*గురుస్వామి సేవ*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
కావున నా అన్నదమ్ములారా ! అమృతమే కోరెదరో ! హాలాహలమే కోరెదరో మీ ఇష్టము. వ్రతానుష్టానములను చక్కగా ఆచరించి , మనస్సేంద్రియములను అరికట్టి , అరిషడ్వర్గములను దరిచేరనీయక , సత్సీలుండై సత్యవ్రంతుడై సత్సంకల్పుండై , 41 రోజుల వ్రతదీక్షను శ్రద్ధా భక్తులతో నెరవేర్చి , గురుస్వామి అనుమతితో ఇరుముడి కట్టును మోసుకొని ఎరిమేలి చేరుకొని , పేటలో ఆడి కాలినడకగా మహదారణ్యములోనికి ప్రవేశించి , పేరూరు తోడులో బొరుగులు చల్లి , కాళైకట్టి ఆశ్రమము సేవించి , ఆళుదా నదిలోమునిగి రాళ్ళను తీసి , ఆ రాళ్ళను కళ్ళిడుం కుండ్రులో విసర్జించి , కరిమల దాటి , పావన పంబానదిలో పాప పరిహారమునకై స్నానమాడి , నీలగిరి ఎక్కి , అప్పాచ్చి ఉండలు వేసి , శబరి పీఠమునకు మ్రొక్కి , శరంగుత్తి మేడులో బెల్లపు ఆల్ శరములు గుచ్చి , సన్నిధి చేరి , పరివార దేవతలకు మ్రొక్కి , పావన అష్టాదశ సోపానములు ఎక్కి తారక బ్రహ్మమును దర్శించి , జన్మ సాఫల్యము పొంది , గణపతి సర్పరాజులను చూచి , శరణములు పలికి , మాళిగై పురత్తమ్మను దర్శించి , ఇరుముడి విప్పి స్వామికి ఆజ్యాభిషేకము చేయించి , జ్యోతిస్వరూపముగా స్వామిని కాంచి, ఆశీస్సులందుకొని మరలి వచ్చి , దీక్షా విసర్జన చేసినచో అది సంపూర్ణయాత్ర అని అనిపించుకొనును. అట్లుగాక మిగిలిన క్షేత్రములన్నియూ వలె అప్పటికప్పుడు అనుకొని వెళ్ళి వచ్చినచో అందు ఏమాత్రమూ ప్రయోజనము లేదు.
మనము గురువుగా స్వీకరించెడి గురుస్వామి అయ్యప్పచే మనలను తరింపజేయు ఉద్దేశ్యము గలవాడై , చిత్తశుద్ధితో శిష్యులను వ్రతానుష్ఠానమందు సక్రమముగా ప్రవర్తింప చేయువాడై , యాత్ర పర్యంతమూ తోడు నీడగా ఉండి సక్రమముగా యాత్ర చేయింప గలవాడై యుండవలెను. అట్లుగాక గురుస్వామి దురాగ్రహియో , దుర్భుద్ధియో కలవాడైనచో శిష్యుల విత్త సేవాదులనే ఆశించుచూ , దారి మధ్యమున శిష్యులను పలు క్లేశములకు గురి చేయు వాడగును.
