*శంబళ నగరం కంటికి కనిపించని ఓ రహస్య నగరం* 🍁
తద్భహ్మసదనం దేవా! సేశ్వరాః క్లిన్నమానసాః
వివిశు స్తదనుజ్ఞాతాః నిజకార్యం నివేదితుమ్.
త్రిభువనజనకం సదాసనస్థం సనక సనందన సనాత నైశ్చసిధ్ధః
పరిసేవిత పాదకమలం బ్రహ్మాణం దేవతా నేముః
🌺అర్ధం:
భిన్నమనస్కులయిన దేవతలు ఇంద్రునితో గూడి బ్రహ్మయనుజ్ఞ పొందినవారై తమకార్యమును నివేదించుటకు బ్రహ్మభవనమునకు వెడలిరి. సనక సనందనాది ఋషులచే, సిద్ధులచే సేవింపబడు చున్న బ్రహ్మకు దేవతలు నమస్కరించిరి.
సూత ఉవాచ.
ఉపవిష్టా స్తతో దేవా బ్రహ్మణో వచనాత్ పురః
కలే రోషా ధర్మహానిం కథయామాసు రాదరాత్.
దేవానాం తద్వచః శ్రుత్వా బ్రహ్మా తానిహ దుఃఖితాన్
ప్రసాదయిత్వా తం విష్ణుం సాధయిష్యా మ్యభీప్సితమ్.
🌺అర్ధం:
సూతుడు పలికెను. దేవతలు బ్రహ్మ భవనమును ప్రవేశించి బ్రహ్మ యనుమతితో కూర్చుండిరి. పిమ్మట కలిదోషము వలన కలుగు ధర్మహానిని విన్నవించిరి. దేవతల వచనములు విని బ్రహ్మ దుఃఖితు అయిన దేవతలను గూర్చి విష్ణుమూర్తిని ప్రసన్నుని చేసుకొని మీకోరిక తీరునని చెప్పెను.
ఇతి దేవైః పరివృతో గత్వా గోలో కవాసినమ్
స్తుత్వా ప్రాహ పురో బ్రహ్మా దేవానాం హృదయేప్సితమ్
తచ్ఛుత్వా పుండరీకాక్షో బ్రహ్మాణ మిద మబ్రవీత్
శంభలే విష్ణుయశసో గృహే ప్రాదుర్భవా మ్యహమ్
సుమత్యాం మాతరి విభో! కన్యాయాం త్వన్నిదేశతః
🌺అర్ధం:
ఇట్లు చెప్పి !బ్రహ్మ ,దేవతలను తీసుకొని వైకుంఠమునకు వెడలి విష్ణుమూర్తిని స్తుతించి దేవతల యభీష్టమును నివేదించెను. పిమ్మట పుండరీకాక్షుడు బ్రహ్మతో హేవిభో! నీవు చెప్పిన ప్రకారము నేను శంభలనగరమున విష్ణుయశసుని గృహమున సుమతియను కన్యకు జన్మించగలనని పలికెను.
యాత యూయం భువం దేవాః స్వాంశావతరణే రతాః
రాజానౌ మరుదేవాపీ స్థాపయిష్యా మ్యహం భువి.
పునః కృతయుగం కృత్వా ధర్మాన్ సంస్థాప్య పూర్వవత్
కలివ్యాలం సంనిరస్య ప్రయాస్కే స్వాలయం విభో.
🌺అర్ధం:
ఓ దేవతలార! మీరు మీ అంశలతో అవతరించుటకు భూమండలమునకు వెడలుడు, నేను మరుడు, దేవాపి అను ఇద్దరు రాజులను పృథ్వీ యందు నిలుపుదును. ఓ బ్రహ్మదేవ! నేను మరల కృతయుగమును జేసి ధర్మసంస్థాపన గావించెదను. కలియను సర్పమును సంహరించి నేను వైకుంఠమునకు తిరిగి వెళ్ళెదను.
🌺పరమ శివుడు కొలువైన కైలాశ పర్వతం మన దేశ పరిధిలో లేకున్నా ఎంతో మంది భారతీయులు ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం అక్కడి వెళ్తుంటారు. అయితే, అక్కడ కంటికి కనిపించని ఓ రహస్య నగరం వుంది అదే శంబళ నగరం. టిబెట్ లో దీన్ని షాంగ్రిల్లా అని అంటారు హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధశ్రమంగా పిలిచేవారు.శివుడి అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవరూ చేరలేరు. అయితే, ధర్మరాజు శివుడు ఆశీస్సులు పొంది ఆ రహస్య ప్రాంతానికి చేరుకున్నాడని పురాణాల్లో పేర్కొన్నారు.