*శరణుకోటి లేఖనం కలియుగ పాపహరణం*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
భగవద్గీత 16 వ అధ్యాయము దైవాసురసంపద్వి విభాగ యోగ మందలి అసురీ స్వభావుల గురించి శ్రీ కృష్ణ పరమాత్ముడు ఇట్లు వివరించెను. *“అసురీ స్వభావులు సతతము కామక్రోధవశులై విషయ వాంఛలే పురుషార్థంగా భావించి , అట్టి అనుభవం కోసం అక్రమ ధనార్జనచేస్తూ జీవితాంతం ఆశాపాశాలలో చిక్కుకుని ఉంటారో "* ఇది నాకు లభించింది. దీంతో నా కోరిక తీర్చుకుంటాను. నాకు ఇంత ఉంది. ఇంకా ఎంతో వస్తుంది. నేను శత్రువులను చంపాను. మిగతా శత్రుశేషాన్ని కూడా చంపేస్తాను. నేను సర్వాధి కారిని బలవంతుడిని , సుఖిని , ధనికుడిని , అపార సుఖభోగా అనుభవిస్తున్నాను. నాకెదురు లేదు. నాకు ఈడయిన వారెవరులేరు. ఆనందం అంతా నాసొత్తే ! *“అని అజ్ఞాన వంతులై అనేక మనోవికారాలతో కూడిన వికలిత మనస్కులై కామోప భోగాదులలో మునిగి తుదకు నరక కూపంలో పడిపోతారు"*
ధర్మసంస్థాపనానంతరం శ్రీకృష్ణ భగవానుడు తన అవతారం చాలించిన మరుక్షణం నుండియే కలియుగము ఆరంభమైనది. భూత , భవిష్యత్ వర్తమానముల గురించి అర్జునునికి ప్రభోధిస్తూ రానున్న కలియుగ పరిస్థితిని , ఆ యుగమానవుల జీవన , లక్షణ స్థితిగతులను స్పష్టంగా ప్రవచిస్తూ భగవానుడు పై విధంగా పేర్కొని యుండవచ్చును. నేటి కలియుగము ఆకలి యుగమైనది. ప్రతివాడు తనపొట్ట నింపుకొనుటకే ప్రయత్నిస్తున్నాడు. స్వార్థంతో ఎదుటివానిని దోచు కుంటున్నాడు. కలియుగమున ప్రజలు అధర్మపరులై , పాపులై అక్రమాలు చేస్తున్నారు. పొట్ట పోసుకోవడం , సంపాదించడమే ప్రధాన ఆశయంగా జీవిస్తున్నారు. విశ్వమెల్ల ఎక్కడ చూసినను సంక్షోభం , అలజడి అగుపిస్తుంది. ఎవడు బలవంతుడో వాడిదే రాజ్యమగుచున్నది. అతివృష్టి , అనావృష్టి , తుఫానులు , మారణహోమాలు , హత్యలు , అరాచకాలు , దోపిడి దొంగతనాలు మానభంగాలు , గృహదహనాలు మితిమీరినవి. వివిధ వ్యాధులు విస్తరించి జనక్షయము జరుగుచున్నది. కలియుగమున ధర్మము నశించెను. తపస్సు , యజ్ఞము భక్తికనుపించడం లేదు.
సత్యము , న్యాయము పారిపోయినవి. భూమి ఊసర క్షేత్రమైనది. రాజులు (అధికారులు) కపటులయ్యారు. బ్రాహ్మణులు లౌక్యము నేర్చిరి. ప్రజలు సేవకులై కామమున మునిగిపోతున్నారు. స్త్రీలు చపలులయ్యారు. పుత్రులు పితృద్వేషు లయ్యారు. సాధువులు బాధలు పడుచున్నారు. దుర్మార్గులు పెరిగిపోతున్నారు. ధర్మం ఒంటి పాదంపై కుంటినడక నడుస్తుంది. ఈ విధంగా కలిమాయా ప్రభావముచే పాపభీతివిడిచి , దైవభక్తి మరచి ఉదరపోషణ , ధనార్జనయే లక్షణముగా గమ్యమెరుగని అవిశ్రాంత జీవనపోరాటం సాగిస్తున్న కలియుగ మానవునికి తరుణోపాయమే లేదా ? చేసిన దోషములకు నివృత్తి , జీవన్ముక్తికి మార్గమేలేదా ? ఎందుకులేదు ? ఈ క్రింది శ్లోకం చదవండి!
