_అయ్యప్ప సర్వస్వం - 40_

P Madhav Kumar


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శరణుఘోష కలిగించు ఫలము*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


చతుర్వేదములు , అష్టాదశపురాణములు , ఉపనిషత్తులు స్తుతించు ఆది శ్రీమహాశాస్తావారి అనుగ్రహము బడయుటకు శరణుఘోష లఘువైన మార్గమగును. ఈ శరణుఘోషను సామాన్యమైనదిగా యెంచవలదు. శ్రీశాస్తా వారిని దలచి చేయబడు శరణుఘోష ధర్మార్థకామ మోక్షములనబడు చతుర్విధ పురుషార్ధములను ప్రసాదించగల్గినదియగును. *చెప్పేవారికి కొండంత అనుగ్రహాన్ని ప్రసాదిస్తే... వినేవారికి సముద్ర మంత అనుగ్రహ సంపదనుకొని తెచ్చిపెట్టడముతో బాటు శ్రీశాస్తావారికి మహదానందాన్ని కలిగించేదియు అగును.* చెప్పేవారి , వినేవారి , రాసేవారి , రాయించేవారి త్రిజన్మదుష్కర్మలను పోగొట్టగల తారకమంత్రమును శ్రీస్వామివారికి మహా ఇష్టమైనది శరణుఘోష.


ఎంతటిమేను బంగారమైనను దాన్ని కొలిచిచూపేది సామాన్యమైన ఇత్తడి గుండే కదా ? ఈ ఇత్తడి గుండ్లు నాకు సమమా. ఇదియా ననుకొలిచేదియని బంగారం అలిగినచో మనకు బంగారము యొక్క తూకంతెలియకపోవును. అలాగే నమకచమక శ్రీసూక్త , పురుష సూక్తాదులతో , మంత్ర తంత్రాదులతో చతుర్వేద పారాయణలతో , మంత్రపుష్పాదులతో చేసెడి శాస్తా (అయ్యప్ప పూజలు మేను బంగారమునకు సమమైనదే ఐనను శ్రీస్వామి వారికి మహ ఇష్టమైన శరణఘోష చేయకపోతే నిష్ప్రయోజనమే. అంటే బంగారు విలువను తెలిపే ఇత్తడి రాయివంటిదన్నమాట శరణుఘోష.


నమకచమకాదులు , మంత్రతంత్రాదులు తెలియకపోయినా శ్రీస్వామి అయ్యప్ప ఆరాధనకు - ఉపాసనకు శరణుఘోష యొక్కటి మాత్రం తెలిసియున్న చాలునన్నమాట. అంతటి మహిమ ఈ శరణుఘోషకు గలదు. శరణుఘోష యొక్క మహిమ అవర్ణనాతీతమగును. అలాగే అది ప్రసాదించే ఫలితములు అవర్ణనాతీతమే. అంతయేల శబరిమల యాత్రకు శ్రీస్వామివారి శరణుఘోషలే మార్గదర్శి మార్గానుచారి - మార్గబంధువు అనిగూడ మనపెద్దలంటుంటారంటే మరి శరణఘోషకు గలమహత్యం గూర్చి ఇంత కన్నా ఏం చెప్పుకోవాలి. అందుకే జాతి , మత , వర్ణ , వర్గబేధములన్నియు మరచి , నదులన్నియు సముద్రములో కలిసి పోవునట్లు మనుష్యులందరూ శరణుఘోష చెబుతూ శబరిమల యను సాగరమున తేడాలేక కలిసిపోతారు. అంతటి మహిమగల శరణుఘోష చేసినవారు పొందిన సత్ఫలాలు గూర్చి కాస్తతెలుసు కొందాము.