*"తాను సాధన చతుష్టయ సంపన్నుడై తనకంటే అనుభవములో గొప్పవాడైనా , సాధన చతుష్టయ సంపన్నత కలిగి నిగ్రహానుగ్రహ సంపన్నుడైన గురువునే ఆచార్యునిగా స్వీకరించవలెను"* అను ఆప్తవాక్యముననుసరించి గురువుని కనిపెట్టి , ఆతని యొక్క ఆజ్ఞకు విధేయుడై యాత్రకు వెడలు స్వామి భక్తునకు దారి మధ్యమున ఎటువంటి కష్టములు కలుగక స్వామి దర్శనము చేసుకొని , మరల వారి యథాస్థానముకు చేరుకొనుటకు సాధ్యమగును. ఇట్లు ఈ రీతిని పాటించక శబరిగిరి యాత్రకు సన్నద్ధుడైనచో ఆతని కష్టనష్టములకు దైవ ఆగ్రహమునకు అతడే కారకుడగును. స్వయంకృతాపరాధమునకు ఎవరిని నిందించి ఏమి ప్రయోజనము ? కొందరు గురువులు తాము మాల వేసుకొనకనే శిష్యస్వాములకు మాల వేయుటయూ , ఇరుముడి కట్టించుటయూ చేయుదురు. అది ఎంత కష్టకారణమో తెలియదు కదా ! సాక్షాత్ ఆ అయ్యప్పస్వామివారూ దిగివచ్చి *“నేను మాల లేకుండా , మాల వేసుకొనకుండా మీకు మాల వేసెదను"* అని అనిననూ మనము అంగీకరించకూడదు. అట్లే ఆచరణలేని గురువును మనము స్వీకరించ కూడదు.
చాలామంది గురుస్వాములు , కన్నిస్వాములను అనేక కష్టములపాలుచేయుదురనియూ , అధికారదర్పము చూపించుచూ అనేక నిందా వాక్యములు పలుకుదురనియూ , శ్రీ అయ్యప్పస్వామి యొక్క వ్రతనిష్ఠలను గురించి భయంకరముగా చెప్పుదురనియూ , దానివలన అనేక మంది కన్నిస్వాములూ , ఇతరులూ భయపడు చున్నారనియూ చాలామంది చెప్పుచున్నారు. ఇది ఏమి వింత ? శ్రీ అయ్యప్పస్వామి అట్టి కఠిన చిత్తుడైన భయంకరుడా ? సామాన్య మానవులమైన మన కన్నతల్లి తండ్రులకే తమ బిడ్డలపై అత్యంత అనురాగమూ , ఈ బిడ్డలు ఎట్లు బాగుపడుదురూ అన్న తపన , ఆరాటం ఉన్న విషయం మనము ప్రత్యక్షంగా చూచుచున్నాము. అట్టిది సర్వలోక సృష్టికర్తా , సర్వలోక పితయైన స్వామి కరుణ ఎంత యుండునని అంచనా వేయగలము ? ఆ కరుణాసముద్రుని గుణ గణములను గూర్చి వక్రముగా చిత్రించువారి ఆజ్ఞానమును ఏమనవలయును ? స్వామి యొక్క సహస్ర నామావళిలో *"కరుణా సాగరాయ నమః"* అను నామము ఒకటి యున్నది. ఆ నామముతో మనము పూజచేయుచూ ఆ స్వామిని మహాభయంకర రాక్షసునిగా చిత్రించుట అపచారము ? ఇట్టి వారి పట్ల మాత్రము స్వామి ఎట్టివాడో చెప్పజాలము కాని , మండల దీక్షతో తన దరి చేరవచ్చుచున్న వారిని , తనను దర్శింప నుత్సుకులైన వారిని , తననే నమ్మి శరణన్న వారిని స్వామి ఎంతటి అనుగ్రహము చూపించునో అనుభవపూర్వకముగా తెలిసికొనవలయునే కాని చెప్పవీలుకాదు.
