తిరుపార్థన్ పల్లి*
🎋శీర్హాళి నుంచి 8 కి మీ దూరంలో ఉన్న ఈ క్షేత్రం గురించి పద్మపురాణంలో వివరించబడినది. శ్రీవారి తిరునామం తామరయాళ్ కేల్వన్. స్వామివారికి పార్థసారథి అను మరి ఒక తిరునామం కలదు. అమ్మవారు: తామరై నాయకి. స్వామి అర్జునునకు, వరుణుడికి, ఏకాదశ రుద్రులకు ప్రత్యక్షమైనాడు. ఉత్సవర్ల తిరునామం కోలవిల్లి రామన్. ఇక్కడ రాముడు ధనుర్భాణాలతో పాటు శంఖు చక్రాలు, గద ధరించి ఉంటాడు. రాముడు శంఖు చక్రాలు, గద ధరించి ఉండటం విశేషం. ఈ సన్నిధిలో కృష్ణుడికి కూడా ఉత్సవ విగ్రహం ఉన్నది. ఒకే సన్నిధిలో కృష్ణుడిని, రాముడిని చూడటానికి వీలయ్యే క్షేత్రం.
*స్థలపురాణం:*
🎋అర్జునుడు తీర్థ యాత్రలు చేస్తూ ఈ ప్రాంతానికి వస్తాడు. ఆయనకు చాల దాహం వేసి చుట్టుపక్కల నీటికోసం వెతుకుతాడు. ఎక్కడా నీరు దొరకక పోయేటప్పటికీ అక్కడే తపస్సు చేస్తూ ఉన్న అగస్త్య మహామునిని నీరు అడుగుతాడు. అయన కమండలంలో కూడా నీరు ఉండదు. అగస్త్యుడికి అది కృష్ణుడి మాయ అని అర్థం అయి, అర్జునుడిని కృష్ణుడిని ప్రార్థించ మంటాడు. అర్జునిడి ప్రార్థనకు కృష్ణుడు ప్రత్యక్షమై ఆయనకు ఒక ఖడ్గాన్ని ప్రసాదిస్తాడు. అర్జునుడు ఆ ఖడ్గంతో భూమిని తవ్వగా భూమిలోనుంచి గంగా జలం తన్నుకువచ్చి కృష్ణుడి పాదాల చెంత ఆగుతుంది.
🎋పైకి తన్నుకు వచ్చిన నీరు ఒక కొలనుగా ఏర్పడుతుంది. ఆ కొలనే ఖడ్గ పుష్కరిణి నామంతో తదనంతరం స్వామివారి పుష్కరిణి అవుతుంది. దీనిని గంగా తీర్థం, విష్ణు పాద తీర్థం అని కూడా పిలుస్తారు. కృష్ణుడు అర్జునుడికి పార్థసారధిలా దర్శనం ఇచ్చి జ్ఞాన బోధ చేస్తాడు. అర్జునుడెవరో, అతని శక్తి ఏమిటో అతనికి తెలియ చేస్తాడు. కృష్ణుడు ఇక్కడ అర్జునిడికి ఉపదేశం చేశాడు కావున ఈ క్షేత్రానికి పార్థన్ పల్లి అని పేరు వచ్చింది. తమిళంలో పార్థన్ అంటే అర్జునుడు, పల్లి అంటే బడి అని అర్థం.
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజI
అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష యిష్యామి మా శుచ:II
*చరమశ్లోకానికి వ్యాఖ్యానం ప్రసాదించ బడిన క్షేత్రం.*
🎋ఉత్సవ మూర్తికి ఇక్కడ నలుగురు దేవేరులు -- శ్రీదేవి, భూదేవి, నీళాదేవీ, జాంబవతి. మాములుగా స్వామివారి పక్కన శ్రీదేవి, భూదేవి మాత్రమే ఉంటారు. ఇచ్చట నలుగురు దేవేరులు ఉన్నారు. మరి ఒక విశేషం ఏమిటంటే రాముడు ఏకపత్ని వ్రతుడు. ఇక్కడ మాత్రం నలుగురు దేవేరులతో ఉంటాడు.
🎋వరుణుడు బృహస్పతి భార్యను దొంగిలించి బ్రహ్మ పాతకం మూటకట్టుకొంటాడు. ఈ స్వామిని సేవించి తన పాతకాన్ని పోగొట్టుకుంటాడు.
🎋ఇచ్చట అర్జునునకు వేరుగా సన్నిధి ఉన్నది. ఆయన మూర్తి ఖడ్గం ధరించి ఉంటుంది.