Part -15
శ్రీవారి బ్రహ్మోత్సవాల వైభవం...
జీవితంలో ఒక్కసారైనా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను వీక్షించడం కొన్ని కోట్లజన్మల పుణ్యఫలమనే చెప్పాలి.
శ్రీవారి బ్రహ్మోత్సవాల విశిష్టత, వాహన సేవలు ఇలా ప్రతి విషయం చదివి, తెలుసుకుని ,అర్థం చేసుకుని ,మనసులో అనుభవించి తరిద్దాం రండి....
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావటంతో, ఇవి 'బ్రహ్మోత్సవాలు' అయ్యాయని అంటారు. మరో వ్యాఖ్యానం ప్రకారమైతే- నవాహ్నిక దీక్షతో, నవబ్రహ్మలు తొమ్మిది రోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి 'బ్రహ్మోత్సవాలు'
" బ్రహ్మోత్సవాలు.. ప్రాశస్త్యం"
కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతాయి. శ్రీనివాసుడు సప్తగిరులపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. స్వామివారి ఆజ్ఞ ప్రకారం.. శ్రీవారి ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యామాసం(ఆశ్వయుజం)లోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. అందువల్లే ఇవి ‘బ్రహ్మోత్సవాలు’గా ప్రసిద్ధిచెంది నాటి నుంచి నిరాటంకంగా కొనసాగుతున్నాయి
ఏడుకొండల స్వామికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు జరిగినా ఏడాదికి ఒకమారు తొమ్మిదినాళ్లపాటు జరిగే బ్రహ్మోత్సవాలు తిరుమల చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యాన్ని కలిగిఉన్నాయి.
బ్రహ్మాది దేవతల కోరికపై కలియుగ మానవుల రక్షణకై “కలౌ
వేంకటనాయకః అన్న బిరుదుతో శ్రీవేంకటేశ్వరుడనే పేరుతో స్వయంవ్యక్త మూర్తిగా కన్యామాసం శ్రవణ నక్ష్మత్రం రోజున ఆవిర్భవించినాడు. ఆ రోజును పురస్కరించుకొని బ్రహ్మదేవుడు ఆ రోజుకు పూర్తి అగునట్లు తొమ్మిది నాళ్లపాటు శ్రీనివాసునికి ఉత్సవాలు నిర్వహించినాడు. బ్రహ్మదేవుడు నిర్వహించినందువల్ల బ్రహ్మోత్సవాలని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీవేంకటేశ్వరునకు జరిగినందువల్ల బ్రహ్మోత్సవాలని ప్రసిద్ధి ఏర్పడింది.
బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఈ ఉత్సవాలేకాక కాలక్రమేణ ఎందరో రాజులు కూడా తిరుమలేశునకు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.
క్రీ.శ. 614 పల్లవరాణి 'సామవై', భోగశ్రీనివాసమూర్తిని బహూకరించి, కన్యామాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు ముందు ఈ మూర్తిని ఊరేగించాలని ఏర్పాటు చేసిందట.
క్రీ.శ. 1254 చైెత్రమాసం లో తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు, క్రీ.శ. 1328 ఆషాఢ మాసంలో “ఆడి తిరునాళ్లు పేర త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాథ యాదవరాయలు, క్రీ.శ. 1429 ఆశ్వయుజ మాసంలో వీరవ్రతాప దేవరాయలు, క్రీ.శ. 1446లో 'మాసితిరునాళ్ల' పేర హరిహరిరాయలు, క్రీ.శ. 1580లో “అచ్యుతరాయ బ్రహ్మోత్సవం” పేర అచ్యుతరాయలు అని ఇలా 1583 నాటికి బ్రహ్మోత్సవాలు సంవత్సరంలో ఇంచుమించు నెలకొకటి వంతున జరిగేవట!
కాలాంతరంలో ఆ రాజులూ, ఆ రాజ్యాల లాగే, వారు ఏర్పాటుచేసిన ఉత్సవాలు నిలిచిపోయాయి. కాని బ్రహ్మదేవుడు ఏర్పాటుచేసిన ఉత్సవం మాత్రం నేటికీ కొనసాగుతూ ఘనంగా నిర్వహింపబడుతూ ఉంది. ఇది తొమ్మదినాళ్లపాటు జరుగుతుంది.
ముందురోజు సాయంత్రం అంకురార్పణ, శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనులవారి ఆధ్వర్యంలో మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. ఆ మరునాడు ధ్వజారోహణనాడు బంగారుధ్వజస్తంభంపై గరుడ కేతనాన్ని ఎగురవేస్తూ సర్వలోకవాసులు ఆహ్వానింపబడతారు.
ఆ రాత్రి శ్రీస్వామివారికి పెద్దశేషవాహనం జరుగుతుంది.
ఇక ఆ మరునాడు ఉదయం, సాయంత్రం రెండువేళలా రెండవరోజు చిన్నశేషవాహనం, హంస వాహనం మూడవరోజు సింహ వాహనం,ముత్యపు పందిరి, నాల్గవరోజు కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, ఐదవరోజు ఉదయం దంతపు పల్లకిలో మోహినీ అవతారం, ఆ రాత్రి గరుడోత్సవం జరుగుతుంది. ఆ రోజు శ్రీవిల్లి పుత్తూరు నుంచి గోదాదేవి ధరించిన పూలమాల, మద్రాసు నుంచి కొత్త గొడుగులు వస్తాయి. వీటినన్నింటిని ధరించిన మలయప్పస్వామి బంగారు గరుడునిపై ఊరేగింపబడుతాడు. లక్షలాది మంది
భక్తులు గరుడోత్సవాన్ని తిలకిస్తారు.
ఇక ఆరవరోజు హనుమద్వాహనం, గజవాహనం, ఏడవరోజు సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, ఎనిమిదో రోజు రథోత్సవం, అశ్వవాహనం జరుగుతాయి. తొమ్మిదో రోజు చక్రస్నానం. ఆ రాత్రి ధ్వజారోహణం కార్యక్రమాలు ఘనంగా నిర్వహింపబడుతాయి.
అధికమాసం వచ్చిన ఏడాది తిరుమలేశునకు రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతాయి. ఒకటి కన్యామాసంలో వార్షిక బ్రహ్మోత్సవంగాను, మరొకటి శరన్నవరాత్రులలో నవరాత్రి బ్రహ్మోత్సవంగాను నిర్వహింపబడుతాయి..
బలరామానుజ గోవిందా || బౌద్ధకల్కిధర గోవిందా
వేణుగానప్రియ గోవిందా || వేంకటరమణా గోవిందా..
గోవిందాహరి గోవిందా || గోకులనందన గోవిందా.
⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️
.