*మధు కైటభుల వధ వర్ణనము - 3*
రాజు పలికెను : భగవాన్! మిమ్మల్ని నొకటి అడగాలని అనుకుంటున్నాను. దయచేసి దానికి బదులివ్వండి.
నా మనస్సు నా చిత్రానికి అధీనంకాక దుఃఖవశమై ఉంది. నేను రాజ్యాన్ని కోల్పోయి, అజుని వలె - నాకది తెలిసుండి - రాజ్యాంగాల అన్నింటిపై నాకు మమత్వం నిలిచి ఉంది, మునిసత్తమా! ఇది ఎలా? ఇతడు కూడా భార్యాపుత్ర భృత్యజనంచేత, స్వజనంచేత తిరస్కృతుడై విడనాడబడి, వారిపై అత్యంత ప్రేమ కలిగి ఉన్నాడు.
ఇలా ఇతడూ, నేనూ, విషయంలో దోషాలను చూస్తూనే, మమత్వం చేత వాటివైపుకు ఆకర్షించబడి అత్యంత దుఃఖితులమై ఉన్నాము. ఓ నిర్మలచిత్తుడా ! తెలిసినవారమైన నాకు, ఇతనికి ఈ మోహం కలిగిందే! మా వివేకాన్ని పోగొట్టి మూఢులను చేసిందే! ఇది ఎలా?
ఋషి పలికెను :
ఇంద్రియగోచరమైన విషయజ్ఞానం సమస్త జంతువులకు ఉంది. ఇంద్రియ విషయాలు వేర్వేరు విధాలుగా వాటికి తెలియవచ్చు. కొన్ని ప్రాణులు పగటిపూట చూడలేవు, మరి కొన్ని ప్రాణులు రాత్రిపూట చూడలేవు. మరి కొన్ని రేయుంబగళ్లు సమంగా చూడగలపు.
మనుషులు జ్ఞాసం కలిగి ఉండడం నిజమేగాని అది కేవలం వారికి మాత్రమే ఉండేది కాదు. పశుపక్షి మృగాదులకు కూడా (ఇంద్రియవిషయ) జ్ఞానం ఉంది. మనుష్యులకు గల జ్ఞానం మృగపక్షులకు కూడా ఉంది, వానికి గల జ్ఞానం మనుష్యులకు కూడా ఉంది.
తక్కినది (నిద్రాభోజనాదికము) రెండుజాతులకూ సమమై ఉన్నది. ఆ పక్షులవంక చూడు. వాటికి జ్ఞానం ఉండి కూడా, తాము ఆకలిచే పీడింపబడుతూ, మోహవశులై, తమ పిల్లల ముక్కులలో (నోళ్లలో) ధాన్యకణాలను (గింజలను) వేస్తున్నాయి.
ఓ మనుజవ్యాఘ్ర (శ్రేష్ఠ)! ప్రత్యుపకారం కలుగగలదనే ఆశతో మానవులు తమ బిడ్డలయెడ అభిలాష కలిగివుంటారు. నీకు ఇది కనిపించడం లేదా? అయినప్పటికీ సంసార స్థితికారిణి అయిన మహామాయ యొక్క ప్రభావంచేత వారు (మానవులు) మమత అనే సుడిగుండంలోకి, మోహం అనే గుంటలోకి కూలద్రోయబడుతున్నారు.
దీనికి ఆశ్చర్యపోవద్దు, ఈ మహామాయ జగత్పతియైన విష్ణుదేవుని యోగనిద్ర . ఆమె చేతనే జగత్తు సమ్మోహితమవుతున్నది. ఆ దేవి, ఆ భగవతి, ఆ మహామాయ జ్ఞానుల మనస్సులను కూడా ప్రబలంగా ఆకర్షించి మోహగ్రస్తులుగా చేస్తుంది సుమా!
ఈ చరాచరరూప జగత్తునంతా ఆమెయే సృజిస్తోంది. ఆమె అనుగ్రహిస్తే నరులకు ముక్తినొసగే వరదాయిని. ఆమె పరావిద్య, ముక్తి హేతువు, సనాతనీ, సంసారబంధానికి కూడా ఆమెయే హేతువు. ఈశ్వరులనందరినీ పరిపాలించు పరమేశ్వరి ఆమెయే.
*సశేషం........*