🙏శ్రీవల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమః
శుక్లపక్ష పాడ్యమిలో శివతేజస్సు చే, విదియలో గర్భం ధరించడం, తదియలో రూపం ఏర్పడటం, చవితిలో అన్ని అవయవాలు ఏర్పడి, పంచమి నాడు పూర్తి ఆకారంతో నిలబడి విల్లు ధరించడం జరిగింది.
కుమారస్వామి విల్లు ఎక్కు పెట్టగానే ఆ ధ్వనికి ఐరావతం, సుప్రీతకం అనే ఏనుగులు కుమారస్వామి మీదకు లంఘించాయి.
కుమారస్వామి వాటిని తన చేతులతో అణచి పెట్టాడు.
ఒక చేత్తో తనకు సహజసిద్ధంగా లభించిన శక్తి ఆయుధాన్ని పట్టుకున్నాడు. ఒక చేత్తో వినోదంగా కోడిని పట్టుకుని శంఖం పూరించాడు.
బొటన వేలిని చప్పరిస్తూ ఆకాశాన్ని చేతులతో చరిచాడు. ఒక బాణంతో క్రౌంచ పర్వతాన్ని, శక్తి ఆయుధంతో శ్వేతపర్వతాన్ని భేదించాడు. ఆరు ముఖాలతో సింహనాదంచేసాడు.
ఆ సింహనాదానికి పర్వతాలు చలించాయి, సముద్రాలు పొంగాయి, భూమి కంపించింది. ఆ ఉత్పాతాలకు భయపడి
ఋషులు శాంతి హోమాలు చేసారు.
అప్పుడు చైత్రరథం అనే అడవిలో ఉన్న జనం " సప్తఋషి పత్నులకు అగ్నిదేవుని వలన జన్మించిన బాలుని వలన ఈ ఉత్పాతాలు సంభవిస్తున్నాయి " అని ఆక్రోశించారు. ఈ అపనిందని భరించలేక ఋషులు తమ భార్యలను వదిలి వేసారు.
కొందరు మాత్రం " ఇందులో ఋషిపత్నుల దోషం ఏమీ లేదు. అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవునిచేరింది " అని చెప్పుకున్నారు.
స్వాహాదేవి " అయ్యా! ఈ బాలుడు నాకు నా భర్తకు జన్మించాడు. మీ పత్నులకు ఇందులో ఎలాంటి సంబంధం లేదు. వారిని స్వీకరించండి " అని చెప్పింది.
ఋషులు ఆమె మాటలు విశ్వసించ లేదు. తరువాత విశ్వామిత్రుడు అనే ముని అగ్ని కుమారునకు జాతక కర్మలు చేసాడు.పార్వతీపరమేశ్వరులిద్దరూ కూడా తమకు కుమారుడు కలిగాదని చాలా సంతోషించారు. వెంటనే కైలాసమునుండి ఒక రథమునుపంపి కుమారస్వామిని కైలాస పర్వతం మీదకి తీసుకుని వెళ్ళారు.
తల్లి పార్వతీదేవి పిల్లవాడిని చూడగానే పరవశించి పోయి ఎదురు వచ్చి మూర్థన్య స్థానమునందు ముద్దు పెట్టుకుంది.
ఆయన కూడా పరవశించి మూడవవాడికి వినపడకుండా షణ్ముఖుడి కుడి చెవి దగ్గరకు తీసుకుని ఆయుష్మాన్ భావ అని ఆరుమాట్లు అన్నాడు.
ఇప్పుడు జరగవలసిన దేవకార్యం ఒకటి ఉంది. అదే తారకాసుర సంహారము.
సుబ్రహ్మణ్యుడి శక్తి సామాన్యము కాదు. తారకుడిని ఎదిరించడానికి వీలుగా దేవతలందరూ తమ శక్తులన్నింటినీ కుమారస్వామికి ధారపోశారు.
పార్వతీ పరమేశ్వరులిద్దరూ కలిసి త్రిశూలము, పినాకము, పాశుపతాస్త్రము, గొడ్డలి, శక్తి, శూలములను (శూలము అమ్మవారి శక్తి) ఇచ్చారు.
శంకరుడు దగ్గర కూర్చోబెట్టుకుని శాంభవీ విద్యనూ కూడా కటాక్షించాడు.
బ్రహ్మదేవుడు వేదములను, యజ్ఞోపవీతమును, గాయత్రీ మంత్రమును, కమండలమును, బ్రహ్మాస్త్రమును, శ్రీమహావిష్ణువు వైజయంతీ మాల, కంఠహారము, ఐరావతమును, వజ్రాయుధమును, వరుణుడు ఒక శ్వేత ఛత్రమును, రత్నమాలను, సూర్యుడు మనోవేగము కలిగిన రథమును, కవచమును, యముడు యమ దండమును, చంద్రుడు అమృత కలశమును, అగ్ని మహాశక్తిని, వాయువు వాయవ్యాస్త్రమును, కుబేరుడు గదను, మన్మథుడు కామ శాస్త్రమును ఇచ్చారు. పాలసముద్రము అమూల్యమయిన రత్నములను, రత్నములతో కూడిన ఒక అందెను బహూకరించింది.
అమ్మవైపు తాతగారయిన హిమవంతుడు వచ్చి కట్టుకోమని పట్టుబట్టలు ఇచ్చాడు. గరుత్మంతుడు ‘చిత్రబర్హణుడు’ అనబడే ఒకనెమలిని, అరుణుడు ‘తామ్రచూడుడు’ అనే కోడి పుంజును బహూకరించారు. అదే కుక్కుట ధ్వజము.
పార్వతీదేవి వెనక్కి పిలిచి గొప్ప చిరునవ్వును కానుకగా ఇచ్చిందట.
అందుకే మీకు సుబ్రహ్మణ్య స్వామి స్వరూపములు అన్నిచోట్లా చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఉంటాయి.
అంతేకాక ఐశ్వర్యమును, చిరంజీవిత్వమును ఇచ్చింది. లక్ష్మీదేవి సంపదను, కంఠహారమును ఇచ్చింది. సావిత్రీదేవి సకలవిద్యలనుఆయనకు ఇచ్చారు. ఇప్పుడు దేవేంద్రుడితో దేవతలతో కలిసి ఆయన తారకాసుర, సంహారమునకు బయలుదేరాడు.
సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః |
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః |
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం తత్^క్షణాదేవ నశ్యతి ‖
🔱 *ఓం శరవణ భవ* 🔱
శ్రీ సుబ్రహ్మణ్య దివ్య చరిత్ర లో మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాం...🙏
🌸 *జై శ్రీమన్నారాయణ* 🌸
🕉️🛕🕉️🛕🕉️🛕🕉️🛕🕉️🛕🕉️