ప్ర . లక్ష్మీ అష్టోత్తర శతనామాలలో "కామాక్షీం క్రోధసంభవాం" అని నామాలున్నాయి. కొన్నిచోట్ల "కామాం క్షిరోధసంభవాం" అనీ, ఇంకొన్ని గ్రంథాల్లో "క్షమాం క్షీరోదసంభవాం" అనీ ఉన్నాయి. ఈ మూడింటిలో ఏది సరియైనది?
" క్రోధ సంభవాం" మాటలో పరమార్ధం ఏమిటి?
జ : " కామాక్షీం క్రోధసంభవాం " అనేది ప్రాచీన పాఠం. లక్ష్మీ అష్టోత్తరశత నామ స్తోత్రం సర్వదేవీ స్వరూపిణియైన జగదంబికను ఉద్దేశించినది. శ్రీ సూక్తాది దేవీసూక్తాలలో ఉన్న తత్త్వం అందులో ఉంది.
అయితే కొన్ని చోట్ల కనిపించే 'కామాం', 'క్షమాం', ' క్షీరోద సంభవాం' అనే మాటలు కూడా దోషాలు కావు. సృష్టి స్థితి లయలకు హేతువైన కామేశ్వర స్వరూపిణి కనుక 'కామాం' అన్నారు. సహనం అనే దివ్యగుణం, భూమి - ఈ రెండు లక్ష్మీ స్వరూపాలు కనుక 'క్షమా' నామం కూడా సమంజసమే.
" క్షీరోద సంభవాం " అంటే ' 'క్షీరసాగరము నుండి ఉద్భవించినది ' అని అర్థం.
కానీ ప్రాచీన పాఠమైన "కామాక్షీం క్రోధ సంభవాం" చాలా అర్థవంతమైనదే. కామాక్షీ దేవత పరాశక్తి. క్రోధము వల్ల ఉద్భవించినది 'క్రోధ సంభవ '.
దీనికి ప్రమాణం మార్కండేయ పురాణంలోని 'దేవిమహత్మ్యం 'లో, దేవీ భాగవతంలో చెప్పిన గాథలే. మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ స్వరూపిణియైన దుర్గ - మహిషాసుర మర్దిని గా మహాలక్ష్మి. మహిషాసురుని దురాగతాలను సహించని మహేశ్వర విష్ణు బ్రహ్మాదులకు కలిగిన కోపోద్రేకంలోంచి వారి నుండి ఉద్భవించిన పరాక్రమ తేజమంతా కలిసి దేవీరూపం ధరించిందని పురాణకథ. ఆ దేవతే అష్టాదశ (18) భుజాలతో సర్వదేవతా శక్తి స్వరూపిణిగా వెలిగి మహిషాసురుని సంహరించింది. దేవతల కోపం నుండి జనించిన శక్తి కనుక "క్రోధ సంభవా" అని కీర్తించారు.