30. ఆ వెంటనే అతడు సింహమయ్యాడు. అంబిక ఆ (సింహ) శిరస్సును ఖండించగానే అతడు ఖడ్గహస్తుడైన మానవుని రూపం ధరించాడు.
31. తక్షణమే దేవి తన బాణాలతో ఆ పురుషుణ్ణి, ఆతని ఖడ్గం, డాలుతోసహా ఛేదించివేసింది. అతడు అంతట పెద్ద ఏనుగు అయ్యాడు.
32. (ఆ ఏనుగు) తన తొండంతో దేవి మహాసింహాన్ని పట్టుకొని లాగి గట్టిగా ఘీంకారం చేసింది. కాని అలా లాగుతున్నప్పుడే దేవి దాని తొండాన్ని తన ఖడ్గంతో నరికివేసింది.
33. ఆ మహాసురుడు అంతట తన మహిషరూపాన్ని మళ్ళీ దాల్చి, చరాచర సహితంగా ముల్లోకాలనూ తల్లడిల్లజేసింది.
34. అప్పుడు జగన్మాత అయిన చండిక క్రోధం దాల్చి దివ్య పానీయాన్ని మాటిమాటికీ త్రాగి నవ్వాసాగింది. ఆమె కన్నులు ఎర్రబడ్డాయి.
35. అసురుడు తన బలసాహసాలతో మదోన్మత్తుడై, మహానాదం చేసి, తన కొమ్ములతో పర్వతాలను చండికపై విసిరాడు.
36. తనపై రువ్వబడిన పర్వతాలను ఆమె తన బాణ సమూహంతో నుగ్గునూచం చేసి, దివ్యపానోన్మత్తత చేత అధికతరమై ఒప్పుతున్న ముఖవర్ణంతో, తొట్రుపడు పలుకులతో, అతనితో ఇలా పలికింది.
37-38. దేవి పలికెను : ఓ మూఢుడా! ఇంకొక క్షణంసేపు, నేను ఈ మద్యం* అంతా త్రాగేసే వరకూ గర్జిస్తూ ఉండు. నిన్ను నేను
వధించినప్పుడు దేవతలు త్వరలోనే ఇక్కడే గర్జిస్తారు.
39–40. ఋషి పలికెను :
ఇలా చెప్పి ఆమె ఎగిరి ఆ మహాసురునిపై వ్రాలి, పాదంతో అతని కంఠాన్ని తొక్కిపట్టి శూలంతో అతనిని పొడిచింది.
41. అతడు అంతట దేవిపాదం క్రింద చిక్కుకొని, ఆమె శౌర్యానికి పూర్తిగా లొంగిపోయి, తన (మహిష) ముఖం నుండి యథార్థ స్వరూపంతో సగం వెలువడ్డాడు.
42. ఇలా సగం వెలువఱచిన నిజస్వరూపంతో పోరాడుతున్న ఆ మహాసురుణ్ణి దేవి తన మహాఖడ్గంతో శిరశ్ఛేదం చేసి కూల్చివేసింది.
43. అంతట దైత్యసైన్యమంతా హాహారవాలు చేస్తూ నాశనమయ్యింది. దేవగణాలందరూ పరమహర్షాన్ని పొందారు.
దేవతలు, దివ్యమహర్షులు, దేవిని స్తుతించారు. గంధర్వపతులు పాడారు, అప్సర గణాలు ఆడారు.
శ్రీ మార్కండేయపురాణంలో సావర్ణి మన్వంతరంలో “దేవీ మాహాత్మ్యము” లో “మహిషాసుర వధ” అనే నామమ తృతీయాధ్యాయము సమాప్తం.
*సశేషం.......*