*ఆదిత్యపురియను పట్టణమున నివసించుచుండిన ఇద్దరుతోడు దొంగలు పలుకాలంగా తస్కరించుటయే వృత్తిగాగొని , ఎవ్వరికీ పట్టు బడక జీవించుచుండిరి. ఒక పర్యాయం వీరు ఆదేశపు మంత్రి గారింట్లోనే కన్నంవేసి దూరి గొల్లకొట్టుటకు ప్రయత్నించువేళ అచ్చట కాపలా యుండిన భటులకంట పడిపోయిరి. భటులు వీరిని పట్టుకొనుటకు ప్రయత్నించగా కలవరము చెందినవీరు తప్పించు కొని పారిపోసాగిరి. రక్షకబటులు వదలక వెంబటించడము తో తప్పించుకొని దాక్కొనేందుకు మరుగైన ప్రదేశం వెతుకుతూ వీధి వీధులు తిరుగసాగిరి. ఆ దినం ఉత్తరానక్షత్ర దినంకావున భక్తులు పగలంతా ఉపవాసముండి , వ్రతమనుష్ఠించి రేయిపూట శ్రీమహాశాస్తా (అయ్యప్ప) ఆలయములలో గుమికూడి శ్రీస్వామి హరినామ జపసంకీర్తనచేసి , శరణుఘోషలు చేయు చుండిరి. భటులవద్దనుండి తప్పించుకొనేందుకు ఆ ఇరువురు దొంగలు అలాంటి యొక దేవాలయములో ప్రవేశించి , భక్తులతో తామూ భక్తులవలే కలిసి అమరివారితో కలిసి బిగ్గరగా శరణుఘోష చేయసాగిరి.*


కాసేపటికి ఆరాధన ముగిసినది. అందరికి శ్రీస్వామివారి తీర్థప్రసాదములు వినియోగించబడినది. ప్రసాదం తీసుకొన్న భక్తులు వారివారి ఇండ్లకు బయలుదేరసాగిరి. భక్తులవలె యుండిన దొంగలుగూడ ప్రసాదం పుచ్చుకొని గుంపులో గోవిందా యనినట్లు పలాయనమైరి. కాని వెంబటించి కాపుకాచిన రక్షకబటులు వీరిని గుర్తించి పట్టుకొని ఖైదుచేసి , రాజుగారి ముంగిట నిలబెట్టిరి.


ఆదేశపురాజైన సధర్ముడు పేరుకు తగ్గట్లు ధర్మనిరతుడు , ధర్మపరిపాలకుడునూ. విద్యావంతుడు , ధీరశౌర్యపరాక్రమవంతుడు అదియుగాక శ్రీమహాశాస్తావారి పట్ల అతీతమైన భక్తిప్రపత్తులు నిండియున్నవాడు శ్రీస్వామివారి ఉత్తరానక్షత్ర పూజ , వ్రత ఉపవాసములను క్రమముతప్పక ఆచరించువాడు కావడంమూలాన శ్రీ స్వామి అయ్యప్ప అనుగ్రహపాత్రుడై కొన్ని దివ్యసిద్ధులను పొందియున్నవాడగును. దేశప్రజలందరికి శ్రీశాస్తావారి అనుగ్రహం కలగాలని అందరిచేత ఉత్తరానక్షత్ర వ్రతాన్ని ఆచరింపజేయు ఆచారశీలుడు అగును. తనరాజ్యమున అక్రమాలు అరాచకాలు , దొంగతనాలు , దోపిడీలు , వర్గకలహాలు జరగకూడదను విషయములో కడు జాగ్రత్త వహించు సుధర్మరాజుకు సాక్షాత్ మంత్రిగారింట్లోనే దొంగలించడానికి సాహసించినారను ఆరోపణతో నిలపెట్టబడిన ఆ ఇరువురిపై మహదాగ్రహము కలిగినది. తన ముంగిట నిలబడియున్న వారిరువురి వృత్తాంతములను విచారించి తెలుసుకొన్న రాజుతన ధర్మసిద్ధాంతాలకు విరుద్ధంగా నడుచుకొని దేశప్రజలను కొల్లగొట్టి బ్రతుకుచున్నవీరు తనదేశంలోనేకాదు ప్రపంచంలోనే జీవించుటకు అనర్హులని నిర్ణయించి , వీరికిచ్చే దండన మిగిలినవారికి గుణపాఠం కావడంతో మున్ముందు గూడ ఎవ్వరూ వీరిలా దుష్కర్మలు చేయుటకు భయపడేలా యుండాలని తలచి *"వీరిద్దరిని భూమిలో మెడదాకపాతి పెట్టి తలను ఏనుగుచేత తొక్కించి చంపివేయండి"* యని ఆజ్ఞాపించెను.


రాజుగారి ఆజ్ఞను శిరసావహించిన సిపాయిలు వెంటనే వారిరువురిని లాక్కెళ్ళి భూమిలో మెడదాక పాతిపెట్టిరి. ఇవన్నియు రాజుగారు మరియు పురప్రజల సమక్షములోనే జరిగెను. ఏనుగువచ్చి వారిరువురితలలను తనపాదములతో త్రొక్కి చంపెను. అదే తరుణాన దివ్యశక్తులు పొందియుండిన రాజుకంట తక్కినవారు చూడలేని యొక అపురూప దృశ్యమొకటి కనబడెను.


