*మధు కైటభుల వధ వర్ణనము - 6*
ఋషి పలికెను : మధుకైటభ సంహారార్థమై శ్రీమహావిష్ణును మేల్కొల్పడానికి బ్రహ్మచేత ఈ విధంగా స్తుతింపబడిన ఆ తామసికశక్తి - విష్ణువు యొక్క నేత్రాలు, నాసిక, బాహువులు, హృదయం, వక్షస్థలం నుండి వీడిపోయి అవ్యక్త జన్ముడు (ఎరుక రానట్టి పుట్టుక గలవాడు) అయిన బ్రహ్మకు దర్శనమిచ్చింది.
ఆమెచేత విడువబడి జగన్నాథుడైన జనార్దనుడు ఏకార్ణవంలో తన శేషతల్పం నుండి లేచి బ్రహ్మను మ్రింగివేయ చూస్తున్న దురాత్ములు, అతి వీర్యపరాక్రమవంతులు, కోపంతో రక్తవర్ణం దాల్చిన నేత్రాలు గలవారు అయిన ఆ మధుకైటభులను చూసాడు. లేచి, సర్వవ్యాపియైన విష్ణుభగవానుడు తన చేతులనే ఆయుధాలుగా ఉపయోగించి ఐదువేల సంవత్సరాలు వారితో యుద్ధం చేసెను.
అంతట వారు బలాతిశయ గర్వంతో మదించి, మహామాయచే సమ్మోహితులై, “మమ్మల్ని ఒక వరం అడుగు” అని విష్ణువుతో అన్నారు.
శ్రీభగవానుడు పలికెను: నాపట్ల మీకు సంతుష్టి కలిగితే, మీరు ఇరువురూ ఇప్పుడు నాచేత వధింపబడాలి. ఇక్కడ అస్యపరంతో అక్కలు ఏమిటి? ఇదే నేను కోరే వరం,
ఋషి పలికెను : ఇలా మహామాయచే వంచితులైన ఆ ఇరువురు, సర్వం జలమయమై ఉన్న జగత్తును చూసి, కమలాక్షుడైన భగవానునితో “భూమి ఎక్కడ నీటిలో మునిగి ఉండదో ఆ స్థలంలో మమ్మల్ని చంపు” అని చెప్పారు.
ఋషి పలికెను . “అలాగే కానివ్వండి" అని చెప్పి శంఖచక్రగదా హస్తుడైన భగవానుడు వారిని తన కటి ప్రదేశం (మొల)పై ఉంచుకొని వారి తలలను తన చక్రంతో ఛేదించివేసెను.
ఈ విధంగా ఆమె (మహామాయ) బ్రహ్మచే సంస్తుతింపబడి స్వయంగా
ప్రత్యక్షమయ్యింది. ఈ దేవి ప్రభావాన్ని ఇంకా విను, నేను తెలియజేస్తాను.
ఇది శ్రీమార్కండేయ పురాణమునందలి సావర్ణి మన్వంతరమున
“దేవీమాహత్మ్యము” లో “మధుకైటభవధ” యను పేరిటి
ప్రథమాధ్యాయము.
*సశేషం..........*