*శివోవాచ : కలి కలుష గుణోపిసాధురేవాయమాశే క్షణ మపిమమపూజ ధ్యాన నామై కనిష్ఠః ॥ సహికృతయుగ త్రేతాద్వాపరా దాసమంతా । దయుతయుగ సమృద్ధ్వాతత్పలం నో లభేత ॥*
*శివుడు చెప్పుచున్నాడు :* కలియుగం మిక్కిలి పాపిష్ఠి దైనను మంచిదనియే తలంచుచున్నాడు. కలియుగ మందు నా పూజాధ్యాన నామస్మరణములు క్షణకాలము ఆచరించి ననూ అతడు కృత , త్రేతా , ద్వాపరముల యందు అనేక వేల సంవత్సరములు నన్నారాధించిన ఫలం పొందును. *శ్రీ అయ్యప్ప భగవన్నామము మదిలో స్మరిస్తూనే స్వామివారికి ప్రీతికరమగు మంత్రము "ఓం స్వామియే శరణం అయ్యప్ప !"* ఒకదాని వెనుక మరొకటి వ్రాస్తూ పోవడమే శరణుకోటి లేఖన మనబడి , స్వామివారి శుభ శరణ నామస్మరణ జరుగుతుందని భావించి పట్టు విడువక వ్రాయువారంటే మణికంఠస్వామికి ఇష్టులు ప్రేమపాత్రులు కాగలరు. భగవన్నామ స్మరణా మహిమ గురించి మరికొంత వివరణలోకి వెళ్తే.....!!
*నామ్నోస్తియా వతీ శక్తిపాపనిర్వహరణే హరేః శ్వపచోపినరః కర్తుం క్షమస్తావన్న కిల్బిషమ్ ॥*
భగవన్నామ స్మరణ ప్రభావమును , పాపమును రూపు మాపుటలో దానిశక్తిని వివరించుటకు మాటలు చాలవు. శ్వపచుడు అనగా కుక్కమాంసమును తినువాడు , మహా పాపిసైతం భగవంతుని నామము స్మరించగానే వాడి పాపములన్ని మాయమయ్యెను. రత్నాకరుడు రామనామ స్మరణ మహిమచే వాల్మీకి మహిర్షియై లోక విఖ్యాతినొందెను. అజామీళుడు అంత్య కాలమున దైవనామ పిలుపు వల్లనే పుణ్యలోకము జేరెను.
*సాంకేత్యం పారిహాస్యం వాస్తోభం హేళన మేవవా వైకుంఠ నామగ్రణమ శేషా ఘహరం విదుః శ్రీ మద్భాగవతం)*
ఏ ప్రాణియైనను శ్రద్ధతోగాని , పుత్రాదుల పిలుపు మిషతోగాని అవహేళనతోగాని నామముచ్చరించిన యెడల అతనిపేరు నా హృదయంలో నిలిచియుండునని భగవంతుడు సెలవిచ్చెను.
*"కలియుగమ్మున భక్తజనులకు కల్పతరువు శరణుకోటి మహిమాన్విత కామధేనువు"*. కలియుగ ప్రత్యక్ష దైవమగు శ్రీ అయ్యప్ప భగవానుని మండలకాల దీక్షా సమయము ముగియడంతో స్వామి ఆరాధనమాని. ఆ తారక ప్రభువునే మరచి ఒక్క సారిగా పాతజీవితమునకు అలవాటు పడి స్వార్థ. అధర్మమార్గమున సంచరించుట ఘోర అపచారమగును. కనీసం స్వామి నామము తలచుట వలన , స్వామి చిత్రపటము గృహమందు కలిగియుండుట వలన ఏదో హాని , కీడు జరుగుతుందనే అపార్థము సర్వత్రా వ్యాపించి యున్నది. ఈ అపప్రధ తుడిచిపెట్టి అనునిత్యం శ్రీ స్వామి వారి సంకీర్తన స్వామివారి స్మరణ , దైవచింతనాభావము , చైతన్యము కలిగించుటకై శరణుకోటి మహాయజ్ఞ కల్పతరువు నేడు శాఖోప శాఖలుగా విస్తరించి సమయపాలన , సద్వర్తన అనుకుసుమము లను , క్రమశిక్షణ అనుకాయలను , ప్రశాంతజీవనము అనుఫలమును సర్వులకు సర్వకాల సర్వావస్థలయందు ప్రసాదించుచున్నది. అలనాడు కేశవుడు అనుభక్తుడు ఉదర వేదనయను కర్మవ్యాధితో బాధపడుచు , మరోమూడు జన్మలవరకు ఆభాద అనుభవింపవలసి యుండియు , మరణమునే జయింపగలుగు అయ్యప్ప స్వామి శరణ నామ సంకీర్తన పారాయణమును ఒకదినమంతయు రేయింబవళ్లు ఎడతెగకంచి , ఉదర వేదనతొలగి కర్మవ్యాధి నివారింపబడి , పరిపూర్ణ ఆరోగ్యవంతుడు కాగలిగాడు.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు🌹🙏