ఒక అందమైన విమానం గగనము నుండి క్రిందికి వచ్చెను. అందుండి శ్రీ శాస్తా గణములు దిగివచ్చి నేరస్తులుగా మరణశిక్షపొంది చంపబడ్డ ఆ ఇరువురి ప్రాణాలను మిక్కిలి మర్యాదగా ఆ విమానము నెక్కించుకొని పైకి కొనిపోసాగిరి. ఆదృశ్యం గాంచినరాజు ఆశ్చర్య చకితుడయ్యెను. వీరిరువురు దీర్ఘకాల నేరస్తులని క్షుణ్ణంగా విచారణ జరిపినేరాలు ఋజువయ్యాకే శిక్ష విధించాను అటులుండగా వీరికింతటి భాగ్యమెలా లభ్యమైనదని ఆలోచించసాగెను.


తాను సరిగ్గా విచారణ జరపక నిరపరాధులను శిక్షించేసానేమోనను చింత ఆ రాజును కలవరపెట్టెను. ఇలా , ఎంతసేపు ఆలోచించినా మనస్సుకు సరియైన సమాధానం లభించక పోవడముతో చింతాక్రాంతుడై తనపూజామందిరమునకు వెళ్ళి అచ్చట రారాజులా అష్టాదశసోపాన సింహాసనము పై అమరియున్న శ్రీ శాస్తావారికి సాష్టాంగ ప్రణామములిడి తన మనసులోని విచారమును తీర్చవలయుననియు పొరబాటు జరిగియుంటే క్షమించమనియు వేడుకొనెను. మహారాజు యొక్క అకల్మషమైన నిత్యనైమిత్య పూజా ఆరాధనలో ముగ్ధమనోహరుడై అమరియుండిన శ్రీశాస్తావారు రాజుయొక్క మనోవిచారం తీరేవిధంగా అశరీరవాణిగా ఇట్లనెను.


*“హే రాజన్ ! కలతచెందవద్దు. నీతీర్పులో ఎట్టిదోషము దొల్లలేదు. వారిరువురు దీర్ఘకాల నేరస్తులే. ఇన్నాళ్ళుగా పట్టుబడక తప్పించుకు తిరుచుండిన వారే. కాని నిన్నటిరేయి మంత్రి ఇంట నుండి భటులకు చిక్కక తప్పించుకు పరుగిడిన వీరిద్దరు నా ఆలయములో ప్రవేశించి , అచ్చటి నాభక్తులతో కలిసికాసేపు శరణుఘోషము చేసిరి. తత్పుణ్య ఫలముచే వారి పూర్వజన్మపాపములు గూడతొలగి నాసామ్రాజ్యమును చేరుకొనే భాగ్యం పొందిరి. నేటితో వారి ఆయుష్కాలము తీరి నందున నీచే మరణ దండన విధించబడి మరణించిరి. శరణఘోష ప్రియుడైన నా నామములతో జేయబడు శరణుఘోష సకల పాపములను హరించివేయగలదన్న సంగతి నీకు తెలిసినదే కదా ! పైగా కొర్కెలన్నిటిని దీర్చగలదనియు , అక్కరలేని దాన్ని హరించి శక్తివంతమైనదనియు గ్రహించుము. కావున మున్ముందు గూడ నీ దేశమున సర్వులు శరణుఘోష చేస్తూ , శరణుకోటిని లిఖిస్తూ యుండునట్లు చేసి , సర్వమంగళములను పొంది సుభిక్షముగా యుందువుగాక"* యని పలికెను.


ఆమాటలతో శరణఘోష యొక్క సంపూర్ణఫలితం తెలుసుకొన్న సుధర్ముడు తనదేశములోని అన్ని ఊర్లలోను శ్రీశాస్తా ఆలయాలు కట్టించి అందరిచే శ్రీస్వామివారి శరణుఘోషను పలికించి , శరణుకోటి వ్రాయించి , స్తూపాలు నిర్మించి , శ్రీశాస్తావారి పరిపూర్ణ కృపకు పాత్రుడై , పలుకాలం రాజ్యభారం వహించి చివర శ్రీశాస్తా లోకం ప్రాప్తించెను.


*శరణుఘోషకు ఎంతటి మహిమగలదో తెలుసుకున్నారు కదా రేపటి నుండి అందరు శరణుఘోష చదువుకోండి*


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat