#శ్రీ వేంకటేశ్వర లీలలు
🐚☀️ *
🌸 *జాబాలి తీర్థము:*
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయమునకు వాయువ్య భాగమున జాబాలి తీర్థము ఉన్నది. ఆ తీర్థమున జాబాలి అను మహర్షి నివసించి తపస్సు చేయుట వలన ఆ తీర్థమునకు ఆ పేరు వచ్చింది.
జాబాలి మహర్షి కోరిక మేరకు స్వయంభువుగా వెలసిన పరమ పవిత్ర దివ్య క్షేత్రం జాబాలి. జాబాలి మహర్షి తిరుమల అనే పవిత్ర ప్రదేశంలో నివసించి, తపస్సు సాధన చేశాడు. ప్రస్తుతం తిరుపతి సమీపంలోని ప్రదేశానికి "జాబాలి తీర్థం" అని పిలుస్తారు.
ఇది చిత్తూరు జిల్లా తిరుమల కొండపైన శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధికి ఐదు కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. స్కందపురాణంలో, వేంకటాచల మహత్యంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించారు. ఇది తిరుమల కొండపైన పాపనాశానానికి వెళ్లే దారిలో కొలువై ఉంది. ఇది పాపవినాశంనకు పోవు మార్గంలో ఒక మలుపు వద్ద ఆంజనేయుని ముఖ మార్గంలో కనిపిస్తుంది. చాలా మందికి ఈ ఆలయం గురించి తెలియదు. ఇక్కడ హనుమంతుడు వెలసి ఉన్నాడు. ఈ ఆలయం సమీపమునకు వెళ్లే కొద్ది ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. చుట్టూ అడవి, ఆలయం ముందు కొలను ఎంతో మనోహరంగా ఉంటాయి.
🟢 *ఈ పవిత్ర దివ్య క్షేత్రానికి సంబంధించిన పురాణగాథ:*
జాబాలి అనే మహర్షి హనుమంతుని రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు ఉన్న కొండ మీద జపం చేయనారంభిస్తాడు. అప్పుడు రుద్రుడు అతని తపస్సుకు ప్రసన్నుడై జాబాలి మహర్షికి తన రాబోవు అవతారాన్ని ముందుగానే చూపిస్తాడు. అదే హనుమంతుని అవతారం. జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జాబాలి అంటారు. అన్ని తీర్థ రాజాలు వచ్చి చేరతయి కనుక జాబాలి తీర్థంగా పేరొందింది.
అయోధ్య కాండలో జాబాలి మహర్షి అనకూడని మాటలు అనడం వల్ల వాక్‌దోష పాపాన్ని మూట కట్టుకుంటాడు. ఆ వాక్‌దోషాన్ని తొలగించుకోవడం కోసం జాబాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానమాచరిస్తాడు. దాంతో ఆయనకున్న దోషం తొలగిపోయిందని పురాణాలు వివరిస్తున్నాయి.
🟢 *జాబాలి తీర్థ మహిమకి సంబందించిన కథ:*
పూర్వము కావేరి నది తీరమున ఒక బ్రాహ్మణుడు కాపురము చేయుచుండెను. ఆ బ్రాహ్మణుని నివాసమునకు సమీపములో చాలా మంది బ్రహ్మాహత్యాది మహాపాపులు నివసించుచుండిరి. ఈ బ్రాహ్మణుడు మంచివాడయ్యూనూ ఆ మహాపాపుల సంపర్కము వలన దుర్మార్గుడైన దురాచారుడయ్యేను.
కొన్నాళ్ళకాతడు పిశాచము పట్టి దేశదేశములూ తిరుగుచుండెను. ఇట్లుండగా ఆ పిశాచము ఈ బ్రాహ్మణుని అనేక చోట్ల తిప్పి చివరకు శ్రీ వెంకటాచలమునకు తీసుకొని వచ్చినది. పిశాచము బట్టిన యా బ్రాహ్మణుడు జాబాలి తీర్థములో మునిగెను. పవిత్రమైన ఆ తీర్థములో మునిగి లేచునప్పటికీ ఆ బ్రాహ్మణునకు పిశాచం వదిలి పవిత్రుడు అయ్యెను.
అప్పుడు బ్రాహ్మణుడు జ్ఞానము కలిగి కావేరి తీరము నుండి నేనిక్కడికి కెట్లు వచ్చితిని? ఎందుకు వచ్చితిని? అని యోచించి సమీపమున నున్న జాబాలి మునికి నమస్కరించి అతని నడిగెను.
జాబాలి ముని దివ్య దృష్టితో అంతయూ యెరిగి బ్రాహ్మణునకు పిశాచ వృత్తాంతము చెప్పి ఆ తీర్థ మహిమ అతనికి బోధించి పంపెను.
🌸 *శేష తీర్థము:*
పాపవినాశనం నుండి కొన్ని మైళ్లు అడవిలో నడిస్తే శేష తీర్థము చేరుకుంటారు. ఈ తీర్థానికి వెళ్ళడం చాలా కష్టం. పర్వతాలను ఎక్కడం, కష్టపడటమే కాక చిన్న ప్రవాహాలను దాటాలి.
ఇక్కడ ఆదిశేషుడు శిలారూపంలో ఉంటాడు. ఇదేకాక ప్రత్యేకంగా కొన్ని నాగుపాములు ఈ తీర్థంలో తిరుగుతూనే ఉంటాయి. ఇది దేవాలయానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది.
🟢 *శేష తీర్థమునకు సంబందించిన పురాణ కథ:*
ఒకరోజు శ్రీ మహావిష్ణువుకు బాగా దాహం వేసింది. దాంతో జలాన్ని తీసుకురావాలని గరుత్మంతుడిని పురమాయించారు. కానీ ఆయన ఎంతసేపటికీ అయినా నీరు తేకపోవడంతో అప్పుడు స్వామి వారు ఆదిశేషుడిని కోరతారు. దీంతో ఆదిశేషుడు జలాన్ని తన తోక ద్వారా రప్పించి స్వామి వారి దాహం తీర్చారని, అందుకే ఇది శేష తీర్థము అయిందని పురాణ చరిత్ర.