అయ్యప్ప సర్వస్వం - 16

P Madhav Kumar


*ఉత్తమ గురుస్వామి*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


త్రికరణశుద్ధిగా అయ్యప్పస్వామి పట్ల భక్తి కలవాడై నిర్మల చిత్తము కలిగి నిరాడంబరుడుగా ఉండవలెను. 


నిష్కల్మష హృదయుడిగా , నిష్కపటిగా , న్యాయా న్యాయములు తెలిసినవాడై ఉండవలెను. 


శాంతము , సత్యము , సహనము కలిగి సదా దైవచింతనాపరుడై ఉండవలెను. 


వ్రతములో నున్న దినములందు మానసికముగా బంధపాశములు వీడినవాడై ఉండవలెను. 


సర్వవ్యసనములకు అతీతునిగా , ప్రతిఫలాపేక్ష రహితునిగా ఉండవలెను. 


ఇతరులు విమర్శించ వీలులేని ఆచార సాంప్రదాయాలు కలవాడై నీతిమంతుడై సత్యమార్గమున నడుస్తూ భక్తులకు మార్గదర్శిగా ఉండవలెను. జాతి , మత , కుల , వర్గ భేదములు లేనివాడై ఉండవలెను. 


తాను సదాచార సంపన్నుడై , జ్ఞానవంతుడిగా ఉండి తన శిష్యరికము కోరివచ్చు భక్తుల పట్ల మిక్కిలి ప్రియమైనవాడై ఉండవలెను.


దురభ్యాసములు లేనివాడై , తన బోధనలచే భక్తులను నిష్కల్మష హృదయులుగా చేయునంతటి గొప్పవాడై ఉండవలెను. 


పూజలు , భజనల యందు ఆసక్తి కలవాడై యుంటూ యాత్ర చేయించుటలో సమర్థుడై ఉండవలెను. 


పవిత్రమైన *ఇరుముడి కట్టు విధానములో మూల మంత్రములు సంపూర్ణముగా తెలిసినవాడై ఉండవలెను.*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*అయ్యప్పస్వామి చరిత్ర క్షుణ్ణంగా తెలిసి ఉండి , శబరిమలైలోని యాత్రా స్థలాల విశిష్టతలను సమగ్రముగా తన శిష్యులకు బోధింపగలవాడై వుండవలెను.*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


పదినెట్టాంబడి విశిష్టత మరియు అయ్యప్పస్వామి యోగసమాధి రహస్యమెరిగి అచటి కీలక ప్రదేశముల , చోటుల గురించి క్షుణ్ణంగా తెలిసినవాడై ఉండ వలయును. 


మార్గమధ్యమున గల యాత్రా స్థలాలన్నింటిని ఓపికగా తెలుసుకుంటూ భక్తులకు చూపిస్తూ బృందమును ఎడబాయక ఉండువాడై ఉండవలయును. 


భక్తులను బహు జాగ్రత్తగా యాత్ర కావించి తిరిగి క్షేమముగా ఇంటికి చేర్చగల సమర్థుడై ఉండవలెను. 


శబరిమలై అయ్యప్పస్వామి దేవస్థానము పద్ధతులు తెలిసినవాడై ఉండి నెయ్యాభిషేకం తానే స్వయంగా చేయించ గలవాడై ఉండవలెను. 


దీక్షా నియమాలను మండలకాలం ఆచరించి అందులో సుగుణములను యెల్లవేళలా పాటించువాడై ఉండవలెను.


*అయ్యప్ప స్వాముల సందేహాలకు , అనుమానాలకు శాస్త్రరీత్యా ఉదాహరణలతో సమాధానాలు చెప్పి వారిని ఉత్సాహ పరచుచుండు వాడై , ముఖ్యంగా కన్నిస్వాముల యెడ వాత్సల్య పూరితుడై యుండవలెను. 


*ఇట్టి విశిష్టతలు కలిగిన గురుస్వామి. వయస్సులో చిన్నవాడైనను గురు స్థానమునకు అర్హత కలవాడని యెంచి నిస్సందేహంగా వారిని గురువులుగా స్వీకరింపవచ్చును.*


*ఇట్టి గుణములు గల గురుస్వామితో శబరిమల యాత్ర చేసినను పుణ్యఫలము పొందువారగుదురు.*


అందుకని , అట్టి గుణములు నిండిన వారినే గురుస్వామిగా ఎన్నుకోవాలని అన్వేషిస్తూ కాలం వృధాచేయరాదు. తమకు దొరికిన గురుస్వామిలో అట్టి గుణములు గలవా అని పరిశోధిస్తూ కాలం వృధాచేయడం అంతకన్నా తగదు. పరుగులు తీసే నేటి కాల పరిధిలో సర్వ గుణములు నిండిన ఉత్తమ గురుస్వాములు అందరికి లభించుట కష్టసాధ్యమే. కావున తమకు లభించిన గురుస్వామి వద్ద పై చెప్పబడిన విశిష్ట గుణములన్నియు నిండియున్నట్లు భావించి వారినే మార్గదర్శిగా ఎంచి , భక్తిని చూపి , శబరిమల యాత్ర చేసి , అయ్యప్ప స్వామిని దర్శించు కొనవలయునే తప్పు , *ఎట్టి పరిస్థితిలోను గురువులను నిందించుటకు సాహసించ రాదు. గురునింద మహా అపచారము అగును.* దానికి నివృతి లేదంటుంది శాస్త్రము. భగవంతుడు కూడా తనను గురువుగానే వ్యక్త పరచి యున్నాడు.


