🎀తిరువహీంద్రపురం: దేవనాథన్ పెరుమాళ్, హేమాంబుజవల్లి తాయార్.
తాయార్ కు శెన్ కమలవల్లి, అమృతవర్షిణి, వైకుంఠనాయకి అని కూడా తిరునామములు ఉన్నవి. శ్రీమద్ వేదాంత దేశికులు ఇచ్చట తపస్సు చేసినారు. వారు హయగ్రీవుని అనుగ్రహం పొందుటకు గరుడోపాసనచేసి ఆయన నుంచి హయగ్రీవ మంత్రమును, హయగ్రీవుల విగ్రహమును పొందినారు. ఈయన దేవనాథన్ పెరుమాళ్ మీద చాలా గ్రంథాలు వ్రాసారు. అన్నీ (తనను నాయకిగా ఉహించుకొని) నాయక, నాయకి భావంలోనే వ్రాసారు. ఈ సన్నిధికి ఎదురుగ ఒక కొండ ఉన్నది. ఆ కొండ పేరు ఔషదగిరి. హనుమంతుడు హిమాలయాలనుంచి సంజీవపర్వతం లంకకు తీసికెళుతున్నప్పుడు, ఆ పర్వతంలోనుంచి ఒక ముక్క విరిగి ఇక్కడ పడిందట.
🎀ఇచ్చట చాలా ఔషధ మొక్కలున్నాయి. దేశికులవారు ఈ కొండమీద సన్నిధి నిర్మించి హయగ్రీవుల విగ్రహం ప్రతిష్ట చేసినారు. ఈ భూమిమీద హయగ్రీవుడి మొదటి సన్నిధి ఇదే. ఈ హయగ్రీవుడు భక్తులను అన్ని ఇబ్బందులనుంచి రక్షిస్తాడని ప్రతీతి. బ్రహ్మ ఈ క్షేత్రంలో తపస్సు చేసినాడు. అందుకే ఈ ఊరికి బ్రహ్మాచలం అనే పేరు కూడా వచ్చింది. శివుడు, ఇంద్రుడు, భూదేవి, భృగుమహర్షి, మార్కండేయమహర్షి కూడా ఇక్కడ తపస్సు చేసారు. ఒకసారి కొందరు ఋషులు శ్రీహరిని దర్శించడానికి క్షీరసాగరానికి వెళతారు. మహా విష్ణువు అక్కడ ఉండడు.
🎀వాళ్ళు అంతట వైకుంఠం వెళతారు. అక్కడ కూడా శ్రీమన్నారాయణుడు ఉండడు. అక్కడివారు ఆ ఋషులను ఈ ప్రాంతానికి వెళ్ళమని చెప్తారు. వాళ్ళు ఈ క్షేత్రానికి వచ్చి మార్కండేయుడు భూదేవిల చేత ఆరాధింపబడుతున్న స్వామిని చూసి దర్శించి సంతుష్టులౌతారు. బ్రహ్మపురాణం, స్కంద పురాణములలో ఈ క్షేత్రముయొక్క వైభవాన్ని వివరించారు. అన్ని అవతారాలలో భక్తులను రక్షించిన శ్రీహరి ఇక్కడ దేవనాథన్ పెరుమాళ్ గా ఉన్నాడు అంటారు తిరుమంగైఆళ్వార్. అనాటి కవులు ఈ క్షేత్రంయొక్క ప్రకృతి రమణీయతను గురించి చాల గొప్పగా వర్ణించారు. ఇప్పుడు ఆ ప్రకృతి మచ్చుకైనా కానరాదు.
*స్థలపురాణం:*
🎀ఒకసారి అసురులు దేవతలను ఓడించి వాళ్ళను స్వర్గంనుంచి తరిమేస్తారు. వాళ్ళందరూ ఈ క్షేత్రానికి వచ్చి తమను కాపాడమని విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. విష్ణువు వాళ్లకు అభయం ఇస్తాడు. ఇది తెలిసి అసురులు తమను గెలిపించాల్సిందిగా శివుడిని ప్రార్థిస్తారు. శివుడు వాళ్లకు అభయం ఇచ్చి వాళ్ళ తరపున యుద్ధం చేసి దేవతలను తరిమికొడతాడు. ఇది గమనించి శ్రీమహావిష్ణువు ఆసురులమీదికి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. అది చాలామంది అసురులను అంతం చేస్తుంది. దాని ధాటికి తట్టుకోలేక మిగిలిన వారందరూ శ్రీహరి శరణు వేడుతారు. అయన వాళ్లందరికీ బ్రహ్మగా, విష్ణువుగా, శివుడిగా దర్శనం ఇచ్చి కటాక్షిస్తాడు.