*మధు కైటభుల వధ వర్ణనము - 5*
“నీ చేతనే ఈ విశ్వం
భరింపబడుతోంది. ఈ జగత్తు నీ చేతనే సజింపబడుతోంది. దేవీ! నీ చేతనే అది పరిపాలింపబడుతోంది.
దానిని ఎల్లప్పుడూ నీవే చివరకు మ్రింగివేస్తావు. (ఎల్లప్పుడూ సర్వ) జగద్రూపవై ఉండే నీవు జగత్సృష్టి కాలంలో సృజనశక్తిగా, స్థితికాలంలో
పరిపాలనశక్తిగా, లయకాలంలో సంహరణశక్తిగా ఉంటావు.
మహాజ్ఞానానివి, మహా అజ్ఞానానివి కూడా నీవే. నీవే మహాబుద్ధివి, మహాస్మరణశక్తివి, మహాభ్రాంతివి. నీవు మహాదేవివి, మహా అసురివి* నీవే. “నీవు సర్వానికి మూలకారణమైన ప్రకృతివి. త్రిగుణాలను - ప్రవర్తింప చేసే తల్లివి. కల్పాంత ప్రళయకాలపు కాళరాత్రివి నీవే. అంతిమ ప్రళయకాలపు మహారాత్రివి నీవే. భయంకరమైన మోహరాత్రివి కూడా నీవే.
నీవు లక్ష్మివి, ఈశ్వరివి, వినమ్రతవు, ప్రబోధాన్ని కల్పించే జ్ఞానచిహ్నమైన బుద్ధివి నీవే, లజ్జ, పుష్టి, తుష్టి, శాంతి, ఓరిమిగల తల్లివి. ఖడ్గం, శూలం, గద, చక్రం, శంఖం, ధనుర్బాణాలు, భుశుండి, ఇనుపకట్లగుది అనే ఆయుధాలు దాల్చిన భయంకరివి. కాని నీవు క్షేమంకరివైన శుభమూర్తివి అవుతావు. శుభవస్తువులంన్నిటి కన్నా అధికమైన శుభమూర్తివి నీవు. అత్యంత సౌందర్యవతివి నీవు. పరాపరాలకు అతీతమైన పరమేశ్వరివి నీవే.
“ఎక్కడ ఏ వస్తువు - సద్రూపమైనది గాని, అసద్రూపమైనది గాని- ఉంటే, ఆ వస్తువుకు గల శక్తి అంతా నీవే. అఖిలాత్మికవైన నిన్ను నేను స్తుతింప సమర్థుడనా? జగత్తును అంతా సృజించి, నిర్వహించి, లయింపజేయువాడు కూడా నీచేత నిద్రావశుడవుతున్నాడు. నిన్ను స్తుతించే శక్తిగల వారు ఇక్కడ ఎవరు ఉన్నారు?
మమ్మలినందరిని (విష్ణువును, నన్ను, ఈశ్వరుణ్ణి) శరీరాలు ధరించేటట్లు చేసిన నిన్ను స్తుతించు శక్తిగల వారు ఎవరు ఉన్నారు? దేవీ! ఇలా స్తుతింపబడిన తల్లివై అప్రతిహతులైన ఈ మధుకైటభాసురులను నీ ఉదార ప్రభావముచేత సమ్మోహితులను చేయి.
జగత్స్వామియైన అచ్యుతుడు త్వరితంగా మేలుకొల్పబడి, ఈ మహాసురులను వధించుటేట్లు ప్రభోదనం పొందుగాక!” (అంటే 'మేలుకొల్పి ప్రభోధించు' అని అర్థం).
*సశేషం.............*