శబరిమల యాత్రను ఉద్దేశించి మాల ధరించి దీక్షబూనిన స్వామి భక్తులు ఒకరినొకరు కలుసుకొన్నప్పుడు పరస్పర సంభాషణకు ముందు చెప్పుకొనేది *'స్వామి శరణం'* అనియే. మిగిలిన దినములలో తెలుగులొ *'నమస్కారము'* అనియో , ఆంగ్లమున *'హలో గుడ్ మార్నింగ్'* అని , చెప్పుకొనేలా మాలధరించినపుడు *'స్వామి శరణం'* అని చెప్పుకొనుచున్నాం. అపుడు మన మధ్య పరస్పర గౌరవపూరిత మైత్రీ భావము ఏర్పడుతుంది. స్వామి అయ్యప్పను గూర్చి తెలుగు రాష్ట్రలలో సర్వే సర్వత్రా *" ఈ అయ్యప్ప స్వామి సమీప కాలములో ప్రబలమైన దేవుడే కదా !"* యను నినాదము వినవస్తున్నది. పండితులు , విజ్ఞులు , శాస్త్రవేత్తలు సైతం *“ఈ అయ్యప్పను గూర్చి ఏ పురాణములోనూ చదివినట్లు గుర్తు లేదండి ! ఏదో ఉపాఖ్యానమని అంటారు"* అని భగవంతునే మద్యాగమనునిగా సంబోధించి సర్వ సాధారణముగా సంభాషిస్తున్నారని తెలియవస్తుంది. ఈ భావన మారాలి.


దేశవ్యాప్తంగా శబరిమల యాత్రజేయు భక్తుల సంఖ్య పెరుగుచునే యున్నది. అయిననూ కడు భక్తితో శబరిమల యాత్ర విధివిధానములను , దీక్షానియమాదులను క్షుణ్ణంగా గ్రహించి , ఆచరించి , యాత్రజేయు అలనాటి యాత్రీకులవలే క్రమబద్ధముగా యాత్రజేయువారి సంఖ్య నేటి కాలములో చాలతక్కువ యనే అనిపిస్తూంది. ఈ యాత్రలో ప్రథమ పాఠమగు గురుశిష్య భావనలోనే తేడాలు , అభిప్రాయబేధాలు కలుగజేసు కొనుచున్నాయనిన మిన్నగాదు. ఇందులకు ఇరు వర్గీయులు కారకులే. తప్పులు రెండు ప్రక్కల కన్పించుచున్నది. యాత్రకొరకైన ప్రయాణ సౌకర్యములు ఎక్కువగా యుండుట వలనను , శబరిమలపై నివాసగృహ వసతులు పెరిగిపోయినందువలనను , గురుస్వాముల ఆవశ్యకత తగ్గి ఎవరికి వారు అనుకొన్నప్పుడు , ఉన్నపళంగా మాలవేసుకొని బయలుదేరుటకు వీలుగా వాహన సౌకర్యము లుండుటవలననూ , నామమాత్రానికి యొకర్ని గురు స్వామిగా ఎన్నుకొనుటకు పరుగిడుట అలవాటైపోయినది. *కొన్నాళ్ళకు గురు స్వాముల పదవి ఎన్నికల స్థాయికి ఎదిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరంలేదని ఒక భక్తుడు నాతో వాపోయాడు.*