మరి *“నిప్పు లేనిదే పొగరాదుకదా ! అసలు శ్రీ అయ్యప్ప స్వామి అబ్బో మహా కఠినుడు"* అను మాట ఎట్లు పుట్టినది ? కావున కొంత కాకపోయినా కొంత అయిననూ స్వామి కఠినచిత్తుడై ఉండ వలయును అను మధ్యేమార్గమున స్వామిని గూర్చి మాటలాడు వారునూ గలరు. ఆ విషయమును గూర్చియూ కొంత చర్చించు కొందుము. ఒక బిడ్డ ఏదైనా తప్పు చేసినచో దండించని తండ్రి యుండునా ? ఏదో కొంత శిక్షతో ఆ తండ్రి ఆ బిడ్డను దండించినంత మాత్రాన ఆ తండ్రికి బిడ్డ పట్ల ప్రేమ కొరవడునా ? ఆ బిడ్డ తండ్రిని కాలదన్నుకొనునా ? అయిననూ ఏ కొంత తప్పో ఆ బిడ్డ చేసిన కదా ఆ తండ్రి శిక్షించుట. తప్పే చేయని బిడ్డను శిక్షించు తండ్రి వుండునా ? ఇప్పుడు చిన్నబిడ్డయని దండించక మానినచో పెద్దవాడయిన పిదప అతడే పెద్ద నేరస్థుడుగా రూపొందును" అని ముందుచూపుతో ఆ బిడ్డపై గల ప్రేమతోనే ఆ తండ్రి దండించును కాని నిష్కారణముగా దండించడు. అయిననూ ఇందులో తప్పు ఎవరిది ? తప్పు చేయడము అనునది బిడ్డ తప్పుకాదందురా ? శిక్షించక వదలినచో ఆ తండ్రిది తప్పు అగును కాని శిక్షించో కాదు. ఈ మాట కాదందురా ? అనలేరు. ఎందుచేత అనగా సర్వులకు ఇది అనుభవ పూర్వకము. అట్టిది సర్వలోక పాలకుడూ , సర్వ క్షేమంకరుడూ అయిన ప్రభువు. ఆయన బిడ్డలమైన మనలను , మనము వెళ్ళుచున్నది సన్మార్గములో పవిత్రమైన ఆనందదాయకమైన స్వామి సన్నిధికి గనుక తప్పక రక్షించును. అట్టి సన్మార్గ వర్తనమున ఎప్పుడైనా ఏవైనా లోటుపాట్లు కలిగిన మనము పశ్చాత్తాపముతో స్వామిని శరణువేడినచో స్వామి కరుణించును.
అంతయే మన నాశనమునకు గాని , మన కుటుంబ నాశనమునకు గాని ఒడిగట్టునా ? అయ్యప్పా ! ఎంత నింద ? ఎంత నింద అయ్యా ! ఇట్టి మాటలు కలలో కూడా నమ్మకుడు. సందేహము వలదు. నేను సవినయముగా మనవి చేయునదేమనగా అయ్యప్ప యొక్క వ్రతదీక్ష క్రమశిక్షణకు లోబడి మనస్సేంద్రియములను ఒక కట్టుబాటులోనికి తెచ్చు ఒక పద్దతియే గాని అయ్యప్పస్వామి భయంకరుడు గాదు. కఠినచిత్తుడూ గాదు. మరల మరల చెప్పుచున్నాను. ఆయన కరుణాసాగరుడు , భక్తవత్సలుడు , భక్తజన సులభుడూ , తన దగ్గరకు వచ్చెడి భక్తుల యొక్క కోరికలు తీర్చే కామధేనువు. శరణన్న వారిని కాపాడుతానని కంకణంకట్టుకున్న కల్ప వృక్షము. ఇహపర అనుగ్రహప్రదాయకుడే కాని ఆగ్రహమూర్తి ఏమాత్రం కానేకాదు. కావున కన్ని స్వాములారా ! మాలవేయవలెనని అభిలషించే మహానుభావులారా ! అనవసరమైన అభాండములను నమ్మకుడు. సందేహము వలదు. స్వామి కారుణ్యమూర్తి. ఆయన మార్గములో అడుగుపెట్టదలుచుకున్న మీరు తరించి , ఇతరులకు చేయూత నిండు. భయపడకుడు , భీతి చెందకుడు. ఆ అపార కరుణా సముద్రుడైన శ్రీ అయ్యప్పస్వామి ఒడిలో నిర్భీతులై శాంతిని పొందుడు.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌹🙏