*దేవీ దూతసంవాదం - 1*
*ఉత్తరచరితము*
*మహాసరస్వతీ ధ్యానమ్*
తన (ఎనిమిది) హస్తకమలాలలో ఘంట, శూలం, నాగలి, శంఖం, రోకలి, చక్రం, ధనుస్సు, బాణాలు ధరించేదీ, మబ్బు అంచున ప్రకాశిస్తుండే చంద్రునితో సమమైన కాంతి కలదీ, పార్వతీదేవి శరీరం నుండి ఉద్భవించినదీ, ముల్లోకాలకూ ఆధారభూతమైనదీ, శుంభుడు మొదలైన దైత్యులను వధించినదీ అయిన అపూర్వయైన మహాసరస్వతిని భజిస్తున్నాను.
ఋషి పలికెను :
పూర్వకాలంలో *శుంభ నిశుంభులు* అనే రక్కసులు తమ బల గర్వాలతో ఇంద్రుని ముల్లోకాలనూ (ఆధిపత్యాన్ని), హవిర్భాగాలను హరించారు.
అలాగే ఆ ఇరువురూ సూర్య చంద్ర యమ వరుణ కుబేరుల అధికారాలు కూడా తమ వశం చేసుకున్నారు.
వాయువు అధికారాన్ని, అగ్ని కర్మను సైతం వారే నిర్వహించారు. ఇలా తమ అధిపత్యాలను, రాజ్యాలను కోల్పోయి దేవతలు ఓడిపోయారు.
ఆ ఇరువురు మహాసురులు తమ అధికారాలను హరించి తరిమివేయడంతో దేవతలందరూ అపరాజిత అయిన దేవిని సంస్కరించారు.
ఆపదలలో నన్ను మీరు స్మరించినప్పుడెల్ల, తత్ క్షణమే మీ ఘోరవిపత్తుల నన్నింటిని నేను అంతమొందిస్తాను” అని ఆమె మాకు వరం ఇచ్చి ఉంది.
ఇలా నిశ్చయించుకుని దేవతలు పర్వతసార్వభౌముడైన హిమవంతుని వద్దకు పోయి, అచట విష్ణుమాయయైన దేవిని స్తుతించారు.
*యా దేవీ సర్వభూతేషు...... స్తోత్రము*
దేవతలు పలికారు:
“దేవికి, మహాదేవికి నమస్కృతులు! నిత్యశుభంకరి అయిన ఆమెకు ఎల్లప్పుడూ నమస్మృతులు. మూలప్రకృతి, రక్షాశక్తి అయిన ఆమెకు నమస్కృతులు. నియతచిత్తులమై మేము ఆమెకు ప్రణమిల్లుతున్నాము.
భయంకరికి నమస్సులు! శాశ్వతకు, గౌరికి, (జగత్) పోషకురాలికి నమస్సులు! కైముదీ (వెన్నెల) రూపకు, చంద్రరూపకు, సుఖరూపకు సర్వదా నమస్కృతులు.
"శుభస్వరూపిణికి నమస్సులు! అభ్యుదయానకి, విజయానికి స్వరూపమైన ఆమెకు నమస్కారాలు! భూపాలురకు అభాగ్యదేవత, భాగ్యదేవత కూడా అయిన శివపత్నివి; అటువంటి నీకు నమస్కారాలు.
కష్టాలలో దరిచేర్చేది, సారస్వరూపిణి, సర్వకార్యాలను ఒనర్చేది, “ఖ్యాతి” అయినది (వివేకజ్ఞానం అయినది), కృష్ (నల్లని) వర్ణం, ధూమ (పొగ) వర్ణమూ అయిన దుర్గాదేవికి ఎల్లప్పుడూ నమస్కారాలు.
అతి సాధుస్వరూప, అతి రౌద్రస్వరూప అయిన ఆమెకు పదే పదే సాగిలపడి ప్రణమిల్లుతున్నాం. జగత్తును భరించే ఆమెకు నమస్కారాలు. సంకల్ప శక్తి రూపిణి అయిన దేవికి నమస్కారాలు.
-సర్వభూతాలలో విష్ణుమాయ అనే పేరుతో నిలిచి ఉండే దేవికి మాటిమాటికి నమస్కారాలు.
*సశేషం.........*