*శబరిమల యాత్ర చేయించు గురుస్వాములలో కొందరు తానేదో పెద్ద పదవిని స్వీకరించిన భావనలో వ్యవహరిస్తున్నారు. అదేదో వదలిపెడితే మరలా దొరకని సింహాసనంలా దానిపై యొక వ్యామోహం , తన్మూలాన ధనము , కీర్తి ఆర్జించాలను తపన నిండిన వారై యున్నారు. వీరికి సరియైన వ్రతానుష్ఠాన పద్ధతులు తెలియకపోవడంతో , తెలసుకోవాలను బాధ్యత లేక పోవడంతో , తమ ఇష్టానుసారం వ్రత నియమాదులలో మార్పులు , చేర్పులు చేయించి అందులో తనకు ఆత్మీయులైన కొందరికి మినహా యింపులు కల్పించి "తాను చెడిన కోతి వనమెల్ల చెరిచె" అన్నట్లు తన దరిచేరిన వారిని పెడదారిపట్టిస్తారు. ఇందుమూలాన యధార్థ భక్తులు ఇలాంటి వారిని పోల్చుకోలేక వీరిచెంత జేరి , ఈ యాత్రలోని పరమార్ధ తత్వమును గ్రహించుకొనుటకు వీలులేక నిరాశచెంది. యాత్ర మధ్యలో స్పర్ధలతో , బాధపడి , శబరిమల యాత్రనే నిందించే స్థితికి దిగజారి , మరల శబరిమలకు వెళ్ళే ఆశను గూడా కోల్పోయే స్థితి ఏర్పడుతుంది.* కావున గురువు అనగా ఎలా వుండాలి ? ఎట్టి గుణగణములు నిండిన వారిని గురువుగా స్వీకరించాలి - యను దానిని శిష్యులు , శిష్యులు ఎలాంటివారై యుండిననూ అందరినీ యొకటిగా చేర్చి దారిపొడుగున వారికి మార్గదర్శిగా నిలిచి , తాను తెలుసుకొన్న సద్విషయములను తనదరి చేరినవారికి తెల్పి వారి సందేహములను నివారించి , బాధ్యతగా యాత్ర చేయించు విధానమును గురించి గురుస్వాములు తెలుసుకొని యుండుట ఆవశ్యము. పరుగులు తీసే నేటి కాల పరిణామముల కనుగుణంగా కొన్ని మార్పులు , చేర్పులు ఆమోదయోగ్యము కావచ్చును లేక అందులకొరకైన ప్రాయశ్చిత్తము లైన చేసుకొనవచ్చును.


జనావాసము నిండిన పెద్ద పట్టణములలో , ఇల్లు , వాకిలి -యంతా యొక గదిలోనే యని జీవించు యాంత్రిక జీవన సరళిలో పటిష్టమైన వ్రత మాచరించుట యనునది కష్టసాధ్యమే. అయినను ఉన్నదాంట్లో పెద్దలు ఏర్పరచి ఇచ్చిన వ్రతానుష్టానములను ఉల్లంఘించక భక్తి ప్రపత్తులతో , నిండు విశ్వాసముతో , మండలకాల వ్రతమాచరించి , ఆ దివ్యసన్నిధి చేరుకొను వారికి పరమాత్ముడైన శబరినాథుని అనుగ్రహము లభ్యమగుతుందనుట తథ్యము. *గురుస్వాముల ఆనతిని శిరసావహించి నడుచుకొనుటయే గురువులకు గురువైన శ్రీధర్మశాస్తావారికి సంతృప్తిని కల్గించును.* గురుస్వామిగారి ఆదేశములను వేదవచనములవలె స్వీకరించి తూ.చ. తప్పక ఆచరించువారి శబరిమల యాత్ర సుఖమయ మౌతుంది. త్రికరణ శుద్ధిగా శ్రీస్వామి చరణమును వేడుతూ గురుముఖముగా మాలధరించి , మండలకాల దీక్షతో ఇరుముడి మోసి , పావన పది నెట్టాంపడి దాటి , పరమాత్మ దివ్య దర్శనం చేసుకొన్నవారి జన్మ ధన్యత నొందుతుందనుటలో సందేహము లేదు. స్వామి శరణములతో , అందులోను అయ్యప్ప స్వామి దీక్షాదక్షులకు గురువే మార్గదర్శి , మార్గానుచారి మార్గబంధువు కూడాను. మాలధరించిన క్షణం నుండి వనయాత్ర చేసి తిరిగివచ్చి మాల విసర్జన చేయువరకు భక్తులకు గురువే తల్లితండ్రి దైవం సర్వమును.


*కావున అయ్యప్ప లకు మాలధారణ చేసి శబరిమల యాత్ర గావించే గురుస్వాములు ఈ విషయమును శ్రద్ధగా చదివి మననం చేసుకొని తమ దరిచేరిన శిష్యులకు మంచి మార్గదర్శకులై యుండవలయునన్నదే మావంటి వారి అభిలాష. అనాదికాలం నుండి ఈయాత్ర ఎందరో మహనీయులైన గురుస్వాముల అడుగుజాడలలో దినదిన ప్రవర్థమానమై సాగిపోవు చున్నది. ఉత్తమ గుణగణములు నిండిన వాత్సల్య వూరిత స్నేహ శీలులైన గురుస్వాములు అనేకమందిగలరు. వారందరికి పేరుపేరునా పాదాభివందనములు చేసుకొనుచున్నాము. ఇలా గురు పరం పరను అన్వేషించుకొంటూ వెళ్తే అందరిగురువూ - ఆది గురువు - గురువిన్ గురువైన ఆ శబరినాథుడే యను వాస్తవము తెలియ వచ్చును. అంతటి బృహత్తరమైనటువంటి స్థానమును అధిష్ఠించిన గురుపరంపర సూర్యచంద్రాదులు వున్నంత వరకు వెలిగిపోతూ ఇంకనూ తామర తంపర్లుగా అనేకమంది శిష్య పరంపరకు దారిచూపే కరదీపమై వెలుగొందాలని ఆకాంక్షి స్తున్నాము. 


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat