అయ్యప్ప సర్వస్వం - 25

P Madhav Kumar


*మాలాధారణ*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*మాలాధారణం నియమాలతోరణం*


మాలాధారణ చేయుట గురించి వివిధ స్వాములు వివిధ రీతుల చెబుతున్నారు. కాని శివాలయమందుగాని , గురుస్వామి ఇంటి యందుగాని , మాలాధారణ చేయుట ఉత్తమమైన మార్గము. *కొంత మంది  పూజారి చేతగాని , తల్లిచేత గాని మాలాధారణ చేయించుకొనుట జరుగుచున్నది. ఇది ఏమంత అనుసరణీయము కాదు. ఎందుచేతనంటే శబరి యాత్ర జ్యోతి సందర్శన పదునెట్టాంపడి అధిరోహణ చేసి మనకు జ్ఞానజ్యోతి కలుగుటకై దీక్షాబద్దులమవు తున్నాము. అట్టి మనకు శబరి యాత్ర చేసి స్వామి అనుగ్రహముతో పునీతులైన గురుస్వాములు మాలాధారణ మంత్రోచ్చారనతో మాల వేసుకున్న మనకు కొంత శక్తి చేకూరుచున్నది. కాబట్టి మాలాధారణకు గురువే ముఖ్యమని తెలుసుకొనవలసియున్నది.*


కొంతమంది తల్లి దైవ సమానురాలు కావున తల్లిచే మాలాధారణ చేయించుట తప్పులేదని తల్లిచే మాలాధారణ చేయించు కుంటున్నారు. మరి కొంతమంది దైవపూజలు చేయు పూజారి భగవంతునితో సమానము కావున పూజారి అర్హుడని అంటూ పూజారిచే గూడా మాలాధారణ చేయించుకుంటున్నారు. గురుస్వామి మనసా , వాచా అయ్యప్పను స్మరించుచూ శరణు ఘోషతో నిశ్చల మనస్సుతో ఎదుటివారి మనస్సులో అయ్యప్ప స్వామిని ప్రవేశింపచేసి మాలాధారణ చేసి దీక్షనొసంగిన ప్రతివారియందు శబరిగిరీశుడు సర్వదా సర్వాభీష్టములు కలుగ చేయుననుటలో ఎట్టి సందేహం లేదు. గురు స్వామి ముందుగా స్వామివారిని అర్చించి శిష్యునకు తులసి మాలగాని , రుద్రాక్షమాలను గాని ,  ఈ క్రింది మంత్రముచే శిష్యుని మెడనలంకరించును.


*మాలాధారణ మంత్రం*


జ్ఞాన ముద్రాం శాస్త్ర ముద్రాం గురు ముద్రాం నమామ్యహం వన ముద్రాం శ్రద్ద ముద్రాం రుద్ర ముద్రాం నమామ్యహం శాంత ముద్రాం సత్య ముద్రాం వ్రత ముద్రాం నమామ్యహం శబర్యాశ్రమ సత్యేన ముద్రాం పాతు సదాపిమే గురుదక్షిణయా పూర్వం తస్యానుగ్రహ కారిణే శరణాగత ముద్రాహ్యం తన్ముద్రా ధారయామ్యహం చిన్ముద్రాం ఖేచరీముద్రాం భద్ర ముద్రాం నమామ్యహం శబర్యాచల ముద్రాయై నమస్తుభ్యం నమోనమః


*'దీక్ష'* ను గైకొనువారు ముందుగా భార్య , తల్లి దండ్రుల వద్ద అనుమతి తీసుకొనవలసియున్నది. శబరియాత్ర చేయు ప్రతి అయ్యప్పకు మండల దీక్ష ప్రధాన సోపానమైయున్నది. మండలం అనగా పదునెట్టాంబడి ఎక్కు నాటికి 41 రోజులు తగ్గకుండా దీక్షాకాలం ఉండాలి. మండలానికి తగ్గకుండా ఎన్నిరోజులైనా ఉండవచ్చును.


*అట్టి దీక్ష మహోన్నతమైనదని పెద్దలు చెప్పియున్నారు. అదియునుగాక మనలో ఉన్న పంచేంద్రియాలు మన స్వాధీనంలోకి రావాలన్నా మన శరీరం నియమాలకు లోబడియుండాలన్నా మండలం రోజులు దీక్ష ముఖ్యం. మండలానికన్నా తక్కువ అనగా అర్థమండలం , పదిరోజులు , ఐదురోజులు , మూడు రోజులు ఒక్క రోజు తీసుకొను దీక్ష , అయ్యప్పస్వామి అనుగ్రహం పొందుటకు ఎంత మాత్రమూ నుపయుక్తముగాదని తెలుసుకొని మండలం తక్కువ గాకుండా దీక్ష తీసుకొని స్వామి అనుగ్రహమునకు పాత్రులు కాగలరని కోరుకొనుచున్నాము. పై విధముగా దీక్షను 40 రోజులు ముందుగా తీసుకొనుటకు నిర్ణయించుకొన్న తదుపరి దీక్షతో ఉండవలసిన నియమాలు తెలుసుకొనవలసియున్నది.*


1) ప్రతిదినము ఉదయం సాయంకాలము లందు చన్నీట తలస్నానమాచరించి , విభూది , చందనం , కుంకుమలతో అలంకరించు కొనవలెను.


2) స్నానానంతరం తప్పకుండా శరణుఘోష చేయవలెను. ఇది చాలా ముఖ్యమైనది.


3) ఒకపూట మాత్రమే భోజనము చేయవలెను.


4) బ్రహ్మచర్యము చాలా ముఖ్యము.


5) ఋతు కాలముననున్న స్త్రీలను చూడగూడదు. మాట్లాడ కూడదు. అటుల ఎప్పుడైన జరిగిన తలస్నానము చేసి శరణములు విధిగా చెప్ప వలెను.


6) అర్థాదులు నల్లటి వస్త్రములను , నిష్కాములు కాషాయి వస్త్రములు ఏలినాటి శనివారు నీలివస్త్రములు ధరించవలెను. 


7) క్షుర కర్మాదులు చేసుకొనరాదు.


8) స్త్రీలను మాతృమూర్తులుగా భావించవలెను. తను అయ్యప్ప గాన ప్రతి వారిని అయ్యప్పగా భావించి 'అయ్యప్పా' అని పిలువవలెను.


9) అయ్యప్పలెవరయినా భిక్షకు గానీ అల్పాహారమునకు గానీ పిలిచిన కులమతములు పాటింపక పోవలెను.


10) దీక్షాకాలములో కనీసం ఐదు భజన కార్యక్రమములలో నైన పాల్గొని తన ఇంటివద్ద భజన కార్యక్రమము జరిపి అయ్యప్పలకు భిక్షగానీ , చద్దిగానీ చేయవలెను.


ॐॐॐॐॐॐॐॐॐ


*రేపు  గురు ఉపదేశం పొందినవారి మాలాధారణ పద్ధతి  చదువుకుందాము*


*卐卐卐卐卐卐卐卐卐*


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat