నవగోప్యాలు

P Madhav Kumar


*నవగోప్యాలు*


👉 ఆయువు,

👉 విత్తము,

👉 ఇంటిగుట్టు,

👉 మంత్రం,

👉 ఔషధం, 

👉 సంగమం,

👉 దానం,

👉 మానము,

👉 అవమానం


అనే ఈ తొమ్మి దింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచా ల్సినవి.


భగవంతుడు మనిషితో పాటు జీవులన్నిటికీ శరీరం ఇచ్చినప్పటికీ ‘వివేకము’ అనే గొప్ప గుణం మనిషికి ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు.


రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు. జరిగేది జరగకమానదు అని వివేకంతో ఆలోచిస్తాడు కాబట్టి మనిషి నిబ్బరంగా ఉండగలుగుతున్నాడు. నిజంగా ఒక వ్యక్తి ఆయుః ప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై అతనిని బాధిస్తుంది. కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్త్రకారుడు.


ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఉన్నపుడు మనకు నష్టం జరుగదు. ‘లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగా రంబు మ్రింగబోడు’ అన్నట్లు నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే. ‘అతి సంచయేచ్ఛ తగదు’ అన్న నీతి చంద్రిక వాక్యం ధనం విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం.


అయినా మన దగ్గర ఉన్నవిషయం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం. ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే పన్నుల మూలకంగా రాజు (ప్రభుత్వం) దాన్ని స్వాధీన పరచుకోవడమో, అగ్ని ప్రమాదాలవల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో జరుగు తుంది.


ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దాన్నే ‘ఇంటిగుట్టు’ అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమపూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. వాటిలో రహస్యాలను బహిరంగం చేయాలనుకోవడం తెలివితక్కువ పని.


సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం- ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు.


మననం చేసేది మంత్రం’- మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చెయ్యడం మన సంప్రదాయం. మంత్ర వైశిష్ట్యం తెలిసినవారికి చెప్పడంవల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కాని అపాత్రునికి చెప్పడంవల్ల నష్టమని భావన. దానిమీద భక్తిలేని వాడికి చెబితే అది అభాసుపాలవుతుంది. మంత్రంపై అచంచల నమ్మకం ఉండాలి.


ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధమే. ఇవాళ భయంకర రసాయనాలను ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఇవి అందరికి బహిరంగ పరిస్తే ఎవ్వరంటేవారు తయారుచేస్తారు. ఔషధం రహస్యంగా ఉంచడం మంచిదే.


సంగమం అంటే కలయిక. మనం కొన్ని రహస్యమైన భేటీలు జరుపుతాం. అవి అధికారిక, అనధికారమైనవి ఏవైనా కావచ్చు. రహస్యంగా ఉంచడం ఉత్తమం. అలాగే గొప్పవారు అనుకునే వారి జీవితాల్లో ఎన్నో రహస్యలున్న సమావేశాలు ఉంటుంటాయి. అవి బహిర్గతమైనపుడు వారి వ్యక్తిత్వాలపై మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే సంగమం రహస్యంగా ఉంచడం మంచిది.


దానం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు. మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలం ఇస్తుంది.


మానం అంటే గౌరవం. దాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. ఏమీ చేతగాకున్నా నేనింతవాణ్ణి అంతవాణ్ణి అని చెప్పకూడదు. మనం గౌరవాన్ని ఎంత రహస్యంగా ఉంచితే అంత పెరుగుతుంది.


అలాగే తనకు జరిగిన అవమానం మరిచిపోవాలి. అవ మానాలను అస్తమానం మననం చేస్తే క్రోధం పెరుగు తుంది. దాంతో పగ.. ప్రతీకారాలు.. ఇక వాటికి అంతనేది ఉండదు. ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం మనం తొలగించలేం కానీ మన చెప్పులు వేసుకొని వెళ్ళడం సులభం కదా.


ఈ తొమ్మిది రహస్యలను కాపాడుకోవడం విజ్ఞుల లక్షణం అని పెద్దలు చెప్పిన జ్ఞానబోధను మనం తప్పక ఆచరించాలి.


*ఓం నమః శివాయ*


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat