకృతి ప్రాభవం తెలియజేయ సంకల్పించి అమ్మవారు శక్తిని ఉపసంహారం చేసి అంతర్ధానం అవుతుంది. 


🌿దానితో పోషణ లేక లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోతాయి. కానీ తన సృష్టిలో ఉన్న జీవులన్నీ ఆకలితో అలమటిస్తుంటే 


🌸తట్టుకోలేక అమ్మవారు కాశీ పట్టణంలో తానే గరిట పట్టుకుని వండి కోటానుకోట్ల జీవులకు వండి పెట్టడం మొదలుపెట్టింది. 


🌿శివగణమంతా ఆకలికి తట్టుకోలేక హాహాకారాలు చేస్తుంటే తనను నమ్ముకున్న వారి బాధ చూడలేక 


🌸ఏ ఆకలి దప్పులు లేని నిరతి ఆనందస్వరూపుడు శివుడు భిక్షాటనకై భిక్షపాత్ర తీసుకుని కాశీకి వెళ్లి అన్నపూర్ణ చేతిలో అన్నం స్వీకరిస్తాడు.


🌿 అప్పుడు ఇద్దరిలో ఎవరూ అధికులు కారని, ప్రకృతి పురుషులిద్దరూ అన్నింటా సమానమని చాటి చెప్పి మరల కైలాశానికి వెళ్ళిపోతారు.


🌸 కాశీ లో అన్నపూర్ణగా అమ్మ శక్తి నిలుస్తుంది. లౌకికంగా చూస్తె ఏమిటి వీరు పోట్లాడుకోవడం ఏమిటి ఆధిక్యం కోసం పోటీ పడ్డట్టు అనిపిస్తుంది కానీ వారు ఆడిన నాటకం ద్వారా చెప్పబోయిన పరమసత్యం మనం అర్ధం చేసుకోవాలి.


🌿 పురుషాధిక్య ప్రపంచంలో ఎవరైనా పురుషుడే అధికుడని అనుకుని పొరబడే అవకాశం ఉండడం వలన అందరికీ తగు పాఠం చెప్పడానికి దివ్యదంపతులిద్దరూ కలిసి ఆడిన నాటకం ఇది. 


🌸శక్తి లేకపోతే స్థూల శరీరం ఉండి లాభం లేదు. ఎవరైనా శక్తి హీనుడు అంటారు కానీ విష్ణుహీనుడు, శివహీనుడు అని అనరు. 


🌿శరీరం లేని శక్తి నిరర్ధకం. శక్తి ఉన్న శరీరం శివం లేకపోతే శవం. కాబట్టి రెండూ సమపాళ్లలో ఉంటేనే మనుగడ అని చాటి చెప్పడానికి ఇద్దరిగా ఉన్న ఒక్కరు ఆడిన నాటకం. 


🌸అన్నపూర్ణ అమ్మ మహిమ గురించి మరొక రెండు సంఘటనలు చెప్పుకుని ఈ  అచ్యుతటపా ముగిద్దాం. 


🌿ఒకసారి ఆది శంకరాచార్యులవారు శిష్యులతో కూడి భిక్షాటన కు వెళ్ళినా వారికి ఆహారం దొరకలేదు. 


🌸శిష్యుల క్షుద్బాధ చూడలేక ఆచార్యులు అమ్మవారిని శరణు వేడారు. అప్పుడు ఆయన గానం చేసినదే అన్నపూర్ణాష్టకం. 


🌿అమ్మవారు ఎంతో ప్రేమగా అందరికీ వండి వడ్డించింది. అమ్మవారి అనుగ్రహంతో ఆవిడ చెప్పిన బోధవలన ఆయన ప్రస్థానత్రయానికి భాష్యం రాయడం మొదలుపెట్టారు. 


🌸ఆవిడ పెట్టిన జ్ఞానభిక్ష స్వీకరించిన ఆదిశంకరులు అత్యద్భుతమైన రచనలు చేసారు. ఇక్కడ అమ్మవారు అన్నం అంటే కేవలం భౌతికమైన ఆకలిని మాత్రం తీర్చేది కాదు జ్ఞాన పిపాసను తీర్చే అమృతతుల్యమైన జ్ఞానాన్ని భిక్షగా వేస్తుంది. 


🌿ఎలాగైతే ఆకలి తీరి శరీరానికి పటుత్వం వస్తుందో, అమ్మవారు పెట్టిన జ్ఞానభిక్ష ద్వారా ఆధ్యాత్మిక అభ్యుదయం కలుగుతుంది. జీవనం పరిపుష్టమవుతుంది. 


🌸ఒకసారి వ్యాస మహర్షి తన శిష్యకోటితో కాశీ సంచారం చేస్తూ అమ్మవారి లీల వలన వరుసగా రెండు మూడు రోజులు భిక్ష దొరకక చాలా క్లేశాలకు గురవుతారు. 


🌿తనకు భోజనం పెట్టలేని కాశీని శపించబోతే అమ్మవారు ఒక ముసలి ముత్తైదువులా అక్కడకు వచ్చి గంగా తీరాన వేదవ్యాసునికి, అతని శిష్యబృందానికి షడ్రసోపేతమైన విందు వడ్డిస్తుంది. 


🌸అటువంటి భిక్ష కేవలం అన్నపూర్ణ అమ్మ మాత్రమె ఇవ్వగలదని గుర్తించి తన అజ్ఞానానికి చింతించి అమ్మవారి పాదాలపై పడతాడు. 


🌿అప్పుడు తనకెంతో ఆప్తమైన కాశీని శపించబోయిన వ్యాసుని శివుడు కోపగించి ఇక కాశీలో అతనికి ప్రవేశం లేదని శాపవాక్కు ఇస్తారు. 


🌸అందుకే నేటికీ కూడా గంగకు ఆవలి ఒడ్డున వ్యాసకాశీ వుంటుంది. కాశీలో అమ్మవారు నిలిచి అందరికీ భోజనం పెడుతూ వుంటుంది. 


🌿అక్కడ అమ్మవారి విగ్రహాన్ని చూస్తె ఒళ్ళు గుగుర్పాటుకు గురవుతుంది. సాక్షాత్తు అమ్మవారు నిలిచి ప్రాణులందరికీ ఆహారం అందిస్తున్న క్షేత్రం అది. 


🌸లౌకికంగా మనం ఈ లీలను అన్వయించుకోదలిస్తే ఒక కుటంబం సజావుగా సాగాలంటే రెండు సమాన బండిచక్రాల్లా భార్యాభర్తలు కలిసి నడిపిస్తున్న సంసారయానం అది.


🌿 ఎవరూ అధికులు కారు. భోజనం అయిందంటే ఎంతటివారైనా తమ భార్య వండి పెట్టినదే ప్రసాదంలా స్వీకరించక తప్పదు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat